జనవరి 10వ తారీఖు
క్రీ.శ.1107 యిదే తారీఖున యివ్వబడిన శనిగరం శాసనంలో కాకతీయ 2 వ బేతరాజు అనుమకొండ పురవరాధీశ్వరుడుగా, చాళుక్య ఆరవ త్రిభువన మల్ల సామంతునిగా పేర్కొనబడ్డాడు. ( కాకతీయ శాసనాలు నెం 6)
అట్లే 1314 యిదే తారీఖునాటి ప్రతాప రుద్రుని గణపేశ్వరం (కృష్ణా జిల్లా, దివి తాలూకా) శాసనంలో రాజు గారి కోట శ్రీవాకిలి, అంగరక్షకుడైన పెదనీలినాయని సోదరుని కుమారుడైన మాచయ కృష్ణా సముద్ర సంగమ మైన పెదదివిలోని గణపతీశ్వరదేవర అఖండ దీపానికి 100 ఆవులనిచ్చినట్టు, వాటిని పుల్లరి పన్ను నుండి మినహాయించినట్లు చెప్పబడ్డది.
అట్లే 1568 నాటి చావలి (తెనాలి తాలూకా, గుంటూరు జిల్లా) శాసనంలో సదాశివరాయల పాలనలో శ్రీ మన్మహా మండలేశ్వర రామరాజు తిరుమల రాజయ్య దేవమహారాజుగారు కొండవీటి సిమలోని తోటపల్లి గ్రామాన్ని రామభద్రునిచే(?) ప్రతిష్ఠితమైన వ్యాలేశ్వరదేవర నిత్య నైవేద్యాలు దీపారాధన, కళ్యాణోత్సవం మున్నగు సకలోపచారాల కిచ్చినట్లుగా చెప్పబడ్డది. ఇది అంతకుముందు పురుషోత్తమ గజపతి యిచ్చిన శాసనానికి పునరుద్ధరణమని, బొద్దులూరు గ్రామాన్ని సిద్దిరాజు తిమ్మయ్య గారు యిచ్చినట్లు, శ్రీ నాధరాజు, తదితరులచే వ్యాలేశ్వరదేవర కు గతంలో యివ్వబడిన భూదానాల ప్రస్తావనలు శాసనంలో ఉన్నాయి (దభాదేశా.వా.16నెం.267)
శీర్షిక నిర్వాహకుల పరిచయం
డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణ కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.