నేడు ఆగస్ట్ 20 వ తారీఖు
క్రీ.శ 1514 ఆగస్ట్ 20 నాటి పొదిలి (ప్రకాశంజిల్లా) శాసనంలో శ్రీకృష్ణ దేవరాయల పాలనలో రాయసం కొండమరుసయ్య పొదిలి భీమేశ్వర, కైలాసనాథరాయలల అంగరంగ వైభవాలకు పొదిలిసీమలోని చిఱమకూరు గ్రామాన్ని సర్వాక్రాంతంగా యిచ్చినట్లు, అందు 4 1/2 భాగాలు భీమేశ్వరునికి, 2 1/2 భాగాలు కైలాసనాథునికి పూర్వక్రమాన చెల్లేటట్లుగా చెప్పబడ్డది [నెల్లూరు జిల్లా శాసనాలు III Po 36].
అట్లే అదే రోజున యివ్వబడిన చిలమకూరు శాసనంలో యిదే విషయం చెప్పబడ్డది. [నెల్లూరు జిల్లా శాసనాలు III Po 4].
అట్లే క్రీ.శ 1545 ఆగస్ట్ 20 నాటి తలమంచిపట్నం (కడప జిల్లా) శాసనంలో సదాశివరాయల పాలనలో శ్రీమన్మహామండలేశ్వర జగతాపి కంచిగోపసోమదేవచోడ మహారాజు తలమంచిపట్నం పెరుమాళ్ళకు (పేరునశించిపోయినది), హనుమంతదేవర దిన అవసరాలకు భూములనిచ్చినట్లుగా చెప్పబడ్డది. శాసన శిల శిధిలమైనందున యితర వివరాలు తెలియరావడంలేదు. [కడప జిల్లా శాసనాలు II నెం 154].
శీర్షిక నిర్వాహకుల పరిచయం
డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణ కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.