నేడు జులై 27 వ తేది
క్రీ.శ 1257 జులై 27 నాటి గంగవరం (కడప జిల్లా) శాసనంలో కాకతీయ గణపతిదేవుని పాలనలో కాయస్థ గంగయసాహిణి భార్య కమలాబాయి పుష్పగిరి..దేవర అంగభోగానికి ములికినాటిసీమలోని గంగాపురమును ధారాపూర్వకంగా యిచ్చినట్లు చెప్పబడ్డది. [కడప జిల్లా శాసనాలు I నెం. 141].
అట్లే క్రీ.శ 1527 జులై 27 నాటి కాళహస్తి శాసనంలో అచ్యుతదేవరాయలు పట్టాభిషిక్తుడై రాయనరాజు,మల్లురాజు మున్నగువారికి అభయహస్తమిచ్చి, పాండ్యరాజు కుమార్తెను పుచ్చుకొని వరదరాజదేవరను సేవించి అనేక అమూల్యకానుకలనిచ్చినట్లుగా చెప్పబడ్డది. [ద.భా.దే.శా.XVI నెం 97].
అట్లే క్రీ.శ 1560 జులై 27 నాటి చెరువు బెళగళ్ళు (కర్నూలు జిల్లా) శాసనంలో సదాశివరాయల పాలనలో కెరెబళుగంటి రాజరాజేశ్వర మహాదేవుని అమృతపళ్ళకు పేంట బలిజవారిచ్చే పన్నులలో కొంతభాగము నిచ్చినట్లుగా చెప్పబడ్డది.అట్లే యితర సుంకాధికారులు కూడా యితర దేవుళ్ళకు అనేక దానాలిచ్చినట్లుగా చెప్పబడ్డది. [ద.భా.దే.శా.XVI నెం 245].
శీర్షిక నిర్వాహకుల పరిచయం
డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణ కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.