నేటి తేది ఆగస్ట్ 4
క్రీ.శ 1217 ఆగస్ట్ 4 వ తేదీ నాటి డిచ్చకుంట (వరంగల్ జిల్లా) శాసనంలో కాకతీయ గణపతి దేవ మహారాజుల మాండలిక రుద్రారెడ్డి కొడుకు కాటయ సేనాని ప్రదక్షినం మహదేవమంచి గారికి ఏలేశ్వరం కాలువన మఱ్తుఱు భూమిని ధారాపూర్వకంగా యివ్వగా వారు దాన్ని తేజోనిథిదేవరకిచ్చిరి. వారు దానిని తిరిగి ఈశ్వర సంవత్సర శ్రావణ అమావాస్య సూర్య గ్రహణ పుణ్యకాలాన గొల్లకోట జలేశ్వరదేవరకిచ్చినట్లుగా చెప్పబడ్డది. [వరంగల్ జిల్లా శాసనాలు. నెం 55].
అట్లే క్రీ.శ 1552 ఆగస్ట్ 4 వ తేదీనాటి మార్కాపురం (ప్రకాశం జిల్లా) శాసనంలో సదాశివరాయల పాలనలో మహామండలేశ్వర తిరుమలదేవ మహారాజులు తమ నాయంకరమైన కొచ్చెర్లకోట సీమలోని తర్నుబాడు కోరివానిపల్లె మేడిశెట్టిపల్లె గంగిరెడ్డిపల్లె జమ్ములదిన్నె తెల్లబోడు కోమటికుంట సూరేపల్లి వానాలపురం చెన్నారెడ్డిపల్లె మున్నగు పది గ్రామాలను మారకాపురం చెన్నకేశవరాయలకు సమర్పించినట్లు చెప్పబడ్డది. [ద.భా.దే.శా XVI నెం. 184].
అట్లే క్రీ.శ 1589 ఆగస్ట్ 4 వ తేదీ నాటి కోకటం (కడప జిల్లా) శాసనంలో శ్రీ వీర వెంకటపతి దేవ మహారాయలు రాజ్యంచేస్తుండగా ఘండికోట సీమలోని కోకటం అగ్రహార చెన్నకేశవపెరుమాళ్ళకును సకలనాధలింగానికి అఖండ తిరువళికలకు (అఖండదీపానికి) దొమ్మరి పెదసాళువపతి కొడుకు మీసరగండ తమ కులంవారికి పుణ్యంగా దొమ్మరి త్యాగాన్ని ధారవోసినట్లుగా చెప్పబడ్డది. [కడప జిల్లా శాసనాలు III నెం 128]
శీర్షిక నిర్వాహకుల పరిచయం
డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణ కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.