Editorial

Monday, December 23, 2024
ఆధ్యాత్మికంఇంద్రియ నిగ్రహమే విజయానికి గీతా సారం - గన్నమరాజు గిరిజామనోహరబాబు తెలుపు

ఇంద్రియ నిగ్రహమే విజయానికి గీతా సారం – గన్నమరాజు గిరిజామనోహరబాబు తెలుపు

‘ఓ అర్జునా! ఎవరియొక్క ఇంద్రియాలు వారిచేత నిగ్రహింపబడి ఉంటాయో అటువంటివారి జ్ఞానమే సుస్థిరమైన జ్ఞానం. అటువంటివారే ‘స్థితప్రజ్ఞులుగా పిలువబడతారు’’ అని చెప్పిన మాట కేవలం అర్జునుని యుద్ధ సందర్భంలో మాత్రమే గాక జీవితంలోని వివిధ సందర్భాల్లోనూ ఉపయోగపడేమాట.

” తస్మాద్యస్య మహాభాహో! నిగృహీతాని సర్వశః ।
ఇంద్రియాణీంద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ॥’’

ఆధ్యాత్మిక సాధనలో అతిముఖ్యమైన అంశం ఇంద్రియ నిగ్రహం. ప్రతి వ్యక్తి ఈ మార్గంలో ముందుగా సాధించవలసిన ఈ అంశం గురించే అన్ని గ్రంథాలు కూడా వివరంగా చెప్పాయి.

అర్జునునిలోని యుద్ధ వైముఖ్యాన్ని పోగొట్టి, అతణ్ణి కర్తవ్యోన్ముఖుణ్ణి చేయవలసిన అవసరం ఏర్పడ్డ సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్ముడే పూనుకొని బోధించిన భగవద్గీతలో చాలాచోట్ల ఇంద్రియ నిగ్రహాన్ని గురించి వివరించాడు. ముఖ్యంగా సమచిత్తతతో ఆలోచించి సుఖదుఃఖాతీతుడైన స్థితప్రజ్ఞని స్థిరచిత్తతకు ఆధారమైన అంశం ఈ ఇంద్రియ నిగ్రహ ప్రవృత్తియే అంటూ ‘‘ఓ అర్జునా! ఎవరియొక్క ఇంద్రియాలు వారిచేత నిగ్రహింపబడి ఉంటాయో అటువంటివారి జ్ఞానమే సుస్థిరమైన జ్ఞానం. అటువంటివారే ‘స్థితప్రజ్ఞులుగా పిలువబడతారు’’ అని చెప్పిన మాట కేవలం అర్జునుని యుద్ధ సందర్భంలో మాత్రమే గాక జీవితంలోని వివిధ సందర్భాల్లోనూ ఉపయోగపడేమాట. ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలనుకున్నవారి విషయంలో ఇది తప్పనిసరిగా పాటించవలసిన ప్రధాన కర్తవ్యంగా భావించాలి.

కోరికలన్నింటినీ తీర్చుకోరాదని ఎప్పుడూ భారతీయ శాస్త్రాలు చెప్పలేదు. విచక్షణజ్ఞానాన్ని ఉపయోగించి వ్యక్తి వాటిని తీర్చుకోవాలని బోధించాయి శాస్త్రాలు. ఇక్కడే మనిషికి ఇంద్రియ నిగ్రహం కావాలి.

మానవునిలోని పంచేంద్రియాలు అంటే కళ్ళు, నోరు, చెవులు, చర్మం, ముక్కు` ఇవికాక కర్మేంద్రియాలుగా మరో ఐదింటిని ధర్మశాస్త్రాలు చెప్పాయి. మొదటి ఐదు ఇంద్రియాలను జ్ఞానేంద్రియాలుగా చెబుతూ వీటిని తన ఆధీనంలో పెట్టుకొనవలసిన బాధ్యత మనిషిదే. ఈ ఐదింటికీ అనేక కోరికలు ఉంటాయి. అవి మనిషిని కోరికలు తీర్చుకొనే దిశగా ప్రేరేపిస్తూ ఉంటాయి. దానిలోని మంచిచెడులను ఆలోచించి నిర్ణయం తీసుకోవలసిన బాధ్యత నిస్సంశయంగా మనిషివే.

కోరికలనేవి అగ్ని వంటివి. అగ్ని దహించినట్లుగా అవికూడా మన జీవితాల్ని బుగ్గిపాలు చేస్తాయి. భగవంతుడు తనకిచ్చిన బుద్ధిబలంతో మనలోని కోరికలలో ఏవి మంచివి, ఏవి చెడ్డవి అని ఆలోచించి విచక్షణతో మనిషి వాటిని తీర్చుకునే ప్రయత్నం చెయ్యాలి. కోరికలన్నింటినీ తీర్చుకోరాదని ఎప్పుడూ భారతీయ శాస్త్రాలు చెప్పలేదు. విచక్షణజ్ఞానాన్ని ఉపయోగించి వ్యక్తి వాటిని తీర్చుకోవాలని బోధించాయి శాస్త్రాలు. ఇక్కడే మనిషికి ఇంద్రియ నిగ్రహం కావాలి. అతని దృష్టిలో అన్నీ మంచివే అనిపిస్తుంటాయి. అన్నీ అవసరమే అనిపిస్తుంటాయి. కాని వాటిలో కొన్ని మన జీవితానికీ, మానవ సమాజానికి కూడా ప్రతికూలమై ఉండేవి కూడా ఉంటాయి. వాటి విషయంలోని ప్రతివాడు జాగ్రత్తపడాలి.

ఆధ్యాత్మిక సాధకులైన మానవులు చిత్తశాంతిని అభిలషించాలనుకున్నప్పుడు విధిగా ఇంద్రియ నిగ్రహాన్ని సాధించే ప్రయత్నం చిత్తశుద్ధితో చెయ్యాలి. అదే విజయసాధనమై నిలిచిపోతుంది. చాలా సులభంగా లక్ష్యం సాధింపబడుతుంది.

కళ్ళేమో కంటికి ఇంపుగా కనిపించేవన్నీ తనకే కావాలనిపిస్తాయి, నోటికి అన్నీ అమర్చాలని అనిపిస్తుంటుంది, చెవులు ఎప్పుడూ చెడుమాటలను వినడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటాయి. చర్మం తనకు స్పర్శ సుఖం కావాలి అది అనైతికమైనదైనా సరేననిపిస్తుంటుంది. ముక్కు కూడా వాసనలు పసిగడుతూనే తన కిష్టమైనవన్నీ కావాలని కోరుకుంటుంటుంది. దీనికి పరిమితులుండవు. కాబట్టి ప్రతిదానిని లోతుగా ఆలోచించి తనకు యుక్తమైన వాటినే మనిషి తీర్చుకోవాలి తప్ప, అన్ని కోరికలనూ తీర్చుకోవాలన్న దురాశకు లోను కారాదు. ఆ విషయాన్నే స్మృతులుగా కూడా

‘‘ఇంద్రియాణాం ప్రసంగేన దోషమృచ్ఛత్య సంశయమ్ ।
సన్నియమ్యతు తాన్యేవ తతః సిద్ధిం నియచ్ఛతి ॥’’

అన్నాయి. చర్మం స్పర్శ మీదకు, నేత్రేంద్రియం రూపం మీదకు, జిహ్యేంద్రియం రుచి మీదకు, ఘ్రాణేద్రియం వాసన మీదకు శ్రోత్రేంద్రియం శబ్దం మీదకును అత్యాశతో ప్రసరింపజేయుటవల్ల మనస్సుకు చంచలత్వం కలుగుతుంది. ఆ చాంచల్యం వల్ల మనిషి తప్పుగా ప్రవర్తించే ప్రమాదం ఉంటుంది. దానిని నిగ్రహించుకొని సన్మార్గం దిశగా మనిషి సాగాలి.

సుఖాలు అనుభవించడం వల్ల కోరికలు చల్లారవు. పైగా అవి ఎక్కువౌతుంటాయి. అగ్నిహోత్రంలో హోమద్రవ్యమైన హవిస్సు వేస్తుండడం వల్ల అవి ఆరిపోవుటకు బదులు మరింతగా వృద్ధి పొందుతుంటుంది

సుఖాలనేవి మానసికమైనవి. భౌతికంగా ఎన్ని సుఖాలనుభవించినా తృప్తి తీరదు. పైగా కోరికలు మరింత పెరిగిపోతాయి. ఆ విషయాన్నే…

‘‘నజాతు కామః కామానా ముపభోగేన శామ్యతి ।
హవిషా కృష్ణ వర్త్మేన భూయ ఏవాభివర్ధతే ॥’’

అనే ఈ శ్లోకం చెప్పింది. ‘‘సుఖాలు అనుభవించడం వల్ల కోరికలు చల్లారవు. పైగా అవి ఎక్కువౌతుంటాయి. అగ్నిహోత్రంలో హోమద్రవ్యమైన హవిస్సు వేస్తుండడం వల్ల అవి ఆరిపోవుటకు బదులు మరింతగా వృద్ధి పొందుతుంటుంది’’ కాబట్టి కోరికలు తీర్చుకోవాలి కాని వాటిని కొంతవరకు నిగ్రహించుకునే ప్రయత్నం తప్పనిసరిగా చెయ్యాలి.

ఇంద్రియ నిగ్రహం వల్ల మనస్సు స్థిరంగా నిలుస్తుంది. తాను ఉపాసించే దైవం దిశగా తన ప్రయాణం సులభంగా సాగుతుంది. దానివల్ల తాను అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. అది ఉత్తమస్థాయిని కల్పిస్తుంది. అందుకే ఆధ్యాత్మిక సాధకులైన మానవులు చిత్తశాంతిని అభిలషించాలనుకున్నప్పుడు విధిగా ఇంద్రియ నిగ్రహాన్ని సాధించే ప్రయత్నం చిత్తశుద్ధితో చెయ్యాలి. అదే విజయసాధనమై నిలిచిపోతుంది. చాలా సులభంగా లక్ష్యం సాధింపబడుతుంది.

మనో ధైర్యముంటే తప్ప ఇది అంత సులభంగా సాధ్యం కాదు కనుక సాధకుడు తొలుత వాక్కును, తరువాత శరీరాన్ని ఆ తరువాత ఇతర ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని ముందడుగు వెయ్యాలి. అది ఆ మనిషికి సంపూర్ణ విజయాన్ని సాధించి పెడుతుందన్నది అక్షరసత్యం.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article