నేడు జూన్ 15 వ తారీఖు
క్రీ.శ 1551 జూన్ 15 సదాశివరాయల కాలం నాటి కొర్రపాడు (కడప జిల్లా) శాసనంలో మహామండలేశ్వర చెన అవుబళేశ్వర దేవమహారాజులు షటగోపజియ్య శిష్యులు, బహుశ, నరసింహాలయ పూజారి, వామన నారాయణ జియ్య గారికి కొర్రపాటి గ్రామాన ప్రథమైకాదశి పుణ్యకాలమందు పినాకినీ తీరమందు నరసింహదేవుని సన్నిధిని భూములు దానమిచ్చినట్లుగా చెప్పబడ్డది.[కడప జిల్లా శాసనాలు II నెం 222].
అట్లే 1554 జూన్ 15 నాటి మాచర్ల శాసనంలో సదాశివరాయల పాలనలో రేచర్ల వెలుగోటి కొమార తిమ్మనాయనింగారి అర్థాంగి లింగమ్మ పేర లింగాపురం గ్రామాన్ని నిర్మించి, అందుల 15 పుట్లు, 10 తూముల భూములను మాచర్ల ఇష్టకామేశ్వర, వీరేశ్వర దేవరల అంగరంగ వైభవాలకిచ్చినట్లుగా చెప్పబడ్డది. [ద.భా.దే.శా.XVI నెం. 191].
అట్లే అదే రోజున యివ్వబడిన బాదేపురం (గుంటూరుజిల్లా) శాసనంలో సదాశివరాయల పాలనలో శ్రీమన్మహామండలేశ్వర తిమ్మరాజుంగారు కొండవీటిసీమ లోని కోట వీథి స్తలములోని రామచంద్రాపురం గ్రామంలో పుట్టి భూమిని బ్రాహ్మణ భావయ్యకు సోమ గ్రహణ పుణ్యకాలమందు యిచ్చినట్లుగా చెప్పబడ్డది. [ద.భా.దే.శా XVI నెం. 192].
శీర్షిక నిర్వాహకుల పరిచయం
డా. దామరాజు సూర్య కుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణా కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.