Editorial

Wednesday, January 22, 2025
Photo Featureతెలంగాణ ఖజురహో : ఈ రామాలయం రతికేళీ శిల్పాలకు ప్రత్యేకం

తెలంగాణ ఖజురహో : ఈ రామాలయం రతికేళీ శిల్పాలకు ప్రత్యేకం

ఆధ్యాత్మిక క్షేత్రాలలో అరుదైన ఆలయం డిచ్ పల్లి ఖిల్లా రామాలయం. ‘తెలంగాణ ఖజురహో’గా పేరొందిన ఈ ఆలయంలో రమణీయమైన రతికేళీ దృశ్యాలు భక్తులను అలరిస్తాయి. రక్తిని కలిగిస్తాయి.

ఫోటోలు, కథనం: కందుకూరి రమేష్ బాబు

నిజామాబాద్ కి 27 కి.మీ ల దూరంలో ఉన్న డిచ్ పల్లి రామాలయం హైదరాబాద్ నుండి 167 కి.మీ. ల దూరం ఉంటుంది. ఈ ఆలయం పై భాగాన, చుట్టూరా ఉన్న ప్యానెల్ అంతా కూడా వాత్సాయన కామసూత్రల నుంచి స్ఫూర్తి పొంది రూపొందించిన శిల్పాలే కావడంతో అవి సహజంగానే ‘ఖజురహో’ను గుర్తుకు తెస్తాయి.

చూపరులకు మొదట ఇక్కడ రతి భంగిమల దృశ్యాలు ఉన్నాయనే భావన కలుగదు. నిదానంగా చూస్తుంటే, ఆలయం అంతటా అవే ప్రధానంగా ఆక్రమించాయని తెలుస్తుంది. చూస్తుంటే మెల్లగా కళ్ళముందు ఆవిశాకారం అవుతాయవి.

డిచ్ పల్లికి కిలోమీటరు దూరంలో ఉన్న ‘దీక్షానగరం’ 12 లేదా 13వ శతాబ్దంలో వ్యాపార కేంద్రంగా ఉండేది. ఇక్కడ యుద్ధానికి సంబంధించిన వస్తువులు అమ్మేవారు. పర రాజులు ఎవరైనా విక్రయానికి వస్తే ఉండటానికి సదుపాయంగా, విశ్రాంతికి యోగ్యంగా అతి సుందరమైన శిల్పకళా చాతుర్యంతో ఈ ఆలయాన్ని నిర్మించారన్నది చరిత్ర అని ఆలయ ప్రధాన అర్చకులు వానమామలై వెంకట కృష్ణమాచార్యులు చెప్పారు.

ఈ ఆలయంపై ఉన్న శిల్పాలను స్థానికులు ‘గిచ్చు బొమ్మలు’గా పిలిచేవారని, సంస్కృతంలో ‘గిచ్చు’ శృంగారానికి పర్యాయ పదం కావడంతో ఈ ఊరుని ‘గిచ్చుపల్లి’ అని, అదే ‘డిచ్ పల్లి’గా మారిందనీ అంటారు.

మూడవ శతాబ్దానికి చెందిన వాత్సాయనుడి కామసూత్ర గ్రంధంలోని కళలకు సంబంధించిన సూత్రాలు…తొలుత అలంకరణ, తర్వాత శోభనానికి సన్నద్ధం అయ్యే దృశ్యాలు, అటు పిమ్మట శృంగారంలో లీనం అయ్యేవి, ఇంట్లాంటివి ఇక్కడి చాలా శిల్పాలు ఎన్నో కథలు చెబుతాయి.

దంపతులు, ప్రేమికులు, అభిరుచితో తప్పక చూసి తరించవలసిన ఆలయం ఇది.

ఒకే పురుషుడు, ఆరుగురు స్త్రీలతో రమించే శిల్పం ఒకటి ఇక్కడ ప్రత్యకం.

 

అభిషేకం చేసిన నీటిని బయటకు వదిలేందుకు అరటి పూవు మాదిరిగా నిర్మించిన ‘సోమ సూత్రం’ ఇక్కడి శిల్పకళా చాతుర్యానికి మరో మచ్చు తునక.

మొదటినుంచీ ఈ ఆలయం వైష్ణవ అలయమా లేక శివాలయమా అన్నది అంతుపట్టదు.

ఇది 16వ శతాబ్దంలో నిర్మాణం అయిందని కొందరు, కాకతీయుల కాలం నాటిదని మరికొందరు అంటారు. ఐతే, 1311 ప్రాంతంలో నవాబుల కాలంలో అర్థాంతరంగా దీని నిర్మాణం ఆగిపొయిందని మాత్రం భోదపడుతుంది.

కాగా 1949 లో గజవాడ చిన్నయ్య గుప్త పూనికతో రామాలయంలో విగ్రహ ప్రతిష్ట పూర్తి చేయడంతో ఇది ఖిల్లా రామాలయంగా పేరొందిందని తెలుస్తోంది.

భారత దేశంలో తాబేలు (కూర్మ) ఆకారంలో నిర్మాణమైన ఆలయాల్లో ఇదొకటి కాగా మరొకటి తిరుమల తిరుపతి దేవస్థానం అంటారు.

ప్రతి ఏటా ఫిబ్రవరి 15న- వైకుంట ఏకాదశి పర్వదినం నుంచి వారం రోజుల పాటు ఇక్కడ ఘనంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ వేడుకల్లో సుమారు 40 గ్రామాల ప్రజలు పాల్గొంటారని అర్చకులు చెప్పారు.

ఆలయం పక్కనే, దక్షిణాన ఉన్న కోనేరు, దాని మధ్యన ఉన్న మండపం- ఈ అరుదైన శిల్పాల వీక్షణం నుంచి గొప్ప విరామ దృశ్యం.

సందర్శకులకు గొప్ప అనుభవంగా నిలిచే ఈ ఆలయం తెలంగాణ పర్యాటకానికి మనోహరమైన చేర్పు అనే చెప్పాలి. దీనిపై శ్రద్ధ పెట్టవలసినంత ప్రభుత్వం పెట్టలేదనే చెప్పాలి.

 

More articles

1 COMMENT

  1. Well described about the temple.
    As per your description
    This may be a kings army related construction as my observation all temple will have a main entrance hear the maintenance is not there devotees enter through a small opening it’s a clear evidence to be a weapon store converted in a temple.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article