నేడు సెప్టెంబర్ 22
క్రీ.శ 1289 సెప్టెంబర్ 22 నాటి తొగర్రాయి (నల్లగొండ జిల్లా) శాసనంలో కాకతీయ ప్రతాపరుద్రుని పాలనలో వారి నాయంకరుడు విష్ణువర్ధనమహారాజుల కరణం ముడిపికంటిమల్లయగారు పశురక్షణ యుద్ధంలో మరణించిన ముడిపికంటి మాదయ, దేవయ, ముడిపికంటి మల్లయ పెండ్లం పోసాని పేరున త్రకూటము నిర్మించి, మాదేశ్వర దేవేశ్వర పోచేశ్వర దేవరలను ప్రతిష్టచేసి నైవేద్యాలకు అంగరంగ భోగాలకు అనేక భూములనిచ్చినట్లుగా చెప్పబడ్డది. [నల్లగొండ జిల్లా శాసనాలు I నెం 93].
అట్లే క్రీ.శ 1629 సెప్టెంబర్ 22 నాటి చినకోట్ల (అనంతపురం జిల్లా) శాసనంలో రామదేవరాయలు వెల్లూరు నుండి రాజ్యంచేస్తుండగా వెంకటపతి నాయనింగారు పెమ్మసాని తిమ్మనాయనింగారి నుండి అమరనాయంకరముగా పొందిన గుత్తి రాజ్యం చిరమాగాణి లోని గ్రామం (పేరు నశించిపోయినది)లో చిక్క వడయలు నిర్మించిన చెరువు నిమిత్తమున భూములనిచ్చినట్లుగా చెప్పబడ్డది. [ద.భా.దే.శా.XVI నెం 323].
శీర్షిక నిర్వాహకుల పరిచయం
డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణ కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా