నేడు తారీఖు అక్టోబర్ 26
క్రీ.శ 1441 అక్టోబర్ 26 నాటి వంకాయలపాడు (గుంటూరు జిల్లా) శాసనంలో దేవరాయలు II పాలనలో పోతినాయనింగారు తమ తల్లిదండ్రులకు పుణ్యంగా దానమేదో చేసినట్లుగా చెప్పబడ్డది. శాసన శిల శిధిలమైనందున యితర దానవివరాలు తెలియరావడంలేదు. [ద.భా.దే.శా XVI నెం 32].
అట్లే క్రీ.శ 1593 అక్టోబర్ 26 నాటి కలమళ్ళ (కడప జిల్లా) శాసనంలో వెంకటపతి రాయల పాలనలో మహామండలేశ్వర నందేల ఔబళేశ్వరదేవమహారాజుల కార్యకర్తలు (పేరు నశించిపోయినది) కలుమళ చెన్నకేశవ పెరుమళ్ కు పెంటసుంకమును ధారపోసి యిచ్చినట్లుగా చెప్పబడ్డది. [ద.భా.దే.శా XVI నెం 305].
అట్లే క్రీ.శ 1602 అక్టోబర్ 26 నాటి సంబటూరు (కడప జిల్లా) శాసనంలో శ్రీమన్మహామండలేశ్వర మట్లి కుమార అనంతరాజయ్య దేవమహారాజుల కార్యకర్తలైన అనిమెల రఘునాథయ్యగారు సంబటూరు కాపులకు బీడుభూములను సాగుచేయుటకు గుత్తకిచ్చినట్లు,ఏడేండ్ల వరకు తప్పక నడపవలెనని,ఎనిమిదవయేటినుండి క్రమంగా కానిక, అసవెచ్చము (దశబంధము (?)లు చెల్లించవలెనని చెప్పబడ్డది. [ద.భా.దే.శా XXXI నెం 141].
అట్లే క్రీ.శ 1626 అక్టోబర్ 26 నాటి అనుంపల్లి (అనంతపురం జిల్లా) శాసనంలో రామదేవరాయలవారి పాలనలో శ్రీమన్మహానాయంకరాచార్య పెదపాపినాయనిగారి కుమారుడు ఇమ్మడి పాపినాయనింగారు అనుంపల్లి గ్రామంలోని గోపాలస్వామికి స్థానమాన్యంగా వేములపాటి స్థానం చిన తింమయకు చంద్రగ్రహణ పుణ్యకాలాన యిచ్చినట్లుగా చెప్పబడ్డది. [ద.భా.దే.శా XVI నెం 320].
శీర్షిక నిర్వాహకుల పరిచయం
డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణ కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.