‘ఇకిగై ‘అంటే ఏమిటో సింపుల్ గా చెప్పాలి అంటే జీవిత పరమార్థం. సంతోషంగా ఉండటానికి నువ్వు చేసే పని. నిజానికి ప్రతి ఒక్కరికి ఇకిగై ఉండితీరాలి. మరి అందుకోసం ఐదు సూత్రాలు పాటిస్తారు వారు. అవేమిటో తెలుపు ఈ వారం వెలుతురు కిటికీ.
సిఎస్ సలీమ్ బాషా
జపాన్ లోని ఒకినోవా ద్వీపంలో ఎక్కువమంది శతాధికులు. మిగిలిన వారు కనీసం 90 సంవత్సరాలు పైబడినవారు. ఈ ద్వీపం ప్రపంచంలో అత్యంత ఆరోగ్యవంతమైన ప్రాంతాల్లో ఒకటి. చాలామంది శాస్త్రవేత్త లు, సామాజిక పరిశోధకులు అక్కడికి వెళ్లి వారి జీవితాన్ని దగ్గరగా ఉండి చూశారు. దీర్ఘకాలం పరిశోధనలు చేశారు. వారికి కొన్ని విషయాలు తెలిశాయి.
అప్పుడు వారికి తెలిసింది, అక్కడ ఉన్న వారందరూ “ఇకి గై” సిద్ధాంతాన్ని నమ్ముతారని. ఈ మధ్యకాలంలో “ఇకి గై” గురించి పుస్తకాలు వచ్చాయి, పరిశోధనలు జరుగుతున్నాయి. అసలు “ఇకి గై” అంటే ఏమిటి?
“ఇకిగై” అంటే ఏమిటో సింపుల్ గా చెప్పాలి అంటే జీవిత పరమార్థం. సంతోషంగా ఉండటానికి నువ్వు చేసే పని. ఒక విధంగా చెప్పాలంటే ikigai అన్నది సంతోషంగా ఉండడానికి నువ్వు ఏం చేస్తావో అది. ప్రతి ఒక్కరికి ఇకిగై ఉండితీరాలి.
ikigai అన్నది ఒక జీవన విధానం. జీవితానికి మనం ఇచ్చుకునే నిర్వచనం.
స్థూలంగా చెప్పాలంటే ikigai అన్నది ఒక జీవన విధానం. అంటే జీవించడానికి ఉన్న కారణం. జీవితానికి మనం ఇచ్చుకునే నిర్వచనం. ఎవరి ikigai వారే నిర్దేశించుకోవాలి. ఇంకా కొంచెం వివరంగా చెప్పాలంటే మనం ఎలా బ్రతకాలి అన్నది.
ఒకినోవా ద్వీపంలో ఉన్నవారి ikigaiలో ప్రధానంగా ఐదు అంశాలు ఉన్నాయి. వారందరూ ఈ ఐదింటిని తమ జీవితంలో భాగం చేసుకున్నారు. ఈ ఐదింటి గురించి ఒకసారి చూద్దాం…
మొదటిది – ఉన్నదానితో తృప్తి పొందడం
…అంటే 99 క్లబ్బులో చేరకపోవడం. ఉన్నదానితో తృప్తి పొందడం అంటే నైరాశ్యం కాదు. సోమరితనమూ కాదు. అసంతృప్తిగా ఉండకపోవడం. ప్రస్తుతం ప్రపంచంలో అందరూ పరిగెడుతున్నారు. ఎందుకో చాలా మందికి తెలియదు. ఒకసారి జీవితంలో అసంతృప్తి వస్తే, దానికన్నా పెద్ద రోగం ఇంకోటి ఉండదు. పరుగు ఎక్కడ ఆపాలో తెలియదు. ఉన్నదానితో తృప్తి పొందాలంటే, మనం ఏం చేస్తున్నామో మనకు తెలియాలి. ఎందుకు చేస్తున్నామో కూడా తెలియాలి. ఈ రెండూ తెలిసిన తర్వాత అసంతృప్తికి తావు ఉండదు.
డబ్బులు అందరికీ కావాలి. అయితే ఎన్ని డబ్బులు? ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. ఇక్కడే చాలామందికి అసంతృప్తి ఉంది. బతకడానికి డబ్బులు కావాలా? డబ్బుల కోసం బతకాలా? ఇందులో క్లారిటీ వస్తే ఎవరైనా సరే సంతృప్తిగా ఉంటారు. దాదాపు ప్రపంచం మొత్తం ఇక్కడే కన్ఫ్యూజన్లో ఉంది.
రెండవది – తక్కువ తినడం
“బతకడం కోసం తినాలా? తినడం కోసం బతకాలా?” ఇక్కడ కూడా ప్రపంచంలో చాలామందికి క్లారిటీ లేదు. కొంతమంది కేవలం తినడం కోసం బతుకుతారు. ఇక్కడ బతకడం కోసం తినడం అంటే మనకు ఇష్టం వచ్చినవి తినకూడదు అని కాదు. మంచి ఆహారం, తగినంత మోతాదులో, సరైన సమయంలో తినడం. Right food, Right quantity, Right Time. అన్నది మంచిది.
ద్వీపంలో దాదాపుగా అందరూ దీన్ని ఖచ్చితంగా పాటిస్తారు. పైగా అక్కడ దొరికే ఆహార పదార్థాలు కూడా మంచి పోషక విలువలు కలిగినవి. క్వినోవా రైస్ అక్కడివే. అంతేకాకుండా ఎక్కువ భాగం వండని ఆహార పదార్థాలు వారి రోజువారి భోజనంలో భాగం.
“ఆహారాన్ని మందు లాగా తీసుకోవాలి, లేకుంటే మందులే ఆహారంగా తీసుకోవాల్సి వస్తుంది”.
మూడవది – బంధాలకు విలువ ఇవ్వడం
ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. బంధాల సంగతి అటుంచితే, మానవ సంబంధాలు బాగా క్షీణించి పోతున్నాయి. ఒకరినొకరు పట్టించుకునే పరిస్థితి లేదు. స్వార్థం ఎక్కువైపోయింది. ఆ ద్వీపంలో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అక్కడ వారందరూ రోజు ఒకరినొకరు పలకరించుకోవడం, ఎవరైనా విచారంగా ఉంటే అందరు వెళ్లి వారిని పరామర్శించడం, వీలైతే వారి కష్టాలను పంచుకోవడం చేస్తారట. అందుకే వారి బంధాలు బలంగా ఉంటాయి. అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఈ కరోనా సమయంలో మానవ సంబంధాలు కాదు, మానవత్వమే కరువైనా సంఘటనలు ఎన్నో చూస్తున్నాం, వింటున్నాం.
నాలుగవది – రోజూ వైవిధ్యంగా జీవించడం.
రొటీన్ అన్న పదం వారి దైనందిన జీవితంలో లేదు. నిత్యం ఏదో కొత్తదనం కోసం వారు తపిస్తుంటారు. కొత్త కొత్త ప్రదేశాలు చూడటం, ప్రకృతిలో మమేకం కావడం వారు పాటించే సూత్రమని అర్థమైంది. రొటీన్ జీవితం కూడా ఒక్కోసారి నిరాశ నిస్పృహలకు దారితీస్తుంది. జీవితం రొటీన్ గా ఉండకుండా ఉండాలంటే మార్పుకు సిద్ధమై ఉండాలి. లేకుంటే ఎవరి జీవితమైనా రోటీన్ గా ఉంటుంది. అందుకే ఆ ద్వీపంలో ఉన్న వారందరూ వైవిధ్యభరితమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడతారు. కొత్త కొత్త సంబంధాలు, బంధాలు ఏర్పరుచుకోవడం అన్నది వారు పాటిస్తారు.
ఐదవది – నిత్యం నవ్వుతూ ఉండటం
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలామంది దీని ప్రాధాన్యతను గుర్తించడం లేదు. ఇదివరకు నవ్వు నాలుగు విధాల చేటు, ఇప్పుడు నలభై నాలుగు విధాల మేలు. కేవలం నవ్వడం వలన చాలా రోగాలు రావు, ఒకవేళ వచ్చినా పెద్ద సమస్య ఉండదు.
సంతోషంగా ఉండే వ్యక్తులందరికీ ఏడు లక్షణాలు కామన్ గా ఉంటాయని తెలిసింది.
ఈ ఇదు సూత్రాల ఆధారంగా వారు సంతోషంగా జీవించడంలో ప్రపంచానికి గొప్ప స్పూర్తినిస్తున్నారు.
ఇక్కడ మరో విషయం. సంతోషం గురించి జరిగిన ఒక సర్వేలో తేలిన విషయం ఏంటంటే, సంతోషంగా ఉండే వ్యక్తులందరికీ ఏడు లక్షణాలు కామన్ గా ఉంటాయని తెలిసింది. అవేంటో చూద్దాం..
సంతోషాల సప్తపది
1. కృతజ్ఞతా భావం. సంతోషంగా ఉన్న వాళ్ళు కృతజ్ఞతలు కలిగి ఉంటారు. జీవితంలో చిన్న
చిన్న విషయాలకు కూడా కృతజ్ఞతలు తెలుపుతారు.
2. వర్తమానంలో జీవించడం. సంతోషంగా ఉన్న వాళ్ళు ఎప్పుడూ గతం గురించి గానీ, భవిష్యత్తు గురించి గానీ అసలు పట్టించుకోరు.
3. సంతోషంగా ఉన్నవారంతా హాస్య ప్రియులు. వాళ్లకి సెన్సాఫ్ హ్యూమర్ ఉంటుంది. నవ్వు నాలుగు విధాలా చేటు కాదు, నలభై నాలుగు విధాల మేలని వారికి బాగా తెలుసు. వారు ముఖ్యంగా భావించేది ఏంటంటే ” సమస్యలు వచ్చినప్పుడు నవ్వడం వల్ల సమస్యలు తీరిపోవు కానీ, నీ కష్టాలను ఎదుర్కొనే సామర్థ్యం ఇంకా పెరుగుతుంది”.
4. సంతోషంగా ఉండే వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఎక్కువ. వాళ్ళకి తమ సామర్థ్యం మీద అపారమైన నమ్మకం ఉంటుంది. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలమన్న విశ్వాసం వారి సొంతం. ఆత్మవిశ్వాసం అన్నది సంతోషానికి దగ్గర బంధువు. చాలా మంది సంతోషంగా ఉండేవాళ్ళు, క్లిష్టమైన పరిస్థితుల్లో నే రాణిస్తారు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా భయపడకుండా ఉండగలుగుతారు.
5. పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మలుచుకోవడం సంతోషంగా ఉన్న వాళ్ల ముఖ్యమైన లక్షణం. అనుకోని పరిస్థితులు ఎదురైనా, బెంబేలు పడకుండా, తమని తాము పరిస్థితులకనుగుణంగా మార్చుకోగలుగుతారు. అలాగే పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోగలగుతారు.
6. సంతోషంగా ఉండే వాళ్ళు ఆశావాదులు. నిరాశను వారు ఎప్పుడూ దగ్గరికి రానివ్వరు. వాళ్లు ప్రతి దాన్ని పాజిటివ్ గానే తీసుకుంటారు. అటువంటి పాజిటివ్ దృక్పథం వల్లనే వారు నిరంతరం ఆశావాదాన్ని ప్రతిబింబిస్తూ ఉంటారు.
7. వాళ్లు డబ్బుకి, పదవులకి, ఇతర భౌతికమైన విషయానికి పెద్దగా విలువ ఇవ్వరు. స్నేహానికి, విలువలకు, కుటుంబానికి, సంతోషానికి ప్రాధాన్యతనిస్తారు. ఆస్తులు సంపాదించడం కన్నా, ఆప్తులను సంపాదించుకోవడం లోనే సంతోషాన్ని పొందుతారు.
అందులో కనీసం నాలుగు ఉంటే కొంచెం అయినా సంతోషంగా ఉంటారని ఒక అంచనా. మరి చూడండి.