హీనాంగాన్ అతిరిక్తాంగాన్, విద్యాహీనాన్ వయోధికాన్
రూపద్రవ్య విహీనాశ్చ జాతిహీనాంశ్చ నాక్షిపీత్
లోకంలో అందరూ శక్తివంతులు ఉండరు. అంగవికలురు, అధిక అవయవాలు ఉన్నవారు, విద్యావిహీనులు, వృద్ధులు, ధనహీనులు మొదలైన వారు ఎందరో ఈ ప్రపంచంలో ఉంటారు. మానవి విలువలకు ప్రాధాన్యమిచ్చేవారు, తమతోటి వారిని ప్రేమించేవారు ఎవ్వరైనా ఇటువంటి వ్యక్తుల విషయంలో విధిగా మంచితనాన్నే ప్రదర్శించాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళను అవమానించరాదు, ఆక్షేపించరాదు అని భారతీయ స్మృతులు బోధించాయి.
ఎక్కడ మానవత్వం చిన్నబొతుందో, అక్కడ ఆధ్యాత్మికత లేనట్లేనని ప్రాచీనుల భావన. అందుకే ప్రతి చిన్న విషయాన్ని కూడా స్పష్టమైన రీతిలో బోధించే ప్రయత్నం చేశారు.
సాధారణంగా ప్రతి వ్యక్తిలో కొన్ని లోపాలుంటాయి. కొన్ని బలహీనతలు ఉంటాయి. దాన్ని ఆధారంగా చేసుకొని ఆ లోపాలనే ఎత్తిచూపే విధంగా ప్రవర్తించడం మానవత్వానికే మాయని మచ్చ. పైగా అది నేరం కూడా. నేర ప్రవృత్తిని కలిగి ఉన్న వ్యక్తులే ఎదుటివారిలో కనిపించే లోపాలను ఎత్తిచూపుతుంటారు. తమ ఆధిక్యాన్ని ప్రదర్శించుకోవడానికి వాళ్ళ లోపాలను ఉపయోగించుకుంటుంటారు. ముఖ్యంగా అంగవైక్యల్యం ఉన్నవారితో మన ప్రవర్తన గౌరవప్రదంగా ఉండాలి తప్ప మరోవిధంగా ఉండరాదు. అటువంటివారిని మహాభారతం మూర్ఖులుగా భావించింది.
దృష్టాంధ బధిర వ్యంగాన్ అనాథాన్ రోగణస్తథా
దయాన భాయతే యేషాం తే నోచ్యా మూఢ చేతసాః
అని స్పష్టంగా చెప్పింది. గుడ్డివారు, చెవిటివారు, అంగవికలురు, అనాథలు, రోగులు ఇటువంటి వారి పట్ల దయచూపించాలే తప్ప వికృతంగా వ్యవహరించరాదు. ఆ విధంగా వ్యవహరించినవాడు మూర్ఖుడు అని చెప్పి ఇది శోచనీయ విషయంగా పరిగణించింది భారతం.
విష్ణుధర్మొత్తర పురాణం కూడా ఇదే మాట చెబుతూ ఉంది.
దీనాంధ కృపణానథవాగ్విహీనేషు యత్తథా
వికలేషు తథాన్యేషు జడవామన పంగుషు
రోగార్తేషు చ యద్దత్తం తత్‌స్యాత్ బహుఫలం ధనమ్
దుఃఖితులైన దీనులు, గుడ్డివారు, దరిద్రులు, మూగవారు, పొట్టి గూని వంటి లక్షణాలున్నవారు, కుంటివారు- మొదలైన బలహీనులకు రోగాలతో బాధపడుతున్నవారి కొరకు దయకలిగి దానము చేసినవారికీ మహాఫలము లభిస్తుంది అని చెప్పడం వెనుక మనం జీవిస్తున్న సమయంలో మనం ఎవ్వరినీ బలహీనులనే కారణం వల్ల ఉపేక్షించరాదు, అవమానం చేయరాదని చెప్పడం మన బాధ్యతను గుర్తు చెయ్యడమేగాని మరొకటి కాదు.
నేర ప్రవృత్తిని కలిగి ఉన్న వ్యక్తులే ఎదుటివారిలో కనిపించే లోపాలను ఎత్తిచూపుతుంటారు. తమ ఆధిక్యాన్ని ప్రదర్శించుకోవడానికి వాళ్ళ లోపాలను ఉపయోగించుకుంటుంటారు.
పురాణాలు, ఇతిహాసాలు, శ్రుతులు, స్మృతులు కూడా ఈ విషయంలో ఖచ్చితమైన నియమాలను విధించాయి. శుఖలిఖితస్మృతికృపణాతు రానా మథవ్యంగ విధవాబాలవృద్ధాన్ ఔషధా వసథాచ్ఛాదనైః బిబృయాత్- అన్న నియమాన్ని నిర్ణయించింది. అన్ని విషయాల్లో బాగున్నవారెవరైనా దరిద్రులు, రోగులు, అనాథలు, అంగవైకల్యం వారు, విధవలు, బాలకులు, వృద్ధులు మొదలైనవారి పట్ల బాధ్యతతో వారికి అవసరమైన ఔషధాలు, నివసించడానికి అవసరమైన స్థలాలు, భోజన వసతి, వస్ర వితరణ మొదలైన సహాయాలను తప్పక చేయాలి, చేసి వారిని పోషించవలసిన బాధ్యత కూడా వహించాలి.
కేవలం వైద్యశాస్త్రానికే పరిమితం కాకుండా చరక సంహిత కూడా సర్వాత్మనాచ ఆతురాణామారోగ్యీ ప్రయతనీయమ్ – అంటూ బలహీనులైన రోగుల విషయంలో వారికి ఆరోగ్యాన్ని సమకూర్చే విషయంలో మనం అన్ని విధాల ప్రయత్నాలు చెయ్యాలని చెప్పింది. ఇది ఆచరించినప్పుడే మానవ సమాజం ఆరోగ్యంగా ఉంటుందన్నది సత్యం.
సాధారణంగా మనిషిలో కొంత ఆధిక్య ప్రదర్శనా ప్రవృత్తి ఉంటుంది. ఇటువంటప్పడు ఆ ప్రవృత్తి బహిర్గతమై తానేదో ఘనకార్యం చేస్తున్నానన్న భావన తన హృదయంలో తొంగిచూస్తుంటుంది.
అయితే ఇటువంటి సందర్భాలలో మన ప్రవృత్తి ఏ విధంగా ఉండాలో కూడా మహా భారతమే స్పష్టం చేసింది. సాధారణంగా మనిషిలో కొంత ఆధిక్య ప్రదర్శనా ప్రవృత్తి ఉంటుంది. ఇటువంటప్పడు ఆ ప్రవృత్తి బహిర్గతమై తానేదో ఘనకార్యం చేస్తున్నానన్న భావన తన హృదయంలో తొంగిచూస్తుంటుంది. అందుకే భారతం అనుగృహ్ణాన్ న చాక్షిపేత్ అన్నది. ఎవరైనా బలహీనులకు సహాయపడే సందర్భంలో ఆ వ్యక్తులను గద్దించడం కాని, వాళ్ళపై అధికారాన్ని చూపడం కాని ఏ వ్యక్తి కూడా చేయకూడని పని. ఇది మనిషి ప్రవృత్తిని పూర్తి అవగాహన చేసిన వాళ్ళు మాత్రమే చెప్పగలిగేమాట.
మన భారతీయ జీవిత విధానంలో ఆధ్యాత్మికత అనేది విడదీయరాని ప్రధానమైన భాగం. ఆధ్యాత్మికత మనిషి మనసును పవిత్రం చెయ్యాలి, మానవతను వృద్ధి చెయ్యాలి. ఈ లక్ష్యంతోనే మన గ్రంథాలు కథల ద్వారా ఈ బోధలు చేసే ప్రయత్నం చేశారు. ఎక్కడ మానవత్వం చిన్నబొతుందో, అక్కడ ఆధ్యాత్మికత లేనట్లేనని ప్రాచీనుల భావన. అందుకే ప్రతి చిన్న విషయాన్ని కూడా స్పష్టమైన రీతిలో బోధించే ప్రయత్నం చేశారు. మానవ సమాజంలో వివిధ విధాలైన వ్యక్తులుండడం సహజం. దాంట్లో అర్హులైన వారు బలహీనుల పట్ల నిరసన భావం లేకుండా జీవించడమే నిజమైన ఆధ్మాత్మికతగా భావించాలి. ఇది తిరుగులేని సత్యం.