నేడు సెప్టెంబర్ 11 వ తారీఖు
క్రీ.శ 1299 సెప్టెంబర్ 11 నాటి అలంపూర్ శాసనంలో కాకతీయ ప్రతాపరుద్రుని పాలనలో హలంపురి (అలంపురం) కి చెందిన సమస్త పెక్కండ్రు, సెట్లు మహాస్థానాధిపతి మల్దేవరాజు తదితరులనుండి కొన్న రేగడి చేనును శ్రీ గౌరీశ్వర దేవర అంగరంగ భోగాలకు అముదుపడులకు మాదిజియ్య నాగజియ్యలకు యిచ్చినట్లుగా చెప్పబడ్డది. [మహబూబ్ నగర్ శాసనాలు I నెం 19].
అట్లే క్రీ.శ 1551 సెప్టెంబర్ 11 నాటి ఎర్రగుడిపాడు (కడపజిల్లా) శాసనంలో సదాశివరాయల పాలనలో అహోబిలదేవర, నమ్మళవారి కోవెలలోను శ్రీవైష్ణవులు 12 మందికి ఆరగింపునకు నంద్యాల తింమయరాజుగారు యర్రగుడిపాడులో భూములనిచ్చినట్లుగా చెప్పబడ్డది. [ ద.భా.దే.శా XXXI నెం 109].
అట్లే క్రీ.శ 1554 సెప్టెంబర్ 11 నాటి చిత్రచేడు (అనంతపురం జిల్లా) శాసనంలో సదాశివరాయల పాలనలో శ్రీమన్మహామండలేశ్వర తిమ్మయదేవ మహారాజులు కుమారకొండ రాజయ్యగారికి నాయంకరానికి యిచ్చిన చిత్రచేడు గ్రామంలో దొమ్మరిపన్నును ఆ గ్రామ చెన్నకేశవ దేవరకు,రామేశ్వరదేవరకు,గణాధిపతి దేవరల ధనుర్మాస తదితర పూజలకు ధారవోసి యిచ్చినట్లుగా చెప్పబడ్డది. [ద.భా.దే.శా XVI నెం 197].
శీర్షిక నిర్వాహకుల పరిచయం
డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణ కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా