గ్రామంనుంచి పట్టణం దాకా మనిషి ఎదుర్కొంటున్నజీవన సంక్షోభాల్ని కథలుగా తీర్చి అందిస్తున్న రచయిత గంగాడి సుధీర్. భిన్నస్థితుల, భిన్నవ్యక్తుల జీవనానుభవాల సమాహారం ‘ఇగురం’. ఇందులోని అనేక కథలు ‘ఆవునూరు’తో ముడిపడి ఉంటాయి.
నందిని సిధారెడ్డి
జీవితంలోని భిన్న సంఘటనలను, విభిన్న సంఘర్షణలను సవివరంగా చిత్రించటానికి అనువైన సాహితీ ప్రక్రియ కథానిక. మానవ ప్రపంచంలో ప్రాంతాల్ని బట్టి, కాలాన్ని బట్టి, పరిస్థితులనుబట్టి జీవనవిధానాలు మారుతూ ఉంటాయి, కొన్ని ప్రత్యేకతలు సమకూరుతూ ఉంటాయి. ఆయా స్థితిగతుల ప్రభావం వల్ల జరిగే సంఘటనలు, పొందే అనుభవాలు విశేషతలను సంతరించుకుంటాయి, సృజనాత్మక రచయిత వాటిని ఒడుపుగా పట్టుకొని, తన కథన ప్రతిభ ద్వారా ఇతరుల ముందు సజీవంగా నిలుపుతాడు, ఎంతోమంది జీవితానుభవాలను వడగట్టి పాఠకుల ముందుంచుతాడు, ఎన్నోకాలాల భావోద్వేగాలను, చారిత్రక సన్నివేశాలను, దేశదేశాల జీవన స్థితులను, సంస్కృతులను అక్షరబద్దం చేసి అందరికి పంచుతాడు, అందువల్ల ప్రపంచ సాహిత్య ప్రక్రియల్లో ‘కథ’ ప్రత్యేక స్థానాన్ని పొందింది.
తెలంగాణ చారిత్రక, భౌగోళిక పరిస్థితులవల్ల స్థానిక ప్రజల జీవనం ప్రత్యేక సమస్యలు ఎదుర్కొంటున్నది, గ్రామీణ జీవితానుభవాలు పట్టణానుభవాలు వేరుగా ఉంటాయి, అట్లాగే కాలం ఎప్పటికప్పుడు మారుతూ ప్రజాజీవనాన్ని మారుస్తూ కొత్త సంఘర్షణలకు తెర తీస్తుంది, వృత్తులు, చదువులు, చిరుద్యోగాలు, కరువులు, కన్నీళ్లు మనిషిని నిలకడగా ఉండనీయవు, స్థిమితంగా జీవించనివ్వవు, గ్రామంనుంచి పట్టణం దాకా మనిషి ఎదుర్కొంటున్నజీవన సంక్షోభాల్ని కథలుగా తీర్చి అందిస్తున్న రచయిత గంగాడి సుధీర్. భిన్నస్థితుల, భిన్నవ్యక్తుల జీవనానుభవాల సమాహారం ‘ఇగురం’. గంగాడి సుధీర్ కథల సంపుటి. గంగాడి సుధీర్ ది ఆవునూరు, ఇందులోని అనేక కథలు ‘ఆవునూరు’తో ముడిపడి ఉంటాయి.
‘ఇగురం’ తెలంగాణ గ్రామీణ స్వభావాన్ని వ్యక్తీకరించేమాట, ‘ఇగురం’లోని కథలు గంగాడి సుధీర్ లోని హృదయ సంస్కారాన్ని చిత్రించిన కథలు. పల్లెటూళ్లలోని జీవనమూల్యాల ముడిసరుకును తడితడిగా వ్యక్తీకరించిన స్వచ్ఛరచనలు, రాజీపడుతూ పోరాడుతూ ఓడుతూ గెలుస్తూ చరిత్ర సృష్టిస్తూ సంస్కృతులు తీర్చిదిద్దుతూ సాగిపోతున్న సజీవ పాత్రలను కథా సహిత్యంలోకి నడిపించుకొచ్చినందుకు సుధీర్ కు హృదయాభినందనలు.
ఏ రచయితయినా చూసిన జీవితమో, అనుభవించిన జీవతమో రాస్తాడు గనుక గంగాడి సుధీర్ తన అనుభవంలోని జీవితాన్నే కథలుగా మలిచాడు. ఒకటి రెండు కథలు తప్ప సంపుటిలోని అన్ని కథలు స్థానిక ప్రజా జీవితంలోని కల్లోలాన్ని ఆవిష్కరించాయి. గంగాడి సుధీర్ ఆవేదన, భిన్న పరిశీలన ‘ఇగురం’ కథల్లో గోచరిస్తుంది. సమాజంలో నెలకొని ఉన్న అవకతవకల్ని సుధీర్ చిత్రించిన తీరు మనల్ని ఆర్ద్రపరుస్తుంది.
సుధీర్ వ్యవసాయ కుటుంబంనుంచి వచ్చాడు గనుక వ్యవసాయ సంక్షోభం, ఆ కుటుంబాలు పడుతున్న ఆపసోపాలు, తప్పనిసరవుతున్న వలసలు అనేక కథల్లో చిత్రితమైనాయి, కథా సంపుటి పేరే ‘ఇగురం’. ‘ఇగురం’ కథలో రోజురోజుకు దుర్భరంగా మారుతున్న రైతు జీవితం, తీరని దు:ఖం చిత్రించాడు రచయిత, బాగా బతికిన కుటుంబం, తరాలు మారుతున్నాకొద్ది చితికిపోయిన ఉదంతం, పదుల ఎకరాల జాగ పంచుకొని, పంచుకొని రెండు ఎకరాలకు చేరుకున్నది. మనుషులు పెరుగుతారు, భూమి పెరగదు, విధానాలు మారుతాయి పాలకులు ‘అభివృద్ధి’ ప్రవేశపెడుతున్నా కుటుంబంలో, జీవితంలో అభివృద్ధి కనబడదు, నీటికాలువలకోసం భూమి పోతుంది తప్ప బతుకు బాగుపడదు, ‘జరిగింది మంచే, జరుగుతున్నది మంచే కానీ నాకయిన మంచేదో తెలువకపాయె’ అని రైతు బాధపడటం వాస్తవం, ఉన్నది ఉన్నట్లు ఉండటం లేదు, ఎదో జరుగుతున్నది మంచి అవునో కాదో తేల్చుకోలేని సందిగ్ధం. బతుకు దిగజారింది నిజం, మానయ్య భూమి కోల్పోయి ఉరి పెట్టుకుంటాడు, రైతుకు ‘ఇగురం’ లేదా? రైతు బతికేదే ‘ఇగురం’తో అయినా ఎందుకు ఉరి ఎదురయింది? రచయిత చెపుతాడు – ‘పనివరస ఇగురాలు వేరు’, ‘బతుకనేర్చిన ఇగురాలు వేరు’. రైతుది బతుకనేర్చిన ఇగురం కాదని పరోక్షంగా ప్రకటిస్తాడు.
రైతుకు ‘ఇగురం’ లేదా? రైతు బతికేదే ‘ఇగురం’తో అయినా ఎందుకు ఉరి ఎదురయింది? రచయిత చెపుతాడు – ‘పనివరస ఇగురాలు వేరు’, ‘బతుకనేర్చిన ఇగురాలు వేరు’. రైతుది బతుకనేర్చిన ఇగురం కాదని పరోక్షంగా ప్రకటిస్తాడు.
‘వలసలు’ కూడా వ్యవసాయం ఎదుర్కొంటున్న దు:ఖ స్థితినే చిత్రించింది. సకాలానికి కరెంటు రాకపోవటం, నీళ్లు చాలని పంపకాల పంచాయితి, కరువు సమస్య, ఇతర వృత్తులు – ఎరుకలి వృత్తి దెబ్బతిన్న వైనం – ఇట్లా ‘గల్ఫ్ దారి’ శరణ్యమనిపిస్తొంది, వీసా కోసం భూమి అమ్మి అప్పుచేస్తాడు, యుద్ధం వచ్చి వీసాలు దొరకయి, మోసపోయిన ఎల్లయ్య పురుగుమందు తాగి చనిపోతాడు, ఎరుకల మల్లయ్య పట్నందారి పడతాడు, ఒకరు ప్రాణం వదులుకున్నా, మరొకరు ఊరు అభిమానం వదులుకున్నా కారణం ఉన్నజీవితం అతలాకుతలమవటమే కదా, విషాధ సన్నివేశాలకు దర్ఫణమైన కథ. ‘నిశ్శబ్దం’ నిరుద్యోగ సమస్యను చిత్రించిన కథ కాగా ‘వివక్ష’ కులాల నడుమ సామాజిక ‘వెలి’ ని, తరాలనడుమ తారుమారైన ‘అవకాశాల్ని’ చిత్రించింది.
బస్సు కార్మికుల సమస్యను బలంగా చిత్రించిన కథ ‘సమ్మె’. సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులకు, సమ్మెను విఫలం చెయ్యటానికి పాలకులు దించిన టెంపరరీ వర్కర్లకు నడుమ సాగిన సంఘర్షణను రచయిత కథగా మలిచాడు, ఆరోజు కూలీలో కూడా కోతపెట్టే దౌష్ట్యాన్ని వివరించటం సుధీర్ నైశిత్యానికి నిదర్శనం, ‘బస్సులో ఎక్కే ఒక్కొక్కరిదీ ఒక్కో కథ, ఒక్కొక్కరిదీ ఒక్కో వ్యథ, ఎవ్వల్ని తప్పుపట్టనీకి లేదు, కార్మికులదొక సమస్య, ప్రభుత్వానిదొక సమస్య, మనకెందుకులే అనుకునే ప్రజల గమ్మత్తు అసలు సమస్య’ అని ప్రకటిస్తాడు. ఎవరి కోణంలోంచి వాళ్లు చూడటం సరైనది కాదు, అన్నికోణాలు పరిశీలించి న్యాయాన్ని నిర్ణయించే సమగ్ర దృష్టి లోపిస్తున్నదన్నది సారాంశం.
ఒక్కొక్కరిదీ ఒక్కో కథ, ఒక్కొక్కరిదీ ఒక్కో వ్యథ, ఎవ్వల్ని తప్పుపట్టనీకి లేదు. ఐతే, ఎవరి కోణంలోంచి వాళ్లు చూడటం సరైనది కాదు, అన్నికోణాలు పరిశీలించి న్యాయాన్ని నిర్ణయించే సమగ్ర దృష్టి లోపిస్తున్నదన్నది సారాంశం.
‘ఓ గెలుపు జ్ఞాపకం’ భౌతిక వాస్తవ స్థితికీ, ప్రేమ భావనకు నడుమ ఘర్షణను తెలియజెప్పిన కథ, పరీక్ష ఫీజు కట్టడానికి ఇబ్బందిపడే విద్యార్థికి పరిస్థితులతో సంబంధం లేకుండా ఎదురైన ప్రేమ సందర్భం వాస్తవ జ్ఞానమున్న అతను ‘ప్రేమలు మనకు సరిపడేవి కావు’ అనుకుంటాడు, అది సహజం ఆ ప్రేమను సఫలం చేయాలనుకున్నాడు రచయిత కనుక కథకు బహుమతి కల్పనతో సుఖాంతం చేశాడు.
మనిషి జీవితంలో ఉన్న కల్లోలం చాలదన్నట్లు కరోనావైరస్ అదనంగా సృష్టించిన కల్లోలం వర్ణించరానిది, కాలం మనిషికి ఎన్నో సమస్యలు సృష్టిస్తుంటే ఇప్పుడు ప్రకృతి కూడా పగబట్టి వైరస్ని ప్రపంచం మీదికి వదిలింది. దేశాలకు దేశాలే కల్లోలమైనాయి, కుటుంబాలకు కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయి, బంధాలు విషమస్థితి నెదుర్కొన్నాయి ‘కరోనా’ సృష్టించిన బీభత్సాన్ని గంగాడి సుధీర్ ఆరు కథల్లో చిత్రించాడు లాక్ డౌన్ కథ, పోలీస్ రియల్ వారియర్, ఆకలిరోగం, కరోనాటైమ్స్, పొక్కిలి, రికవరీ కథలు వలసకూలీల ధైన్యం, పోలీసుల వింతస్థితి, అన్నదాన చమత్కారాలు, వర్క్ ప్రమ్ హోమ్ సరదాలు, వలసలు, తరుణోపాయాలు ఇలా కరోనా విలయాలెన్నింటినో కళ్లముందట ఉంచి కదదిలిపోతుంటాయి.
కథలన్నింటిలోకి భిన్నమైంది ‘సండే సరదాకథ’ రచయితే ‘సరదా’ అన్నాడు కనుక సరదాగా సాగుతుంది, అన్ని కథల్లో విషాదం, కరుణ, జాలి, ప్రవహిస్తే ఈ ఒక్క కథలో ‘హాస్యం’ ప్రవహించింది, కాపురంలో కష్టాలు ఉండవచ్చు, కలతలు, కన్నీళ్లు ఉండవచ్చు, కానీ సరదాలు కూడా ఉంటాయి, ఉండాలి మరి. ఆదివారం రోజు కాపురాన్ని సరదాగా నడిపించే ప్రయోగం చేశాడు సుధీర్. సుధీర్ సరదా స్వభావానికి ఇదొక ఉదాహరణగా భావించవచ్చు.
గ్రామీణ జీవితం మీద గంగాడి సుధీర్ కు ప్రత్యేక అభిమానం వ్యవసాయం కావచ్చు, ఊరి జ్ఞాపకాలు కావచ్చు, ఆవునూరు అనుభవాలు కావచ్చు, ప్రకృతి దృశ్యాలు కావచ్చు, వాగులు, స్థానిక జలపాతాలు, మితృలు, కుటుంబాలు, ఎడబాటులు, నిరుద్యోగాలు, పెళ్లిసమస్యలు ఎన్నెన్నో సుధీర్ హృదయాన్ని తడితడిగా నిలబెడుతున్నాయి
గ్రామీణ జీవితం మీద గంగాడి సుధీర్ కు ప్రత్యేక అభిమానం వ్యవసాయం కావచ్చు, ఊరి జ్ఞాపకాలు కావచ్చు, ఆవునూరు అనుభవాలు కావచ్చు, ప్రకృతి దృశ్యాలు కావచ్చు, వాగులు, స్థానిక జలపాతాలు, మితృలు, కుటుంబాలు, ఎడబాటులు, నిరుద్యోగాలు, పెళ్లిసమస్యలు ఎన్నెన్నో సుధీర్ హృదయాన్ని తడితడిగా నిలబెడుతున్నాయి, లోపలి ఆరాటాలు వ్యక్తీకరించాలని నిరంతరం సుధీర్ తపనపడుతుంటాడు, అటు కవితలు, ఇటు కథలు మరొకవైపు పాటలు రాయడం ఇష్టంగా మలుచుకున్నాడు. ఇప్పటి సంక్షోభ పరిస్థితుల్లో లోపలి రచయితను కాపాడుకోవటం విశేషం. ఎప్పటికప్పుడు చుట్టూ చేతులు పెట్టి దీపాన్ని కాపాడుకున్నట్టు సుధీర్ గ్రామీణ స్వభావాన్ని కాపాడుకుంటున్నందుకు సంతోషం.
‘ఇగురం’ తెలంగాణ గ్రామీణ స్వభావాన్ని వ్యక్తీకరించేమాట, ‘ఇగురం’లోని కథలు గంగాడి సుధీర్ లోని హృదయ సంస్కారాన్ని చిత్రించిన కథలు. పల్లెటూళ్లలోని జీవనమూల్యాల ముడిసరుకును తడితడిగా వ్యక్తీకరించిన స్వచ్ఛరచనలు, రాజీపడుతూ పోరాడుతూ ఓడుతూ గెలుస్తూ చరిత్ర సృష్టిస్తూ సంస్కృతులు తీర్చిదిద్దుతూ సాగిపోతున్న సజీవ పాత్రలను కథా సహిత్యంలోకి నడిపించుకొచ్చినందుకు సుధీర్ కు హృదయాభినందనలు. మరిన్ని పాత్రల్ని, మరిన్ని అనుభవాల్ని మరిన్ని మంచి కథలుగా మలిచి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేయాలని ఆకాంక్షిస్తున్నాను.
ఈ పుస్తకం కోసం హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో ‘సోపతి’, ‘నయనం’ ప్రచురణలతో పాటు ‘ఎమెస్కో’, ‘నవచేతన’ స్టాల్స్ లో కూడా లభిస్థాయి లేదా ఈ amazon లింక్ క్లిక్ చేసి ఇంటికి తెప్పించుకోవచ్చు.