Editorial

Wednesday, January 22, 2025
సంపాద‌కీయంమానవత్వం తెలుపు

మానవత్వం తెలుపు

ఒక భాషగా భావంగా సమస్త రంగులను ఇముడ్చుకున్న రాగంగా తెలుపు టివి నేటి నుంచి మీ ముందుకు వస్తోంది.

Telugu Logo

మహమ్మారి కాలం. ప్రపంచం ఒక కుగ్రామం. నేడు అదొక స్మశానం. అంతేనా? కాదు.

నిజానికి ఈ మహమ్మారి కాలం ఒక అపూర్వ ఘట్టానికి తెరలేపింది చేతనైన సహాయానికి ప్రతి ఒక్కరినీ పురికొల్పింది. ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అని లేదు, మానవత్వం మేలుకొంటున్న అపురూప సందర్భంలో ప్రతి మనిషికీ నేడొక కథ ఉన్నది. చిన్నదో పెద్దదో…. ఆర్ద్రమైన ఒక కథ ఏర్పడింది. చిత్రమేమీ లేదు, ఎదో ఒకటి చేయకుండా ఉండలేని స్థితి నలుదిక్కులా దాపురించినప్పుడు చెడు ఒక్కటే లేదని, దానిని మరిపించే తెలుపూ ఒకటున్నదని, దాన్ని గొప్పగా చాటవలసిన సమయంలో తెలుపు టివి ముందుగా ఒక వెబ్సైట్ గా ప్రారంభమవుతోంది.

మంచిని… మనిషిని… మీదు మిక్కిలి ఈ విశ్వానికి తానే సమస్తం అనుకుంటున్న సమయంలో ఈ ప్రాణకోటి తనతో నిమిత్తం లేకుండా సైతం హాయిగా ఉంటుందన్న సోయికి మానవుడు రావడం ఒక అసాధారణ కల్పన. దీన్ని మించిన వివేకం లేదు. బహుశా ఇంతకు మించిన తెలియవలసినది కూడా ఏమీ లేదు.

ఇప్పుడు మానవుడు తన అంతరంగాన్ని మాత్రమే కాదు, విశ్వాత్మను వినగలిగే నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఇప్పుడతడు వివేకి. అందుకే తెలుపు టివి నిర్మలంగా మీ ముందుకు వస్తోంది.

ప్రేమ, మానవతలను తన భాషగా, భావంగా… సమస్త రంగులను ఇముడ్చుకున్న రాగాన్ని తన విస్తృతిగా ‘తెలుపు టీవి’ సమాచార రంగంలోకి అడుగు పెడుతోంది.

తానే ఇతివృత్తం కాకుండా, నాలుగు దిక్కుల నుంచి సేకరించే వార్తలే నిజమని నమ్మబలక కుండా మొత్తం విశ్వభాషనూ వినిపించే పాటగా తెలుపు టివి (Language of the universe) మీ దరికి చేరుతున్నది.

మీకు తెలుసు. మహమ్మారి కాలంలో ఒక పాటగాడు హృదయ విదారకమైన తన పాటతో వలస కార్మికుల వ్యథను తేటతెల్లం చేసి ఒక్క పరి మన బాధ్యతను గుర్తు చేశాడు. అపన్నహస్తంగా నిలవడానికి మహోన్నతంగా స్ఫూర్తి నిచ్చాడు. మరొక ప్రతి నాయకుడు తన బాధ్యతాను తానే అపూర్వంగా నిర్వచించుకుని, ఆ బాధ్యతను అలవోకగా తన భుజస్కంధాలపై వేసుకుని సిసలైన నాయకుడిగా ఎదిగిండు. ఏకంగా దేశానికి విమానం అయ్యాడు. అప్రకటిత ప్రధానిగా మారాడు. ప్రాణ వాయువు అందించే ప్లాంట్ ల నిర్మాణానికే నడుం కట్టిండు. అతడు ఒక సైన్యం. అలాంటి వాడే మన దగ్గరా మరొకతను. అతడు ఇరవై నాలుగు గంటలపాటు నిత్యావసరాలు అందించే RICE ATMగా మొదలై వారి ఉపాధి కల్పనకూ చేయూత అందించే LIFE ATM గా మారాడు. వీరందరు మనలోని వాళ్ళే. మనమే ఆ తెలుపు. అలాంటి మహానుభావులు ఎందరో. నేటి నిరాశామయ స్థితిలో అలాంటి వారందరినీ నేడు హృదయపూర్వకంగా తలుచుకుంటూ తెలుపు టివి తన ప్రస్థానాన్ని ఆరంభిస్తుంది. ఇదే సందర్భంగా కరోనా కాలంలో మనం కోల్పోయిన వారందరికీ పేరు పేరునా అంజలి ఘటిస్తూ ఈ అడుగులు వేస్తున్నది. ఇది సామాన్యశాస్త్రం ప్రయత్నానికి మరొక చేర్పు అని, ఎప్పట్లా అక్కున చేర్చుకుంటారని ఆశిస్తున్నది.

మిత్రులారా….చీకటి కాలంలో తెలుపు తన పని తాను ప్రారంభించడం అనివార్యం అని, ఎంత మాత్రమూ ఆడంబరం లేకుండా చిన్నగా మీ ముందుకు వస్తున్నదని మనవి. పవిత్ర బుద్ధ పూర్ణిమ మొదలుగా తెలుపు వినయంగా మీ నిండు ఆశీర్వాదం కోరుతున్నది.

కృతజ్ఞతాభివంధనాలతో…

కందుకూరి రమేష్ బాబు

 

Teluputv Logo  

More articles

10 COMMENTS

  1. ప్రథమంగా రమేశ్ నీ సాహసానికి అభినందనలు మరియు ఆశీస్సులు. సంపాదకీయం బాగుంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను సున్నితంగా సృజించిన తీరు బహుదా ప్రశంసనీయం. సమస్త రాజకీయం,సామాజికం,కవిత్వం,కళలు మరియు కర్తవ్యం ఇవే కాక దిశ నిర్దేశనం మానవాళి మనుగడ నే ప్రశ్నార్థకం అయిన సమయాన తెలుపు టీవి ఆవిష్కరణ ఆనందదాయకం. శుభాశీస్సులు.

  2. సామాన్య శాస్త్రానికి కొనసాగింపుగా ప్రారంభించిన తెలుపు టివి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను…. Premraj

  3. అభినందనలు. సంపాదకీయం బాగుంది. కవిత లు బాగున్నాయి.

  4. తెలుపు టివి కి అభినందనలు… సంపాదకీయం, శ్రీనివాసన్ గారి హే నమో బుద్దాయ వ్యాసం చదివిన. బాగున్నాయి.

    రమేష్, సుమ లకు అభినందనలు.. జయహో

  5. నూతనత్వం.కేవలం నూతనత్వం.
    ఎవరూ నీ బాట నడచి రాకపోయినా
    నువు ఒకడవె పదవోయ్

  6. నూతనత్వం.కేవలం నూతనత్వం.
    ఎవరూ నీ బాట నడచి రాకపోయినా
    నువు ఒకడవె పదవోయ్

  7. అభినందనలు అన్నా. జీవితం ప్రశ్నార్ధకం అయిన ప్రతిసారి నేనున్నానంటూ మానవత్వం మన తలుపు తడుతుంది. ఈ సందర్భంలో పత్రికల పాత్ర ప్రాణవాయువుతో సమానం. ఆ బాధ్యత తెలుపు టీవీ నెరవేస్తుందని మొదటి సంపాదకీయంలో మాట ఇవ్వడం చాలా సంతోషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article