Editorial

Monday, December 23, 2024
ఆరోగ్యం'కరోనా' వల్లనే గుండె పోట్లా...: Misinformation పై డాక్టర్ విరించి విరివింటి సమాధానం

‘కరోనా’ వల్లనే గుండె పోట్లా…: Misinformation పై డాక్టర్ విరించి విరివింటి సమాధానం

ఈ ఉదయం ఎపి ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గారు గుండెపోటుతో మరణించిన నేపథ్యంలో వారి మరణానికి కారణం పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ అని, వారు క్రమం తప్పక వ్యాయామం చేసినప్పటికీ ఇలా మృతి చెందడం ఏమిటనీ అనేక టివి కథనాలు చూస్తూన్నాం. ఈ నేపథ్యంలో మనం క్యారీ అవుతున్న మిస్ ఇన్ఫర్మేషన్ పై ఈ కథనం ఎన్నో విషయాలు తెలుపు. కరోనా వలన గుండె జబ్బులు వస్తున్నాయని, సడెన్ గా చనిపోతున్నారనే అభిప్రాయాల్లోని నిజమెంతో వివరించు.

డాక్టర్ విరించి విరివింటి

ఇది చాలా ముఖ్యమైన అంశం. కనుక జాగ్రత్తగా చదవగలరని మనవి.

కరోనా వలన గుండె జబ్బులు వచ్చేస్తున్నాయనీ, లేదా వాక్సిన్ల వలన సడెన్ గా చనిపోతున్నారనీ మిత్రులు నాకు పంపి “నిజమేనా?” అని అడుగుతున్నారు.

కరోనా తర్వాత… వాక్సినేషన్ తర్వాత నిజంగానే హార్ట్ అటాక్స్ అలాగే సడన్ కార్డియాక్ డెత్స్ పెరిగాయి లేదా పెరిగినట్టు కనిపిస్తున్నాయి. దానికి కారణాలు ఎన్నో …కానీ కరోనా గానీ వాక్సిన్ కానీ ఎంతమాత్రం కాదు. ఆ వివరాలేమిటో పరిశీలిద్దాం….

గుండె గుండెకీ తెలియాలి

1. కరోనా ఇన్ఫెక్షన్ల అక్యూట్ దశలో అంటే కరోనా వచ్చిన మొదటి పది పదిహేను రోజుల్లో కొందరిలో గుండె కండరానికి కూడా ఇన్ఫెక్షన్ పాకుతుంది. కరోనా న్యూమోనియాతో పోలిస్తే అదేమీ ప్రాణాంతకం కాదు. కరోనా న్యూమోనియా తగ్గిపోతే ఈ గుండె కండరం ఇన్ఫెక్షన్ కూడా తగ్గిపోతుంది. అంతే తప్ప కరోనా తగ్గాక కూడా రోజుల తరబడి నెలల తరబడి ఉండదు.

2. కరోనా అక్యూట్ దశలో కొందరిలో రక్తం గడ్డకడుతుంది. ఈ రక్తపు గడ్డలను శరీరం స్వయంగా శుభ్రం చేసుకోగలదు. ఇచ్చే మందులు కూడా ఈ శుభ్రప్రక్రియలో పాల్గొంటాయి. ఒకసారి ఈ అక్యూట్ దశ దాటాక మళ్ళీ ఏ క్లాట్సూ ఏర్పడవు. ఒక్కోసారి సకాలంలో ట్రీట్మెంట్ దొరకకపోతే ఈ కలాట్స్ వలన హార్ట్ అటాక్స్ లేదా పారలసిస్ లు వచ్చే అవకాశం ఉంటుంది.

అంటే …ఒకసారి కనుక కరోనా ఇన్ఫెక్షన్ అక్యూట్ దశ దాటామంటే గుండె కండరం ఇన్ఫెక్షన్ కానీ క్లాట్స్ వలన వచ్చే హార్ట్ అటాక్స్ కానీ వచ్చే అవకాశం దాదాపు తగ్గిపోయినట్లే. అర్థమైంది కదా…ఐతే కరోనా అక్యూట్ దశ ఎంతకాలం ఉంటుందో తెలియదు కాబట్టి కరోనా వచ్చి తగ్గిన తర్వాత కొంతకాలం పాటు..అంటే ఒక ఆరునెలల పాటు డాక్టర్ ని కలుస్తూ ఉండాలని మొదటి నుండీ చెబుతూనే ఉన్నాం.

ముఖ్యంగా హోం క్వారెంటైన్ లో తగ్గినవారు కాక, హాస్పిటల్ లో ఎక్కువ కాలం పాటు కరోనా ట్రీట్మెంట్ తీసుకుని బయటపడినవారు తప్పకుండా డాక్టర్లను తరచూ కలవడం అవసరం. మరీ ఎక్కువ కాలం అవసరం లేదు. ఓ ఆరునెలలు చాలు. తరచూ అంటే రోజూ కాదు. కనీసం నెలకొకసారి.

కొంతకాలం తర్వాత?

కరోనా నుండి బయటపడినవారికీ వాక్సిన్ తీసుకున్న వారూ “కొంతకాలం తరువాత” సడెన్ గా చనిపోతున్నారు అనడంలో నిజమెంత?. పరిశీలిద్దాం.

పైన చెప్పినట్టు “కొంతకాలం తర్వాత” వచ్చే ఏ హృద్రోగ సంబంధ సమస్యైనా కరోనా వలన లేదా వాక్సిన్ వలన కాదు. వాటి కారణాలు వేరే.

1. కరోనా రాకముందు కూడా మనదేశంలో 2000 వ. సంవత్సరం నుంచి హృద్రోగ సమస్యల బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అమెరికా యూరప్ లకంటే ఇండియన్స్ కి హృద్రోగ సమస్యలు ఎక్కువగా ఉండటానికి కారణం మన జన్యువులు. ఆసియా దేశాలలో కూడా ఇండియాలోనే హృద్రోగ సమస్యలు ఎక్కువ.

2. పెరుగుతున్న యాంత్రిక జీవనశైలి, తరుగుతున్న మానవ సంబంధాలు, మారుతున్న ఆహార పద్ధతులు,శారీరక శ్రమ తగ్గిపోవడం వంటి కారణాలవలన కూడా 2000వ. సంవత్సరం నుండి మనదేశంలో ఈ సమస్యలు ఎక్కువగా అయ్యాయి.

3. ప్రతి నాలుగు హార్ట్ అటాక్స్ లో లేదా సడన్ కార్డియాక్ డెత్ లలో ఒకరు చిన్న వయసు వారు (40yrs లోపు)ఉండటం 2000వ.సంవత్సరం నుండి మొదలైంది. కాబట్టి ఇది కరోనా త‌ర్వాత వచ్చిన స్థితికాదు. 2000వ. సం. నుండి ఉన్న స్థితి.

4. ఇపుడు కరోనా తర్వాత ఎవరు చనిపోయినా తెలుసుకోగలిగిన యాక్సెస్ పెరగడం వలన ఎక్కువ మరణాలను మనం తెలుసుకోగలుగుతున్నాం. దానికి వాక్సినే కారణమని అనుకుంటున్నాం. (Blanket vaccination) అంతే.

జిమ్ లలో గంటలు గంటలు వర్కప్ లు చేయడం పెరిగింది. లావుగా ఉండటం సకల రోగాలకూ కారణమని అనవసరంగా ప్రజలలో భయాలను పెంచేవారు ఎక్కువయ్యారు. అర్జెంట్ గా లావు తగ్గాలని చిత్ర విచిత్రమైన వ్యాయామాలు అతిగా చేయడం మొదలైంది. ఇవి సడెన్ కార్డియాక్ డెత్ లలో ప్రధాన కారణాలవడం కొత్త సమస్య.

5. గుండె జబ్బుల నిర్థారణ విషయంలో నూటికి యాభై శాతం పైన ఇంకా పూర్తి జబ్బు రాకముందే పరీక్షల ద్వారా జరుగుతుంటుంది. గుండె జబ్బు రాకముందే నిర్థారించగల పరీక్షలు ఏమిటి?. ECG, 2D ECHO, TMT, ANGIOGRAM వంటివి గతంలో జనరల్ టెస్టులలో భాగంగా నిరంతరం చేయబడుతుండేవి. గుండె జబ్బులు వచ్చేకంటేముందే జరిగే ఈ నిర్థారణ పరీక్షలు ఎంతోమందిని ప్రాణాపాయం నుండి కాపాడేవి. ఐతే కరోనా వచ్చాక లాక్డౌన్ల వలన, ఆస్పత్రులంటే భయంవలన ఈ నిర్ధారణ పరీక్షలు గత రెండు సంవత్సరాలుగా సరిగ్గా జరగకపోవడంతో చాలామందిలో ఇవి బయటపడక దాక్కుని ఉండటం వలన ఇపుడు బయటపడటం మొదలైంది.

6 . కరోనా సమయంలో చాలామంది ఎన్నో అపోహలకు లోనవడం చిత్ర విచిత్రమైన సొంత వైద్యాలు చేసుకోవడం కనిపించింది. ఇవి శరీరాలపై చూపే దీర్ఘకాలిక ప్రభావాలు ఎవరికీ తెలియదు. డాక్టర్ల మాట వినే పరిస్థితి లేదు. వాటిని వదిలేసి కరోనా న్యూమోనియా నుండి కాపాడే వాక్సిన్ పై అపోహలు పెంచుకోవడం జరిగింది. వాక్సిన్ పనిచేస్తే కరోనాకి యాంటీబాడీలు తయారౌతాయి. పని చేయకపోతే యాంటీబాడీలు తయారు కావు. అంతే తప్ప అవి వ్యక్తుల ప్రాణాలను హరించేస్తాయి అని ప్రచారం చేయడం ఎంత ప్రమాదకరమో, అసలు కారణాలను ఎలా మరుగున పరుస్తుందో చూడండి.

7. కరోనా వలన టీవీ వార్తలల్లో చూపిస్తున్న మరణాల వలన తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. చెబితే మీరు నమ్మరు కానీ రోజూ కరోనా యాంక్జైటీ పేషంట్లను చూస్తున్నాం. విపరీతంగా భయపడిన ఒక మిత్రుడు రెండు సంవత్సరాలుగా ఇంటిలో నుండిబయట అడుగుకూడా పెట్టలేదు. ఒంటరితనం, భవిష్యత్తు పై కోల్పోయిన నమ్మకాలు వారిలో తీవ్రమైన ఒత్తిడి కి లోను చేస్తున్నాయి. ఇవి గుండె జబ్బులకు దారితీస్తాయి. కాబట్టి కరోనా విషయంలో జాగ్రత్తలు ఎంత అవసరమో అర్థంపర్థంలేని అపోహలతో జీవితాన్ని భయమయం చేసుకోకుండా అందులోంచి బయటపడటం అంతే అవసరం.

నిజంగా గుండె నొప్పి వచ్చినపుడు ఏదీ హెల్ప్ చేయదు. మీరు సకాలంలో స్పందించకుండా ఉండేందుకు ఎంతో మిస్ ఇన్ఫర్మేషన్ మిమ్మల్ని అడ్డుకుంటుంది. దాని మూల్యం ప్రాణమే.

8. physical exercise రెండు రకాల రూపాల్ని తీసుకుంది. అసలు ఎలాంటి వ్యాయామం చేయని స్థితి ఒకటైతే విపరీతమైన వ్యాయామం చేసే స్థితి మరొకటి. జిమ్ లలో గంటలు గంటలు వర్కప్ లు చేయడం పెరిగింది. లావుగా ఉండటం సకల రోగాలకూ కారణమని అనవసరంగా ప్రజలలో భయాలను పెంచేవారు ఎక్కువయ్యారు. అర్జెంట్ గా లావు తగ్గాలని చిత్ర విచిత్రమైన వ్యాయామాలు అతిగా చేయడం మొదలైంది. ఇవి సడెన్ కార్డియాక్ డెత్ లలో ప్రధాన కారణాలవడం కొత్త సమస్య. గుండె సమస్యలు రాకుండా ఉండేందుకు రోజుకు నలభై ఐదు నిముషాల వ్యాయామం వారానికి ఐదురోజులు చేయగలిగితే చాలు. కానీ ఈ సమయం గంటలకు పెరిగింది. ఓవర్ ఎక్సర్సైజ్ చేయడం వీరత్వమయింది.

9. సడెన్ కార్డియాక్ డెత్ కారణాలలో గుండె నిర్మాణ లోపాలు కూడా ఉంటాయి. చిన్న వయసువారిలో సడెన్ కార్డియాక్ డెత్ లకు సింహభాగం కారణం గుండె నిర్మాణంలోని లోపాలే తప్ప మరోకారణం దాదాపుగా ఉండదు. అంటే వీరిలో డయాబెటిస్ బీపీ వంటివి లేకున్నా చనిపోతుంటారు. ఐతే ఇవన్నీ గతంలో కూడా ఉన్నాయి. కానీ హాస్పిటల్స్ లో డయాగ్నాసిస్ అయ్యేవి. కరోనా ఇటువంటి వారినందరినీ డాక్టర్లకు దూరం చేసింది.

10. కుటుంబాలలోసాగే కొలెస్ట్రాల్ జన్యు సమస్యలు ఇప్పటికీ సకాలంలో నిర్థారణ కావడం లేదు. ఏవో విటమిన్లు వాడితే గుండెనొప్పి రాదనే భ్రమలో చాలామంది సకాలంలో డాక్టర్ల దగ్గరికి పోవడం లేదు. సిగరెట్ స్మోకింగ్, సెడెంటరీ లైఫ్ స్టైల్ వంటి మార్చుకోతగిన రిస్క్ ఫ్యాక్టర్స్ మీద చాలామందికి అవగాహన శూన్యం. పైగా ఫేక్ ప్రవచనకారులు అందరూ వైద్యావతారాలు ఎత్తి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్నారు.

9. Precipitating factors అంటాం. అంటే కనబడకుండాదాక్కుని ఉన్న జబ్బులను ఏవో కొన్ని అంశాలు బయటపడేటట్లు చేస్తాయి. పైన చెప్పిన ఎన్నో అంశాలు లోపల దాగివున్న జబ్బుని సడెన్ గా బయటపడేలా చేయడంతో తేరుకునే లోపలే ప్రాణాల్ని తీసేస్తుంటాయి. అందుకే వీటిపై అవగాహన పెరగాలి. వేరే దారి లేదు. నా వాల్ మీద చాలా సమాచారం రాసి పెట్టాను. వాటిని చదువుకున్న వారు ప్రాణాలు కాపాడుకున్నామని సకాలంలో ఈ ఇన్ఫర్మేషన్ మాకు ఉపయోగపడిందని చెబుతున్నవారు ఉన్నారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే నిజంగా గుండె నొప్పి వచ్చినపుడు ఏదీ హెల్ప్ చేయదు. మీరు సకాలంలో స్పందించకుండా ఉండేందుకు ఎంతో మిస్ ఇన్ఫర్మేషన్ మిమ్మల్ని అడ్డుకుంటుంది. దాని మూల్యం ప్రాణమే.

డాక్టర్ విరించి విరివింటి సామాజిక సమస్యలపై స్పందించే కవీ, రచయితా షార్ట్ ఫిల్మ్ మేకర్. మీదు మిక్కిలి చక్కటి హస్తవాసి గల వైద్యులు. ‘రెండో అధ్యాయానికి ముందుమాట’ వారి తొలి కవితా సంపుటి.  అర్జంటు ఐతే వారిని నేరుగా ఈ నంబర్ ద్వారా సంప్రదించవచ్చు : +91 99486 16191

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article