సంపత్తిని రక్షించుకోవడంలో ఎంత శ్రద్ధ చూపిస్తామో సదాచార రక్షణలోనూ వీలైతే అంతకన్నా ఎక్కువే శ్రద్ధ చూపాలి. సంపద నశిస్తే తిరిగి సంపాదించుకునే అవకాశం ఉంది. కాని ఒకసారి సదాచారం వదిలి దురాచారులైతే దాన్ని సవరించుకోవడమనేది అంత సులభం కాదు.
గన్నమరాజు గిరిజా మనోహరబాబు
‘‘సాధవః క్షీణ దోషా: న్యుః స్వచ్ఛబ్దః సాధువాచకః ।
తేషామా చరణం యత్తు సదాచారః స ఉచ్చతే ॥”
సనాతన ధర్మాన్ని బోధించిన ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, స్మృతి శాస్త్రాలు అన్నీ ‘సదాచారం’ గురించి ఎన్నో విషయాలు వెలిబుచ్చాయి. అసలు సదాచారము అంటే ఏమిటి? అని ప్రశ్నించేవారికి విష్ణుపురాణం చెప్పిన నిర్వచనమే యీ శ్లోకం. ‘సత్’ అనే శబ్దం యొక్క అర్థాన్ని సాధవు అనొచ్చు. దోషములు లేని వారే సాధువులు. ఇటువంటి సత్పురుషుల యొక్క ఆచరణాన్నే సదాచారము అంటారు”. వారి మార్గాన్నే లోకం ఆర్శంగా తీసుకొని ఆ మార్గంలో నడిచే ప్రయత్నం చేస్తే తానూ సుఖపడతాడు. సమాజమూ సమృద్ధమవుతుంది.
దురాచారం మనిషిని, అతడు జీవించే సమాజాన్ని కూడా దుర్గతి పాలు చేస్తుంది.
మానవ సమాజంలో దురాచారాలు ప్రబలిపోవడం పెను ప్రమాదంగా మారింది. ఆ ప్రమాదాలను తప్పించే ఏకైక మార్గం సదాచారాన్ని పాటించే విధంగా చెయ్యడమే నన్నది తొలి రోజులనుంచి భారతీయుల భావన. అందుకే పలు గ్రంథాలు మనిషికి అనేక సందర్భాల్లో కథల ద్వారా ఉత్తమ మానవ విలువలను బోధించే ప్రయత్నం చేశాయి. దురాచారం మనిషిని, అతడు జీవించే సమాజాన్ని కూడా దుర్గతి పాలు చేస్తుంది. అందుకే స్మృతులు కూడా.
‘‘దురాచారోహి పురుషో లోనే భవతి నిందితః
దుఃఖభాగీచ సతతం వ్యాధితోల్పయు రేవచ ॥”
అన్నాయి. ‘‘సదాచారాన్ని వదిలి మనిషి దురాచారవంతుడైతే తాను తన కాలపు సంఘమునందే నిందాపాత్రుడవుతాడు. అంతేకాదు ఎప్పుడూ దు:ఖాన్ని అనుభవించే అవకాశం కూడా వస్తుంది. పైగా అనారోగ్యం పాలై అల్పాయుష్కుడు కూడా అవుతాడు. అందుకే మానవులందరూ సదాచారం దిశగా ప్రయగాణం సాగించే ప్రయత్నం చెయ్యాలి. దానివల్ల సకల శుభాలను పొందగలరు. అది సర్వులకు శ్రేయోదాయకమైన అంశం.
సంపత్తిని రక్షించుకోవడంలో ఎంత శ్రద్ధ చూపిస్తామో సదాచార రక్షణలోనూ వీలైతే అంతకన్నా ఎక్కువే శ్రద్ధ చూపాలి.
సదాచార నిష్ఠుడైన వ్యక్తి ఇహపరాలలో కూడా విజయుడనిపించుకుంటాడు. ఆ విషయాన్నే ‘‘సదాచారవతా పుంసా జితే లోకావుభావపి” అని విష్ణు పురాణం నొక్కి వక్కాణించింది. సిరిసంపదలను రక్షించుకోవడమనేది మా బాధ్యత. సంపత్తిని రక్షించుకోవడంలో ఎంత శ్రద్ధ చూపిస్తామో సదాచార రక్షణలోనూ వీలైతే అంతకన్నా ఎక్కువే శ్రద్ధ చూపాలి. సంపద నశిస్తే తిరిగి సంపాదించుకునే అవకాశం ఉంది. కాని ఒకసారి సదాచారం వదిలి దురాచారులైతే దాన్ని సవరించుకోవడమనేది అంత సులభం కాదు. అందుకే మహాభారతం ఉద్యోగపర్వంలో
‘‘వృత్తం యత్నేన సంరక్ష్యం విత్తమేతిచ యాతిచ ।
లక్షీణోవిత్తతః క్షీణో వృత్తతస్తు హతో హతః ॥”
అని పేర్కొన్నది. ధనము, సదాచారము అనే ఈ రెండు విషయాలలో మానవులు వీలైనంతవరకు ధన రక్షణ కన్నా సదాచార రక్షణకే విలువ ఇవ్వాలి. దానిపైనే దృష్టి ఉంచాలి. అంతేకాని ధనరక్షణ ప్రధానమని భావించరాదు. ధనము ఎంత నశించినా కొంత మిగిలే ఉంటుంది. కాని సదాచారమనేది నశిస్తే మనిషి సర్వనాశనమవుతాడు” అంటూ మానవ విలువల రక్షణయే సదాచార రక్షణగా భావించి చెప్పినట్లైంది.
ధనం మనిషిని తప్పుత్రోవ పట్టించడంలో మొదటి స్థానంతో నిలుస్తుంది. తాను సదాచార సంపన్నుడైతే ఆ దిశగా మనిషి ప్రయాణం చెయ్యడు.
మానవ సమాజ పతనాన్ని నిర్దేశించేది ఎక్కువగా ధనమే. ధనం మనిషిని తప్పుత్రోవ పట్టించడంలో మొదటి స్థానంతో నిలుస్తుంది. తాను సదాచార సంపన్నుడైతే ఆ దిశగా మనిషి ప్రయాణం చెయ్యడు. ఎంత ధనవంతుడైనా కాపాడగలిగే శక్తి యీ సదాచార నిర్వహణకు ఉంది. అందుకే వ్యక్తి ప్రతినిత్యము కూడా సదాచారంపైనే తన దృష్టి నిలపాలని గృహస్త రత్నాకరము స్పష్టంగా చెప్పింది.
‘‘పత్యహం పర్యవేక్షేత నరశ్చరి తమాత్మనః ।
కిన్ముమే పశుభిస్తుల్యం, కిన్ను సత్పురుషైరివ ॥”
అన్న ఈ విషయాన్ననుసరించి ‘మనిషి ప్రతిదినము తన ప్రవర్తన పైన, సదాచారముపైన దృష్టి నిలపాలి. నేడు నా ప్రవర్తనలో ఏదైనా పశు ప్రవర్తనవలే ఉన్నదా? ఏది సత్పురుషుని ప్రవర్తనవలె ఉన్నది? అని తప్పక పరీక్షించుకోవాలి. పరిశీలన చేసి చూచుకోవాలి”. దీనర్థం వ్యక్తి కూడా పశు ప్రవర్తన కలిగి ఉండరాదు. ఇతరులెవ్వరి ప్రవర్తనను తానే స్వయంగా సమీక్షించుకున్నప్పుడు సత్యాసత్యాలు బహిర్గతమవుతాయి. దానివల్ల ఎవరో చెప్పవలసిన అవసరం లేకుండానే తనను తాను సరిదిద్దుకొనగలడు. దానివల్ల మానవత్వం కలిగిన మనిషిగా ఎదిగే అవకాశం ఉంది.
ఏ సమాజమైనా వ్యక్తుల సమాహారమే. సమాజం యొక్క ఔన్నత్యం వ్యక్తులపైనే ఆధారపడి ఉంటుంది. కనుక వ్యక్తి నిర్మాణం సరియైన దిశగా ఉంటే దానివల్ల ఉత్తమ సమాజం ఏర్పడుతుందన్న భారతీయుల విశ్వాసమే పలు మహాగ్రంథాల సారాంశంగా ముందుకు వచ్చింది. సదాచార ఆచరణే ప్రధానమని, ఏ సాధన చెయ్యాలన్నా సదాచారమే అవసరమని అవన్నీ బోధించడం విశేషం.