యుగాల తరబడి నడిచిన యుద్ధం కాండను సిస్టమేటిక్ గా పరిశోధన చేసేందుకు కొందరు నడుము బిగించారు. ఒక్కమాటలో వారి పరిశోధనా సారం – యుద్ధాల చరిత్రంతా మనిషిలోని ‘యుద్ధ వ్యతిరేక శాంతి కాంక్ష’ను ఎలా అణగదొక్కాలి అనే అంశం మీదే నడవడం.
డాక్టర్ విరించి విరివింటి
యుద్ధం అనగానే యుద్ధ వీరుడు అనగానే మనకు ఎన్నో భావాలు మదిలో మెదులుతూ ఉంటాయి. యుద్ధం ఒక వీరోచితమైన పోరాటమనీ, యుద్ధవీరుడైన సైనికుడు దేశం కోసమే పోరాడతాడనీ, అతడు దేనికీ భయపడడనీ, మరణానికసలే భయపడడనీ…యుద్ధం రంగంలో శత్రువులను చీల్చి చెండాడుతాడనీ ఇత్యాదివి. ఇక మన సినిమాల్లో ఐతే సైనికుడు పర దేశ సైనికులను గురి చూసి కాల్చి చంపేస్తూ తన అస్త్ర శస్త్ర ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తూ, ఎందరో శత్రువులు ప్రాణాలను గాలిలో కలిపేస్తూ ఉంటాడనీ చూపిస్తూ ఉంటారు. ఐతే ఇవన్నీ సాధారణ మనుషులకు, అంటే సైనికులు కాని వారికి ఉండే అపోహలు మాత్రమే అనేది యుద్ధాల మీద యుద్ధ సైనికుల మీద పరిశోధనలు చేస్తున్న వారు చెబుతున్న అంశం.
ఒకవేళ యుద్ధమే కనుక వొస్తే “యుద్ధం ఆగిపోవాలనీ, శాంతి వెల్లి విరియాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తి – సైనికుడే!” అన్నది అసలైన సత్యం…ఎపుడూ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనని సాధారణ మనిషికి ఎప్పటికీ అర్థం కాని సత్యం ఇది!
Any books అని ఒక ఫ్రీ యాప్ ఉంది. అందులో చదివిందే Lt.Col. Dave Grossman రాసిన On Killing అనే పుస్తకం. ఈ వ్యాసం ఒకరకంగా దానికి ఒక ఇంట్రోడక్షన్ మాత్రమే. మిగతా సోర్సేస్ – Soldiers – John Keegan and Richard Holmes. Men against fire – SLA MARSHAL. Acts of War – Richard Holmes.
సమాజంలో మంచి “అందమైన ఆడమనిషిని ప్రేమించడమూ, దుష్టుడైన మగవాడిని చంపేయడమూ” గొప్ప మగతనంగా పరిగణించబడుతున్నపుడు ప్రేమ మీద, ప్రణయం మీద గొప్ప గొప్ప పరిశోధనలు చేసి గొప్ప విషయాలు కనుగొన్న మనిషి, మనుషులను చంపే విషయం లో కూడా ఎందుకు అంతగా పరిశోధనలు చేయలేదనే బాధ కొంతమందిని పీడించింది. అందుకే యుగాల తరబడి నడిచిన ఈ యుద్ధం కాండను సిస్టమేటిక్ గా పరిశోధన చేసేందుకు కొందరు నడుము బిగించారు. అందులో ముఖ్యుడు, ఒక రకంగా ఆద్యుడు అమెరికా ఆర్మీ బ్రిగేడియర్ జనరల్ SLA మార్షల్.
మనుషులను చంపడానికి తీవ్రమైన వ్యతిరేకత ప్రతి సైనికుడిలోనూ ఉంటుందట. ఆ వ్యతిరేకత ఎంత బలంగా ఉంటుందంట అంటే, దాన్నుంచి బయటపడే లోపలే వాళ్ళు యుద్ధంలో చనిపోతుంటారట. మార్షల్ చేసిన పరిశోధనలు యుద్ధానికి సంబంధించిన ఇంలాంటి అనేక కొత్త విషయాలను ప్రపంచానికి పరిచయం చేశాయి.
రెండవ ప్రపంచ యుద్ధం ముందు వరకూ ఉండే అవగాహన ఏమంటే, ఒక సగటు సైనికుడు దేశం కోసమే శత్రువులను చంపుతాడనీ, లేదా తమపై అధికారులిచ్చిన ఆర్డర్ల వలన చంపుతారనీ, తమ ప్రాణాలనూ, తమ తోటి సైనికుల ప్రాణాలను కాపాడటానికే శత్రువులను చంపుతారనీ, శత్రువును చంపే అవకాశం లేనప్పుడు తప్పించుకుని పారిపోతారనీ అనుకునేవారు. కానీ మార్షల్ చేసిన పరిశోధనలు యుద్ధానికి సంబంధించిన అనేక కొత్త విషయాలను ప్రపంచానికి పరిచయం చేశాయి. రెండవ ప్రపంచ యుద్ధానంతరం అతడు కొన్ని వేల మంది పదాతి దళ సైనికుల ఇంటర్వ్యూ లు తీసుకుని చంపడంలో మానవ ప్రవర్తనలోని విభిన్న కోణాలను ఆవిష్కరించాడు.
ముఖ్యంగా అతడు చెప్పిన అంశం ఏమంటే – ఒక వంద మంది సైనికులు తుపాకులతో చంపడానికి సిద్ధంగా నిలబడి ఉన్నప్పటికీ, “ఫైర్” అనే ఆర్డర్ వచ్చినప్పుడు కేవలం 15-20 శాతం సైనికులు మాత్రమే తూటాలు పేలుస్తుంటారని. మిగిలిన వారు తుపాకులు పక్కకు పెట్టి పక్కనున్న సైనికులకు తుపాకులను లోడ్ చేస్తూనో, గాయ పడితే కట్లు కడుతూనో ఉండిపోతారని తేలింది. ఎందుకు ఈ విధంగా సైనికులు ప్రవర్తిస్తున్నారు అని ఆరా తీస్తే స్పష్టంగా బయటపడిన అంశం ఏమంటే – మనుషులను చంపడానికి తీవ్రమైన వ్యతిరేకత ప్రతి సైనికుడిలోనూ ఉంటుందని. మనిషిని చంపడం పట్ల వ్యతిరేకత ఎంత బలంగా ఉంటుందంట అంటే, ఆ వ్యతిరేకత నుంచి బయటపడే లోపలే వాళ్ళు యుద్ధంలో చనిపోతుంటారట.
ఇంకాస్త లోతుగా పరిశీలిస్తే, మనుషులు సాటి మనుషులను చంపడానికి ఎందుకంతటి వ్యతిరేకతను కలిగి ఉంటారనే విషయం పరిశోధకులకు బోధపడింది. మన మెదడు అభివృద్ధి చెందిన విధానంలోనే దాని మూలాలు ఉన్నాయి అనే విషయం ఆసక్తికరమైనది కూడా!.
నియో కార్టెక్స్ అనబడే భాగం కొత్తగా అభివృద్ధి చెందింది. ఇది మనిషిని ఆలోచింపజేస్తుంది. అది ఎంత రేషనల్ గా ఆలోచించగలదో, అంతే ఉన్మాదంగా కూడా ఆలోచించేలా చేయగలదు.
జంతువులకు శత్రువులు అనేవి ఏంటి?! మనుషులకు శత్రువులు ఎవరు? అనేది మనం చూస్తే కొంత అవగాహన కలగవచ్చు. సాధారణంగా జంతువులకు శత్రువులు అంటే అదే జాతికి చెందక వేరే జాతికి చెందినవి మాత్రమే! అంటే పిల్లికి మరో పిల్లి శత్రువు కాదు! కుక్క శత్రువు కావచ్చు. అలాగే కుక్కకు, పులికి, సింహానికీ, పాములకూనూ. అంటే ఒక కుక్క మరో కుక్క పోట్లాడుకోవని కాదు… ఖచ్చితంగా పోట్లాడుకుంటాయి. కానీ ఆ పోట్లాట తన సొంత జాతి జంతువును చంపేంత ద్వేషంగా ఉండదు.
కోపం ఉండవచ్చు కానీ సొంత జాతి జంతువులను చంపవు. కానీ మనిషి అలా కాదు. మనిషికి శత్రువు మనిషే! వేరే మతమైనా, వేరే కులమైనా, వేరే దేశమైనా, సాటి మనిషిని, అంటే ఒకే మనుష్య జాతికి చెందిన వాణ్ణి చంపగలడు. సృష్టిలో ఇంత దుర్మార్గమైన జంతువు మరొకటి లేదు. ఎందుకిలాగా అంటే మనిషి మెదడులో – నియో కార్టెక్స్ అనబడే భాగం కొత్తగా అభివృద్ధి చెందింది. ఇది మనిషిని ఆలోచింపజేస్తుంది. అది ఎంత రేషనల్ గా ఆలోచించగలదో, అంతే ఉన్మాదంగా కూడా ఆలోచించేలా చేయగలదు. ఐతే దానిని ఒక రేషనల్ భావజాలంతో ట్రైన్ చేస్తున్నామా లేక ఒక ఉన్మాద భావజాలంతో ట్రైన్ చేస్తున్నామా అనే దాన్ని బట్టి ఆ మనిషి ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. ఐతే, జంతువులలో నియో కార్టెక్స్ ఉండదు. ఐతే మనిషి ఎమోషనల్ సెంటర్ నియో కార్టెక్స్ లో ఉండదు. అది లింబిక్ సిస్టం అని mid brain లో ఉంటుంది. ఒక్క మనిషి తప్ప సకల జంతువులు ఆరోగ్యకరమైన ఈ మిడ్ బ్రెయిన్ తో పని చేస్తుంటాయి. అంటే ప్రేమ ఆప్యాయత అభిమానం అనురాగం ఇత్యాదివన్నీ లింబిక్ సిస్టం ద్వారా మనిషి ప్రదర్శించగలుగుతాడు. అలాగే జంతువులూ ప్రదర్శించగలుగుతాయి. ఈ ఎమోషన్స్ ను పైనున్న నియో కార్టెక్స్ కంట్రోల్ చేయాలని అనుకుంటుంది. భాష ద్వారా, భావజాలం ద్వారా నియో కార్టెక్స్ తన ప్రభావాన్ని ఈ లింబిక్ సిస్టం మీద చూపించగలుగుతుంది. ఒక వ్యక్తిని చంపేయాలని లింబిక్ సిస్టం ఎప్పటికీ అనుకోదు. కానీ నియో కార్టెక్స్ లో నింపిన భావజాలం లింబిక్ సిస్టం లోని protective mechanism ని అణచివేసి, మనిషిని ఎమోషన్స్ లేని కరడుగట్టిన వ్యక్తిగా మారుస్తుంది. అంటే ప్రేమించడం, పంచుకోవడం మానవుని సహజ లక్షణాలైతే, ఒక systematic training ద్వారా, ఒక భావజాలాన్ని భాషతో నూరిపోయడం ద్వారా మనిషిలోని సహజ గుణాన్ని అణచివేసి అతడిని సాటి మనిషిని చంపేంతటి క్రూరుడిగా మార్చవచ్చు. అందుకే సైనికులు రెండవ ప్రపంచ యుద్ధంలో కంటే అత్యంత క్రూరంగా, భయంకరంగా వియత్నాం యుద్ధం లో ప్రవర్తించారని తేలింది. రెండవ ప్రపంచ యుద్ద కాలంలో సైనుకుల మెదడును conditioning చేసి శత్రువులపై ఉసిగొలిపేంత తెలివి ప్రపంచానికి ఇంకా అబ్బి ఉండలేదు. కానీ వియత్నాం యుద్ధం సమయానికి ఒక క్రమ పద్దతిగా సైనికులను క్రూరంగా మలచవచ్చునని వారి మెదడులను కండీషనింగ్ చేయవచ్చుననీ కనుగొన్నారు. దాని ఫలితంగా ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన, ఉన్మాదమైన సైనికుడి సృష్టి వియత్నాం యుద్ధంలోనే జరిగిందనేది ఆ యుద్ధాన్ని కనులారా చూసినవారు చెబుతారు.
ఎంతటి శత్రువైనా అవతలివాడు కూడా నాలాగా మనిషే అని అనుకునే హక్కు తుపాకిని కావాలానే తప్పుగా పేల్చే హక్కు సైనికుడికి ఉంటుంది. ఐతే మనిషికి ఉండే ఈ హక్కులనూ, సాటి మనిషి జీవితం పట్ల ఉండే స్పృహనూ అధిగమించడమే ప్రస్తుత యుద్ధోన్మాద దేశాల యుద్ధ వ్యాపార తంత్రం.
మనిషి mid brain అతడిలోని క్రూరత్వాన్ని inhibit చేస్తుంది. అంటే ఇది ఒక ఇమ్యూన్ సిస్టం లాంటిది. ఏ మనిషిలో ఐతే ఇమ్యూనిటీ తగ్గుతుందో అతడిలో రకరకాల వ్యాధులు ప్రబలుతాయి. సరిగా తినకపోతే ఇమ్యునిటీ పవర్ తగ్గుతుంది. అలాగే HIV అనే వైరస్ సోకినా ఇమ్యునిటీ తగ్గుతుంది. దీనిని మనం Acquired Immuno Deficiency syndrome (AIDS) అని అంటున్నాం. అదే విధంగా మనిషిలో mid brain లోని inhibition ని కూడా తగ్గించవచ్చు. దీనిని ACQUIRED VIOLENCE IMMUNO DEFICIENCY SYNDROME (AVIDS) అంటున్నారు. సైకోపథ్ లకూ తీవ్రవాదులకూ ఈ మిడ్ బ్రెయిన్ అహింసాత్మకత లోపించి ఉంటుంది. సైనికులలో ట్రెయినింగ్ ద్వారా , నియో కార్టెక్స్ ని కండీషనింగ్ చేయడం ద్వారా మిడ్ బ్రెయిన్ అహింసాత్మకతను తగ్గించడం జరుగుతుంది. యుద్ధాల చరిత్రంతా ఏ విధంగా మనిషిలోని యుద్ధ వ్యతిరేక శాంతి కాంక్షను అణగదొక్కాలి అనే అంశం మీదే నడిచిందని అర్థమవుతుంది.
అంతేకాకుండా, మారుతున్న యుద్ధ రీతులు సైనికులను ఎదురెదురుగా నిలవనీయవు. పదాతి దళ సైనిక వ్యవస్థ తగ్గిపోవడం, air bombing వ్యవస్థలు పెరగడం వలన సైనికులు శత్రు సైనికులను face to face ఎదుర్కునే అవకాశం ఉండదు. కాబట్టి పైనుంచి బాంబు కిందికి వదిలి దూసుకుపోవడమే తప్ప ఆ బాంబు వలన తోటి మానవులు చనిపోతున్నారనే స్పృహ కలగనీయని పరిస్థితులు యుద్ధ రీతుల్లోకి వచ్చేశాయి.
ప్రపంచాన్ని జయించాడని మనం చెప్పుకుంటున్న అలెగ్జాండర్ కత్తి యుద్ధంలో తాను కోల్పోయిన సైన్యం కేవలం ఏడువందలు అంటే నమ్మశక్యం కాదు గానీ అది వాస్తవం.
ప్రపంచాన్ని జయించాడని మనం చెప్పుకుంటున్న అలెగ్జాండర్ కత్తి యుద్ధంలో తాను కోల్పోయిన సైన్యం కేవలం ఏడువందలు అంటే నమ్మశక్యం కాదు గానీ అది వాస్తవం. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు కాలంలో సైనిక వ్యవస్థ ముఖ్యంగా పదాతి దళంగానే ఉండేది. Soft bore musket లలో తూటాలు లోడ్ చేసి పేల్చే వారు. అవి టార్గెట్ ను హిట్ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి. 250 రౌండ్లు కాల్పులు జరిపితే ఒక్క సైనికుడికి తగిలేదట. అంటే వాటితో టార్గెట్ ని గురి చూసి కాల్చడం అంత కష్టమైన విషయం. అంతేకాకుండా పై అధికారులు Fire అని ఆర్డర్ ఇచ్చినప్పుడు నూటికి తొంభై శాతం మంది సైనికులు శత్రువులకేసి గురిపెట్టకుండా ఆకాశంలోకి కాలుస్తూ ఉంటారట. ఇంకో మనిషిని చంపడం ఇష్టం లేకే ఇలా చేసేవారని పరిశోధనలో తేలింది. Target ని హిట్ చేయమని కమాండ్ వచ్చినప్పుడు అదే టార్గెట్ ని intensionally లేదా instinctively మిస్ చేయడమన్నది సైనికుడి ప్రాథమిక హక్కు. ఎంతటి శత్రువైనా అవతలివాడు కూడా నాలాగా మనిషే అని అనుకునే హక్కు తుపాకిని కావాలానే తప్పుగా పేల్చే హక్కు సైనికుడికి ఉంటుంది. ఐతే మనిషికి ఉండే ఈ హక్కులనూ, సాటి మనిషి జీవితం పట్ల ఉండే స్పృహనూ అధిగమించడమే ప్రస్తుత యుద్ధోన్మాద దేశాల యుద్ధ వ్యాపార తంత్రం.
డాక్టర్ విరించి విరివింటి సామాజిక సమస్యలపై స్పందించే కవీ, రచయితా షార్ట్ ఫిల్మ్ మేకర్. మీదు మిక్కిలి చక్కటి హస్తవాసి గల వైద్యులు. ‘రెండో అధ్యాయానికి ముందుమాట’ వారి తొలి కవితా సంపుటి.