Editorial

Wednesday, January 22, 2025
సాహిత్యం'నా తెలంగాణ- రుబాయి ప్రస్థానం' : ఏనుగు నరసింహారెడ్డి మననం

‘నా తెలంగాణ- రుబాయి ప్రస్థానం’ : ఏనుగు నరసింహారెడ్డి మననం

“ఇప్పటి దాకా బతికుంటే దాశరథి కూడా ప్రత్యేక తెలంగాణ కోరి ఉండేవారని చెప్పడానికి నేను కవిత్వం రాసాను. అది వచన కవిత్వంలా కాకుండా రుబాయి రూపాన్ని సంతరించుకోవడం నా వరకు నాకు ఒక మలుపు”

రుబాయిల రూపం – సారం, ఆ ప్రస్థానం తెలుపు వ్యాసం తెలుపుకు ప్రత్యేకం.

ఏనుగు నరసింహారెడ్డి

ఆడినప్పుడు ఆట విలువలు తెలియరావు
గెంతినప్పుడు స్వేచ్ఛ ఎత్తులు తెలియరావు
అనుభవించిన క్లేషమే చుక్కాని తుదకు
చిమ్మచీకటి కమ్మ; దారులు తెలియరావు

ఉమర్ ఖాయం, అంజద్ హైదరాబాదీల రూబాయిలను అనేకులు తెలుగులోకి పద్యాలలో అనువదించారే కానీ ఎవరూ తెలుగులోకి రుబాయి రూపం తేలేదనే చెప్పాలి. నిజానికి మహాకవి దాశరథి గారే ఈ దిశగా తొలిప్రయత్నం చేసారు. తను కూడా సౌష్టవమైన రుబాయిని నిలబెట్టలేదు. రదీఫ్, కాఫియాలను అడపాదడపానే పాటించారు. మాత్రల సమత వీలైన చోట్లే పాటించారు. చాలాచోట్ల గేయం స్థాయికి తెచ్చారు. దాశరథి ప్రఖ్యాత రుబాయి

‘కళ్ళెం ఉన్నది మన చేతిలో
గుర్రం మాత్రం పడె గోతిలో
తప్పితీరదని నేనంటాను
నీళ్ళే అందని మన నూతిలో’’ లో రదీఫ్, కాఫియాలు లేవు.

దాశరథి తర్వాత రూబాయిలను నెత్తికెత్తుకున్నవారు తిరుమల శ్రీనివాసాచార్య. వారు రుబాయి రూపాన్ని సరిగ్గా పట్టుకున్నారు. రదీఫ్, కాఫియాలు నిర్వహించడంతోపాటు మాత్రల సమత కూడా పాటించారు.

దాశరథి

దాశరథి తర్వాత రూబాయిలను నెత్తికెత్తుకున్నవారు తిరుమల శ్రీనివాసాచార్య. వారు రుబాయి రూపాన్ని సరిగ్గా పట్టుకున్నారు. రదీఫ్, కాఫియాలు నిర్వహించడంతోపాటు మాత్రల సమత కూడా పాటించారు. అయితే పుంఖాను పుంఖాలుగా రాస్తూ అనేక సంపుటాలు తీసుకురావడం వల్లనో ఏమో అక్కడక్కడ రదీఫ్, కాఫియాలు జారిపోయాయి. రదీఫ్ స్థానంలో అంత్యప్రాసలొచ్చి చేరాయి. ఆ తర్వాత గుర్తుంచుకోదగిన మంచి రుబాయిలు దాశరథుల బాలయ్య రాసారు. ఇంకా కొంతమంది రుబాయిలు రాస్తున్నవాళ్ళున్నా రుబాయి అని పేరుపెట్టుకొన్నా వాటన్నిటికీ పరిపూర్ణ రుబాయి రూపాన్ని సంతరించలేకపోయాయన్నది నా వ్యక్తిగత అభిప్రాయం.

నా తెలంగాణ రుబాయిలలో రదీఫ్, కాఫియాలు ఖచ్చితంగా పాటించాను. మాత్రల సమత కూడా సాధించాననే అనుకుంటున్నాను. భౌతిక రూపాన్ని సాధించిన నేను భావరూపాన్ని ఏ మేరకు సాధించానో పాఠకులు చెప్పాలి.

తెలుగులో సర్వలక్షణ సమన్వితమైన రుబాయి ఇంకా స్థిరపడకపోవడం ఆశ్చర్యంగా అనిపించింది, కానీ అది నిజం. తెలంగాణ రుబాయిలు ప్రచురిస్తూ ఉన్నప్పుడు ఆ ఎరుక నా మది నిండా ఉంది. తెలంగాణ రుబాయిలు ద్వారా రూపపరంగా నేను సరియైన రుబాయి ప్రకటించాననే అనుకొంటున్నాను. నా తెలంగాణ రుబాయిలలో రదీఫ్, కాఫియాలు ఖచ్చితంగా పాటించాను. మాత్రల సమత కూడా సాధించాననే అనుకుంటున్నాను. భౌతిక రూపాన్ని సాధించిన నేను భావరూపాన్ని ఏ మేరకు సాధించానో పాఠకులు చెప్పాలి.

ఇరివెంటి కృష్ణమూర్తి

ఇరివెంటి కృష్ణమూర్తి చెప్పినట్లు రుబాయి రచన ఎంత సులభమని అనిపిస్తుందో, మంచి రుబాయిని నిర్మించడం అంత కష్టమని కూడా నాకు అనుభవంలోకి వచ్చింది. ఆంధ్రప్రభలో సీరియల్ రాస్తూ ఉన్నప్పుడు, వారం వారం పంపాల్సిన టైం తరుముకొస్తూ ఉన్నప్పుడు కాలమిస్టుల సమస్యలు నాకు తెలిసివస్తూ ఉండేవి. ఏదో అర్జంటు మీటింగుల్లో ఉండిపోయి, అర్ధరాత్రి కూడా సరియైన థాట్ రాకపోయినప్పుడు పత్రికవాళ్ళకు ఫోన్ చేసి ఒకరోజు గ్రేస్ పీరియడ్ అడగడం, ఇదంతా నాకు స్మ్మరణీయం .అలా రుబాయి రచన నన్ను నిరంతరం చలనశీలుడిగా మలిచిందని పంచుకుంటున్నాను.

స్వతంత్ర వస్తువును రుబాయి ప్రక్రియలో పలికించడం కూడా తెలుగులో జరిగింది. వెరసి తెలుగులో రుబాయి పుట్టడం, కొత్త వస్తువును కూడా నిబిడీకరించుకోవడం విశేషం. అవసరమైనప్పుడు అది ఉద్యమాన్ని, ఆవేశాన్ని కూడా పలకవలసి రావడమూ గమనించాం.

‘ఈ జగమంతా పురాతన పాంథశాల, అతిథి గృహము’ అన్న తాత్విక చింతన ఉమర్‌ ఖయ్యాంను, పారశీక సాహిత్య ప్రక్రియ రుబాయిని గుర్తుకు తెస్తుంది. ఫారసీ నుండి ఉర్దూ తదితర భాషల్లోకి తర్జుమా అయినా రుబాయి తన మౌలికతను కోల్పోలేదు. భాషాంతరీకరణ జరిగినా మూలవస్తువు వాహిక చాలా సందర్భాల్లో మారిపోయింది. ఎందరివో రుబాయిలు తెలుగులో దేశీ రూపాలెత్తుకొన్నవి. ఇది అనువాదాల సంగతి. అయితే స్వతంత్ర వస్తువును రుబాయి ప్రక్రియలో పలికించడం కూడా తెలుగులో జరిగింది. వెరసి తెలుగులో రుబాయి పుట్టడం, కొత్త వస్తువును కూడా నిబిడీకరించుకోవడం విశేషం. అవసరమైనప్పుడు అది ఉద్యమాన్ని, ఆవేశాన్ని కూడా పలకవలసి రావడమూ గమనించాం.

కాగా, ఆ ఉద్యమ సోయికి గల నేపథ్యాన్ని. నేను రుబాయి రూపంలో పలకడానికి గల ఇతివృత్తాన్ని కూడా ఇక్కడ పంచుకుంటాను.

డిసెంబర్‌ 09, 2013 ప్రకటన తర్వాత సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉండాలని అలజడి మొదలయింది. ఆ అలజడి వల్లనో, సీమాంధ్ర నాయకుల లాబీయింగ్‌ వల్లనో తెలంగాణ రాష్ట్ర ప్రకటనను వెనక్కి తీసుకుంది కేంద్రంలోని ఆనాటి కాంగ్రేసు ప్రభుత్వం. రాష్ట్ర ప్రకటనను వెనక్కి తీసుకున్న తర్వాత తెలంగాణలో రాష్ట్రోద్యమం మరింత తీవ్రరూపం దాల్చింది. అప్పటిదాకా తటస్థ వైఖరి అవలంభించినవాళ్ళు కూడా తెలంగాణ ఏర్పాటై తీరాల్సిందేనని పట్టుబట్టారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే తెలంగాణ ఎందుకు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితీరాలో తటస్థులకు, అప్పటిదాకా రాష్ట్రం విడిపోవలసిన అవసరం లేదనుకుంటున్న కొద్దిమంది తెలంగాణ వారికీ అప్పుడు స్పష్టంగా తెలిసివచ్చింది. సీమాంధ్ర పెట్టుబడిదారులకూ, కోస్తానాయకులకు తెలంగాణతో కలిసి ఉంటే చాలా ప్రయోజనాలే ఉన్నట్లు అందరికీ అర్థమయింది. అందువల్ల ఉద్యమం ఉధృతమయింది. సామాన్యుల నుండి మేధావు దాకా ముక్తకంఠంతో ప్రత్యేక రాష్ట్రం కోసం ఎవరికి తోచిన పద్ధతుల్లో వాళ్ళు ప్రయత్నించారు.

రాష్ట్రోద్యమంలో ముందున్న కవులు వచన కవిత్వంతో పాటు ప్రత్యామ్నాయ రచనలనూ వెతికారు. అలా నేనూ ఒకటీరెండు గేయాలు రాసాను. అందెశ్రీ పట్టుబట్టి నాచేత ఒక పాట రాపించారు.

‘బొంత పురుగునైనా మేం ముద్దుబెట్టుకుంటం
కుష్టురోగినైనా మేం కౌగిలించుకుంటం
కావాలి తెలంగాణ మా కలల తెలంగాణ
రావాలి తెంగాణ రతనాల తెలంగాణ’ అనే పల్లవితో ఆ పాట రాసాను.

ఇప్పటి దాకా బతికుంటే దాశరథి కూడా ప్రత్యేక తెలంగాణ కోరి ఉండేవాడని చెప్పడానికి నేను కవిత్వం రాసాను. అది వచన కవిత్వంలా కాకుండా రుబాయి రూపాన్ని సంతరించుకోవడం నా వరకు నాకు ఒక మలుపు.

గాయకులైన కవులవి, కొందరు ప్రఖ్యాతి పొందిన కవులవి వేదిక మీద గాయకులు పాడితే ప్రచారంలోకి వచ్చాయి తప్ప చాలా మంది కవుల పాటలు కాగితాల మీదనే ఉండిపోయాయి. వచన కవిత్వం కంటే సూటి వ్యక్తీకరణ కోసం చాలా మంది ఆలోచించారు. చాలా మంది పాటలు రాసారు. వెలపాటి రాంరెడ్డి లాంటి వాళ్ళు పద్యాలు రాసారు. దాశరథిలోని సమైక్యవాదాన్ని కొందరు ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తే దేశపతి లాంటి వాళ్ళు ఉపన్యాసాల ద్వారా దాశరథిలోని నిజాయితీని ఎత్తిచూపారు.

ఇప్పటి దాకా బతికుంటే దాశరథి కూడా ప్రత్యేక తెలంగాణ కోరి ఉండేవారని చెప్పడానికి నేను కవిత్వం రాసాను. అది వచన కవిత్వంలా కాకుండా రుబాయి రూపాన్ని సంతరించుకోవడం నా వరకు నాకు ఒక మలుపు.

తెలంగాణ ఇచ్చి తీరాల్సిందేననే భావంతో ఇరవై రుబాయిలు రాసి కాసుల ప్రతాపరెడ్డి గారికి పంపించాను. ఆయన వాటిని తెలంగాణ రుబాయిలు శీర్షికన ప్రచురించారు. వాటిలో కొంత తీక్షణత ఉంది. రాష్ట్ర విభజనకు అడ్డుపడే వారిపై వ్యతిరేకత కూడా ఉన్నది. దాంతో కొంతమంది సమైక్యవాదులు ఆ పోస్ట్‌పైన తీవ్రమైన విమర్శలు చేసారు.

‘ఇందూరు జైలులోన పుట్టిన పద్యం’ పేరున రాసిన రుబాయిలను బైస దేవదాసు గారికి పంపిస్తే వెంటనే నేటినిజంలో వేసారు. అదే ఊపుతో తెలంగాణ ఇచ్చి తీరాల్సిందేననే భావంతో ఇరవై రుబాయిలు రాసి కాసుల ప్రతాపరెడ్డి గారికి పంపించాను. ఆయన వాటిని తెలంగాణ రుబాయిలు శీర్షికన 29 అక్టోబర్‌, 2013న oneindia.com లో ప్రచురించారు.

వాటిలో కొంత తీక్షణత ఉంది. రాష్ట్ర విభజనకు అడ్డుపడే వారిపై వ్యతిరేకత కూడా ఉన్నది. దాంతో కొంతమంది సమైక్యవాదులు ఆ పోస్ట్‌పైన తీవ్రమైన విమర్శలు చేసారు. మారుపేర్లతో అనుకుంటా, చెడ్డభాషను ఉపయోగించి నిందించారు. రుబాయిలను, కవిత్వాన్ని రేఖామాత్రంగానే స్పృశిస్తూ తెలంగాణవాదాన్ని విమర్శించారు. స్వార్ధనాయకులు పుట్టించిన నినాదమన్నారు. రాయలేని మాటలు చాలా అన్నారు. దానికి కౌంటర్‌ కూడా చాలానే నడిచింది. అనేకమంది తెలంగాణవాదులు నన్ను సమర్దిస్తూ పోస్టు పెట్టారు. అలా అది చాలా రోజులు నడిచింది. ఉద్యమవాదానికి ఢోకా ఏమీ లేదు కాబట్టి, సాహిత్య చర్చ అక్కడేమీ జరగట్లేదు కాబట్టి అక్కడ నేనేమీ ప్రత్యేక కౌంటర్‌ రాయలేదు. కానీ నేను తెలంగాణ రుబాయిలు రాయడం ఆపలేదు. మరిన్ని రాస్తూ పోయాను.

వైఎస్‌ఆర్‌ఎస్‌ గారిని కలిసాను. ఆయన ‘మీ రచనలుంటే ఇవ్వండి ఆంధ్రప్రభకు’ అన్నారు. ‘కొన్ని తెలంగాణ రుబాయిలు ఉన్నాయి. మీరు వేస్తారా’ అని సందేహంగా అడిగాను. నేనలా ఇచ్చివచ్చిన మరుసటి వారం నుండి, అంటే 28 ఫిబ్రవరి, 2016 నుండి ‘తెలంగాణ రుబాయిలు’ ఆంధ్రప్రభ ఆదివారం సంచికలో సీరియల్‌గా వేస్తూ వచ్చారు.

నేను బాలనగర్‌ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తూ ఉన్న రోజుల్లో 2016 ఫిబ్రవరిలో ఒకసారి ఆంధ్రప్రభ కార్యాయానికి వెళ్ళి వై. వసంత గారికి ఒక వ్యాసం ఇచ్చాను. ‘ఎలాగూ ఇంతదాకా వచ్చారు కదా. మా ఎడిటర్‌ గారిని కలవండి’ అన్నారు. వైఎస్‌ఆర్‌ఎస్‌ గారిని కలిసాను. ఆయన ‘మీ రచనలుంటే ఇవ్వండి ఆంధ్రప్రభకు’ అన్నారు. ‘కొన్ని తెలంగాణ రుబాయిలు ఉన్నాయి. మీరు వేస్తారా’ అని సందేహంగా అడిగాను. ‘మీరిచ్చి వెళ్ళండి. చూసి వేద్దాం. మాకు ఆంధ్రా తెలంగాణ తేడా ఏం లేదు’ అన్నారు. అప్పటికి నా దగ్గర ఉన్న వంద రుబాయిల సెట్‌ను ఇచ్చి వచ్చాను. నేనలా ఇచ్చివచ్చిన మరుసటి వారం నుండి, అంటే 28 ఫిబ్రవరి, 2016 నుండి ‘తెలంగాణ రుబాయిలు’ ఆంధ్రప్రభ ఆదివారం సంచికలో సీరియల్‌గా వేస్తూ వచ్చారు.

నాలుగైదు నెలల తర్వాత వై.వసంత గారు ఫోన్‌ చేసి రెగ్యులర్‌గా రుబాయిలు పంపుతూ ఉండమన్నారు. నేను మరో వంద రుబాయిలు పంపించాను. ఆ సీరియల్‌ను 2016, 2017, 2018 డిసెంబర్‌ ఎండింగ్ లో ‘ఇక ఆపనా’ అని అడుగుతూ వచ్చాను. ‘రుబాయిలకు మంచి రెస్పాన్స్‌ ఉందండి. మీరు రాయగలిగినంత కాలం రాయండి’ అని ఉత్సాహపరిచారు. 2019 మార్చి, 3న ఆదివారం అనుబంధంలో కవిత్వం ఆపేసేవరకు మూడు సంవత్సరాల ఒక నెల పాటు ధారావాహికంగా ఆంధ్రప్రభ దినపత్రిక ‘తెలంగాణ రుబాయిల’ను ప్రచురించింది. అప్పుడు కూడా ‘తెలంగాణ రుబాయిల’ను సాహితీ గవాక్షంలోకి షిఫ్టు చేస్తాం అన్నారు. నేనే ‘ఇక చాలు’ అనవలసి వచ్చింది.

ఆంధ్రప్రభలో సీరియల్‌గా వస్తున్న రుబాయిలను చదివిన పాఠకుల స్పందన ఒక ఎత్తైతే చాలా ప్రాంతాల నుండి వాటిని సెల్‌ఫోన్లో పాడి వినిపిస్తూ ఉన్నప్పటి అనుభూతి గొప్పది. ఆలేటి మల్లేశం, ఎం.వెంకటనరసింహారెడ్డి, సోమశిల తిరుపాల్‌, సామ నర్సిరెడ్డి తదితర మిత్రులు అక్కడక్కడ వేదికల మీద పాడడం గుర్తు. పత్రికలో ప్రచురించబడిందానికంటే ఎక్కువ ప్రచారం ఫేస్‌బుక్‌ ద్వారా జరిగింది. నేను పత్రికను చూడకముందే ఫేస్‌బుక్‌లో సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గ్లోరియా బుజ్జాయి గారలు పోస్టు చేసేవారు. వాటిని పోరెడ్డి రంగయ్య, సాగర్ల సత్తయ్య, పెరుమళ్ళ ఆనంద్‌, మండల స్వామి, కాసుల ఆంజనేయులు వాట్సాప్‌ గ్రూపుల్లో షేర్‌ చేసి ప్రచారం కల్పించారు.

2017 డిసెంబర్‌, 19 నుండి 23 వరకు ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా నిర్వహణ బాధ్యతల్లో తలమునకలై ఉన్న తరుణంలో ఆంధ్రప్రభ నుండి ఫోన్‌ …‘ఈ సారి మీరు ప్రపంచ తెలుగు మహాసభల గురించి రుబాయిలు రాయాలి’ అన్నారు.

2017 డిసెంబర్‌, 19 నుండి 23 వరకు ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా నిర్వహణ బాధ్యతల్లో తలమునకలై ఉన్న నేను ఇక ఈ వారం నుండి రుబాయిలు రాయలేను, మానేస్తాను అనుకొంటున్న తరుణంలో ఆంధ్రప్రభ నుండి ఫోన్‌ చేసి ‘ఈ సారి మీరు ప్రపంచ తెలుగు మహాసభల గురించి రుబాయిలు రాయాలి’ అన్నారు. ‘అయిదు కాదు పది రుబాయిలు రాయాలి’ అన్నారు. అట్లా తప్పనిసరై కొనసాగించాను. చివరికి ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్న తీరును చూడడానికి ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియానికి వెళ్ళినప్పుడు అక్కడ నన్ను కవిత్వం చదవమని సభాధ్యక్షుడు పట్టుబడితే సెల్‌ఫోన్‌లో ఆంధ్రప్రభ ఈపేపర్‌ ఓపెన్‌ చేసి అవే పది రుబాయిలు చదివాను. అలా రుబాయిలు రాసితీరవలసి వచ్చింది.

ఒకరోజు కవయిత్రి దేవనపల్లి వీణావాణి ఫోన్‌ చేసి  ‘అనుభవించిన క్లేశమే చుక్కాని’ అన్న ఒక రుబాయి పాదాన్ని నేనుసైతం ఆశ్చర్యపోయేట్లు విశ్లేషించింది.

రాసీరాసీ కాస్త ఆగుదామా అనుకొంటున్న తరుణంలో ఒకరోజు కవయిత్రి దేవనపల్లి వీణావాణి ఫోన్‌ చేసి చాలా రుబాయిల గురించి మాట్లాడింది. తెలంగాణ రుబాయిల వస్తువు తన జీవితానికి ఎంతగానో సరిపోతుందని చెప్పింది. తన జీవితానుభవాలే తనకో దారి చూపిస్తున్నాయని చెబుతూ ‘అనుభవించిన క్లేశమే చుక్కాని’ అన్న ఒక రుబాయి పాదాన్ని నేనుసైతం ఆశ్చర్యపోయేట్లు విశ్లేషించింది. ఆమె విశ్లేషించిన స్థాయిలో కాకపోయినా కొన్ని వందల అభిప్రాయాలు ఫోన్లలో, కొన్ని వేల కామెంట్లు ఎఫ్‌బీలో, వాట్సాప్‌ గ్రూపులో నమోదయ్యాయి. ఈ కారణాల వల్ల కూడా సీరియల్‌ కొనసాగింది. కొన్ని రుబాయిలను ఆంధ్రప్రభ నుండి ఎత్తి ‘తెలంగాణ రెవెన్యూ’ మాసపత్రికలో ప్రచురించడం జరిగింది.

ఈ సీరియల్‌ ఇలా కొనసాగుతూ ఉండగానే ఇంగ్లీషులో కూడా రదీఫ్‌, కాఫియాలను నిర్వహిస్తూ తెలంగాణ రుబాయత్‌ పేరుతో ప్రసిద్ధ అనువాదకులు సాయి చంద్రమౌళి గారు ఇరవై, ముప్పై రుబాయిలను ఇంగ్లీషులోకి అనువదించారు. డా॥ రూప్‌కుమార్‌ డబ్బీకార్‌ గారు కొన్ని ‘తెలంగాణ రుబాయిల’ను హిందీలోకి అనువాదం చేసారు.

మీ రుబాయీలు ఇందరు పాడుతూ ఉన్నా ఒకచోట రికార్డైతే బాగుంటుందన్న మిత్రుల సూచన మేరకు కొన్ని రుబాయిలను దక్షిణామూర్తి గారు స్వరకల్పన చేసి ప్రసిద్ధ గాయని పద్మావతిగారితో కలిసి పాడి రికార్డు చేసారు. ఉత్త ఆడియోను షేర్‌ చేయడం కష్టమని భావించి దానికి అపురూపమైన దృశ్యరూపం ఇచ్చారు నర్రా వేణుగోపాల్‌రెడ్డి, నర్రా ప్రవీణ్‌రెడ్డి. అలా తెలంగాణ రుబాయిలనే కవిత్వం పాడబడి దృశ్యమయం చేయబడి యూట్యూబ్‌కు చేరింది. ఇప్పుడు వేలాది మంది తెలంగాణ రుబాయిలను వింటూ, చూస్తూ ఉన్నారు.

ఈ క్రమంలో మరి అభ్యర్ధన. ‘నాకొక పుస్తకం కావాలి సార్‌ …తెలంగాణ రుబాయిలు’ అన్నవారికి ‘ఇంకా పుస్తకం వేయలేదు’ అనడం కొంచెం ఇబ్బందికరంగా మారింది.

పుట్టకముందే కొంత చరిత్రను నమోదు చేసుకుందీ ‘తెలంగాణ రుబాయిలు’. నేను బాలానగర్‌ డిప్యూటీ కలెక్టరుగా పనిచేస్తూ ఉన్నప్పటి నుండి వారంవారం రాస్తూ ఉండడం చూసిన సహచరులు ‘ఇంక పుస్తకం వేయండి’ అని అనేవారు.

పుట్టకముందే కొంత చరిత్రను నమోదు చేసుకుందీ ‘తెలంగాణ రుబాయిలు’. నేను బాలానగర్‌ డిప్యూటీ కలెక్టరుగా పనిచేస్తూ ఉన్నప్పటి నుండి వారంవారం రాస్తూ ఉండడం చూసిన సహచరులు ‘ఇంక పుస్తకం వేయండి’ అని అనేవారు. నేను కీసర ఆర్డీఓగా, కందుకూరు ఆర్డీవోగా, రంగారెడ్డి స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టరుగా, తెలంగాణ సాహిత్య అకాడమి కార్యదర్శిగా బదిలీలు అవుతూ ఉన్నా సీరియల్‌ నడిచింది కానీ పుస్తకంగా తేలేకపోయాను. ఇప్పుడు నిజంగా ఒత్తిడి ఎక్కువ అయిపోయింది. డా॥ గంటా జలంధర్‌ రెడ్డి తెలంగాణ రుబాయి పేపర్‌ కటింగులతో డా॥ కాంచనపల్లి తదితరులతో వ్యాసం కూడా రాయించడంతో, కోట్ల వెంకటేశ్వరరెడ్డి పట్టుబట్టడంతో పుస్తకం తేక తప్పలేదు.

సామల సదాశివ.

నాలుగే నాలుగు పాదాలు. అందులో ఒక మూడో పాదంలోనే కొంత స్వేచ్ఛ. మిగిలిన మూడు పాదాల్లో రదీఫ్‌గా ఒకే పదం ఉండి తీరాలి. కాఫియా, రదీఫ్‌కు ముందున్న పదం. ఇది మిగిలిన మూడు కాఫియాలతో అంత్యప్రాస కలిగి ఉండాలి. అన్ని పాదాల్లో సమంగా మాత్రలు ఉండి తీరాలి. ఈ నిబంధనల నడుమ ఒక రుబాయి ఒక స్వతంత్ర భావాన్ని వ్యక్తం చేయాలి. అది అంత చిన్న విషయం కాదంటాడు సామల సదాశివ. రుబాయిలను తెలుగులో రాయడం కష్టమంటారు. అందుకే ఆయన అంజద్‌ హైద్రాబాదీ రుబాయిలను గీతాలలో అనువదించారు. బూర్గుల రామకృష్ణారావు ఉమర్‌ ఖయ్యాం రుబాయిలను వృత్తాలలో అనువదించారు. దువ్వూరి రామిరెడ్డి పానశాల కూడా పద్యానువాదమే. అజ్జాడాదిభట్ట నారాయణదాసు కూడా పద్యాలలోనే ఉమర్‌ ఖయ్యాంను తెనిగించాడు. దాశరథి గాలీబు షేర్‌లను కొన్నింటిని గీతాలలో, కొన్నింటిని ద్విపదలలో తెనిగించారు.

కాఫియాకు అవకాశం లేనిచోట వదిలివేసి రాసారు. భావంకోసం మాత్రలనటూ ఇటూ జరిపారు. ఇక అది రుబాయి ఎట్లా అవుతుందని విమర్శకులనే ప్రమాదం ఉందని డా।। సి. నారాయణరెడ్డి గారు రుబాయీకి అదనపు పాదం చేర్చి ప్రపంచ పదులు రాసారు.

తెలుగులో రుబాయిలు రాసిన వాళ్ళలో చాలామంది రదీఫ్‌కు బదులు అంత్యప్రాసను వాడారు. కాఫియాకు అవకాశం లేనిచోట వదిలివేసి రాసారు. భావంకోసం మాత్రలనటూ ఇటూ జరిపారు. ఇక అది రుబాయి ఎట్లా అవుతుందని విమర్శకులనే ప్రమాదం ఉందని డా।। సి. నారాయణరెడ్డి గారు రుబాయీకి అదనపు పాదం చేర్చి ప్రపంచ పదులు రాసారు. అలా రుబాయి ఛందస్సు కొంత భయపెట్టినా దాశరథి, తిరుమల శ్రీనివాసాచార్య, రెంటాల శ్రీవెంకటేశ్వరరావు తదితరులు రాస్తున్నారు. రుబాయిల పేరు పెట్టుకొని రాస్తూ ఉన్నప్పుడు దాన్ని పాటించడం అవసరం. అది కొంచెం కష్టం అయినా అందులో శక్తి కూడా ఉంది.

ఉమర్‌ ఖయ్యాం శాస్త్ర సంబంధ విషయాలపై, గణిత శాస్త్రంపై ప్రధానంగా కృషి చేసాడు. శాస్త్ర వ్యవహారాలలోని అలసట తీర్చుకోవడం కోసం సాహిత్య సృజన చేసాడని కొందరంటారు. తన కాలంలో మారిపోతున్న సామాజిక, రాజకీయ కార్యకలాపాలకు కలతచెంది రచనలు చేసాడని కొందరంటారు. తన కాలపు వ్యవహారాల పట్ల కలతతో రాసిన రుబాయిలు గొప్ప జీవన సత్యాలను వినూత్నంగా ఆవిష్కరించాయి. అవి మిగుల ప్రచారంలోకి రావడానికి రుబాయిలలోని వస్తువు ఒక కారణమైతే ప్రక్రియలోని వెసులుబాటు మరొక కారణం. ఈ రెండు కారణాల వల్ల పొదగబడ్డ అద్భుతాన్ని ఫిడ్జ్‌ జెరాల్డ్‌ ప్రపంచానికి పరిచయం చేసాడు. అలా అన్నీ భాషల్లోకీ రుబాయి విస్తరించింది.

రుబాయీ వస్తువు కూడా నిర్ణీతమని సాహిత్యకారులంటారు. గజళ్ళను కొత్తవస్తువు దిశగా దారిమళ్ళించి విజయం సాధించిన సినారె మన కళ్ళముందటి ఉదాహరణ. రుబాయీ ప్రధానంగా తాత్విక విషయాల కోసం పుట్టినప్పటికీ ఇతర విషయాలలో రుబాయిని పరిపుష్టం చేయడానికి నా వంతు కృషి నేను చేశాను. మరి ఏ మేరకు సఫలీకృతుడనయ్యానో మీరు చెబితేనే తెలిసేది.

కవి, రచయిత, సాహిత్య విమర్శకులు అయిన డా.ఏనుగు నరసింహారెడ్డి రచించిన ‘తెలంగాణ రుబాయిలు’ వారి ప్రసిద్ది పొందిన కవితా సంపుటి. దీంతో పాటు వారు ‘కొత్త పలక’, ‘మూల మలుపు’ కవితా సంపుటులు కూడా వెలువరించారు. మీర్ లాయక్ అలీ గ్రంధాన్ని ‘హైదరాబాద్ విషాదం’ పేరిట అనువదించారు కూడా. ప్రస్తుతం మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న వీరు గతంలో తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శిగా సేవలు అందించిన విషయం సాహితీ లోకానికి పరిచితమే. వారి మొబైల్ 8978869183.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article