ధర్మరాజు ప్రతినిత్యం భీష్ముని వద్ద రాజనీతిని తెలుసుకుంటున్న సందర్భంలో యజమానికి వర్తించే ధర్మాలేమిటో గ్రహిస్తారు. వాటిని విశదీకరిస్తూ గన్నమరాజు గిరిజామనోహరబాబు పరిపాలకులైన వారు రాజ్యానికో దేశానికో యజమానులే కనుక నేటి పాలకులు కూడా తమ ఆధీనంలో పనిచేసే వారి విషయంలో మిక్కిలి శ్రద్ధ వహించాలని అన్యాపదేశంగా సూచిస్తున్నారు.
అలాగే కరోనా మహమ్మారి కాలంలో ఉద్యుగుల పట్ల యాజమాన్యం సహృదయంతో ప్రవర్తించవలసిన ఆవశ్యకతను కూడా ఈ వ్యాసంలో వారు ఒక ధర్మంగా చెప్పకనే చెబుతారు.
ఆత్మనశ్చ పరేషాంచ వృత్తిం సంరక్ష భారత
పుత్రవచ్చాపి భృత్యాన్ స్వాన్ ప్రజాశ్చ పరిపాలయ
ఇది మహాభారతం చెప్పిన మాట. భీష్మ పితామహుడు అర్జునుని కారణంగా బాణోపహతుడై అంపశయ్యపై ఉన్నప్పుడు, యుద్ధానంతరం ధర్మరాజు ప్రతినిత్యం భీష్ముని వద్దకు వెళ్ళి రాజనీతిని లోకధర్మాలను తెలుసుకుంటున్న సందర్భంలో ధర్మరాజుతో భీష్ముడు యజమానిని గురించి చెబుతూ యజమాని యైన వ్యక్తి తన యొక్క ఇతరుల యొక్క జీవిత సాధనములను సమానంగా రక్షించాలి. తన దగ్గర పనిచేసే సేవకులనైనా, తనయేలుబడిలోని ప్రజలనైనా తన పుత్రులతో సమానంగా ప్రేమించాలి. అనగా సేవకులైన వారిని కూడా పుత్రసమమైన ప్రేమతో గౌరవించాలి. ప్రజలను కూడా పుత్ర సమానంగా పోషించాలి- ఇది ప్రతి యజమానికి కూడా వర్తించే కనీస ధర్మము.
అసలు యజమాని అనే పదానికి యజ్ఞమును నిర్వహించిన వాడు అని అర్థము. కాని కాలక్రమంలో కుటుంబపు పెద్దకు, భూముల స్వంతదారుకు, వ్యాపార స్థాపకునికి ఇట్లాంటి అర్థాలతో స్థిరపడిన మాట యజమాని అనేమాట. ఈ దృష్టితో మన గ్రంథాలు యజమానికి అవసరమైన అనేక ధర్మాలను ఎంతో స్పష్టంగా చెప్పాయి.
ఆపస్తంబమహర్షి తన ధర్మ సూత్రాలతో కామ మాత్మానం భార్యాం పుత్రం వా ఉపరుంథ్యాత్, నతు దానకర్మాన్- అన్నాడు. అంటే యజమాని ఒక్కోసారి తనకు, తన భార్యాబిడ్డలకు అవసరమైన అన్న వస్త్రాదులను సమకూర్చుకోవడంలో కష్టములు పడవచ్చు కాని ఎంత కష్టమైనాసరే తన సేవలకులనుగాని, పరిచారకులను గాని ఎటువంటి కష్టానికి గురిచెయ్యరాదు అన్నప్పుడు కుటుంబ యజమాని బాధ్యత ఎంత గొప్పనైనదో తెలుస్తున్నది.
యజమాని ఒక్కోసారి తనకు, తన భార్యాబిడ్డలకుఅవసరమైన అన్న వస్త్రాదులను సమకూర్చుకోవడంలో కష్టములు పడవచ్చు కాని ఎంత కష్టమైనాసరే తన సేవలకులనుగాని, పరిచారకులను గాని ఎటువంటి కష్టానికి గురిచెయ్యరాదు
అంతేకాదు, యజమానియైన వ్యక్తి తన ఇష్టానుసారంగా సేవకులను తనవద్ద పనిచేసేవారిని మధ్యంతరంగా తొలగించరాదంటూ శుక్రనీతి ఎంత స్పష్టంగా చెప్పిందో ఈ మాటలు పరిశీలిస్తే అర్థమవుతుంది. నకుర్యాత్ భృతి లోపంతు తథా భృతి విలంబనమ్- అంటే తన సేవకులను మధ్యలోనే తొలగించడం తప్పు. వారికివ్వవలసిన వేతనాదులను కూడా ఆలస్యం చేసి ఇబ్బంది పెట్టరాదని వివరంగా చెప్పింది. అదే శుక్రనీతి. యథా యథాతుగుణవాన్ భృతకస్తద్భృతిస్తథా- అని కూడా చెప్పింది. ఉత్తమమైన సేవలందించే ఉత్తమ సేవకుడు గుణవంతుడైనప్పుడు, పనులలో నేర్పరి అయినప్పుడు అతని వేతనమును తప్పనిసరిగా పెంచుచుండవలెను. ఇది అన్ని కాలాలలో ఆచరించవలసిన ధర్మము. మరోమాట కూడా యజమాని ధర్మాన్ని, అతని ప్రవర్తనను గురించి కూడా శుక్రనీతి తెలిపింది.
పరిపాలకులైనవారు రాజ్యానికో దేశానికో యజమానులే కనుక తమ ఆధీనంలో పనిచేసే వారి విషయంలో మిక్కిలి శ్రద్ధ వహించాలి ఈ మాట కూడా మహాభారతం చెబుతూ నభృత్యానాం వృత్తి సంశోధనేన…రాజ్యం ధనం సంజిఘృక్షేదపూర్వమ్- అన్నది. అంటే ఏ పాలకుడైనా యజమానియైనా తమ ఆధీనంలోని సేవకులకు ఇవ్వవలసిన ద్రవ్యాన్ని ఆపి తన సంపద పూర్వం కన్నా వృద్ధి పొందాలని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలోచించి ఆ దిశగా ప్రయత్నాలు చేయరాదు. వారికి ఏయే స్థాయిలో ఇవ్వవలసిన వేతనాలున్నాయో లేదా వారికి యేయే సాయాలు చెయ్యాలని నిర్దేశింపబడ్డాయో వాటన్నింటిని సకాలంలో చెల్లించి వారిని సంతృప్తి పరచాలి. ఇట్లా చెప్పడంలో యజమాని ధర్మాలను స్పష్టంగా చెప్పినట్లయింది.
ఏ పాలకుడైనా యజమానియైనా తమ ఆధీనంలోని సేవకులకు ఇవ్వవలసిన ద్రవ్యాన్ని ఆపి తన సంపద పూర్వం కన్నా వృద్ధి పొందాలని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలోచించి ఆ దిశగా ప్రయత్నాలు చేయరాదు.
అంతేగాకుండా చిన్నచిన్న విషయాలను గురించి కాని అనుకోకుండా వారివల్ల జరిగిన పొరపాట్లు ఉన్నప్పుడుగాని వాదవివాదాలు చేసి యజమానులు వారిని కించపరచరాదని దాసవర్గేణ న సమాచరేత్ – స్పష్టంగా బోధిస్తూనే ఉన్నాయి. యజమానులైన వారి హృదయం కరుణామయమై ఉండాలి. తమ పరిజనం పట్ల మానవీయదృక్పథం ఉండాలి. చాణక్యుడు కూడా ఈ విషయాన్నే ధర్మ కృత్యేషు అపి సా్వమిన ఏవ ఘోషయేత్- అన్నాడు. ఒకవేళ తమ పరిజనుల ఇండ్లలో ఏవైనా యజ్ఞయాగాలు, వివాహాది ధర్మకార్యాలు, వేడుకలు జరుగుతున్నయెడల ఇవి మా యజమాని దయవల్లనే జరుగుతున్నాయని వాళ్ళు చెప్పుకునే స్థాయిలో వారికి సహాయసహకారాలు అందించాలి.
సృష్టిలోని ప్రతిప్రాణికీ జీవించే హక్కు ఉంది గనుక ప్రతి జీవిని ప్రేమించడమే దైవమార్గపు మొదటిమెట్టు. ఇక్కడ యజమాని, సేవకుడు, అధికారి, ఉద్యోగి ఇట్లాంటి భేదభావాలు ఉండరాదు. ప్రాథమికంగా అందరూ మానవులు, తరువాతనే వారివారి జీవన ధర్మాలు.
మానవ సంబంధాలకు పెద్దపీట వేసినవి భారతీయ స్మృతి పురాణాది ధర్మగ్రంథాలు. తన తోటివారి విషయంలో మానవత్వంతో ప్రవర్తించడమే నిజమైన ఆధ్యాత్మికతగా భావించాయి. రామాయణమైనా, భారతమైనా, భాగవతమైనా మానవధర్మాలకే అగ్రస్థానాన్నిచ్చాయి. మానవత్వానికే ప్రాధాన్యాన్నిచ్చాయి. అందుకని మానవ సేవను మాధవ సేవగా గౌరవించాయి.
శుష్కమైన చిత్తశుద్ధిలేని పూజాదికాలు ఏవీ నిజమైన ఆధ్యాత్మికత అనిపించుకోవు. మనిషిని దైవస్వరూపంగా భావించి తమ జీవితాల్లో మనిషిపట్ల గౌరవభావం కలిగి ఉండటం, సృష్టిలోని ప్రతిప్రాణికీ జీవించే హక్కు ఉంది గనుక ప్రతి జీవిని ప్రేమించడమే దైవమార్గపు మొదటిమెట్టు. ఇక్కడ యజమాని, సేవకుడు, అధికారి, ఉద్యోగి ఇట్లాంటి భేదభావాలు ఉండరాదు. ప్రాథమికంగా అందరూ మానవులు, తరువాతనే వారివారి జీవన ధర్మాలు. కనుక మనకు ఎవరిపైనా ప్రత్యేకమైన హక్కులుండవు. అందరినీ సమదృష్టితో చూడటమే ప్రధానధర్మం. అదే పూర్వులు భావించిన ఆధ్యాత్మికత. అందుకే ప్రతి యజమాని మానవీయ భావనల ఆచరణలో ఏమరపాటు లేకుండా తన ధర్మాన్ని ఆచరించి తరించాలని మన పూర్వులు భావించి ఇన్ని శాస్రాలను అందించి మనల్ని సంపన్నుల్ని చేసి వెళ్ళారు. వాటిని మనం ఆచరించి ఉత్తమ యజమానులమనిపించుకోవాలి.
గురువుగారు బాగా అర్థం అయ్యేటట్లు తెలియపరచారు.ధన్యవాధములు