రిటైర్ అయ్యాక కాస్త తీరికగా ఆ పుస్తకం చదువుతోంటే ఇన్ని అచ్చుతప్పులతో లైబ్రరీలకు ఇచ్చానా అని బాధేసింది. మళ్ళీ ప్రింట్ చేయటం, మార్కెటింగ్ నా వల్ల కాదు అనిపించింది. అలాంటి సమయంలో “ E-Book గా తీసుకొచ్చెయ్యి” అని స్నేహితురాలు వేమన వసంతలక్ష్మి సలహా ఇచ్చింది. అలా మళ్ళీ మీ ముందుకు వస్తోంది ఈ పుస్తకం.
బొమ్మకంటి కృష్ణకుమారి
30 ఏళ్ళ తర్వాత e-bookకి ముందుమాట రాస్తున్నప్పుడు బోలెడు జ్ఞాపకాలు, ఉద్వేగాలు చుట్టుముడుతున్నాయి. ఎక్కువగాను, కృతజ్ఞతాపూర్వకంగానూ కూడా గుర్తొస్తున్నవి కొన్ని ఉన్నాయి.
ప్రధానంగా స్వాతంత్ర సమరయోధులను కలుసుకున్న సందర్భాలు, వాళ్ళ సంస్కారం మొదలైనవి. తర్వాత ప్రొఫెసర్ వి. రామచంద్ర, ప్రొఫెసర్ చల్లా రాధాకృష్ణ శర్మ గార్లు యిచ్చిన ధైర్యం. ఇంత చిన్న పుస్తకానికి అప్పుడు కె.వి.ఆర్. ముందుమాట రాయటం.
నేను 1989 నవంబర్ లో మద్రాసు యూనివర్సిటీలో ఎం.ఫిల్ లో చేరాను. ఇంటర్వ్యూ సమయంలోనే ‘గరిమెళ్ళ సాహిత్యం – విమర్శనాత్మక పరిశీలన’ అనే శీర్షికతో synopsis ఇచ్చాను. ఆ అంశమే ఖరారయ్యింది.
పిడుగుల జడి’ అంటూ శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ సాహిత్యంపై బొమ్మకంటి కృష్ణ కుమారి ఎంఫిల్ సిద్ధాంత గ్రంథం ఇక్కడ క్లిక్ చేసి ఉచితంగా అందుకొండి. ఇది వారి కృషిపై వచ్చిన ఏకైక గ్రంథం.
ఈ కింది వ్యాసం 30 ఏళ్ల తర్వాత నేటి పాఠకులకు నాటి ప్రయత్నంపై వారి మలి పలుకులు. పుస్తకమూ వారి ఉద్విగ్న జ్ఞాపకమూ తెలుపుకు ప్రత్యేకం.
శ్రీ శ్రీ అన్నట్టు అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలిప్పుడు.
ఆ తరవాత ఒకటి రెండు నెలలకు గరిమెళ్ళ కుటుంబ సభ్యుల ప్రస్తుత పరిస్థితి గురించి, ఆయన సాహిత్యాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవటం గురించి వివరిస్తూ, గరిమెళ్ళ సత్యనారాయణ శతజయంతి జరపాలని విజ్ఞప్తి చేస్తూ ప్రముఖ సాహిత్యకారులు పరకాల పట్టాభి రామరావు, మహీధర రామ్మోహనరావు గార్ల పేర్లతో వార్తాపత్రికలలో ఒక ప్రకటన వచ్చింది. ఆ ప్రకటనకు అప్పటి తెలుగు యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డా.సి.నారాయణ రెడ్డి సానుకూలంగా స్పందించారు.
అప్పటికే ఉద్యోగం చేస్తున్న అనుభవం వల్లనో ఏమో, నేను వెంటనే నా పరిశోధనాంశం గురించి తెలియచేస్తూ పరకాల పట్టాభిరామరావు గారికి ఉత్తరం రాశాను. ఆయన సంతోషిస్తూ వెంటనే జవాబు యిచ్చారు. అలా మొదలయింది అనేకమంది స్వాతంత్ర సమరయోధులతో నా పరిచయం.
వాళ్ళందరూ నా కన్నా కనీసం నలభై (ఇంకా ఎక్కువేమో కూడా) యేళ్ళు పెద్దవాళ్ళు. ఏం అడిగితే ఏం అనుకుంటారో అని భయం.అయినా వాళ్ళ జ్ఞాపకాల కోసం పదిహేను నుంచి ఇరవై మందిని (హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, శ్రీకాకుళం) కలిశాను. ఒక ప్రశ్నాపత్రం తయారు చేసుకుని వెళ్ళాను. జవాబులతో పాటు ఇతరత్రా మీకు తెలిసిన విషయాలు తరవాతైనా నాకు పంపించండి అని చెప్పాను. కొందరు గరిమెళ్ళ సాహిత్యం గురించి మాట్లాడారు. కొందరు గరిమెళ్ళ గురించి చెప్పలేకపోయినా స్వాతంత్రోద్యమం గురించి, వారికి తెలిసిన స్వాతంత్ర సమరయోధుల గురించి భావోద్వేగంతో తమకు తెలిసిన విషయాలు పంచుకున్నారు. ఇవన్నీ చాలా సంతోషాన్నిచ్చాయి.
ఇప్పుడు ఈ పరిశోధన వల్ల ఏం ఉపయోగం అని కొందరు నిరాశగా మాట్లాడారు. కొందరు విసుక్కున్నారు కూడా. ఒకాయన చాలా కోపంగా మాట్లాడారు. అయినా ప్రశ్నాపత్రం ఆయన టేబుల్ మీద పెట్టి నమస్కరించి వచ్చేశాను. ఇంతలో కొమ్మారెడ్డి సత్యనారాయణమూర్తి 50వ వర్ధంతి సంచిక వస్తోందని, ఆ పని మీద హైదరాబాద్ వస్తున్నానని, ఆ సమాచారం నీకు ఉపయోగపడచ్చు వచ్చి కలవమంటూ పరకాల పట్టాభిరామరావు గారు రాసిన ఉత్తరం వచ్చింది. మఖ్ధూమ్ భవన్ కి వెళ్ళి ఆయన్ని కలిసి ఆయనిచ్చిన కాగితాలు చూస్తూ నాకు కావాల్సినవి రాసుకుంటున్నాను. ఒకటి రెండు సార్లు కలవటం ద్వారా, ఉత్తరాల ద్వారా ఆయనతో కొంచెం పరిచయం ఏర్పడింది. నా మౌనం గమనించి కాబోలు ఒక అరగంట తర్వాత ఆయన “ఏమైందమ్మా” అన్నారు. ఇంక అంతే ఏడుపు తన్నుకొచ్చేసింది. పేరు చెప్పకుండా ఆ స్వాతంత్ర సమరయోధుడు కోపంగా అన్న మాటలు చెప్పేశాను. కొంచెం సేపయాక “కృష్ణా, మీ తాతగారు నిన్ను ఏమైనా అన్నారనుకో, ఇలాగే మనసులో పెట్టుకు కూర్చుంటావా!” అన్నారు. “ఆయన పెద్దాయన. ఈ పాటికి మర్చిపోయి కూడా ఉంటారు. నువ్వు దాన్ని మనసులో పెట్టుకుని బాధపడుతూ కూర్చుంటే ఏం ప్రయోజనం? నువ్వు చక్కగా చెయ్యగలవు. నీ పని నువ్వు చెయ్యి. అయినా ఏదైనా పని నిర్వహిస్తున్నప్పుడు పూలు, రాళ్ళు కూడా పడతాయి. సిద్ధంగా ఉండాలి” అన్నారు. ఈ మాటలు ఆ తరవాత కూడా చాలాసార్లు నన్ను సవ్యంగా నడిపించాయి. ధైర్యాన్నిచ్చాయి. అందుకని ఈ మాటలు తప్పకుండా చెప్పాలనిపించి చెపుతున్నాను. పట్టాభిరామరావు గారు చెప్పినట్లే ఆ పెద్దాయన ఆ తర్వాత తన కోపం వదిలేసి, నన్ను కోప్పడినందుకు ‘సారీ’ చెపుతూ, తనకు తెలిసిన విషయాలతో పెద్ద ఉత్తరం రాశారు.
దొరికిన సమాచారాన్నంతా ఒక చోట చేర్చి చదువుతున్నపుడు ఈ అంశంపై నేను సరిగా రాయగలనా అనిపించింది. ఒక పక్కన గరిమెళ్ళ శతజయంతి సంబరాలకు తెలుగు యూనివర్సిటీ సన్నద్ధం అవుతుండగా ఆయన రచనలను విమర్శిస్తే, ఆ విషయాన్ని సాహిత్యకారులు, స్వాతంత్ర సమరయోధులు ఎలా స్వీకరిస్తారో అని ఆందోళన పడ్డాను. అప్పుడు నా పరిశోధనా పర్యవేక్షకులైన ప్రొఫెసర్ వి. రామచంద్ర గారు “పంట చేతికొచ్చినప్పుడు గింజ, తాలు రెండూ ఉంటాయి. వాటిని విడదీసి చూసి ఉపయోగిస్తాం. దేని విలువ దానిదే. ఇదీ అంతే. ముందు నువ్వు రాసే పని చూడు” అంటూ ధైర్యం చెప్పారు. ఆ మాటలు గుర్తు వచ్చినపుడల్లా ‘ఎంత simple గా చెప్పేశారో’ అని ఆశ్చర్యం వేస్తుంది. ఆ విషయంలో ప్రొఫెసర్ చల్లా రాధాకృష్ణ శర్మ గారు కూడా ధైర్యం చెప్పారు. వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే నేను సకాలంలో పరిశోధన ముగించగలిగాను. ఎం.ఫిల్ డిగ్రీ చేతికొచ్చింది.
1993 లో దాన్ని పుస్తకంగా తీసుకొస్తున్నపుడు ముందుమాట రాయమని కె. వి. ఆర్. ని అడగాలనుకున్నాను. అప్పటికే ఆయన సాహిత్యవిమర్శ రంగంలో ప్రసిద్ధులు. ఈ చిన్న పుస్తకానికి ముందుమాట రాయటానికి ఒప్పుకుంటారో ఒప్పుకోరో! తీరిక ఉంటుందో లేదో! అని భయపడ్డాను.
ఆ తరవాత 1993 లో దాన్ని పుస్తకంగా తీసుకొస్తున్నపుడు ముందుమాట రాయమని కె. వి. ఆర్. ని అడగాలనుకున్నాను. అప్పటికే ఆయన సాహిత్యవిమర్శ రంగంలో ప్రసిద్ధులు. ఈ చిన్న పుస్తకానికి ముందుమాట రాయటానికి ఒప్పుకుంటారో ఒప్పుకోరో! తీరిక ఉంటుందో లేదో! అని భయపడ్డాను. అయితే గరిమెళ్ళ గారి మీద ఉన్న ప్రేమకొద్దీ రాస్తారేమో అని ఒక ఆశ. నా ఆశ వమ్ము కాలేదు.
నేను పుస్తకాన్ని ప్రచురించాను కానీ, నా పుస్తకానికి ఆవిష్కరణ సభ పెట్టలేదు. గరిమెళ్ళ సత్యనారాయణ సాహిత్యం మీద పరిశోధన జరిగిందని, అది పుస్తకంగా ప్రచురించబడిందని తెలుసుకుని రాజమండ్రి లోని స్వాతంత్ర సమరయోధులు, నా పుస్తకాన్ని రాజమండ్రిలో ఆవిష్కరిస్తామని అడిగారు. 18-12-1995 న గరిమెళ్ళ సత్యనారాయణ గారి వర్ధంతి సందర్భంగా అక్కడి గవర్నమెంట్ హైస్కూల్ లో సభ పెట్టారు. సభకి ముందు ఆయన ఫోటో పట్టుకుని రాజమండ్రి వీధులలో ఊరేగింపు తీశారు. నా పుస్తకాన్ని ఆ సభలో చల్లా రాధాకృష్ణ శర్మ గారు ఆవిష్కరించారు. ఆ సభలో వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఆ హైస్కూల్ కి గరిమెళ్ళ సత్యనారాయణ పేరు పెట్టాలని ప్రతిపాదించారు. తరవాత ఆ కోరికను ప్రభుత్వ విద్యాశాఖ అంగీకరించి ఆ హైస్కూల్ కి ఆయన పేరు పెట్టింది. తెలుగు యూనివర్సిటీ గరిమెళ్ళ శతజయంతి ఉత్సవాలను ఘనంగా జరిపింది. ఆయన రాసిన కొన్ని వ్యాసాలను ప్రచురించి ఆ ఉత్సవాలలో ఆవిష్కరించారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ వారు ‘మాకొద్దీ తెల్లదొరతనము’ పాటను డిగ్రీ విద్యార్థులకు తెలుగు సబ్జెక్టులో సిలబస్లో పెట్టారు. ఆయన గేయాలను పరకాల పట్టాభిరామరావు గారి సంపాదకత్వంలో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు ప్రచురించారు. జాతీయోద్యమ సాహిత్యం – గరిమెళ్ళ, (ప్రచురణ, 1996), గరిమెళ్ళ సాహిత్యం – జాతీయోద్యమం (ప్రచురణ, 2003) అనే పేర్లతో గరిమెళ్ళ రచనలను కె.ముత్యం సంపాదకత్వంలో దృష్టి, హైదరాబాద్, గరిమెళ్ళ శతజయంతి ఉత్సవాల సారధ్య సంఘం, శ్రీకాకుళం సంస్థలు ప్రచురించాయి. డిసెంబర్, 2019 లో గరిమెళ్ళ విజ్ఞాన కేంద్రం, శ్రీకాకుళం వారు మరి కొన్ని వ్యాసాలను వ్యాఖ్యానాలతో సహా ప్రచురించారు. శ్రీకాకుళంలో గరిమెళ్ళ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
ఇవన్నీ జరగాలని 1952 లో టేకుమళ్ళ కామేశ్వరరావు గారి వంటి ఆయన సమకాలికులు, ఇతర స్వాతంత్ర సమరయోధులు, పరకాల పట్టాభిరామరావు, మహీధర రామమోహన రావు గారి వంటి సాహిత్యజీవులు కోరుకున్నారు. ఆలస్యంగా నయినా అవి చాలా మటుకు జరిగాయి. అందులో నాకు కూడా కొంచెం భాగం ఉన్నందుకు సంతోషంగా ఉంది.
పుస్తకం తీసుకురావడమైతే తీసుకొచ్చాను కాని ఆ పనిలో అనుభవం లేక ప్రూఫులు సరిగా చూసుకోలేకపోయాను. చాలా అచ్చు తప్పులు వచ్చాయి. చాలా బాధ పడ్డాను. పరిశోధనా పుస్తకాలు పెద్దగా ఎవరూ కొనరు. అందుకని చాలా కాపీలు ఉండిపోయాయి. అచ్చుతప్పులకు క్షమించమని కోరుతూ ఆ కాపీలను లైబ్రరీలకు ఉచితంగా పంపేశాను. కొందరికైనా అందుబాటులో ఉంచగలిగానని చాలా సంతోషించాను.
రిటైర్ అయ్యాక కాస్త తీరికగా ఆ పుస్తకం చదువుతోంటే ఇన్ని అచ్చుతప్పులతో లైబ్రరీలకు ఇచ్చానా అని బాధేసింది. ఏం చేయాలో తోచలేదు. మళ్ళీ ప్రింట్ చేయటం, మార్కెటింగ్ నా వల్ల కాదు అనిపించింది. అలాంటి సమయంలో “ E-Book గా తీసుకొచ్చెయ్యి” అని స్నేహితురాలు వేమన వసంతలక్ష్మి సలహా ఇచ్చింది. అలా మళ్ళీ మీ ముందుకు వస్తోంది ఈ పుస్తకం.
చాలా చాలా థాంక్స్ వసంత.
Very good attempt. Do you have the script of maakoddi tella doratanamu in author’s own handwriting.
No Sir. I don’t have that script. Maakoddee tella
Doratanamu was translated into English by Vakulabharanam Ramakrishna garu may be in late 90s.
Thank you for the compliment .😊