అడివి పూసినా
వెన్నెల కాసినా
కాలువలు పారినా
సముద్రం నిండినా
టేకుపూల సోయగాన్ని
ఇప్పపూల పరిమళాన్ని
ప్రకృతిలోని ప్రతి సౌందర్యాన్ని
చెట్లు గుట్టలే కాదు
అడివి అడివంతా పరిచయం చేసింది మా నాన్నే
సమాజాన్ని చదవడం
సమస్యల్ని ఎదుర్కోవటం
నేర్పింది మా నాన్నే
మానవసేవే మాధవ సేవనీ
ఆపదలో వున్న వాళ్ళను ఆదుకునే గుణం
ఆకలితో వున్న వాళ్ళకు
కడుపు నిండా అన్నం పెట్టేతనం అలవాటు
చేసింది నాన్నే
వేలు పట్టి నడిపింది మొదలు
భుజంతట్టి అక్షర శిఖరo చేరే వరకు
వెన్నుముకగా నిలిచింది నాన్నే
నీ బిడ్డకు అన్నీ నీ పోలికలే
అని ఎవరైనా అన్నప్పుడు
నాన్న కళ్ళలో ఓ మెరుపు
మెరుస్తుంది
నువ్వు మీ నాన్నలాగే వుంటావన్నప్పుడు
నాకొకింత గర్వం తొనికిసలాడుతుంది
అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడైనా
నాన్నే నా జీవితాన
వెలుగు బాట
నాన్నే నా జీవితాన
వెన్నెల పాట
జయశ్రీ బండారు
మీ నాన్న గారికి నమస్కారం. మా బాల్యం నుండి ఆయనను చూసే అదృష్టం మాది.
మీకు నాన్నకు శుభాకాంక్షలు 🙏
కవిత చాలా బాగుంది జయశ్రీ గారు.సింపుల్ అండ్ స్వీట్ గా వుంది.