నేడు జూన్ 9వ తారీఖు
నేడు కూరెళ్ళ. ఉదయగిరి, చదలవాడ శాసనాలు
క్రీ.శ 1294 జూన్ 9 వ తారీఖునాటి కూరెళ్ళ (నల్లగొండ జిల్లా) శాసనంలో కాకతీయ ప్రతాపరుద్రుని పాలనలో చెఱకు బొల్లయరెడ్డి సేనాని కుమారుడైన రుద్రయ తమ పురోహితులైన లక్ష్మీధరప్పంగారికి కూడెడ్ల (కూరెళ్ళ) గ్రామాన్ని నివృత్తి సంగమేశ్వరుని సన్నిధిలో చంద్రగ్రహణ పుణ్యకాలమందు సర్వమాన్యంగా యివ్వగా,దానగ్రహీత దాన్ని తిరిగి ఓరుగల్లు స్వయంభూదేవరకు, కొల్లిపాక సోమనాధదేవరకు,మెట్టు నరసింహదేవరకు, సిరివొడ్ల సోమనాధదేవరకు, కూడెడ్ల విశ్వనాధదేవరకు, కేశవదేవరలకు, నానాగోత్రీకులైన విద్వన్మహాజనులకు వ్రిత్తులుగా పెట్టినట్లు చెప్పబడ్డది.[నల్లగొండ జిల్లా శాసనాలు I నెం 91].
అట్లే క్రీ.శ 1514 జూన్ 9 నాటి శ్రీకృష్ణ దేవరాయల ఉదయగిరి శాసనంలో శ్రీకృష్ణ దేవరాయలు ఉదయగిరిని జయించి ప్రతాపరుద్రగజపతిని కొండవీటి దాకా “ఇరగబొడిచి” వారి పినతండ్రి తిరుమల కాంత రాయని పట్టుకొని తిరిగి ఉదయగిరికి విచ్చేసి, కోనవల్లభరాయని పూజా పురస్కారాలకి నైవేద్యాలకి సర్వభోగాలకు నెల్లూరుసీమలోని శీకల్లు గ్రామాన్ని యిచ్చినట్లుగా చెప్పబడ్డది.[నెల్లూరు జిల్లా శాసనాలు III ఉదయగిరి 40].
అట్లే క్రీ.శ 1565 జూన్ 9 నాటి చదలవాడ (ప్రకాశం జిల్లా) శాసనంలో సదాశివరాయలు రాజ్యం చేస్తుండగా అద్దంకి- అమ్మనబోలుసీమలోని చదలవాడ శ్రీ రఘునాయకులకు రంగపరాజయ్య దేవమహారాజులు చదలవాడ, మల్లవరము,అలవలపాడు మున్నగు గ్రామాల అడ్డగడ సుంకాలు, విహిత సుంకాలు(?), స్థలభరితాలు,మూలవీసాలు బడి మున్నగు సుంకాల ఆదాయాన్ని ప్రథమైకాదశి పుణ్యకాలమందు ధారవోసి యిచ్చినట్లుగా చెప్పబడ్డది. [నెల్లూరు జిల్లా శాసనాలు II ఒంగోలు 29].
శీర్షిక నిర్వాహకుల పరిచయం
డా. దామరాజు సూర్య కుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణా కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.