Editorial

Wednesday, January 22, 2025
హెరిటేజ్ప్రకృతి తొలిచిన అందమైన గుహ - ఆదిమ కాలపు అర్జున లొద్ది

ప్రకృతి తొలిచిన అందమైన గుహ – ఆదిమ కాలపు అర్జున లొద్ది

అటవీ శాఖ సహకారం, ప్రిహా సంస్థ అధ్యయనంతో ఆసిఫాబాద్ అడవులలో ఆదిమ కాలపు సున్నపు రాతి గుహ వెలుగులోకి వచ్చిన వైనంపై తెలుపు నివేదిక

తెలంగాణ అడవులు దాచుకున్న ఎన్నో రహస్యాల్లో అర్జున లొద్ది గుహ ఒకటి. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం మేశ్రామ్ గూడ గ్రామ పంచాయతీ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఉన్న ఈ సున్నపు రాతి గుహ తెలంగాణలో ప్రకృతి తొలిచిన అతి కొద్దీ అందమైన గుహల్లో ఒకటి.

ఈ ప్రాంతాన్ని అర్జున లొద్ది అంటున్నారు. ఎన్నో తరాలుగా స్థానిక గోండు, పరధాన్ గిరిజనులు ‘అర్జున్ పేణ్’ అంటే అర్జున దేవుడుగా కొలిచే శిల ఈ గుహలో ఉన్నందున ఈ ప్రాంతాన్ని అలా పిలుస్తున్నారు.  తెలంగాణ అటవీ శాఖ గిన్నెధారి రేంజ్ లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తోడిశెట్టి ప్రణయ్ చొరవతో, జిల్లా ఫారెస్ట్ అధికారి యస్ శాంతారాం, ఐ ఎఫ్ ఎస్, ప్రోత్సాహంతో, ఈ గుహ వెలుగులోకి రావడం విశేషం.

పబ్లిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ హిస్టరీ, ఆర్కియాలజీ అండ్ హెరిటేజ్ (ప్రిహా) జనరల్ సెక్రటరీ ఎం ఏ శ్రీనివాసన్ బృందం భూగర్భ శాస్త్రవేత్తల సహాయంతో ఈ గుహ గురించి అధ్యయనం చేసి అనేక విషయాలు వెల్లడి చేసింది.

ఎఫ్ ఆర్ ఓ ప్రణయ్ తో పరిశోధకులు శ్రీనివాసన్

పబ్లిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ హిస్టరీ, ఆర్కియాలజీ అండ్ హెరిటేజ్ (ప్రిహా) జనరల్ సెక్రటరీ ఎం ఏ శ్రీనివాసన్ బృందం గత వారం ఈ గుహలో తిరిగి లోపలి దృశ్యాల్ని రికార్డు చేసి భూగర్భ శాస్త్రవేత్తల సహాయంతో ఈ గుహ గురించి అధ్యయనం చేసి అనేక విషయాలు వెల్లడి చేసింది. ఈ బృందం అర్జున లొద్ది గుహ, పరిసర ప్రాంతాల్లో ఆదిమ యుగపు మానవుల ఆనవాళ్ల కోసం కూడా పరిశీలన చేసింది.

ఎన్నో తరాలుగా స్థానిక గోండు, పరధాన్ గిరిజనులు ‘అర్జున్ పేణ్’ అంటే అర్జున దేవుడుగా కొలిచే శిల ఈ గుహలో ఉన్నందున ఈ ప్రాంతాన్ని ‘అర్జున లొద్ది’ పిలుస్తున్నారు.

స్థానిక ఆదివాసీలకు సుపరిచితమైన ఈ గుహ ఇప్పటివరకు శాస్త్రీయ పరిశోధనకు, సాహస పర్యాటనకు నోచుకోలేదు. దట్టమైన అటవీ ప్రాంతం లో కవ్వాల్ టైగర్ జోన్ లో ఉన్న ఈ గుహ అక్కడక్కడా ఇరుకుగా ఉండటం వల్లా పాకుకుంటూ వెళ్లాల్సి వచ్చిందని శ్రీనివాసన్ తెలుపు టివితో అన్నారు. దాదాపు 30 మీటర్ల వరకు వెళ్లగలిగిన ఈ గుహ ఇంకా పొడుగ్గా ఉన్నందున, వెలుతురు లేకపోవడం కారణంగా తమ అన్వేషణ ఇంకా పూర్తిగా జరగలేదని వివరించారు. కాగా, ఈ గుహ సుమారు 1,25,000 నుండి 11,000 ఏళ్ళ మధ్య జరిగిన మార్పుల వల్ల ఏర్పడి ఉంటుందని భూగర్భ శాస్త్రవేత్తలు అంచనాగా శ్రీనివాసన్ చెప్పారు.

గుహ కప్పు నుండి ఖనిజాలు ద్రవ రూపంలో కారుతూ క్రమంగా గట్టి పడి వివిధ ఆకృతులు ఏర్పడిన స్టాలగ్మయిట్లు ఈ గుహలో ఉన్నాయి. ఆ విధంగా ఏర్పడ్డ ఒక శిలనే ఇక్కడి ఆదివాసులు అర్జునుడిగా పూజ చేస్తుండటం గమనించవచ్చు.

నియో ప్రొటెరోజోయిక్ కాలం అంటే 54 కోట్ల ఏళ్ళ కింద భూమిలో ఉన్న సున్నపు రాయిని భూగర్భ జలం తొలచడంతో మొదలైన ఈ ప్రక్రియ సుమారు లక్ష ఇరువవైయైదు వేల ఏళ్ళ క్రింద నుండి గుహ ఏర్పడడం మొదలై ఉండొచ్చని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ చకిలం వేణుగోపాల రావు గారు చెబుతున్నారు. కర్నూల్ గుహలపై జరిగిన శాస్త్రీయ పరిశోధన గీటురాయిగా  ఈ గుహ ఏర్పడిన కాలాన్ని అంచనా వేయవచ్చని ఆయన అభిప్రాయ పడుతున్నారు.

ఈ గుహ ప్రాంతంలో పాత రాతి యుగపు మానవ సంచారానికి సంబంధించిన ఆనవాళ్లు రాతి పనిముట్ల రూపంలో దొరికాయి. పక్కనే జలధార ఉండటం వాళ్ళ, పాత రాతి యుగం నుండి మానవులు వీటిని ఆవాసాలుగా వాడే అవకాశం ఉందని, ఇంకొంత పరిశోధన చేస్తే తెలంగాణలో రాతి యుగం చరిత్ర మరింత తెలిసే అవకాశం ఉందని శ్రీనివాసన్ అన్నారు.

గుహ కప్పు నుండి ఖనిజాలు ద్రవ రూపంలో కారుతూ క్రమంగా గట్టి పడి వివిధ ఆకృతులు ఏర్పడిన స్టాలక్టైట్లు, ఖనిజాలు కింది నుండి గట్టి పడి ఏర్పడ్డ స్టాలగ్మయిట్లు ఈ గుహలో ఉన్నాయి. ఆ విధంగా ఏర్పడ్డ ఒక శిలనే ఇక్కడి ఆదివాసులు అర్జునుడిగా పూజ చేస్తుండటం గమనించవచ్చు.

కాగా, తెలంగాణ పర్యాటక, అటవీ శాఖలు ఈ గుహను ఒక పర్యాటక కేంద్రంగా, సాహస పర్యటనలో భాగంగా చేస్తే ఎకో టూరిజం, చరిత్ర అధ్యయనం రెండిటికీ లాభం జరుగుతుందని అన్వేషణకు నడుంకట్టిన ప్రిహా సంస్థ తెలియజేస్తోంది.

 మరిన్ని వివరాలకు శ్రీనివాసన్ గారిని సంప్రదించవచ్చు:  8106935000

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article