నేడు జూలై 9 వ తేదీ
క్రీ.శ 1546 జులై 9 తేదీ నాటి బల్యంపల్లి (కడప జిల్లా) శాసనంలో సదాశివదేవ మహారాజుల పాలనలో రాజుగారి ఆనతిని రామరాజయ్యగారు భోగాపురం అగ్రహారం మహాజనాలకు, కరణాలకు కానిక, సిద్ధాయము, మడిపన్ను మున్నగువాటిని సర్వమాన్యం చేసినట్లు చెప్పబడ్డది.[కడప జిల్లా శాసనాలు II నెం.186].
అట్లే అదేరోజున యివ్వబడిన పెదకోమెర్ల (కడప జిల్లా) శాసనంలో సదాశివరాయల పాలనలో మహామండలేశ్వర నందేల చిన అవుబళేశ్వర మహారాజు పెదకోమెర్ల చెన్నరాయని నైవేద్య దీపారాధన, అంగరంగ భోగాలకు సకల తిరుకైంకర్యాలకు 13 పుట్ల చేను యితర భూములనిచ్చినట్లుగా చెప్పబడ్డది. [కడప జిల్లా శాసనాలు II నెం.185].
అట్లే అదే రోజున యివ్వబడిన ములకలచెరువు (చిత్తూరు జిల్లా) శాసనంలో సదాశివరాయల పాలనలో కనుగొండ తిరువెంగళనాథునికి ఏకాదశి పుణ్య కాలాన దద్యోన్న అవసరాలకు సోమపాల్య అగ్రహారం ముదిరడి మారమరడి కుమారుడు యరగంగిరెడ్డి భూములనిచ్చినట్లుగా చెప్పబడ్డది. [ద.భా.దే.శా XVI నెం. 152].
అట్లే క్రీ.శ 1572 జులై 9 వ తేదీ నాటి శ్రీ పెరంబుదూరు (తమిళనాడు) శాసనంలో శ్రీరంగరాయల పాలనలో వెంకటయ్య దేవమహారాజులు శ్రీ పెరంబుదూర్ ఆదికేశవ పెరుమాళ్ తిరుపని తిరువారాథనలకు చంద్రగిరిరాజ్యం జయంకొండ మండలం చంగాతికోటసీమ మేకుడి స్థానంలోని గ్రామాలలో కావలి,కందాయము మున్నగు పన్నుల నుండి వచ్చే ఆదాయమును యిచ్చినట్లుగా చెప్పబడ్డది. [ద.భా.దే.శా.XVI నెం 282].
శీర్షిక నిర్వాహకుల పరిచయం
డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణా కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.