Editorial

Monday, December 23, 2024
కవితవెన్నెల – బాలగంగాధర తిలక్

వెన్నెల – బాలగంగాధర తిలక్

 

బాలగంగాధర తిలక్

కార్తీక మాసపు రాత్రివేళ
కావాలనే మేలుకున్నాను
చల్లని తెల్లని వెన్నెల
అంతటా పడుతోంది
మెత్తని పుత్తడి వెన్నెల
బూమి వొంటిని హత్తుకుంది
శిశువులాంటి వెన్నెల
నవ వధువులాంటి, మధువు లాంటి వెన్నెల
శిశిరానిలానికి చలించే
పొరల పొరల వెన్నెల
శరద్రధుని సౌధానికి కట్టిన
తెరల తెరల వెన్నెల
ఎంత శాంతంగా,
హాయిగా, ఆప్యాయంగా ఉంది!
చచ్చి పోయిన మా అమ్మ
తిరిగొచ్చినట్టుంది
స్వర్గంలో ఎవరో సంగీతం
పాడుతున్నట్టుంది
స్వర్గంలో అచ్చరలు
జలక్రీడ లాడుతున్నట్టుంది
ఎంత నీరవ నిర్మల సౌందర్యం
నన్నావరించుకుంది?
ఏ చామీకర చషకంతో
నా పెదవుల కందిస్తున్నది!

ఈ రాత్రి నిద్రిత సర్వధాత్రిమీద
ఎవరు ఈ తళుకు తళుకు
కళల పుప్పొడిని వెదజల్లారు!
ఎవరీ మెరిసే ముఖమల్
జంఖానా పరచి వెళ్ళారు!
ఓహో! చద్రకిత ధాత్రి
ఓహో! కోరకిత గాత్రి
ఓహో! శరధాత్రి!
వ్యధలతో బాధ్యతలతో
భయాలతో మహితమైన
నా మనస్సు కిప్పుడూరట కలుగుతోంది.

ఈ వెన్నెల మనస్సులోకి
జారుతోంది
నా గుండె పగుళ్ళనుండి కారుతోంది
నా అంతరాంతర రంగస్థలాన
ఏకాకి నటుడినైన నన్ను
తన మైత్రీ మధుర భావంతో
క్రమ్ముకుంటోంది
నా లోపలి లోపలి గుప్త
వీణా తంత్రీ నివహాన్ని
వేపధు మృదు లాంగుళుల
తాకి పలికిస్తోంది.
నన్ను బతికిస్తోంది
నా బతుక్కి అందాన్నీ
అర్థాన్నీ ఆశనీ
రచిస్తోంది
నా రచనగా తానై పోయింది
వెన్నెల వంటి నా ఉద్రేకానికి
తెలుగు భాష శరద్వియ
ద్విహార వనమై నడిచి పోయింది

చలి చలిగా సరదాగా ఉంది వెన్నెల
చెలి తొలిరాత్రి సిగ్గులా ఉంది
విరిసిన చామంతి పువ్వులా ఉంది
పడక గదిలో వెలిగించిన
అగరొత్తుల వాసనలా వుంది
పడగిప్పిన పాములు తిరిగే
పండిన మొగలి వనంలాగుంది
పన్నీరు జల్లినట్టు వుంది
విరహిణి కన్నీరులా ఉంది
విరజాజుల తావితో కలిసి
గమ్మత్తుగా ఉంది
విచిత్రమైన మొహమణి
కవాటాలను తెరుస్తోంది
యౌవన వనంలోని కేళీ సరస్సులా ఉంది
దవుదవ్వుల పడుచు పిల్లలు
పకపక నవ్వినట్టుంది
దాపరికం లేని కొండజాతి
నాతి వలపులాగుంది
ఇది సృష్టి సౌందర్యాను
భూతికి టీక
ఇది తరుణ శృంగార
జీవన హేలకు ప్రతీక
చిందెను తెల్లని చల్లని వెన్నెల
చలిరాత్రుల మౌనపు
గానపు తెన్నుల
జారెను తోటల
కొబ్బరి మొవ్వల
ఇంటిముందు బోగన్ విల్లా పువ్వుల
ధనికుల కిటికీ పరదా చిరుసందుల
సురతాలస నిద్రిత సతి కపోలమ్ముల
జారిన జార్జెట్ చీర జిలుగుటంచుల

చిందెను తెల్లని చల్లని వెన్నెల
చలిరాత్రుల మౌనపు గానపు తెన్నుల
నిరుపేదల కలలో
కదలిన తీయని ఊహల
ఊరి ప్రక్క కాలువ అద్దపు
రొమ్ముల
ఊరి బయట కాలీకాలని
చితి కీలల
అడవిలోన వికసించిన
ఒంటరి పువ్వుల
చిందెను తెల్లని చల్లని వెన్నెల
చలిరాత్రుల మౌనపు గానపు తెన్నుల

“నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు..నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు”..అంతేకాదు, “నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు” అని ప్రకటించిన ఆధినిక కవి, శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్ ‘అమృతం కురిసిన రాత్రి’ నుంచి పునర్ముద్రణ ఈ కవిత.  రచనా కాలం 1965.

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article