నేడు ఆగస్ట్ 14 వ తారీఖు
నేటి రోజున ఇదు శాసనాల లభ్యం : వేల్పూరులో రెండు- కొణిదెన, గోరంట్ల, నాదెండ్లలో ఒక్కో శాసనం
క్రీ.శ 1221 ఆగస్ట్ 14 నాటి కొణిదెన (ప్రకాశంజిల్లా) శాసనంలో కాకతీయ గణపతిదేవుడు రాజ్యం చేస్తుండగా కమ్మనాటి రాజధాని కొట్యదొన శంకరేశ్వర శ్రీమహదేవరకు బల్లసాని అరదీపం పెట్టినట్లుగా చెప్పబడ్డది. [ద.భా.దే.శా.VI నెం. 618].
క్రీ.శ 1239 ఆగస్ట్ 14 నాటి వేల్పూరు (గుంటూరు జిల్లా) శాసనంలో కాకతీయ గణపతిదేవుని పాలనలో వారి పాద పద్మోపజీవి సోమరౌతు రాణి ఐతసాని వేల్పూరు శ్రీ రామేశ్వరదేవరదేవ మహాదేవుని అఖండ దీపానికి 25 మోదాలు పెట్టినట్లుగా చెప్పబడ్డది. [ద.భా.దే.శా X నెం 290].
క్రీ.శ 1264 ఆగస్ట్ 14 నాటిదే వేల్పూరులోనిదే మరో శాసనంలో కాకతీయ రుద్రమ పాలనలో కోట పాలకులు నాలుగు వాడ్ల (వాడల) పూజారులకు భూములు, యిండ్లు యిచ్చినట్లుగా చెప్పబడ్డది. శాసన శిల శిధిలమైనందున యితర వివరాలు తెలియరావడంలేదు. [ద.భా.దే.శా X నెం 401].
క్రీ.శ 1524 ఆగస్ట్ 14 నాటి గోరంట్ల (అనంతపురం జిల్లా) శాసనంలో శ్రీకృష్ణదేవరాయల పాలనలో వాకిటి ఆదెప్పనాయనింగారి కార్యకర్తలైన సూరపరాజుగారు సోమేశ్వరుని గుడి శిఖరము ఛిద్రమైన చోట బాగుచేసినట్లు తంబళ్ళవారిచే విస్తరాకుల వెట్టిని మాన్పించినట్లు చెప్పబడ్డది. [ద.భా.దే.శా. XVI నెం.89].
క్రీ.శ 1579 ఆగస్ట్ 14 నాటి నాదెండ్ల శాసనంలో శ్రీరంగరాయల పాలనలో శ్రీమన్మహామండలేశ్వర గొబ్బూరు తింమ్మరాజయ్యగారి కార్యకర్తలైన రామాపండితులుంగారు నాదెండ్ల గోవర్థనరాయ అంగరంగ వైభవాలకు నిత్య నైవేద్యాలకు దీపారాధనకు వెలిపొలము తదితర భూములనిచ్చినట్లుగా చెప్పబడ్డది. [ద.భా.దే.శా XVI నెం 686].
శీర్షిక నిర్వాహకుల పరిచయం
డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణ కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.