Editorial

Monday, December 23, 2024
కాల‌మ్‌సమయం తెలుపు - వెలుతురు కిటికీ

సమయం తెలుపు – వెలుతురు కిటికీ

‘వెలుతురు కిటికీ ‘ ఒక మెలకువకు సంకేతం. ఈ వారం మీ జీవితాన అత్యంత విలువైన ప్రమాణం ఏమిటో తెలుపు

సిఎస్ సలీమ్ బాషా

అందరికీ  రోజుకి 1440 నిమిషాలే (అంటే 86,400 సెకండ్లే )

నిజమే అందరికీ  ఒకటే టైం ఉన్నప్పటికీ, కొంత మంది మాత్రమే అనుకున్న అంశంలో ఎందుకు సఫలం అవుతున్నారు.? అంటే వాళ్ళు తమకున్న కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారన్నమాట.

ఈ ప్రపంచంలో దేన్నయినా కొనగలం. ఒక్క టైం ను తప్ప.

ఈ ప్రపంచంలో వెనక్కి రానిది ఒక్కటే. అదే “టైం”

ఈ ప్రపంచంలో బ్యాడ్ టైం, గుడ్ టైం అని ఉండవు. మనం సరిగా ఉపయోగించుకోలేక పోతే బ్యాడ్, ఉపయోగించుకుంటే గుడ్. అంతే!

ప్రపంచంలో చాలామంది అతి తక్కువ విలువ ఇచ్చేది “టైం”కే. అంటే కాలానికే.

ఇది ‘వెలుతురు కిటికీ’ రెండో వారం కథనం. ఇందులో శ్రీ సిఎస్ సలీమ్ బాషా గదిలో ఉన్న మనకోసం అలవోకగా పక్కనే ఉన్న కిటికీ తెరిచి కొత్త గాలి ఆడేలా చేస్తారు. మంచి వెలుతురుకు స్వాగతం చెప్పేలా చూస్తారు. జీవితం సరళంగా, హాయిగా సాగిపోవడానికి కావాల్సిన అంశాలను తేలికగా విశదం చేస్తారు.

” నాకు టైం లేదు”

” నాకు టైం సరిపోవడం లేదు”

” ఇంకా కొంచెం టైం ఉంటే బాగుండు”

” అప్పుడే నాలుగు గంటలు  అయిందా?” (నాలుగు గంటలకే 4 అవుతుంది ఒక్క క్షణం ముందు వెనక కాదు)

” నా టైం అస్సలు బాలేదు”

” ఏం చేస్తాం బ్యాడ్ టైం”

-ఇవి మనం  టైం గురించి తరచూ  వినే మాటలు కొన్ని.

“వాచ్ ఉన్న ప్రతి వాడు “టైం” వస్తుంది అనుకుంటాడు. టైం తెలుస్తుంది  అంతే!” అని ఈ మధ్య వచ్చిన ఒక సినిమాలో డైలాగ్.  చాలా అర్థవంతమైన డైలాగ్ అది.

తమ దగ్గర టైం ఉన్నంత మాత్రాన పనులు జరిగిపోతాయని కాదు. టైం ను సరిగ్గా వాడుకుంటేనే పనులు జరుగుతాయి. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. చాలామంది ఎంతో ఖరీదైన వాచీలను, అది చాలా కష్టపడి వెతికి వెతికి మరీ కొనుక్కుంటారు. అటువంటి వాళ్ళు చాలామంది వాచీ కి విలువనిస్తారు, అది చూపించే టైంకు కాదు.

ఈ ప్రపంచంలో చాలామంది తమ దగ్గరున్న అత్యంత విలువైన వస్తువు ‘టైం’ అని తెలుసుకోలేరు.

ఈ ప్రపంచంలో చాలామంది తమ దగ్గరున్న అత్యంత విలువైన వస్తువు ‘టైం’ అని తెలుసుకోలేరు.

కాలానికి మనం విలువ ఇవ్వకపోతే. కాలం మనకు విలువ ఇవ్వదు.

మన జీవిత అకౌంట్ లో రోజుకి 1440 నిమిషాలు క్రెడిట్  అవుతాయి. తమాషా ఏంటంటే ఆ నిమిషాలను మనం వాడిన  వాడకపోయినా మన  అకౌంట్ లో నుంచి డెబిట్ అవుతుంటాయి. ఆరోజు ముగిసే టప్పటికి మన అకౌంట్  లో ఒక్క నిమిషం కూడా ఉండదు. మళ్లీ మరుసటి రోజు మాత్రమే అకౌంట్ లో మళ్ళీ 1440 నిమిషాలు  క్రెడిట్ అవుతాయి. బీద గొప్ప, ఆడా మగా, అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ప్రతి రోజు ప్రారంభంలో 1440 నిమిషాలు క్రెడిట్ అవుతాయి. నిజానికి వాటికి ఏ మాత్రం విలువ ఉండదు. క్రెడిట్ అయిన వాటికి మనమే విలువ ఇవ్వాలి.

సామాన్యుడి నుండి సచిన్ టెండూల్కర్ వరకు టైం చాలా ఇంపార్టెంట్. క్రికెట్ లో 1/10 సెకండ్ కూడా ఇంపార్టెంట్. కొంచెం ఆలస్యమైనా ఏమైనా జరగొచ్చు. అందుకే క్రికెట్ లో  టైం బాగుండడం  కాదు “టైమింగ్” బాగుంటేనే రాణించగలుగుతారు. జీవితంలో కూడా ఏదైనా సాధించాలి అనుకుంటే, Time Management (సమయపాలన) ఉండాలి. ఈ కంప్యూటర్ యుగంలో ఒక గంట కాదు, ఒక్క నిమిషం కాదు, ఒక సెకండ్ కాదు. Nanosecond అంటున్నారు. అంటే 1/1000000000 సెకండ్ అన్నమాట!

ఈ కంప్యూటర్ యుగంలో ఒక గంట కాదు, ఒక్క నిమిషం కాదు, ఒక సెకండ్ కాదు. Nanosecond అంటున్నారు. అంటే 1/1000000000 సెకండ్ అన్నమాట!

అసలు టైం ఎలా వేస్ట్ అవుతుంది?

సరైన ప్రణాళిక లేకపోవడం. దీనివల్ల చాలా సమయం వృధా అవుతుంది. అదే ఒక ప్రణాళిక ఉంటే అన్ని ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ  వెళ్ళవచ్చు.

“You may plan to fail but you should not fail to plan”.

ఒక్కోసారి ప్రణాళిక   ఉన్నప్పటికీ మనం విఫలం చెందవచ్చు అసలు ఒక ప్రణాళికనే లేకుంటే సక్సెస్ అయ్యే అవకాశమే లేదు. ప్రణాళిక వల్ల టైం చాలా ఆదా అవుతుంది.

Smart phone. ఇది ఈ శతాబ్దపు అత్యంత ప్రమాదకరమైన ఆవిష్కరణగా మారిపోవడానికి కారణం మనమే.

అనేక అంతరాయాలు

ఇందులో ముఖ్యమైనది smart phone. ఇది ఈ శతాబ్దపు అత్యంత ప్రమాదకరమైన ఆవిష్కరణగా మారిపోవడానికి కారణం మనమే. ఇది  మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. చాలామంది సమయపాలనలో విఫలం కావడానికి ఇది ప్రధాన పాత్ర వహిస్తుంది. అలాగని దీని ఉపయోగాలను  తక్కువ చేయలేం. కానీ దీన్ని ఉపయోగించే కాలం  వల్లనే  సమస్య. టైం మేనేజ్ మెంట్ లో  ముఖ్యమైనది phone management.

ఇక ఫ్రెండ్స్, సినిమాలు, పిక్నిక్ లు, టెలివిజన్, కంప్యూటర్,  ఉప్పరి మీటింగ్ లు  కూడా కొంత టైం తినేస్తాయి.

పని గురించి సరైన అంచనా లేకపోవడం

చాలామంది దెబ్బతినేది ఇక్కడే. చేపట్టిన పని గురించి కనీసం చిన్న అంచన లేకపోవడం. ఎంత టైం పడుతుంది ఈ పని పూర్తి చేయడానికి అని ఆలోచించకుండా పనులు  చేయడానికి సిద్ధపడడం.

ఒత్తిడి (Stress)

ఈ శతాబ్దపు అతిపెద్ద మహమ్మారి ఒత్తిడి. కరోనా కన్నాప్రమాదకరమైనది. ప్రణాళిక లేకుంటే ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి పెరిగితే టైం మేనేజ్మెంట్ దెబ్బతింటుంది. Stress Management దీనికి మార్గం.

వాయిదా వేసే మనస్తత్వం

“రేపటి పని ఈ రోజు- ఈరోజు పని ఇప్పుడే”. అన్న నానుడి మర్చి పోవడం వల్లనే ఇబ్బంది కలుగుతుంది. Do it now అన్నది దీనికి విరుగుడు. అంతకన్నా ముందు రేపు చేయవలసిన పనులు ఈరోజే రాసుకోవడం అన్నది కొంత ఉపయోగకరంగా ఉంటుంది.

“రేపటి పని ఈ రోజు- ఈరోజు పని ఇప్పుడే”. అన్న నానుడి మర్చి పోవడం వల్లనే ఇబ్బంది కలుగుతుంది.

అన్ని పనులూ ఒకేసారి చేయాలనుకోవడం

“One thing at a time” అని అనుకోకుండా “All at a time” అనుకోవడం వలన ఇబ్బంది. ఇది పనులకే కాదు జీవితానికి కూడా వర్తిస్తుంది. మల్టీటాస్కింగ్ అని చెప్తారు కానీ దాని వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయని ఈ మధ్యకాలంలో తేలింది. పైగా మల్టీటాస్కింగ్ అందరికీ సాధ్యమయ్యే పనికాదు. దానికి కూడా చాలా ముందస్తు ప్రణాళిక ఉండాలి. మల్టీటాస్కింగ్ వల్ల బ్రెయిన్ కూడా కొంతకాలం తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఉంది. అది ఆల్జీమర్స్ కూడా దారి తీయవచ్చు అని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.

ఒకేసారి ఎన్నో పనులు చేయగలిగిన నిష్ణాతుడు జాన్ రాంబో ఇంత అర్ధవంతమైన సమాధానం ఇచ్చాడు.

రాంబో 2 సినిమా లో rescue ఆపరేషన్ పూర్తయిన తర్వాత, రాంబో ని “ఎలా బతుకుతావు? (How you live john?) అని అడుగుతాడు అతన్ని తీర్చిదిద్దిన మేజర్. అప్పుడు రాంబో “day by day” అంటాడు. అంటే ఒక్కొక్క రోజు అని. ఒకేసారి ఎన్నో పనులు చేయగలిగిన నిష్ణాతుడు జాన్ రాంబో ఇంత అర్ధవంతమైన సమాధానం ఇచ్చాడు.

ప్రతి పనిని పర్ఫెక్ట్ గా చేయాలనుకోవడం

Perfection is a disease. It is a Time Killer. అని ఒక జపనీస్ శాస్త్రవేత్త అభిప్రాయం ఆ మధ్య నెట్లో దర్శనం ఇచ్చింది. నిజమే! ప్రతి పనిని   పర్ఫెక్ట్ గా చేయాలనుకోవడం వల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది. అలా అని పనులు పర్ఫెక్ట్ గా చేయడానికి ట్రై చేయకూడదని కాదు. కొంచెం విజ్ఞతతో వ్యవహరించాలి.

ఒక పని తొందరగా పూర్తి కావాలంటే, దాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించు కోవడమే. అప్పుడు పని సక్సెస్ అయ్యే అవకాశము ఉంది, టైం కూడా సద్వినియోగం అవుతుంది.

మన సమయ పాలన ఎలా ఉందో తెలుసుకుని, దాన్ని మరింత మెరుగు దిద్దుకోవడానికి  ఒక మార్గం ఉంది. ఒక పెద్ద సైజు తెల్ల పేపర్ తీసుకొని దాన్ని 48 గడులు గా విభజించుకోవాలి. ఒక్కో గడి 30 నిమిషాలు అనుకుందాం.  అంటే (48×30= 1440 నిమిషాలు లేదా 24 గంటలు). ఇప్పుడు ప్రతి  గడిలో ( అంటే ఆ అరగంట) మనం  ఏం చేశామో నిజాయితీగా రాసుకోవాలి. దాన్ని పరిశీలిస్తే మనం  మన సమయాన్ని  ఎలా వాడుకుంటున్నాం అన్నది తెలుస్తుంది.  దాన్నిబట్టి మన టైంను మనం మరింత సమర్థవంతంగా మేనేజ్ చేసుకోవచ్చు.

టైం మానేజ్ మెంట్ మాత్రిక

స్టీవెన్ కొవే అనే వ్యక్తిత్వ వికాస నిపుణుడు, ఒక టైం మానేజ్ మెంట్ మాత్రిక (matrix) తయారు చేశాడు. దాన్ని చూద్దాం..

ఇక్కడ 4 Quadrants(భాగాలు) ఉన్నాయి.

  1. urgent and Important (మన సమయంలో 15% దీనికి ఇవ్వాలి )

దీంట్లో మనకు అర్జంట్ అయ్యుండి, ముఖ్యమైనవే రాసుకోవాలి. ఉదాహరణకు మెడికల్ ప్రాబ్లమ్స్. అవి అర్జెంటు, ముఖ్యమైనవి కూడా.

  1. Not urgent but Important (మనసమయంలో 70% దీనికి ఇవ్వాలి )

దీంట్లో మనకు అర్జంట్  కాకపోయినా  ముఖ్యమైనవి రాసుకోవాలి. ఉదాహరణకు మన సంబంధాలు, వృత్తి పరమైనవి, పిల్లల చదువులు  ఇవి అర్జెంటు కాకపోయినా ముఖ్యమైనవి. సమయపాలన లో ఇది ముఖ్యమైన భాగం.

  1. Urgent but not Important (మనసమయంలో 10% దీనికి ఇవ్వాలి )

దీంట్లో మనకు అర్జంట్  అయినప్పటికీ, ముఖ్యమైనవి కానీ వాటిని రాసుకోవాలి. ఉదాహరణకు ఫోన్ కాల్స్, ఈ మెయిల్ లాంటివి (మన  సమయంలో 5% దీనికి ఇవ్వాలి )

  1. Not urgent and not important

దీంట్లో మనకు  అర్జెంటు కానివి  , ముఖ్యమైనవి కానివి కూడా రాసుకోవాలి. ఉదాహరణకు సడెన్ గా ఎవరైనా పిలిస్తే సినిమాకి వెళ్లడం, లేదా ఎవరైనా మనల్ని బయటికి  రమ్మని  అడగటం ఇలాంటివి,

అంటే మనం ఏ భాగానికి ఎంత సమయం  కేటాయిస్తున్నాం అనే దానిమీద మన సమయపాలన ఆధారపడి ఉంటుంది.

కాలం ఎవరికోసం ఆగదు. కాలాన్ని ఒడిసి పట్టు కోవడం కూడా కుదరదు. ఎందుకంటే కాలం గుర్రం లాంటిది. దాంతోపాటు పరిగెత్తాలి, లేదా దానిపైన స్వారీ అయినా  చేయాలి. అలా చేయాలంటే  దానికి “సమయ పాలన” (Time management) తెలిసుండాలి.

కాలమిస్టు సలీం భాషా సైకాలజిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు. సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్. ఉద్యోగ నైపుణ్యాల భోదకులు కూడా. వారి మొబైల్ నంబర్ 93937 37937

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article