మలిదశ ఉద్యమంలో కాదు, అంతకు ముందే, సరిగ్గా చెప్పాలంటే 1967లోనే శ్రీ ఎన్. గోపి గారి హృదయం నుంచి వ్యక్తమైన బంగారు కవిత ఇది. బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణా చిత్తరువును తెలుపు కవిత మరోసారి…
తంగెడుపూలు అంటే ఒప్పుకోను
బంగరు పూలు
పొంగిన విచారాన్ని
దిగమింగిన పూలు
వెలగలిగిన గులాబీల కన్న
వెలవెలబోయే మల్లెల కన్న
వెలలేని ఈ పూలు మేలు
తెలుగువారి బతకమ్మల కమ్మని మొగాల
వెలుగునింపు పూలు
కాపుకన్నెల ముద్దుగొలుపు ముద్దకొప్పుల్లో
కాపురముండే పూలు
మనసున్న పూలు
మమతలున్న పూలు
వాసనలేకున్నా వలపు
బాసలు నేర్చిన పూలు
పేదపూలు
పేదలపూలు
‘తంగెడుపూలు’ అంటే ఒప్పుకోను
బంగరుపూలు
డా. ఎన్. గోపి