నేడు తేదీ జూన్ 24
తిథి జేష్ఠ పౌర్ణమి. నేటి తేదీ మీద తెలుగు శాసనం లభించలేదు కానీ…
1.శక 1216 (క్రీ.శ. 1294)…నామ సంవత్సర జేష్ఠ పౌర్ణమి నాటి వేంపాడు (నెల్లూరు జిల్లా) శాసనంలో కాకతీయ ప్రతాపరుద్రుని పాలనలో త్రిపురాంతకేశ్వరుని ఆశీస్సులతో, రాజుగారికి పుణ్యంగా కందుకూరి స్థలంలోని బముపాడి గ్రామ తలారికాన్ని ముప్పడి నాయకుల కిచ్చినట్లుగా చెప్పబడ్డది.[నెల్లూరు జిల్లా శాసనాలు II నెం.కందుకూరు 84].
అట్లే శక 1217 జయనామ సంవత్సర జేష్ఠ పౌర్ణమి. (క్రీ.శ 1294) తిథినాటి కూరెళ్ళ (నల్లగొండ జిల్లా) శాసనంలో కాకతీయ ప్రతాపరుద్రుని పాలనలో
చెఱకు బొల్లయరెడ్డిసేనాని కుమారుడైన రుద్రయ తమ పురోహితులైన లక్ష్మీధరప్పంగారికి కూడెడ్ల (కూరెళ్ళ) గ్రామాన్ని నివృత్తి సంగమేశ్వరుని సన్నిధిలో చంద్రగ్రహణ పుణ్యకాలమందు సర్వమాన్యంగా యివ్వగా, దానగ్రహీత దాన్ని తిరిగి ఓరుగల్లు స్వయంభూదేవరకు, కొల్లిపాక సోమనాధదేవరకు, మెట్టు నరసింహదేవరకు, సిరివొడ్ల సోమనాధదేవరకు,కూడెడ్ల విశ్వనాధదేవరకు, కేశవదేవరలకు, నానాగోత్రీకులైన విద్వన్మహాజనులకు వ్రిత్తులుగా పెట్టినట్లు చెప్పబడ్డది.[నల్లగొండ జిల్లా శాసనాలు I నెం 91].
శీర్షిక నిర్వాహకుల పరిచయం
డా. దామరాజు సూర్య కుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణా కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.