Editorial

Wednesday, January 22, 2025
సామాన్యశాస్త్రం'గాంబత్తె' : మీరు ముందుకు సాగమనే పుస్తకం

‘గాంబత్తె’ : మీరు ముందుకు సాగమనే పుస్తకం

జపాన్ దేశం నుంచి జనించిన ‘ఇకిగై’ గురించి చాలా మందికి తెలుసు. కొన్ని పుస్తకాలు కూడా చదివి ఉంటారు. ఐతే, అక్కడి మనుషుల దీర్ఘాయువు వెనకాలి కారణం ఏమిటీ అంటే అది ‘‘గాంబత్తె’. దాన్ని ప్రపంచ పౌరులంతా అలవర్చుకోవచ్చనే ఈ పుస్తకం.

కందుకూరి రమేష్ బాబు

Kandukuri Ramesh Babu

ఆల్బర్ట్ లీబర్ మ్యాన్ రచించిన ‘గాంబత్తె’ అన్న పుస్తకం మొన్న నవ చేతన పుస్తకాలయంలో తీసుకుని చదవడం పూర్తి చేశాను. బుక్ డిజైనింగ్ ఎంతో బాగుంది. కవయిత్రి, సీనియర్ పాత్రికేయులు పసుపులేటి గీత గారి అనువాదం కూడా చక్కగా ఉంది. పైకి రావడం గురించి ఎన్నో పుస్తకాలున్నాయి. కానీ ఎన్ని సమస్యలున్నా, ఎంతటి విధ్వంసం జరిగినా మనిషి పురోగమించాలని, ముందుకు సాగిపోవాలని చెప్పే పుస్తకమిది.

మానవ ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో ఆపకుండా ఉండాలన్నది, ఎల్లవేళలా నిండు ఆశావహ దృక్పథంతో ముందుకే సాగిపోవాలన్నది ఈ పుస్తకం ప్రధాన ఇతివృత్తం. చేసే పని ఓరిమితో పరి పరిపూర్ణంగా పూర్తి చేయమని సూచించేది. ఒక్కమాటలో చెప్పాలంటే, “Do your best” అన్నమాట!

జపాన్ దేశం నుంచి జనించిన ‘Ikigai’ గురించి చాలా మందికి తెలుసు. కొన్ని పుస్తకాలు కూడా చదివి ఉంటారు. ఐతే, అక్కడి మనుషుల దీర్ఘాయువు వెనకాలి కారణం ఏమిటీ అంటే అది ‘Ganbatte’. దాన్ని ప్రపంచ పౌరులంతా అలవర్చుకోవచ్చనే ఈ పుస్తకం.

నెమ్మదిగా అనిపించే ఈ పుస్తకం అందరికీ నచ్చదు. ముఖ్యంగా పైపైకి ఎగబాకే తత్వం, తెలివి తేటలను పెట్టుబడిగా పెట్టి బ్రతికే మనుషులకు ఈ పుస్తకం పెద్దగా నచ్చదు. కానీ జీవితంలో నెమ్మది తనం విలువేమిటో తెలిసిన వారికి ఈ పుస్తకం ఉత్సాహంగా ఉంటుంది.

ఈ ఇతివృత్తం లేదా పుస్తకపు ఫిలాసఫీ జపాన్ జన జీవితంలో ఒక భాగం. దాన్ని ప్రపంచంతో పంచుకోవడానికి అందమైన పుస్తకంగా ఆ తాత్వికతను కథలు కథలుగా విశదం చేస్తాడు రచయిత. అందుకు గాను ఒక యాభై అధ్యాయాల్లో పరిపరి ఉదాహరణలతో ఆ తత్వం ఎట్లా సదరు వ్యక్తుల జీవితంలో భాగం అయిందో చూపుతూ పాఠకుల చెంతకు చేర్చడం ఈ రచన ప్రణాళిక.

నిజానికి సారాంశం చిన్నది. దాన్ని అనేక మంది వ్యక్తులు ఎట్లా తమ జీవితంలో అనుసంధానించు కున్నారో చెప్పడం ద్వార ఆ మెలుకువ మనకు బోధపరిచేలా రచయిత రాస్తారు. నిజానికి వేగం లేకుండా అంటే నెమ్మదిగా అనిపించే ఈ పుస్తకం అందరికీ నచ్చదు. ముఖ్యంగా పైపైకి ఎగబాకే తత్వం, తెలివి తేటలను పెట్టుబడిగా పెట్టి బ్రతికే మనుషులకు ఈ పుస్తకం పెద్దగా నచ్చదు. తరచూ ఒకే ఫిలాసఫీని వేరు వేరు అంశాలు ఉదాహరిస్తూ విడమర్చి చెప్పడం కూడా వారికి బోరింగ్ గా ఉంటుంది. కానీ జీవితంలో నెమ్మది తనం విలువేమిటో తెలిసిన వారికి ఈ పుస్తకం ఉత్సాహంగా ఉంటుంది. తమకు తెలిసిన విషయాలే అయినా వాటిని చదవడంలో ఒక కుతూహలం, అభినందన వారికి ఈ పుస్తకాన్ని ఆసక్తిదాయకం చేస్తుంది. చేసే ప్రతి పనికి ప్రయోజనం లెక్క చూసే జనులకు భిన్నంగా ఒకవైపు పరిశ్రమను మరోవైపు అదృష్టాన్ని సమానంగా స్వీకరిస్తూ సాధారణంగా బ్రతికే మనుషులకు ఈ పుస్తకం ఎంతో హాయిగా ఉంటుంది.

పుస్తకంలో ఒక్క ´‘గాంబత్తె’ గురించే కాక జపాన్ విశ్వసనీయమైన మరెన్నో దృక్పథాలను కూడా ఈ పుస్తకం ఉద్దేశించిన తాత్వికతలో భాగంగా చెప్పడం లేదా దానికి అనుబంధంగానే ఉన్న కారణంగా వాటిని కూడా రచయిత అంతే స్థాయిలో చర్చించడం గమనిస్తాం. ఒకరకంగా ఇది ఈ పుస్తకం బలం, బలహీనత కూడా. ఒక తత్వం చెప్పడానికి పూనుకోవడంలో అదొక్కటే జీవితంలో ప్రధానాంశం అని చెప్పడంలో ఎప్పుడూ ఉండే సమస్యే ఇది. రచయిత అందుకే అటూ ఇటూ విస్తరిస్తూ మళ్ళీ మౌలిక విషయమైన ‘గాంబత్తె’లోకి వెళుతూ ఉంటాడు.

ఒక రకంగా ‘సీక్రెట్’ ఆన్న పుస్తకం ఎలా చాలా మందిని ఆకర్షించిందో ఈ పుస్తకం అంత ఆకర్షించకపోయినా ప్రతి విషయంలో ముందుకు సాగేందుకు జపనీయుల జీవన వికాసంలో ఉన్న ‘రహస్యం’ ఇదే అని తెలుస్తుంది.

నిజానికి చిన్న చిన్న అంశాల పట్ల శ్రద్దాసక్తులు, గాఢమైన అనుభవం, మనుషుల పట్ల ప్రేమాభిమానాలు, సౌదర్యం పట్ల ఎనలేని ఆరాధన, విశ్వాసంతో కలగలసి ఉండటం ఈ పుస్తకం చర్చించే ‘ఆశావహ దృక్పధం’, ‘అది తక్షణం ఆచరణలోకి తపెట్టడాన్ని’ ‘గాంబత్తె’ విడమరిచి చెబుతుంది. ఒక రకంగా ‘సీక్రెట్’ ఆన్న పుస్తకం ఎలా చాలా మందిని ఆకర్షించిందో ఈ పుస్తకం అంత ఆకర్షించకపోయినా ప్రతి విషయంలో ముందుకు సాగేందుకు జపనీయుల జీవన వికాసంలో ఉన్న ‘రహస్యం’ ఇదే అని తెలుస్తుంది.

అయితే పుస్తకం ఉదాహరించిన వ్యక్తులందరిలో ‘గాంబత్తె’ తత్వం పరిచయం చేసే క్రమంలో కొద్ది మంది, ఉదాహరణకు – ఫ్రెంచి రచయిత రాసిన ‘మొక్కలు నాటే మనిషి’ వంటి పాత్రల్లో వారి ఉన్నతికి, ఔదార్యవంతమైన కృషికి కూడా అదే తత్వం కారణం అని భావించి రాయడం ఈ పుస్తకంలో కనిపిస్తుంది. అట్లా, ఈ ‘తత్వం’ అన్నది జీవితంలో భాగంగా ఉండటం వల్ల ఎంతటి అసామాన్య పనులు పూర్తయ్యా యో చెప్పడం కోసం రచయిత ప్రతి అనుభవంలో దాన్ని వెతకడం కొంత కృతకంగా అనిపిస్తుంది గానీ మరో రకంగా భావిస్తే ఒక్క జపాన్ లోనే కాదు, ఈ జీవిత రహస్యం తాలూకు వివేకం దేశాలతో నిమిత్తం లేకుండా ఎందరిలోనో కానవస్తుంది. బహుశా అందుకే జపాన్ దాటి కూడా కొన్ని ఉదాహరణలు ఈ పుస్తకంలో కానవస్తాయి.

నాకు బాగా నచ్చిన అధ్యాయాల్లో ఒకటి ‘విలుకాడు, చందమామ’. ఇందులో చివర్లో ‘విలుకాడి అస్త్రానికి లక్ష్యం స్వయంగా విలుకాడే’ అని గురువు చెప్పిన ఉపదేశం ఎవరికైనా అవతలి వాళ్ళను అనుసరించడం లక్ష్యం కారాదు, ‘తమను తాము చేరుకోవడమే’ అంతిమం అన్న ‘మీరు సామాన్యులు కావడం ఎలా ?’ అన్న పుస్తకం తాత్వికత గుర్తు చేస్తుంది. ఇది నేను రాసిందే. అట్లే, టోక్యో లో ఒక చిన్న రెస్టారెంట్ నడిపే జిరో ఒనో ఆచరించిన సామాన్య సరళిలోని అసామాన్యత కట్టి పడేసింది. ఆయన కేవలం పది స్టూళ్ళు, టేబుల్లతో నడిపే అతడి రెస్టారెంట్ యజమాని. కానీ అక్కడ భోజనం చేయాలంటే పెద్ద విన్యాసమే చేయాలట. ఎంతో రుచిగల అక్కడి వంటల ప్రశస్తి తెలుసుకునే జపాన్ ప్రధాని మాజీ అమెరికా అధ్యక్షుడిని ఆహ్వానించి ఇక్కడ విందు ఇస్తాడు. విశేషం ఏమిటంటే జిరో ఒనో తాను వండే పదార్థాన్ని వినియోగాదారులు ఆరగిస్తుండగా ఆయన శ్రద్దగా గమనిస్తారు. ఈ వైఖరి నేను తెలియకుండానే నిర్వహించే గ్యాలరీలోనూ అనుసరిస్తూ ఉండటం నన్ను ఆశ్చర్య పరిచింది. వీక్షకుల అనుభూతిని ఆస్వాదిస్తూ వారి అనుభవాలు వింటూ ఆ బొమ్మ గురించిన చరిత్ర వివరించడం నేను కూడా అతడిలా అలవర్చుకున్నందుకు ఎంతో సంతోషించాను. ‘గాంబత్తె’ అంటే ఇదే. ఇలాంటి దృక్పథం అన్నది జిరో ఒనో ప్రతిభకు తోడుగా ఉందని. అందువల్లే అతడిలో ఆ స్థిరత్వం, ఉత్సాహంగా నేరిపే అతగాడి నిర్విరామ శ్రమకు దోహదపడిందని, అతడి జీవన సాఫల్యానికి కారణం ఇదే అని రచయిత చెబుతారు. ఇలాంటి అనేక అనుభవ జ్ఞానాన్ని రచయిత పలు ఉదాహరణలుగా ఇస్తారు.

అతడు వెండితెరపై చిత్రించేటప్పుడు కూడా అది కేవలం షూటింగ్ ఐనప్పటికినీ ప్రత్యేకంగా తాను ఆచరించిన కొన్ని సూత్రాల సూక్ష్మతను ఈ పుస్తకం మొదటిసారిగా తెలుపుతుంది.’

ప్రసిద్ద దర్శకులు అకిరా కురొసోవా చిరస్మరణీయలుగా మారడానికి కనిపించని అతడి పనివిధానం గురించి కూడా ఒక కొత్త కోణాన్ని ఈ పుస్తకం తెలియజేస్తుంది. పరిపూర్ణత అంటే బాహ్యమే కాదు, అంతరంగం తాలూకు విషయం అన్నది కూడా అని చెబుతూ అతడు వెండితెరపై చిత్రించేటప్పుడు కూడా అది కేవలం షూటింగ్ ఐనప్పటికినీ ప్రత్యేకంగా తాను ఆచరించిన కొన్ని సూత్రాల సూక్ష్మతను ఈ పుస్తకం మొదటిసారిగా తెలుపుతుంది. ‘గాంబత్తె’ అంటే పరిశ్రమ ఒక్కటే కాదు, పరిపూర్ణతలో భాగంగా పనిచేయడం అన్నది కూడా మనకు బోధపదుగుతుంది.

మీరూ చదవండి. బౌండ్ చేసిన ఈ పుస్తకం తీరిగ్గా పలుమార్లు చదవడానికి వీలుగా చిన్న చిన్న అధ్యాయాలుగా రచించబడింది. అందులోని వ్యక్తి లేదా ఉదాహరణ గుర్తొచ్చినప్పుడల్లా మీరు మరోసారి పుస్తకం తెరుస్తారు.

‘గాంబత్తె’ మీ జీవనంలో ఇప్పటిదాకా ఒక భాగస్వామి కాకపోతే ఇకముందు అయిపోతుంది. ఎందుకంటే, అ శక్తి మీలో ఇదివరకే ఉన్నది. తరచి చూసేలా చేయడమే ఈ పుస్తకం చేసే పని.

మంజుల్ పబ్లిషింగ్ హౌజ్ ప్రచురించిన ఈ పుస్తకం ప్రతి ఇంటా ఉండదగ్గది. మనషులు డీలా పడినప్పుడు, ఏమీ తోచని స్థితిలో ఉన్నప్పుడు తమ ఉదాసీనతని వదిలి, నిష్క్రియాపరత్వం నుంచి బయట పడటానికి ఈ పుస్తకం దోహదపడుతుంది. అందులో ఏ అధ్యాయం చదివినా ఏదో ఒక స్ఫూర్తి మంత్రశక్తిలా మిమ్మల్ని కార్యోన్ముఖులను చేస్తుంది.

పుస్తకం వెల 399 రూపాయలు. amazon వారి ఈ లింక్ ఇంకా తక్కువకే ఇస్తున్నట్టు చూపుతోంది.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article