Editorial

Wednesday, January 22, 2025
Opinionఆత్మకథ : కలెనేత -ఇది అచ్చమైన 'ఏడుతరాల తలపోత' - దుర్గం రవిందర్

ఆత్మకథ : కలెనేత -ఇది అచ్చమైన ‘ఏడుతరాల తలపోత’ – దుర్గం రవిందర్

ఈ ఆత్మకథలో ఏడు తరాల వివరాలు ఉన్నాయి, నాలుగు దశాబ్దాల తెలంగాణ విద్యారంగ వివరాలు ఉన్నాయి. ఆ కాలంలో ఒక బాలిక చదువుకోవాలంటే ఎన్ని అడ్డంకులో, ఎంత కష్టమో ఇందులో ఉంది. ఒక కులపు దాదాపు సంపూర్ణ ఆచార వ్యవహారాలు, ఒక ప్రాంత సంస్కృతి, ఒక జిల్లా ఏడు దశాబ్దాల సామాజిక చరిత్ర, అక్షర జ్ఞానం కోసం ఒక బీసీ మహిళ పడిన పాట్లు, బిడ్డల చదువులు చదివించడానికి పడిన తపన ఇలా అనేక అంశాలు సవివరంగా ఉన్నాయి.

దుర్గం రవిందర్

ఇటీవలి కాలంలో తెలుగులో వచ్చిన తెలుగు ఆత్మకథలు, జీవిత చరిత్రలలో ప్రధానంగా చెప్పుకోదగిన గొప్ప పుస్తకం ఇది. సాధారణ పద్మశాలి కుటుంబంలో పుట్టిన సరస్వతి గారు తనకు మూడు తరాల ముందు, తన తర్వాత మూడు తరాల విషయాలను పూసగుచ్చినట్లు వివరించిన తీరు అద్భుతంగా ఉంది. సరస్వతమ్మ నలుగురి పిల్లల జీవిత చిత్రణ ఇందులో ఉంది.

సరస్వతమ్మ 1941 ఏప్రిల్ 4న జన్మించారు. తండ్రి రామదాసు, తల్లి లక్ష్మమ్మ. 1957లో ఓల్డ్ సెవెంత్ పాసయ్యారు. 1958 లో టీచర్ ట్రైనింగ్ వెళ్లారు. 1967 హెచ్ ఎస్ సీ పాసయ్యారు. పట్టుదలగా పియూసి పూర్తిచేశారు. వెంటనే సెకండరీ టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి బి ఏ డిగ్రీ కూడా చేసి, అక్కడితో ఆగకుండా బిఇడీ కూడా 1984లో సునాయాసంగా పూర్తి చేశారు. 1961లో ఉద్యోగంలో చేరారు. 1999లో ఉద్యోగ విరమణ చేశారు. 1958 పెళ్లయింది. భర్త బల్ల సోమయ్య, వీరికి నలుగురు పిల్లలు, ఏడుగురు మనవళ్లు మనవరాళ్లు, ఒక మునిమనవరాలు. ఈ మాత్రం వివరాలు రాస్తే అది మామూలు ఆత్మకథ అయ్యేది. కానీ ఈ ఆత్మకథ ప్రత్యేకంగా ఉంది.

ఇక్కడ సరస్వతమ్మ ఏమి చేసిందో ఆమెకు తెలియదు. కాని ఆత్మకథ ద్వారా అద్భుత సామాజిక, చారిత్రిక, సాంస్కృతిక విషయాలను అద్భుతంగా ఆవిష్కరించారు.

క్రీస్తు జీవిత చరిత్ర ఆధారంగా తీసిన కరుణామయుడు సినిమాలో జీసస్ ను రోమన్ సైనికులు హింసిస్తుంటే “వారేమి చేయుచున్నారో వారికి తెలియదు వారిని క్షమింపుడు” అని జీసస్ అంటాడు. అలాగే ఇక్కడ సరస్వతమ్మ ఏమి చేసిందో ఆమెకు తెలియదు. కాని ఆత్మకథ ద్వారా అద్భుత సామాజిక, చారిత్రిక, సాంస్కృతిక విషయాలను ఆవిష్కరించారు. సరస్వతమ్మ ఈ పుస్తకం ద్వారా అందించిన విషయ సమాచారంతో మా కాలపు పి.హెచ్.డి లు ఆరు చేయవచ్చు, ఈ కాలపు పి.హెచ్.డి లు ఇరవై చేయవచ్చు.

ఈ పుస్తకం నిండా ప్రతిపేజీలో తెలంగాణ సాంస్కృతిక అంశాలు గుభాళిస్తున్నాయి. పూలపండ్లు, పెళ్లి, మారు పెండ్లి, అయిరేండ్లూ, ఎదురుకోళ్లు, బంతి భోజనాలు, పదారు పండగ, సాగనంపుడు, సీమంతం, పురుడు, పురిటి స్నానాలు, ఎల్లిపాయ కారం, ఎళ్లి పాయల దండ, ఓమ పొడి, తొట్లే, వాకిలి దేవర, గంగమ్మ పండగ, కేదారేశ్వరి గౌరమ్మ వ్రతము, పుప్పొడి ముగ్గు, కొత్తలు పెట్టుకోవడం, ఒడి బియ్యం, బొడ్డెమ్మ, పండుగ, నూల పున్నమి, కామునిపున్నమి, ఇతర పండుగలు చేసుకునే తీరును చక్కగా వివరించారు. దసరా, దివిలె, యాకాశి. బాల్య వివాహాలు, శిశుమరణాలు, బాల వైదవ్యాలు, పురుషాధిక్యత, ఫ్యామిలి ప్లానింగ్ ఆపరేషన్లు, చావు విందులు, దొంతరల కులవ్యవస్థ సంబంధించిన వివరాలు ఈ ఆత్మకథలో విరివిగా ఉన్నాయి. ఆత్మీయులు పోయినప్పుడు శోకం పెట్టి ఏడవడం అనే పద్దతి తెలంగాణ సంస్కృతిలో ప్రత్యేకం. దీని వివరణ సరస్వతిగారు ప్రత్యేకంగా రాశారు.

ఇందులో తెలంగాణ సంస్కృతి, ప్రాంతం, ఊరు, కులము, కుటుంబము, వంటలు, సామెతలు, వ్యక్తుల పేర్లు, ఇంటిపేర్లు, రాజకీయం, కులాంతర వివాహాలు, నగలు, కూలిన కులవృత్తులు, ఆత్మహత్యలు, శిశుమరణాలు, వైరాగ్యాలు, హత్యాయత్నాలు, జీవన పోరాటం ఇంకా ఇలాంటి అంశాలు ఎన్నో ఉన్నాయి.
కేదారేశ్వరి వ్రతంలో వేసే పుప్పొడి ముగ్గు గురించి చక్కగా వివరిస్తారు. కేదారము అంటే వరి చేను, కేదారేశ్వరుడు అంటే వరి దేవుడు, ఆ దేవుడి వ్రతం అది చతురస్రాకారపు 21 గడులు, గుంత తవ్వి సీతాఫలం కొమ్మలతో వేసే పందిరి తదితర సాంస్కృతిక అంశాలు చాలా ఉన్నాయి. చిన్న చిన్న చిట్కా వైద్యాలు, ఉపాయాలు, నాటు వైద్యం, భూతవైద్యం, ఇలాంటి చిన్నా పెద్ద సాంస్కృతిక అంశాలు ఎన్నో పుస్తకం నిండా ఉన్నాయి.

బర్రెలు, దున్నపోతులు. ఇలాంటి ఎన్నో యవుసం సంబంధ విషయాలు ఇందులో ఉన్నాయి. ఎద్దు చనిపోతే రైతు ఇంటిల్లిపాది శోకాలు పెట్టి ఏడ్చే సందర్భాన్ని హృద్యంగా ఉటంకించారు.

పూర్వం తెలంగాణలో పశువులను సొమ్ములు అనేవారు. ఇందులో మళ్లీ తెల్ల సొమ్ములు, నల్ల సొమ్ములు అని ఉండేవి. తెల్లనివి అంటే ఆవులు, ఎడ్లు. నల్లనివి అంటే బర్రెలు, దున్నపోతులు. ఇలాంటి ఎన్నో యవుసం సంబంధ విషయాలు ఇందులో ఉన్నాయి. ఎద్దు చనిపోతే రైతు ఇంటిల్లిపాది శోకాలు పెట్టి ఏడ్చే సందర్భాన్ని హృద్యంగా ఉటంకించారు. గోర్జము (గోరోజనం), మోసాంబ్రం, కస్తూరి మాత్రలు, చెక్క మందుల ప్రస్తావన సందర్భోచితంగా చక్కగా చేశారు. గొల్ల కురుమలలో వరుడు ఇంట్లో పెళ్లి కావడానికి వీలుగా ఆ పిల్లలను ఎత్తి ఇవ్వడం అనే పద్ధతిని వివరిస్తారు.

సాధారణంగా తెలంగాణలో మాంసం కూరలో టమాట తప్ప ఇతర కూరగాయలను కలిపి వండరు. కానీ పారిశ్రామిక విప్లవంతో వచ్చిన నడమంత్రపు పేదరికంతో పరిమాణం పెరగటానికి మాంసంలో రకరకాల కూరగాయలు కలిపి వండే తీరు శాలోళ్లకు అలవడింది. ఈ కూరగాయల మేళవింపుతో కొన్నిసార్లు మాంసం అద్భుతంగా రుచికరంగా కుదురుతుంది. ఉదాహరణకు మాంసంలో దోసకాయ వేసి వండితే అద్భుతంగా ఉంటుంది. చనిపోయిన మేక, గొర్రె, కోడి మాంసం తినే అలవాటు కూడా వారికి పేదరికం వల్ల వచ్చిందే. మగ్గం మీద రోజంతా శ్రమించి అలసట తీరడానికి ర్యాక పట్టుకుని కల్లుతాగే అలవాటును ప్రస్తావించారు. ఇలాంటి సూక్ష్మ విషయాలను సరస్వతమ్మ చక్కగా రికార్డ్ చేశారు. పాలాంభ్రం అనే తీపి వంటకాన్ని పరిచయం చేస్తారు. ఇది ఎక్కడ విన్నట్టు లేదు, అది బహుశా కాకతీయుల కాలం నాటి వంటకం అయి ఉంటుంది. శండమ్మ, మీనమ్మ, శీలమ్మ, అండమ్మ, సమ్మక్క, నీలమ్మ, రాజమ్మ, మణెమ్మ, జయమ్మ, భూలక్ష్మి, సత్తయ్య, శంకరయ్య…. బహుషా ఈ పేర్లు కూడా కాకతీయుల కాలం నుండి వస్తున్నవే.

గొర్రె మీద కొసరు, ‘కుడుము అంటే పండగ అంటారు’. ఉస్కె ముడిగాడు పెండముడిగాడు, ఇలాంటి సామెతలు సందర్భానుసారం చాలా దొర్లుతాయి. మసీదు అనకుండా ఆయన గుడిలో అజా చేసేవారు అని వివరిస్తుంది. వరంగల్ జిల్లాలో దిష్టి తీయడాన్ని మిత్తి తీయడం అంటారు అని రచయిత్రి వివరిస్తారు.

కాకతీయులు, రాచకొండ, విజయనగర, కుతుబ్షాహీ ల పాలన కాలంలో తెలుగు పద్మశాలీలు అత్యంత సంపన్నులు. ఆనాడు వరంగల్ ప్రాంతంలో 30 పైగా రకాల నాణ్యమైన పట్టువస్త్రాలు తయారయ్యేవి, ఈ విషయాన్ని పాల్కురికి సోమన బసవపురాణంలో వాటి పేర్లతో సహ చక్కగా వివరించారు. ఈ పట్టువస్త్రాలను ప్రపంచంలోని రాజ కుటుంబాలు, అత్యంత సంపన్నులు మాత్రమే కొన గలిగే వారు. అవి ఎంతటి ఖరీదైనవి అంటే కిలో బంగారానికి కిలో వస్త్రాలు తూచి ఇచ్చేవాళ్ళు. అలా ఈ ప్రాంత నేత కులం వారు 12వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం దాక సంపదతో తులతూగారు. వీరు నేసే కాటన్ వస్త్రాలు ఎంత పలచగా ఉండేవంటే కులీన స్త్రీలు మూడు వరుసల దుస్తులు ధరించి కూడా మగవారి ముందుకు రావడానికి సిగ్గుపడేవారట. ముఫ్తీ అని ఈ వస్త్రాన్ని పిలిచేవారు. అంత సంపన్నులు కాబట్టే వారిలో “క్లాస్ నేచర్” కనపడుతుంది, ముఖ్యంగా మహిళల్లో.

మగ్గాలు మూలకు పడిన నేపథ్యంలో ఏడు తరాల జీవన పోరాటం ఈ ఆత్మకథలో దర్శించవచ్చు.

యూరప్లో వచ్చిన పారిశ్రామిక విప్లవంతో కుదేలైన ఆ కులం పాపం ఇంకా లేచి కూర్చుంటూనే ఉంది. 1785 యూరప్లో మర మగ్గం కనుగొన్నారు. 1890 నుండి ఇంగ్లాండ్ నుంచి బట్టల దిగుమతి మనకు బాగా పెరిగింది. భారతీయ ఉత్పత్తులైన నూలు, పట్టు, ఉన్ని వస్త్రాలపై బ్రిటిష్ ప్రభుత్వం 25-30 శాతం పన్నులు విధించి నిరుత్సాహపరిచారు. ఢాకా, కంచి, యూపీ, బీహార్ల్లో నేతపని వారిపై భౌతికంగా దాడి చేసి వేళ్ళు విరిచి, మగ్గాలను ధ్వంసం చేసి అత్యంత క్రూరంగా అణచివేశారు. అప్పుడు భారతీయ చేనేత కార్మికులకు గడ్డు రోజులు మొదలయ్యాయి. ఆ గడ్డు రోజులు నేటికీ కొనసాగుతున్నాయి. మగ్గాలు మూలకు పడిన నేపథ్యంలో ఏడు తరాల జీవన పోరాటం ఈ ఆత్మకథలో దర్శించవచ్చు. మరమగ్గం వేగంగా నాణ్యతతో బట్టలను నేసింది. ఆ బట్టలు భారత దేశానికి దిగుమతి అయి ఇక్కడి మగ్గాల సాయామానులను విరగ కొట్టింది. దీనికి తోడు బ్రిటిష్ ప్రభుత్వం పనిగట్టుకొని కుట్రపూరితంగా స్థానిక నేత పని వారి నైపుణ్యాలను కుళ్ళ బొడిచింది. ఒకటి రెండు దశాబ్దాల్లోనే దాదాపు ఎనభై, తొంభై లక్షల మగ్గాలు విరిగిపోయాయి లేదా అటకెక్కాయి. అప్పటివరకు పచ్చగా ఉన్న చేనేత కులం కుప్పకూలింది. ఒకటి రెండు దశాబ్దాల్లో కొన్ని లక్షల, లక్షల మగ్గాలు మూలన పడ్డాయి.

ఈ ప్రభావం నైజాం దేశంలోని వరంగల్ జిల్లాలో కూడ పడ్డది. దీంతో నేత కులం వారు అచిరకాలంలోనే పేదలుగా, అతి పేదలుగా జారిపోయారు. పారిశ్రామిక విప్లవంతో మరమగ్గాల ఆవిష్కరణతో బాగా దెబ్బతిన్న చేనేత కులం అనివార్యంగా ఆ వృత్తిని వదులుకోవాల్సి వచ్చింది. జీవిక కోసం కొత్తగా వచ్చిన వ్యాపకాన్ని దేన్నేౖనా ఈ ప్రాంతంలో చేనేత కులం వారే ముందు అందుకున్నారు. సరస్వతి తండ్రి ఉప్పరి పనిలోకి వెళ్ళాడు. ఆయన కొడుకు డ్రైవర్ లేదా కండక్టర్ కావాలని ప్రయత్నించి విఫలమై తండ్రి బాట పట్టాడు. మరిది బొంబాయిలో పాల వ్యాపారం చేశాడు. సరస్వత్తమ్మ ఆడబిడ్డ సకుటుంబ సమేతంగా తిరుపతి లాడ్జిలో ఆత్మహత్య చేసుకొంది. ఆయుర్వేదం, కాంపౌండర్లు, ఆర్.ఎం.పి, ఫోటోగ్రఫి, రేడియో మెకానిజం, ఇంగ్లిష్ మందులు, ఫార్మసి, సైన్ బోర్డు రైటింగ్… ఇలా ఒక్క మంగలిపని తప్ప అన్ని పనుల్లోకి వెళ్ళారు. కొందరు ఐ.ఏ.ఎస్, గ్రూపు ఒన్ అధికార్లు అయ్యారు. చాలామంది డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారు. ఈ తరంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు అవుతున్నారు.

రచయిత్రి 1952 లో స్కూల్లో టీచర్ గా చేరారు, అది మొదలు ఆమె రిటైర్ అయ్యే వరకు తెలంగాణ విద్యా శాఖ పనితీరు పట్ల చక్కటి వివరాలను పొందుపరిచారు.

సరస్వతమ్మ 1960 దశకం ఆరంభంలో పంతులమ్మ నౌకరిలో చేరారు. ఆనాడి బడుల పరిస్థితిని ఇలా వివరించారు. “స్కూల్లో ఒక బోర్డు మాత్రమే ఉన్నది. ఒక చేయిలేని కూర్చి నేను కూర్చోవడానికి ఏర్పాటు చేసినారు”. స్కూల్ రిజిస్టర్ను గోడపై పెట్టి దానిపై ఒక రాయి పైన పెట్టేది, గాలికి కొట్టుకు పోకుండా ఉండడానికి. వర్షం పడ్డప్పుడు పాక స్కూల్లోకి జల్లు కొట్టేది. రోజు రిజిస్టర్ను తీసుకొని ఉదయం బడికి వచ్చేటప్పుడు తెచ్చుకునేది. “ఆ స్కూలుకు అటెండర్, క్లాస్ టీచర్, హెడ్మాస్టర్ అన్ని నేనే” అంటుంది టీచర్ సరస్వతమ్మ గారు. ఇది 1962లో తెలంగాణలో ఉన్న బడుల పరిస్థితి, యావత్ తెలంగాణాలో ఇదే పరిస్థితి. సీమాంద్ర పాలక వర్గం దాష్టిక ఫలితం అది. అప్పట్లో ఏ ఊరు వెళ్ళాలన్న కాలినడకే గతి. పటేండ్లు, సంపన్నులు కొందరే ఎడ్లబండ్లు, సైకిల్ మీద తిరిగేవారు. రచయిత్రి 1952 లో స్కూల్లో టీచర్ గా చేరారు, అది మొదలు ఆమె రిటైర్ అయ్యే వరకు తెలంగాణ విద్యా శాఖ పనితీరు పట్ల చక్కటి వివరాలను పొందుపరిచారు.

పద్మశాలీల పని తీరు ఉల్కలు, ఇక్కత్, కండెలు, గంజి పెట్టడం, ఆసుపోయడం లాంటి పనులు వివరణ చక్కగా ఉంది. కామ్యాబ్, ఆమ్ ముక్త్యార్ నామ, దావత్, తబాదల, జాయిజాత్, వతన్ లాంటి ఉర్దూ పదాలను అవసరమైన చోట అతికినట్లుగా వాడారు. ఆ రోజుల్లో బీసి మహిళ నడవలేని స్థితిలో ఒక మాదిగోని సైకిల్ మీద ఎక్కిరావడం ఎంత పెద్ద తప్పో ఒక సందర్భంలో వివరిస్తారు. చేనేత కులానికి సంబంధించిన సిరిశాల సంగతులు ఎన్నో ఈ కథనంలో ఉన్నాయి. తెలంగాణకే పరిమితమైన గుంత మగ్గానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. గుడ్ల మాను వస్త్రాల ప్రస్తావన ఉంది.

వినాయక చవితిని వీధిలో చేయడం మా దగ్గర (వరంగల్ జిల్లాలో) 1979లో మొదలైంది. వినాయక మండపాలు ఏర్పాటుతో చాపకింద నీరులా హిందుత్వ భావజాలం వ్యాప్తిని వివరిస్తారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, నక్సల్స్ ఉద్యమం, కాంగ్రెస్ తెలుగుదేశం రాజకీయాలు, మహిళా రిజర్వేషన్లు తదితర సామాజిక రాజకీయ అంశాల ప్రస్తావన వివరంగానే ఉంది.

అరి కట్లం, కోదండం, చల్ల కలుపు, పుప్పొడి, జాలారు, సాయ మాను, దూపబుడ్లు, ఇలాంటి అంశాల వివరణ సందర్భ శుద్దితో సహజంగా సాగిపోతుంది.

భర్త సోమయ్య మరణాన్ని ఉటంకిస్తూ 1958లో మా పెండ్లి అయింది, 2001లో విడుదల, 43 ఏళ్ల అనుబంధం నేటితో పుటుక్కున తెగిపోయింది, అని కొంత లోప భూయిష్టమైన మన వివాహా వ్యవస్థలోని లోతయిన తాత్వికతను, మంచి చెడులను అలవోకగా వివరిస్తారు.

భర్త బల్ల సోమయ్య సారులో తెలంగాణ సగటు భర్తల వలే పుష్కలంగా ఉన్న పురుషాధిక్య భావజాలంను చక్కగా చిత్రిక పట్టి చూపించారు. భర్త సోమయ్య మరణాన్ని ఉటంకిస్తూ 1958లో మా పెండ్లి అయింది, 2001లో విడుదల, 43 ఏళ్ల అనుబంధం నేటితో పుటుక్కున తెగిపోయింది, అని కొంత లోప భూయిష్టమైన మన వివాహా వ్యవస్థలోని లోతయిన తాత్వికతను, మంచి చెడులను అలవోకగా వివరిస్తారు. ఆడబిడ్డ అండాలు తిరుపతి లాడ్జిలో సకుటుంబ ఆత్మహత్య, భువనగిరిలో నక్క ఆండాలు హత్య మొదలైన మంచి చెడులు ఇందులో వివరిస్తారు. రజాకార్లు, రైతాంగ సాయుధ పోరాటం, పోలీస్ ఆక్షన్ నాటి సంఘటనలు, నక్సలైట్ ఉద్యమ పుట్టుక పెరుగుదల, ప్రభుత్వ ప్రతిఘటన, దళాలు అరెస్టులు, ఒక దళానికి బలవంతపు షెల్టర్ ఇవ్వాల్సి వచ్చిన సందర్భాన్ని చక్కగా వివరించారు.

ఈ ఆత్మకథలో ఏడు తరాల వివరాలు ఉన్నాయి, నాలుగు దశాబ్దాల తెలంగాణ విద్యారంగ వివరాలు ఉన్నాయి. ఆ కాలంలో ఒక బాలిక చదువుకోవాలంటే ఎన్ని అడ్డంకులో, ఎంత కష్టమో ఇందులో ఉంది. ఒక కులపు దాదాపు సంపూర్ణ ఆచారవ్యవహారాలు, ఒక ప్రాంత సంస్కృతి, ఒక జిల్లా ఏడు దశాబ్దాల సామాజిక చరిత్ర, అక్షర జ్ఞానం కోసం ఒక బీసీ మహిళ పడిన పాట్లు, బిడ్డల చదువులు చదివించడానికి పడిన తపన ఇలా అనేక అంశాలు సవివరంగా ఉన్నాయి.

సరస్వతమ్మ కూతురు పద్మజకు చిన్నతనంలోనే పెళ్లి అవుతుంది, ఆచారం ప్రకారం పద్మజను అత్తవారు తీసుకెళ్తారు. పద్మజకేమో పదవ తరగతి పుట్టిన ఊర్లోనే చదువుకోవాలని ఉంటుంది. ఆ మామ ‘చదివింది చాలు ఇక చదువు అక్కర్లేదు’ అంటారు, లేదంటే మా ఊర్లోనే చదువుకో అని అంటారు, కానీ పద్మజ నిస్సహాయంగా కంట్లో నీళ్లు కంట్లోనే కుక్కుకుంటూ తన ఇబ్బందిని తల్లికి సరస్వతికి చెప్పుకుంటుంది. అది విన్న తల్లి గుండె తల్లడిల్లి పోతుంది. ఇదివరకు లేని మొండి ధైర్యం తెచ్చుకుని భర్త వద్దంటున్న వినకుండా జనగామలో బస్సు ఎక్కి నిజామాబాదులో ఉంటున్న వియ్యపురాలు ఇంటికి వెళ్ళిపోతుంది. వారిని కన్విన్స్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. “నిజమే మీ కోడలే, కానీ ఇంకా బాల క్యాలి పోలే ఒక ఏడాది మా ఊర్లో చదివించుకుంటా అని వేడుకుంటుంది”, వారు కుదరదు అంటారు, అప్పుడు ఆ తల్లి వియ్యపురాలు రాధమ్మ రెండు కాళ్లపై నుదురును పూర్తిగా ఆనించి దండం పెడుతుంది. ఇక ఇంతకన్నా చెప్పేదేమీ లేదు చేసేదేమి లేదు అని తన బిడ్డను తీసుకుని బస్టాండ్ కు వచ్చి సిద్దిపేట బస్సు ఎక్కుతుంది. బిడ్డను చదివించుకుంటుంది. ఆ బిడ్డ ఇప్పుడు ప్రభుత్వంలో అదనపు సహాయ కార్యదర్శి హోదాలో ఉంది. సరస్వతమ్మ అమ్మలాంటి అమ్మ లక్ష్మమ్మ, పద్మజలాంటి బిడ్డ మనకు ఉంటే బాగుంటుందనిపిస్తుంది.

ఈ పుస్తకం రాసినందుకు కు సరస్వతమ్మ జన్మ సార్థకం అయింది. ఈ పుస్తకం రాయడం ద్వారా సరస్వతమ్మ తన పుట్టిన జిల్లా, కులం రుణం తీర్చుకున్నట్లు కూడా అయింది.

పుస్తకం ముందుమాట, చివరి మాటల్లో ఎరుపు రంగు అద్దె ప్రయత్నం కొంత కనిపిస్తుంది. పుస్తకంలో చివర వంశవృక్షం జతపర్చడం చక్కగా నప్పింది. అయితే తేదీలు ఉంటే బాగుండేది. వీళ్లకు ముందరి తరం సరస్వతి ముత్తాత బుచ్చినరసయ్య, ముత్తమ్మ గుర్రం బుచ్చి నరసమ్మ వీరి వివరాలతో పాటు ఆనాటివారి ఫోటోలు పొందుపర్చడం పుస్తకానికి అదనపు సమాచారం జోడించి నట్లయింది. ఆ ఫోటోలో వారి కట్టు బొట్టు ఆహార్యం చక్కగా కనిపిస్తున్నాయి. ఈ పుస్తకానికి జాతీయ అంతర్జాతీయ స్థాయి బహుమతి ఏది వచ్చినా అది ఆ బహుమతికి అదనపు గౌరవాన్ని తెచ్చి పెడుతుంది. ఈ పుస్తకం రాసినందుకు కు సరస్వతమ్మ జన్మ సార్థకం అయింది. ఈ పుస్తకం రాయడం ద్వారా సరస్వతమ్మ తన పుట్టిన జిల్లా, కులం రుణం తీర్చుకున్నట్లు కూడా అయింది.

కలెనేత (ఆత్మ కథ) : ఏడుతరాల తలపోత – కోసం అన్విక్షికి పబ్లిషర్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారిని ఈ ఫోన్లో సంప్రదించవచ్చు. 97059 72222.  నేరుగా Amazon నుంచి కూడా ఈ లింక్ క్లిక్ చేసి తెప్పించుకోవచ్చు. వెల : 448. పేజీలు : 700.

సీనియర్ జర్నలిస్టు, సామాజిక విశ్లేషకులు, ప్రచురణకర్త దుర్గం రవిందర్ తెలుపు కోసం రాసిన ఇతర వ్యాసాలు ఎవరీ కణికీర?, ఎవరు సన్నాసి?, పత్రికలు- వ్యాపారం- తెలంగాణ ఉద్యమం.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article