Editorial

Wednesday, January 22, 2025
వ్యాసాలుపూల బతుకమ్మ పండుగ - డా. రావి ప్రేమలత

పూల బతుకమ్మ పండుగ – డా. రావి ప్రేమలత

Painting by Sri Thota Vaikuntam

వెనుకట బతుకమ్మ పండుగ ఆడపిల్లలకు విద్యాపీఠంగా ఉండేది. పండుగ వల్ల ఆచార సంప్రదాయాలు తెలిసేవి. సంగీతం, సాహిత్యం, నృత్య కళలతో పరిజ్ఞానం ఏర్పడేది. బాల్య వివాహాలు చేసుకొని అత్తింటికి వెళ్ళే ఆడపిల్లలకు బతుకమ్మ పాటలు అత్తింట్లో మెలగవలసిన పద్ధతులను బోధించేవి. వారికి అనుభవ పాఠాలుగా, జీవితాలకు మార్గదర్శకాలుగా, విజ్ఞాన వాహికలుగా ఉండేవి.

డా.రావి ప్రేమలత

నవరాత్రుల సమయంలో భీకర స్వరూపిణి దేవిని తెలంగాణలో అందమైన సుకుమారమైన పూలరూపంలో పూజిస్తారు. పాటలు పాడుతూ, ఆడుతూ ఆమెను ఆరాధిస్తారు. బతుకమ్మ పండుగ దక్షిణాయనంలో పెత్రమాస నుండి మొదలై మహర్నవరాత్రి వరకు జరుగుతుంది. దక్షిణాయనాన్ని స్త్రీ తత్వానికి, స్త్రీ శక్తికి ప్రతిరూపంగా భావిస్తారు. ఈ కాలంలో వచ్చే పండుగ లెక్కువగా శక్తి స్వరూపిణి అయిన దేవికి సంబంధించే ఉంటాయి. ప్రతి నెలలో దీనికి సంబంధించిన ఏదో ఒక పండుగ కానీ, జాతర కానీ జరుగుతుంటాయి.

దుర్గాదేవి, లక్ష్మీదేవి, సరస్వతి. ఈ ముగ్గురు మూర్తుల ఏకరూపంగా పూలతో బతుకమ్మను పేర్చి పూజిస్తారు తెలంగాణ స్త్రీలు.

పెత్రమాస లేదా మహాలయ అమావాస్య మరుసటిరోజు నుండే నవరావూతుల ఉత్సవాలు, దేవీ పూజలు మొదలవుతాయి. మొదటి మూడు రోజులు దుర్గాదేవి లేదా కాళికాదేవికి, తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవికి, చివరి మూడు రోజులు సరస్వతికి చెందినవని అంటారు. ఈ ముగ్గురు మూర్తుల ఏకరూపంగా పూలతో బతుకమ్మను పేర్చి పూజిస్తారు తెలంగాణ స్త్రీలు. బతుకమ్మ నిండైన బతుకునే కాకుండా గౌరీదేవిగా సౌభాగ్యాన్ని, లక్ష్మీదేవిగా సంపదనూ, సరస్వతీ దేవిగా చదువునూ ప్రసాదిస్తుందని స్త్రీల నమ్మకం.

బతుకమ్మ గాథలు

బతుకమ్మ దేవత గురించి, బతుకమ్మ పుట్టు పూర్వోత్తరాల గురించి అనేక గాథలు తెలంగాణలో చెప్పుకుంటారు.

1. చోళరాజు దంపతులైన ధర్మాంగన, సత్యవతిలకు నూరుమంది కొడుకులున్నా వాళ్ళందరు యుద్ధంలో చనిపోతారు. దుఃఖంలో ఆ దంపతులు మళ్ళీ సంతానం కావాలని లక్ష్మీదేవి కోసం తపస్సు చేస్తారు. వారి తపస్సుకు మెచ్చి లక్ష్మీదేవి ప్రత్యక్షమై ‘ఏం వరం కావాలని’ అడుగగా ఆమెను తమ బిడ్డగా పుట్టమని కోరుకుంటారు. ‘తథాస్తు’ అని వారి బిడ్డగా పుట్టగానే అత్రి, వసిష్ట మహామునులు వచ్చి ‘బతుకమ్మ’ అని ఆశీర్వదిస్తారు. లక్ష్మీదేవి బతుకమ్మగానే పెరిగి పెద్దదయి చక్రాంకుడనే పేరుతో మారువేషంలో వచ్చిన విష్ణుమూర్తిని పెళ్ళి చేసుకొంటుంది. అనేకమందికి సంతానం, సిరి సంపదలను ప్రసాదిస్తూ, అనేక వేల ఏండ్లు వెలుగొంది ‘బతుకమ్మ’గా పూజలందుకుంటుంది.

2. మరొక కథలో మహిషాసురునితో యుద్ధం చేసి, అతణ్ణి చంపి అలసిపోయిన దేవి స్పృహ కోల్పోతుంది. ఆమె ప్రాణాలను కోల్పోతుందేమోనని స్త్రీలందరూ దేవిని ‘బతుకమ్మ, బతుకమ్మ’ అని ప్రార్థించగా శుద్ధ పాడ్యమి నాడు స్పృహ కోల్పోయిన దేవి దశమి రోజున స్పృహలోకి వస్తుంది. నాటి నుండే దేవిని బతుకమ్మగా తొమ్మిది రోజులు పాటల్లో కీర్తిస్తూ పండుగ జరుపుకుంటున్నారు.

3. బతుకమ్మను పేర్చడంలో తంగేడు పూలను వాడటానికి గల కారణాన్ని కూడ కథగా చెప్పుకుంటారు. వెనుకట ఒక చెల్లెలు అన్న యింటికి వస్తుంది. ఆమె రావడానికి ముందే పనిమీద వేరే ఊరికి వెళ్తాడు అన్న. చెల్లెలు అన్న వచ్చేవరకు ఉందామనుకుంటుంది. తెల్లవారి వదినతో కలిసి చెరువుకు స్నానానికి వెళ్తుంది. చెరువు ఒడ్డున పెట్టిన ఇద్దరి చీరెలు కలిసిపోతాయి. ఒకరి చీరను మరొకరు కట్టుకుంటారు. దాంతో ఇద్దరూ మాటామాటా అనుకుంటారు. వదిన కోపంతో ఆ మరదల్ని (చెప్లూలు) చెరువులోకి తోసేసి వెళ్ళిపోతుంది. అదే రాత్రి చెల్లెలు తన భర్త కలలో కనిపించి వదిన తనను చెరువులో పడివేసిందని చెప్పుతుంది. భర్త చెరువు దగ్గరకు రాగా అక్కడ పచ్చని పూలతో ‘తంగెడు చెట్టు’ కన్పిస్తుంది. దాని దగ్గరకు వెళ్ళగానే ‘పాపకారి వదిన నీళ్ళల్లో నూకేసింది, చెట్టయి మొలిచాను. తంగెడు పూలై పూచాను’- అంటూ ప్రతేడు తంగేడు పూలతో బతుకమ్మను పేర్చి చెరువులో వెయ్యమంటుంది. భర్త అదే విధంగా చేస్తాడు. ఆనాటి నుండే తంగెడు పూలతో బతుకమ్మను పేర్చడం ఆచారమయ్యింది.

4. కుండలిలోని చక్రోపాసనమే సామాన్య స్త్రీలకు బతుకమ్మ ఆరాధనగా మారి ఉండవచ్చని ఒక అభిప్రాయముంది. కుండలిని ఏడుచక్షికాల సమ్మేళనం అని, మూలాధారం, స్వాధిష్ఠానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధ, ఆజ్ఞా, సహవూసారం- ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క అధిష్టాన దేవతను ప్రతిష్టించి వారికి ఒక్కొక్క పండుగను ఏర్పరిచారు. అవి వినాయక చవితి, దుర్గాష్టమి, విజయదశమి, నాగులచవితి, దీపావళి, సంక్రాంతి, రథసప్తమి. ఈ పండుగలన్నీ కుండలిని చక్రాలకు సంబంధించిన పండుగలే. కుండలిని చక్రాల్లో నాలుగదైన ‘అనాహత చక్రానికి’ శక్తి దేవత అయిన దుర్గాదేవి అధిష్టాన దేవత. నవరావూతుల్లో విజయదశమికి దుర్గాదేవిని పూజించడం సంప్రదాయంగా ఏర్పడింది. అనాహత చక్రోపాసననే, శక్తి ఆరాధననే బతుకమ్మ పండుగగా రూపాంతరం చెంది ఉండవచ్చు. గౌరీదేవిని బతుకమ్మలో నిలిపి ఆమెను పూజించడం చక్రోసాసనలోని అంతరార్థంతో సరిపోతుంది.

5. బతుకమ్మ ఆరాధనకు మరొక కథను కూడా చెప్పుతుంటారు. వెనుకట ఎప్పుడో వర్షాలు లేక దుర్బిక్షమేర్పడి భరించరాని కరువు వచ్చిందని, తిండి లేక వేలమంది చనిపోయారని, చనిపోగా మిగిలిన వారు తమనైనా బతకన్విమని బతుకమ్మ దేవతను ప్రతిష్టించి వేడుకున్నారని, ఆ దేవత దయతో వారందరు బతికారని, వర్షాలు కురిసి పంటలు పండాయని అప్పటి నుండే ‘బతుకమ్మ’ దేవతను పూజించి పండుగ చేసుకునే సంప్రదాయం వచ్చిందనీ అంటారు.

– ఈ కథలూ, అభివూపాయాలు ఎలా ఉన్నా బతుకమ్మ పండుగను చేసుకునే సంప్రదాయం ఎప్పటినుండి వస్తుందనే ప్రశ్నకు చారిత్రాకంగా సరైన సమాధానం దొరకడం లేదు. ఆరుద్ర మాత్రం కాకతీయుల యుగంలో రెడ్డి రాజుల కాలంలో బతుకమ్మ పండుగను చేసుకునే వారని తెలిపారు. అంటే కాకతీయ యుగం కంటే ముందే బతుకమ్మ పండుగను జరుపుకునే సంప్రదాయముండేదని ఊహించవచ్చు.

పూల ప్రాధాన్యం

రకరకాల పూలతో బతుకమ్మను పేర్చడంలోనే తెలంగాణ స్త్రీల కళా నైపుణ్యం వ్యక్తమవుతుంది. బతుకమ్మను పేర్చే పూలలో తంగెడు పూలే ఎక్కువగా ఉంటాయి. తంగెడు పూలకు నీటిని శుభ్రపరిచే గుణం ఉంది. భాద్రపద మాసంలో వర్షాల వల్ల బురదనీరు, మురికినీరు చెరువుల్లో, కాల్వల్లో, వాగుల్లో చేరుతాయి.

బతుకమ్మలను నిమజ్జనం చేసినప్పుడు తంగెడు పూలతో నీళ్ళు శుభ్రమవుతాయని అంటారు.

వీటిలో తంగెడు పూలతో ఉన్న బతుకమ్మలను నిమజ్జనం చేసినప్పుడు తంగెడు పూలతో నీళ్ళు శుభ్రమవుతాయని అంటారు. ఇత్తడి పళ్ళెంలో గుమ్మడి ఆకును పరచి తంగెడు, గునుగు, ముత్యాల, గన్నేరు, రుద్రాక్ష, బీర పువ్వులను వరుసగా, గుండ్రంగా శిఖరాకారంలో పేరుస్తారు. శిఖరంపైన గుమ్మడి పూవును అలంకరిస్తారు. పసుపుతో గౌరమ్మను చేసి బతుకమ్మపైన అమరుస్తారు. బతుకమ్మను పేర్చడంలో తంగెడు పూలతో పాటు గుమ్మడికి కూడ ప్రాధాన్యం ఉంది. దేవికి ‘కూష్మాండి దేవి’ అనే పేరు కూడా ఉంది. అందుకే కూష్మాండపు (గుమ్మడి) ఆకులతో, పూవులతో బతుకమ్మను పేరుస్తారు.

బతుకమ్మ ఆట లాస్యనృత్యమే

ఉదయం పేర్చిన బతుకమ్మలను సాయంకాలం ఇళ్ళముందు ఉంచి వాటి చుట్టూ ఆడి, తర్వాత ఊళ్ళోని బతుకమ్మలన్నింటిని చెరువుగట్టు పైన గానీ, ఊరి మధ్యలోగానీ పెట్టి స్త్రీలందరూ వాటి చుట్టూరా తిరుగుతూ కొంచెం వంగి చేతులు తట్టుతూ ఒకరు పాటను చెపుతుంటే మిగిలిన వారు పాడుతుంటారు.

మధురమైన గేయాలతో ఉయ్యాలో, వలలో, చందమామ వంటి పల్లవులతో, చప్పట్లనే తాళాలతో ఆడే బతుకమ్మ ఆట లాస్యనృత్యమే.

స్త్రీల అడుగుల కదలిక, అడుగులకు అనుగుణమైన పాట, వీటిని అనుసరిస్తూ చప్పట్లు బతుకమ్మ ఆటను అందంగా తీర్చిదిద్దుతాయి. స్త్రీలు ఒకే రీతి కంఠస్వరంతో తమ తమ జీవితాల్లోని అనుభవాలను, అనుభూతులను, పౌరాణిక కథలనూ, నాయకుల చరివూతలను, తాము కన్న, విన్న సంఘటనలను పాటల్లో వర్ణిస్తుంటారు.

మధురమైన గేయాలతో ఉయ్యాలో, వలలో, చందమామ వంటి పల్లవులతో, చప్పట్లనే తాళాలతో ఆడే బతుకమ్మ ఆట లాస్యనృత్యమే. లాస్య నృత్యాన్ని ఆరంభించిన పార్వతీ దేవి మరో రూపమే బతుకమ్మ. ఆమె పండుగే బతుకమ్మ పండుగ.

బతుకమ్మను పోలిన పండుగలు-నృత్యాలు

బతుకమ్మ ఆట పండుగ తెలంగాణకే ప్రత్యేకమైనా పండుగ సందర్భాల్లో స్త్రీలు గుండ్రంగా తిరుగుతూ నాట్యం చేయడం ఇతర ప్రాంతాల్లో కూడా కన్పిస్తుంది. ఆంధ్ర ప్రాంతంలోని ‘గొబ్బి నృత్యం’ v తమిళదేశంలోని ‘కుమ్మ’ బతుకమ్మ ఆటను పోలి ఉంటాయి. మలయాళ స్త్రీలు ‘ఓనం’ పండుగకు పూలను వలయాకారంలో అలంకరించి చుట్టూరా తిరుగుతూ పాటలు పాడుతుంటారు. గుజరాత్‌లోని స్త్రీల గర్బా నృత్యం v రాజస్థాన్‌లోని గంగోర్ నృత్యం బతుకమ్మ ఆట మాదిరే ఉంటాయి. గుజరాత్ స్త్రీలు నవరావూతుల సమయంలో గర్భిని (కుండను) ఇంట్లోనే అలంకరించి ఇంటి ఇంటికీ తిప్పుతూ బతుకమ్మ పండుగలో మాదిరి ఒకే దగ్గర పెట్టి వాటి చుట్టూరా తిరుగుతూ, చేతులు తడుతూ, పాటలు పాడుతూ నృత్యం చేస్తారు v రాజస్థాన్‌లో స్త్రీలు పార్వతీదేవి బొమ్మను మట్టితో చేసి, పూలతో అలంకరించి దాని చుట్టూరా అడుగులు వేస్తూ పాటలు పాడుతారు. తర్వాత గౌరీదేవిని పూలతో పాటు నీటిలో నిమజ్జనం చేస్తారు.

బతుకమ్మ ఒక విద్యాపీఠం

వెనుకట బతుకమ్మ పండుగ ఆడపిల్లలకు విద్యాపీఠంగా ఉండేది. పండుగ వల్ల ఆచార సంప్రదాయాలు తెలిసేవి. సంగీతం, సాహిత్యం, నృత్య కళలతో పరిజ్ఞానం ఏర్పడేది. బాల్య వివాహాలు చేసుకొని అత్తింటికి వెళ్ళే ఆడపిల్లలకు బతుకమ్మ పాటలు అత్తింట్లో మెలగవలసిన పద్ధతులను బోధించేవి. వారికి అనుభవ పాఠాలుగా, జీవితాలకు మార్గదర్శకాలుగా, విజ్ఞాన వాహికలుగా ఉండేవి.

బతుకమ్మతో మన సాంస్కృతిక పునరుజ్జీవనం

తెలంగాణ ఆచార సంప్రదాయాలను జీవిత విధానాలను తమలోనే పదిల పరచుకున్న బతుకమ్మ పాటలు క్రమంగా అంతరించి పోతున్నాయి. పండుగలో ఆచరించే సంప్రదాయాలు కనుమరుగై పోతున్నాయి. వీటిని మీడియా ద్వారానైనా ప్రచారం చేయాలి. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లోని బతుకమ్మ పాటలను సేకరించి సీ.డీ.లలో పదిల పరచడం, బతుకమ్మ పండుగలోని సంస్కృతీ సంప్రదాయాలను వీడియోల్లో రికార్డు చేయడం, పాఠ్యాంశాలలో చేర్చడం ఈనాటి తెలంగాణ సాంస్కృతిక అభిమానుల కర్తవ్యం. అప్పుడే బతుకమ్మతో పాటు తెలంగాణ సంస్కృతి కూడ కలకాలం నిలబడుతుంది.

డా. రావి ప్రేమలత సాహితీవేత్త, పరిశోధకురాలు. గత మూడుదశాబ్దాలు తెలుగు అధ్యాపకురాలిగా పనిచేసి, ఉత్తమ విమర్శకురాలిగా, సాహిత్య పరిశోధకురాలిగా అనేక అవార్డులు పొందారు. స్త్రీల ముగ్గులపై వారి చిత్రలిపి ఎన్నదగిన పరిశోధనా గ్రంధం.  

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article