నేడు జూన్ 16 వ తారీఖు
క్రీ.శ. 1548 జూన్ 16 సదాశివరాయల నాటి శంఖవరం (కడప జిల్లా) శాసనంలో మహామండలేశ్వర నంద్యాల తింమ్మరాజయ్య నారపరాజయ్య గారి ఆనతిని ముప్పినేని పర్వతనాయనింగారు శంకవరం చెంన కేశవ పెరుమాళ్ళ అమృతపడికి, అంగరంగ వైభవాలకు ఘండికోట సీమలోని సకిలిసీమలోని ముద్దిరెడ్డిపల్లెను దానంచేసినట్లు చెప్పబడ్డది. [కడప జిల్లా శాసనాలు II నెం 197].
అట్లే 1559 జూన్ 16 నాటి గంగపేరూరు (కడప జిల్లా) శాసనంలో సదాశివరాయల పాలనలో గంగపేరూరు గ్రామాన్ని అమృతపళ్ళకు అంగరంగ వైభవాలకు దానం చేసినట్లుగా చెప్పబడ్డది. శాసన శిల శిధిలమైనందున యితర వివరాలు తెలియరావడంలేదు. శాసనంలో ఆరవీటి రామరాయలు,శ్రీరంగరాయల పేర్లు ప్రస్తావించినట్లు కనిపిస్తుంది. [కడప జిల్లా శాసనాలు II నెం. 249.
అట్లే 1578 జూన్ 16 నాటి శ్రీరంగరాయల చిడిపిరాల (కడప జిల్లా) శాసనంలో చిడిపిరాలలో గల కాలువలు ఖిలమైవుండగా వాటిని తవ్వించి, నీటిని పారించి, ఆ కాలువల కింద పండే పంటలలో, దేవబ్రాహ్మణ భూములను మినహాయించి, పన్ను భాగాన్ని చిడిపిరాల అగస్త్యేశ్వర గోపాలకృష్ణ దేవరలకు శ్రీవైష్ణవులకును,బ్రాహ్మణులకున్ను సహస్ర భోజనాలను పెట్టేటందుకు సమర్పించినట్లుగా చెప్పబడ్డది.[కడప జిల్లా శాసనాలు III నెం 97].
శీర్షిక నిర్వాహకుల పరిచయం
డా. దామరాజు సూర్య కుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణా కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.