ఇవాళ జూలై 6 వ తేదీ
క్రీ.శ 1429 జూలై 6 వ తేదీ నాటి మంగినపూడి (ప్రకాశంజిల్లా) శాసనంలో మహామండలేశ్వర దేవరాయమహారాయల కాలంలో మంగినపూడి చెరువు ఖిలమై వుండగా బొమ్మరాజు శింగరాయలు పంపిన మంచిరాజు, సింగమలిరాజు, ఆదిపరెడ్డి, వల్లభరెడ్డి, నారపరెడ్డి, మేంకలరెడ్డి, వెంకారెడ్డి, బుసిరెడ్డి, కొంమిరెడ్డి, మున్నగువారు మరమ్మతులుచేసి తలా రెండు మర్తురుల భూమి ప్రతిఫలంగా తీసుకొనేటట్లుగా చెప్పబడ్డది. [నెల్లూరు జిల్లా శాసనాలు I Darsi 47].
అట్లే 1514 జూలై 6 వ తేదీ నాటి తిరుమల శాసనంలో శ్రీకృష్ణ దేవరాయలు ప్రతాపరుద్రగజపతిపై దండెత్తి అతడిని కొండవీడు దాకా “యిరగబొడిచి” ఉదయగిరి దుర్గాన్ని గైకొని తిరిగి విజయనగరం పోతూ తిరువేంగళనాథుని దర్శనానికి తిరుమలదేవి, చిన్నాదేవిలతో తిరుమల విచ్చేసి వారితో అమూల్య ఆభరణాలను సమర్పించినట్లు చెప్పబడ్డది. అట్లే తిరుమలదేవిగారు చోళింగవరప్పట్టలోని ఇరాతూరిగ్రామాన్ని సమర్పించినట్లుగా చెప్పబడ్డది. [టి.టి.డి.శాసనాలు III నెం 74].
అట్లే అదే రోజున అదే సందర్భంలో రాయలవారి మరో దేవేరి చిన్నాదేవి కూడా అనేకమైన కానుకలు సమర్పించి తొండ మండలంలోని ముధిడియూరును సమర్పించినట్లు చెప్పబడ్డది. [టి.టి.డి.శాసనాలు III నెం 71.]
అట్లే అదే రోజున అదే చోట అదే సందర్భంలో యివ్వబడిన మరోశాసనంలో రాయలవారు కూడా అనేక కానుకలనిచ్చి పొత్తపినాటిలోని తాళపాక గ్రామాన్ని దేవుని అమృతపడికి, నివేదనలకు యిచ్చినట్లు, ఆ ప్రమాదంలో నిర్దేశించిన కొంతభాగం రాయలవారిచే స్థాపించబడ్డ సత్రాలలో బ్రాహ్మణుల పోషణకు వుపయోగించునట్లుగా చెప్పబడ్డది. [తి. తి. దే. శాసనాలు III నెం 68].
శీర్షిక నిర్వాహకుల పరిచయం
డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణా కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.