ద
“కష్టజీవి కి ఇరువైపులా నిలిచేవాడే నిజమైన కవి” అని శ్రీ శ్రీ ఇచ్చిన సందేశానికి ఇది మరో రూపం దాశరథి గారి ఈ పాట. నేడు వారి జయంతి సందర్భంగా విని తరిద్దాం.
ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో
ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ॥ఆ చల్లని॥
భూగోళం పుట్టుక కోసం, రాలిన సురగోళాలెన్నో
ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో
ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో
కులమతాల సుడిగుండాలకు బలిగాని పవిత్రులెందరో ॥ఆ చల్లని॥
మానవ కళ్యాణం కోసం ఫణమొడ్డిన రక్తం ఎంతో
రణ రక్కసి కరాళ నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో
కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాధమెంతో
ఉన్మాదుల అకృత్యాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో ॥ఆ చల్లని॥
అన్నార్తులు అనాధలుండని ఆ నవయుగ మదెంత దూరమో
కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో
పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో
గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో ॥ఆ చల్లని॥