ఫేస్బుక్ ని ఎందుకు తొలగించాలో ఇకపై రోజూ మాట్లాడుకుందాం…
డాక్టర్ విరించి విరివింటి
ఫేస్బుక్ కి మొదటి అధ్యక్షుడు సీన్ పార్కర్. ఈయన సోషల్ మీడియా గురించి ఏమంటున్నాడో చూడండి.
“నేను కావొచ్చు జూకర్బర్గ్ కావొచ్చు ఇన్స్టాగ్రాం అధినేత కెవిన్ సిస్ట్రోమ్ కావొచ్చు ..మేము ప్రజలను అర్థం చేసుకున్నాం. నీవు దేనికి లొంగిపోతావో దానిని ఎక్స్ప్లాయిట్ చేయడం ఎలాగో మేము అర్థం చేసుకున్నాం. నీకు ప్రతిరోజు ప్రతి పూటకూ ప్రతి గంటకూ ఎవరో ఒకరు చిన్న సైజ్ డోపమైన్ ఇంజెక్షన్ వంటిది నీకు ఎక్కించాలంటే ఏం చేయాలి? నీ ఫోటోనో లేదా నీవు రాసిన రాతనో ఎవరో ఒకరు లైక్ చేయడమో కామెంట్ చేయడమో చేస్తుండాలి. నీ ఫోటోనో రాతనో సమాజం ధృవీకరించడం ప్రతిస్పందించడం చేయడం వలన నీకు నీవు ఒక ఉచ్చులోకి జారుకోవాలి. నాలాంటి హాకర్ చేసే పని ఇదే – ‘నిన్ను ఉచ్చులోకి పడవేయడం’. దీనివలన నీకు సమాజంతో ఉండే సంబంధం చెడిపోతుంది. ఒకరితో ఒకరికి సంబంధాలూ చెడిపోతాయి. మనిషి ఉత్పత్తి శక్తి తెలియని రీతుల్లో తగ్గిపోవడం మొదలౌతుంది”.
మేము ఇది తయారు చేసేటపుడు మాలో ఎలాంటి చెడు ఆలోచనలూ లేకున్నా ఎక్కడో మొమెదడు మూలల్లో తప్పు చేస్తున్నామనే స్ప్రుహ ఉండింది. ప్రస్తుతం మనం ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాం.
ఫేస్బుక్ గత వైస్ ప్రెసిడెంట్ చమత్ పాలిహపిటియా ఏమంటున్నాడో చూడండి.
“మేము సృష్టించిన తాత్కాలిక డోపమైన్ ప్రతిస్పందనా ఉచ్చు సమాజం పనిచేసే తీరును నాశనం చేస్తుంది. పౌరుల మధ్య సంభాషణలు మాయమౌతాయి. ఒకరికొకరు సహాయం చేసుకోవడం ఆగిపోతుంది. తప్పుడు కథనాలు, తప్పుడు సమాచారం, అబద్ధాలు. ఇవే సమాజాన్ని నడిపించడం మొదలౌతుంది. ఇది ఏ ఒక్క దేశ సమస్య కాకుండా ప్రపంచ సమస్య ఔతుంది. మేము ఇది తయారు చేసేటపుడు మాలో ఎలాంటి చెడు ఆలోచనలూ లేకున్నా ఎక్కడో మొమెదడు మూలల్లో తప్పు చేస్తున్నామనే స్ప్రుహ ఉండింది. ప్రస్తుతం మనం ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. నా అభిప్రాయం ప్రకారం ఇది మనుషులు ఒకరితో మరొకరు నడుచుకునే ప్రవర్తనా మూలాలనే తినేయడం మొదలుపెట్టింది. దీనికి పరిష్కారం నా దగ్గర లేదు. నేను చేయగలిగిండేదల్లా ఫేస్బుక్ ని ఉపయోగించకపోవడమే. గతంలో నేనెపుడూ వాడనిదానిని ఇపుడైనా ఎందుకు వాడాలి?”.
“అడిక్షన్”అనే పదాన్ని “ఎంగేజ్మెంట్”పదంతో మార్చేసింది ఫేస్బుక్. నీవు ఫేస్బుక్ లో ఎంగేజ్ ఐవున్నావు అని చెప్నడం మొదలైంది.
ఒకతను ఫేస్బుక్ మొదటి అధ్యక్షుడు ఐతే రెండవ అతను ఫేస్బుక్ మాజీ వైస్ ప్రెసిడెంట్. ముఖ్యంగా మనం గమనిస్తే ఫేస్బుక్ ఒకరిమీద ఒకరు గేలి చేసుకోవడానికీ అపహాస్యం చేసుకోవడానికీ నిందలు వేసుకోవడానికీ తప్ప మరెందుకూ పనికిరాకుండా పోతోందని అనిపిస్తుంది. ఫేస్బుక్ వాడకూడదని ప్రపంచ వ్యాప్తంగా ఎందరో మేధావులు సూచించడం మొదలుపెట్టారు. ఒక చక్కని స్నేహపూరిత సంభాషణా వేదికగా ఫేస్బుక్ ఏమాత్రం నిలబడలేదని అర్థం చేసుకున్నారు. డోపమైన్ రష్ కలిగించే తాత్కాలిక ఉద్రిక్తతలకు లోనై మనిషి తోటి మనిషితో కలిసి నడవలేని స్థితికి దిగజారడం గమనించిన వారు దీనికి దండం పెడుతున్నారు. ఆన్లైన్ బుల్లీయింగ్ ట్రోలింగ్ విపరీత పోకడలు పోవడంతో ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చాలు ఎందుకొచ్చిన డిప్రెషన్ అని తలలు పట్టుకుంటున్నారు. “అడిక్షన్”అనే పదాన్ని “ఎంగేజ్మెంట్”పదంతో మార్చేసింది ఫేస్బుక్. నీవు ఫేస్బుక్ లో ఎంగేజ్ ఐవున్నావు అని చెప్నడం మొదలైంది. నిజానికి చెప్పవలసినది నీవు ఫేస్బుక్ తో అడిక్ట్ ఐవున్నావు అని. అడిక్ట్ ఐనవాళ్ళందరూ నిజ జీవితం తో నిజమైన మనుషులతో దూరం జరిగి ఒక వర్చువల్ లోకంలో ఇల్యుషన్లలో ఉండిపోతూ తాము తోటి వ్యక్తి గురించి ఊహించిందే నిజమని తలపోస్తూ అదే ఉచ్చులో చుట్టుకుపోతున్నారు.
ఫేస్బుక్ విషపూరితం కావడం మనుషుల మధ్య తేలికపాటి గేలి సంబంధాలు తప్ప నిజమైన విద్వేష రహిత స్నేహపూరితమైన సంబంధాలు కనుమరగవడం మొదలైంది.
ముఖ్యంగా సోషల్ మీడియా మనుషుల ప్రవర్తన మీద తీవ్రమైన ప్రభావం చూపుతోంది అంటాడు Jaron Lanier అనే సైంటిస్ట్. ఈయన సోషల్ మీడియాను లెడ్ పెయింట్ తో పోలుస్తాడు. “లెడ్ ప్రమాదకరం అని తెలిసిన తర్వాత ప్రజలు లెడ్ పెయింట్ ని వేయడం ఆపేశారు. గోడలకు పెయింట్ లేకుండానే బతికేశారు. తెలివైన మనుషులు విషపూరితమైన లెడ్ లేని పెయింట్ తయారయ్యే వరకూ ఓపికగా వేచి చూశారు. అలాగే తెలివైన ప్రజలు విషపూరితంకాని సోషల్ మీడియా వచ్చేంతవరకూ తమ అకౌంట్లను డిలీట్ చేసుకుని వేచి చూడాలి” అంటాడు. గమనించి చూడండి ఫేస్బుక్ విషపూరితం కావడం మనుషుల మధ్య తేలికపాటి గేలి సంబంధాలు తప్ప నిజమైన విద్వేష రహిత స్నేహపూరితమైన సంబంధాలు కనుమరగవడం మొదలైంది. గుంపులుగా గ్రూపులుగా ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోలేనంత అసహనంగా తయారవుతోంది.
మంచి ఆలోచనలు స్నేహశీలతగలిగిన వారిగా మనం దీనిని ఏమైనా బాగు చేయగలమేమో చర్చించండి. ఆలోచించండి.
కొంతమంది దీనిని కవితలకు కథలకు చర్చలకూ వేదికగా తయారుచేయాలని చూశారు. చేయగలిగినంత చేశారు. కానీ ఎవరూ సంభాషణలకు స్నేహ సంబంధాలకూ పరిపూర్ణ వేదికలుగా తీర్చిదిద్దలేక పోయారు. మాటల ద్వారా పరిష్కరించుకోవలసిన సమస్యలను మాటలద్వారానే పెంచి పెద్దదిగా చేసుకుంటున్నారు. ఇది చాలా తీవ్రమైన సమస్యనే.
మంచి ఆలోచనలు స్నేహశీలతగలిగిన వారిగా మనం దీనిని ఏమైనా బాగు చేయగలమేమో చర్చించండి. ఆలోచించండి. కానీ ఈ లోగా ఫేస్బుక్ ని ఎందుకు తొలగించాలో ఇకపై రోజూ మాట్లాడుకుందాం.
అక్షరం సైతం చక్కటి హస్తవాసిగా గల వైద్యుడు డాక్టర్ విరించి విరివింటి.
తాను కవీ, రచయితా షార్ట్ ఫిల్మ్ మేకర్. ‘రెండో అధ్యాయానికి ముందుమాట’ తొలి కవితా సంపుటి.