Editorial

Monday, December 23, 2024
సాహిత్యంఎవరీ కణికీర? - దుర్గం రవీందర్ సాహిత్య వ్యాసం

ఎవరీ కణికీర? – దుర్గం రవీందర్ సాహిత్య వ్యాసం


మూడో రోజు మూడు గంటలకు ఒక కమ్మలో ఆమె అవ్వ పేరు “కనక వీరమ్మ” అని కనిపిస్తుంది. ఆ పేరును-అక్షరాలను కండ్ల నిండా నింపుకుంటది, చేతుల నిండా తాకుతది. వాల్ల అవ్వ మళ్ళా బతికొచ్చినంత సంతోష పడ్తది. ఆవ్వ బతికున్న ఆనవాల్లు దొరికినందుకు దుక్కం సంబురం కలెబడి పొంగి యెగదన్నుతయి. యుద్ధంలో గెలిచినంత ఆనందం అయితది. ఇది ఒక కథ. రచయిత్రి సొంత కథనే. ఇలాంటి కథలే ఇంకో 14 ఉన్నాయిందులో.

జూపాక సుభద్ర రాసిన ‘రిజర్వేషన్ బోగి’ లోని ఒక్కో కథపై ఒక పి‌హెచ్‌డి చేయవచ్చు.

దుర్గం రవీందర్

తన తరం ఎదుర్కొంటున్న వివక్షతో పాటు తన ముందు అనేక తరాల వారు వారసత్వంగా అందించిన అనంత దైన్యపు అస్తిత్వ లక్షణాలను విడమరిచి చెబుతుంది ఈ చిన్న కథల పుస్తకం. కుల వ్యవస్థ పనికి మాలినదేమీ కాదు కానీ అందులోని అవలక్షణాలను, అవమానాలను, కష్ట నష్టాలను కిందివారికి మాత్రమే మిగిల్చే దరిద్రపు గొట్టు వ్యవస్థ అది. ఆ వ్యవస్థ లోని లోపాలను వివరించి చూపే కథలివి.

ఏ కాలంలో అయినా, ఏ ప్రాంతంలో అయినా ఏదయినా ఒక సామాజిక అంశాన్ని, మానవ క్లేశాన్ని గురించి మెదడు లోపొరల్లో నిజాయితీగా, అర్థవంతంగా జరిగే ఘర్షణలను, ఆలోచనలను, విశ్లేషణలను నిజాయితీగా, నిర్భయంగా అక్షరీకరిస్తే అది ఉత్తమ సాహిత్యంగా గుర్తింపు పొందుతుంది. ఆ పనినే సుభద్ర చేసింది. తన సొంత అనుభవాలకు, ఆలోచనలకు వివరణ ఇచ్చిన ఫలితమే ఈ కథలు. నిజం. ఇవి ఉత్తమ కథలు, ఈమె ప్రపంచ స్థాయి అగ్రశ్రేణి రచయిత్రి. చలం గారు తెలుగులో రాసి ఎలా మనకే పరిమితమయి పోయారో, సుభద్ర విషయంలో అదే జరుగుతున్నది, వీరి కథల్లో ఎంత లోతు ఉంటుందంటే ….నిజానికి ఈమె ఒక్కో  కథపై ఒక పి‌హెచ్‌డి చేయవచ్చు.

ఆ ఆఫిసరమ్మనే స్వయంగా హైదరాబాదు నుంచి బయలు దేరి వెళ్ళి పంచాయితీ ఆఫీసులో ఉన్న పలు రికార్డులల్లో తల్లి పేరు కోసం పిచ్చి పట్టినట్లు వెతుకుతుంది. ఏ రికార్డ్ లోనూ కనికీర పేరు ఉండదు.

రచయిత్రి జూపాక సుభద్ర

వరంగల్ జిల్లాలో దామరంచ పల్లె అనే ఒక గ్రామం, ఆ గ్రామంలో ఒక మాదిగ మహిళను అందరూ “కణికీర” అని పిలుస్తుంటారు, నోరుతిరగని వారు నోరు బలిసిన వారు రకరకాలుగా పిలుస్తారు. ఆమె పన్నెండు మంది సంతానంలో ఒక బిడ్డ. పట్టుదలగా అనేక కష్టాలను, అవమానాలను ఎదుర్కొని సదువుకొంటుంది, కష్టపడి నౌకరీ కూడా తెచ్చుకుంటది, ఆఫీసరమ్మ అవుతది. ఆమె తను పడ్డ కష్టాలనే కథలుగా రాస్తుంటది, ఆ కథలల్లో తడి ఉంటది కాబట్టి రచయిత్రిగా కొంత పేరు వస్తది. ఆ కథలను గుర్తించిన ఒక విదేశీ విశ్వ విద్యాలయం ఆమెను సాహిత్య సదస్సుకు రమ్మంటది. విదేశాలకు వెళ్లాలంటే పాస్పోర్ట్ కావాలికదా. అప్పుడు పాస్ పోర్ట్ కోసం దరకాస్తు ఫారం తెప్పిస్తది. దరకాస్తు ఫారంలో తల్లి పేరు రాయమని ఉంటది. మన సర్టిఫికేట్లలో తండ్రి పేరు ఉంటది, కానీ తల్లి పేరు ఎక్కడ ఉండది. తన తల్లిని అందరూ కణికీర, కనికీరక్క, కనికీరవ్వ, కనికీరి అని పిలిచేవారు అని మాత్రం ఆమెకు తెలుసు. ఆమె తల్లి పేరు కణికీర అనేందుకు ఒక్క రుజువు ఉండదు. 16 ఏళ్ల క్రింద చనిపోయిన తల్లి పేరు ఫలానా అనే రుజువు ఎక్కడా ఉండదు. సర్పంచ్ కు పోన్ చేసి మా అమ్మ పేరు ఎక్కడయిన గ్రామ రికార్డుల్లో ఉందేమో చూసి చెప్పమని అడుగుతది, ఆయన పట్టించుకోడు, ఆ ఆఫిసరమ్మనే స్వయంగా హైదరాబాదు నుంచి బయలు దేరి వెళ్ళి పంచాయితీ ఆఫీసులో ఉన్న పలు రికార్డులల్లో తల్లి పేరు కోసం పిచ్చి పట్టినట్లు వెతుకుతుంది. ఏ రికార్డ్ లోనూ కనికీర పేరు ఉండదు. తల్లి పేరు కోసం దుక్కాన్ని యెగపోసుకుంటూ యుద్ధం లాగా వెతుకుతది. ఎక్కడా తల్లి పేరు ఉండదు. ఆమె యాతన చూసి మండలాఫీసర్ వోటర్ లిస్టులో ఉంటుందేమో చూడండి అని చెపుతాడు, పంచాయితీ ఆఫీసులో వోటర్ లిస్ట్ కోసం అడిగితే మా దగ్గర పదేళ్ళ వోటర్ లిస్టులే ఉంటాయి, పాతవి కావాలంటే మండలాఫీసుకో, కలెక్టరాఫీసుకో పోవాలని చెప్తాడు. తల్లి చని పోయి పదారేండ్లు అయ్యింది. అంటే 20 ఏళ్ల కిందటి వోటర్ లిస్టు కావాలే. తను ఆఫీసర్ అయినా రిక్వెస్ట్ చేసుకుని పాత లిస్టులను తీయించి మూడు రోజులు వెతుకుతుంది. మూడో రోజు మూడు గంటలకు ఒక కమ్మలో ఆమె అవ్వ పేరు “కనక వీరమ్మ” అని కనిపిస్తుంది. ఆ పేరును-అక్షరాలను కండ్ల నిండా నింపుకుంటది, చేతుల నిండా తాకుతది. వాల్ల అవ్వ మళ్ళా బతికొచ్చినంత సంతోష పడ్తది. అవ్వ ఎదురుగా నిల్చున్నట్లు అనిపిస్తది. ఆవ్వ బతికున్న ఆనవాల్లు దొరికినందుకు దుక్కం సంబురం కలెబడి పొంగి యెగదన్నుతయి. యుద్ధంలో గెలిచినంత ఆనందం అయితది. ఇది ఒక కథ. రచయిత్రి సొంత కథనే. ఇలాంటి కథలే ఇంకో 14 ఉన్నాయిందులో.

ఈ దేశంలో కోటాను కోట్ల మట్టి ఎట్టి మనుషులకు సరి అయిన పేర్లు ఉండవు. ఉన్నా ఎవరు వారిని ఆ పేర్లతో పిలవరు.వారి పేర్లు ఎక్కడా నమోదయి ఉండవు.వారికి పుట్టిన తేదీలుండవు. చచ్చిన తేదీలుండవు. మూడు తరాలకు ముందు వారి పేర్లు తెలియవు. ఇలా కనీసం బతికిన ఆనవాల్లయినా పాపుకోని బాంచల సొదలు ప్రతి ఊరిలో ఉంటాయి. ఈ సొదలు యెతలు రందిని కలిగిస్తాయి, ఈ రంది తర తరాల వంశ వృక్షాలు రాసి పెట్టుకునే వారికి యెంత మాత్రం అర్థం కావు.

కథను చెప్పడానికి రచయిత్రి వాడే భాష, పదాలు, సామెతలు అర్థవంతంగా అద్భుతంగా ఉంటాయి . వ్యక్తి ముఖంలో 400 కండరాలు పది వేల భావాలను వ్యక్తం చేయగలవట, ఈ భావాలు భాషలో వ్యక్తం కావు, పదాల్లో ఇమడవు.

తన సేనా నాయకుల్లో ఒకడు చేసిన ద్రోహంతో కాకాతీయ చివరి చక్రవర్తి ప్రతాప రుద్రుడు బందీ అయి మరణించిన ఏడాది 1323 లో స్టాగ్నేట్ అయి వెనకబడి గిడస బారిన తెలంగాణ సమాజపు హీన సంస్కృతి లోని చీకటి కోణాలను వీరి కథలు మనకు వివరిస్తాయి.

కథను చెప్పడానికి రచయిత్రి వాడే భాష, పదాలు, సామెతలు అర్థవంతంగా అద్భుతంగా ఉంటాయి . వ్యక్తి ముఖంలో 400 కండరాలు పది వేల భావాలను వ్యక్తం చేయగలవట, ఈ భావాలు భాషలో వ్యక్తం కావు, పదాల్లో ఇమడవు. మనముంటున్న కుల -కుటుంబ వ్యవస్థలో మన ముందు అనేక తరాల వారి సంస్కృతి అప్రయత్నంగా మనలోకి వస్తుంది, అలాగే వారి దైన్యాలు, అవమానాలు మనలోకి వస్తాయి, మా బతుకులు ఎందుకిట్లా ఉన్నాయి అని చింతిస్తూ కూర్చున్నదళిత తల్లి మొకంలో ఈ తరతరాల భావాల జాడలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి, వీటిని చూసే, చదివే నేర్పు సుభద్రకుంది .

“కంపన పడ్డ కాల్లు” కథలో ఒక దళిత బాలిక ధూఖాన్ని వివరిస్తూ ఇలా రాస్తుంది , “ప్రశాంతి బస్సులనే నిళ్లాడింది, పిల్లగాడు బుట్టిండు. యీ దుక్ఖాలల్లా నీల్లాడే నొప్పులు గూడా దిగదుడు పయినాయి”,
నొప్పిని డెల్స్ లో కొలుస్తారు. మనిషి దేహం 45 డెల్స్ నొప్పిని మాత్రమే తట్టుకుంటుంది, అలాంటిది పురిటి నొప్పులు 57 డెల్స్ వరకు ఉంటాయట, 57 డెల్స్ అంటే దేహంలో 20 బొక్కలు ఒకే సారి విరిగినప్పుడు కలిగే నొప్పితో సమానం. ఈ నొప్పిని మరిపించేటంత నొప్పి ప్రశాంతి మెదడులో కడుపులో ఉందని రచయిత్రి అలవోకగా చెపుతుంది ఇంత నొప్పి ఉంటుంది కాబట్టే ప్రతి కానుపు సమయంలో ప్రతి మహిళ అనుకుంటుంది అట, “ఛీ ! జన్మలో మగ వాడితో కలవ వద్దు” అని, దీనినే పురిటి వైరాగ్యం అంటారు. అయితే ఆ వైరాగ్యం ఎక్కువ కాలము ఉండదు, ఇది ఒక ప్రకృతి విచిత్రం, అలాగే శ్మశాన వైరాగ్యం ఉంటుంది అది వేరే విషయం అనుకోండి.

“ఊరందరు నన్ను ఉమిస్తే నేను పోయి చెరువులో ఉముస్తా” అన్నట్లు దళిత పురుషులు సమాజంలో ఎదుర్కొనే పీడన, కుల వివక్షను ఎలా ఎదుర్కోవాలో తెలియక వారి విసుగును కోపాన్ని ఇంటికి వచ్చి ఆలుబిడ్డల మీద ప్రదర్శిస్తారు, ఈ దాష్టీకాన్ని ఎదుర్కొంటున్న దళిత మహిళల కష్టాలను సుభద్ర చక్కటి కథలుగా మలిచింది.  కింది కులాల వారిని అదుపు చేయడానికి, నీచ పరచడానికి వారికట్టు బొట్టు, ఆహార, ఆలోచన అలవాట్లు వాటి పరీదుల మీద బ్రామ్మాలు, ఓసీ కులాల వారు పన్నే వ్యూహాలను నీసు నియ్యతి, ముద్దు కూర, బిందాస్ బీఫ్, కథల్లో రచయిత్రి విప్పి చూపించే తీరు ప్రతిభా వంతంగా ఉంది.

వీలుంటే ఈ కథలు చదవండి, చదివేటప్పుడు మీ కంట్లో తడి ఊరితే మీరు మనుషుల కింద లెక్కలోకి వస్తారు.

రిజర్వేషన్ బోగి : జూపాక సుభద్ర. నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌజ్. 104 పేజీలు. వెల 100/-. రచయిత్రి ఫోన్ నంబర్ 9441091305.

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article