మాతృదేవోభవ
పితృదేవోభవ
ఆచార్య దేవోభవ
అతిథి దేవోభవ
ఇవన్నీ ఉపనిషత్తులు ప్రవచించిన విలువైన మాటలు. మానవ జీవితంలో ఆధ్యాత్మిక జీవనానికి ఎక్కువ ప్రాముఖ్యం ఉంటుంది. మనిషి ప్రవర్తనను సరిదిద్ది సక్రమ మార్గంలో నడిపించి లోకకళ్యాణం కోరే మార్గమే ఆధ్యాత్మిక మార్గం. కేవలం పూజలకు మాత్రమే పరిమితం చేయకుండా సజ్జనులై తమ నడవడిని ప్రపంచం ఆదర్శంగా తీసుకోవాలన్న దృష్టి కలిగిన సనాతన ధర్మం వేదాల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా, ఇతర పురాణేతిహాసాల్లోని కథల ద్వారా, శాస్త్రాల ద్వారా అనేక ధర్మాలను బోధించింది.
తిథి, వార, నక్షత్రాలు లేకుండా అకస్మాత్తుగా మన దగ్గరకు వచ్చిన వాళ్ళనే అతిథులు అంటారు. మానవులు సేవ చేసుకునే సదవకాశాన్ని కలిగించేవారు అతిథులే. అందువల్లే ఉపనిషత్తులు అతిథులను దేవుళ్ళుగా సంభావించాయంటూ గన్నమరాజు గిరిజామనోహరబాబు అతిథిసేవయే నిజమైన భగవత్సేవ…అదే అసలైన ఆధ్యాత్మిక మార్గం అని విశదీకరిస్తున్నారు.
ఉపనిషత్తులోని పైమాటల వల్ల ప్రతి మనిషి తన జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తులను విస్మరించరాదు, అవమానించరాదు. అంతేకాదు వారిని దైవభావనతో పూజించాలి అని స్పష్టంగా తెలుస్తున్నది. మనం ఈ ప్రపంచంలోకి రావడానికి కారణభూతులైన తల్లిదండ్రులే మనకు కనిపించే మొదటిట దేవుళ్ళు. మనం జీవించడానికి అవసరమైన జ్ఞానిన్ని అందించి మన భవిష్యత్తును మరింత ప్రకాశవంతం చేసిన గురువులు కూడా మనం ప్రత్యక్ష దైవాలుగా భావించాలి. అదేవిధంగా అతిథులను కూడా దైవభావనతో గౌరవించాలన్న సందేశాన్ని కూడా అందించిన ఈ వరుసను గమనిస్తే మనకు తల్లి, తండ్రి, గురువులతో పాటు అదేస్థాయిలో గౌరవించవలసిన మరోవ్యక్తి అతిథి అన్న సత్యం బోధపడుతుంది. ఇది ఆధ్యాత్మికోన్నతికి గొప్ప మార్గంగా చెప్పుకోవచ్చు.
తిథి, వార, నక్షత్రాలు లేకుండా అకస్మాత్తుగా మన దగ్గరకు వచ్చిన వాళ్ళనే అతిథులు అంటారు. పిలిచినప్పుడు వచ్చేవారిని అభ్యాగతులు అనాలి. కాని మన వాళ్ళు ఆహ్వానిస్తే వచ్చిన వారిని కూడా అతిథులుగా పేర్కొంటున్నారు. అతిథులను గౌరవించే విధానాన్ని పలు గ్రంథాలు విపులంగా చెప్పాయి.
ఆగతస్యాసనం దద్యాత్ శ్రాంతస్య శయనం తథా
తృషితస్య చపానీయం క్షుధితస్య చ భోజనమ్
అని బృహస్పతి తన స్మృతి శాస్ర్తంలో చెప్పాడు. ఎవరైన అనుకోని అతిథి మనయింటికి వస్తే ఆ వచ్చిన వ్యక్తికి ముందుగా కూర్చోవడానికి తగిన ఆసనం చూపాలి. ఒకవేళ అలసిపోయి వస్తే విశ్రాంతి కొరకు ఏర్పాటు చేసి మంచి శయ్యను అమర్చాలి. దప్పిగొని ఉండవచ్చు కనుక చల్లని నీరివ్వాలి. ఆకలిగొని వస్తే భోజనం కూడా పెట్టి గౌరవించాలి. వీటినే మనవాళ్ళు అతిథి మర్యాదలు అన్నారు. ఒక్కోసారి అధికారంలోనో, మరో దానిలోనో మనకన్నా తక్కువవారు అనుకోని అతిథులుగా రావచ్చు. వారిని తక్కువచేసి చూడరాదని బార్హస్పత్య అర్థ శాస్త్రం చెప్పినది గమనిస్తే మన ప్రవర్తన ఎంత ఉత్తమ స్తాయిలో ఉండాలో, ఎంత సంస్కారవంతంగా ఉండాలో తెలుస్తుంది.
సమాన ప్రభుం విద్యేశ్వరం వా స్వాగతేన, ఆసనేన
శిరః కంపేన, తాంబూల దానేన, హాస్యకథయాచ
అంటే తనకన్నా తక్కువస్థాయివారు, లేదా తనతో సమానుడు కానివాడు అనుకోని అతిథిగా వస్తే కూడా అతనికి స్వాగతం చెప్పి మర్యాద నెరపాలి. తగిన ఆసనాన్ని చూపి గౌరవించాలి. తనకన్నా తక్కువవాడే కదా అనుకొని తను చెప్పే మాటలను అలక్ష్యం చేయకుండా విని తల ఆడించాలి. తాంబూలం ఇచ్చి ఆనందింపజెయ్యాలి. చక్కగా వినోద ప్రసంగం చేసి సంతోషపెట్టాలి- అన్న ఈ విషయాలను గమనిస్తే మానవ సంబంధాలను అధికారంతో ముడిపెట్టరాదన్న సత్యం తెలుస్తున్నది. మానవుల మధ్య హెచ్చుతగ్గులను పాటించరాదు. అంతస్తులను పాటించడం కూడా కూడని పనిగా గుర్తించాలి.
అనుకోకుండా వచ్చిన అతిథి భగవ్స్యరూపుడు. భగవంతుణ్ణి ఎంత పవిత్ర భావంతో పూజిస్తామో అతిథిని కూడా అంతటి గౌరవభావంతో చూడాలనడం మానవుల మధ్య అంతరాలు పనికిరావనీ, అదే అసలైన ఆధ్మాత్మిక మార్గమనీ తెలుసుకోవాలి. మన ప్రాచీన గ్రంథాలైన మహాభారత, రామాయణాది మహాగ్రంథాలు, శౌనకీయ నీతి శాస్త్రము, పరమేశ్వర పటలము, చాణక్యనీతి, శుక్రనీతి వంటి అనేక ధర్మశాస్త్రాది గ్రంథాలు అతిథి విషయాలను గురించి చాలా విపులంగా వివరించాయి. దీనిని బట్టే మన సనాతన ధర్మం అతిధుల విషయంలో ఎంతటి గౌరవం చూపాయో గమనిస్తే మనం ఏ విధంగా మన జీవన విధానాన్ని అనుసరించాలో తెలుసుకోవచ్చు. మన నడవడికను మార్చుకోవచ్చు.
దైవాన్ని చేరే దగ్గరి దారి మానవసేవే. మానవులు సేవ చేసుకునే సదవకాశాన్ని కలిగించేవారు అతిథులే కనుక ఉపనిషత్తులు అతిథులను దేవుళ్ళుగా సంభావించాయి.
రామాయణంలో శ్రీరామ చంద్రుణ్ణి కలవడానికి అరణ్యాలకు వెళ్ళిన భరతునికి అతని పరివారానికి భరద్వాజముని చేసిన అతిథి మర్యాదలు, అదేవిధంగా రోమపాద మహాముని అయోధ్యకు విచ్చేసినప్పుడు అతనికి దశరథుడు అందించిన గౌరవ మర్యాదలు, మహాభారతంలో శ్రీకృష్ణుడు రాయబారిగా వెళ్ళినప్పుడు కురురాజు ధృతరాష్ర్టుడుచేసిన అతిథి మర్యాదలు, అర్జనుడు ఇంద్రపురం ప్రవేశించినప్పుడు వాళ్ళు చేసిన గౌరవ మర్యాదలు- ఇటువంటి సందర్భాలన్నీ భారతీయుల అతిథి మర్యాదలను, దాని ఔన్యత్యాన్ని విశదం చేస్తున్నాయి.
దైవాన్ని చేరే దగ్గరి దారి మానవసేవే. మానవులు సేవ చేసుకునే సదవకాశాన్ని కలిగించేవారు అతిథులే కనుక ఉపనిషత్తులు అతిథులను దేవుళ్ళుగా సంభావించాయి. అతిథిసేవ నిజమైన భగవత్సేవ. అదే అసలైన ఆధ్యాత్మిక మార్గం.