నేడు సెప్టెంబర్ 16 వ తేదీ
క్రీ.శ 1289 సెప్టెంబర్ 16 నాటి ఖండవల్లి (పశ్చిమ గోదావరి జిల్లా) శాసనంలో కాకతీయ ప్రతాప రుద్రదేవుడి పాలనలో మంత్రి అన్నయదేవహూతి విద్దనాచార్యులకు భూదానం చేసినట్లుగాను, ఈ విద్దనాచార్యులు పూర్వ ఉత్తర మీమాంసలపై “ప్రమేయచర్చాంత్ర “మనే గ్రంధాన్ని రాసినట్లు, చాళుక్య ఇందుశేఖరుని నుండి ఉత్తరేశ్వరపురమును గ్రహించినట్లు చెప్పబడ్డది. అట్లే అన్నల దేవసచివుడు దానమిచ్చిన భూములను అనేకమంది బ్రాహ్మణులకు దానమిచ్చినట్లు చెప్పబడ్డది. [Epigraphia Andhrica IV, pp103ff]
అట్లే క్రీ.శ 1559 సెప్టెంబర్ 16 నాటి కల్లుభావి (కర్నూలుజిల్లా) శాసనంలో సదాశివరాయల పాలనలో కల్లుభావి గ్రామంలో విప్రవినోదులు జంగములకేదో దానమిచ్చినట్లు తోచుచున్నది. శాసన శిల శిధిలమైనందున యితర దాన వివరాలు తెలియరావడంలేదు. [ద.భా.దే.శా XVI నెం.242].
శీర్షిక నిర్వాహకుల పరిచయం
డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణ కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా