అది కేవలం చీకటి కాదు. చుట్టూ కూర్చున్న వందల మంది నిశ్శబ్దాల్ని దాచుకున్న ఓ సామూహిక అంగీకారం.
జీవితానికి సినిమాకీ ప్రధానమైన తేడా ఏంటి? జీవితంలో హాస్యమూ, దుఃఖమూ, సరసమూ, ఆనందమూ, విచారమూ అన్నీ కలిసే ఉంటాయి. మన జీవితాలు అన్ని రంగుల్నీ ఒకే సారి పూసుకుని వాటి వాటి సంక్లిష్టతలను ఏక కాలంలో సంధిస్తాయి. సినిమా అలా కాదు. ఏ రసాన్ని తెర మీద పండించాలనుకుంటే ఆ ఒక్క రంగునే తెర మీద పూసి సన్నివేశాన్ని హాస్యంగానో హృద్యంగానో మలుస్తుంది. తెర మీద ఆవిష్కరించబడుతున్న జీవితపు నమూనాని మనం ఎలా చూడాలి అన్న విషయంపై ఒక లాంటి నియంతృత్వాన్ని ప్రదర్శిస్తుంది సినిమా. సినిమా థియేటర్ కూడా అంతే. చుట్టూతా ప్రపంచానికి మన కళ్ళు కట్టేసినట్టు ఒక చీకటి వలయం మన చుట్టూ పరిచి తెర వైపే చూడమని బలవంత పెడుతుంది. మనం ఆనందంగా అంగీకరిస్తాం.
మన ఇంట్లో టీవీలోనో లాప్టాప్ లోనో సినిమా చూసేప్పుడు ఈ ఏకాగ్రత మనకున్నా, ఆ అనుభవానికి సంతకం చేసే చీకటి ఉండదు. ఎందుకంటే అది కేవలం చీకటి కాదు. చుట్టూ కూర్చున్న వందల మంది నిశ్శబ్దాల్ని దాచుకున్న ఓ సామూహిక అంగీకారం. కరోనా కాలంలో ఇంట్లో సినిమాలు చూసేప్పుడు ఎన్ని సార్లు “ఈ సీన్ థియేటర్ లో భలే పేలి ఉండేది” అని అనుకొని ఉంటాం? సినిమా చూసేప్పుడు మన ప్రతిస్పందనలు మనవి మాత్రమే కావని, అవి అదే థియేటర్ లో మనతో పాటు చూస్తున్న వాళ్ల స్పందన వల్ల అంతో ఇంతో పెరగడమో జరుగుతుందని మనకు ఎన్ని ఒంటరి సినిమాలు గుర్తు చేసి ఉంటాయి!
“ఏదైనా థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరబ్బా” అని ఎవరైనా అంటే రొటీన్ డైలాగ్ అనిపించేది కానీ అదెంత నిజమో ఆ రోజు గుర్తొచ్చింది.
మనందరం మళ్ళీ థియేటర్లలో ఏ భయం లేకుండా అలా కలిసి సినిమా చూసే రోజు త్వరలోనే వస్తుందని ఆశిద్దాం.
మొన్న జనవరిలో సంధ్య 70 mm లో The Dark Knight సినిమా స్పెషల్ షో వేస్తున్నారని తెలిసి ఏదో విధంగా నాలుగు టిక్కెట్లు సంపాదించాం. ఆ సినిమా మేమందరం అప్పటికే ఓ డెబ్భై సార్లు చూసి ఉంటాం. నిజంగా. Batman వీరోచిత విన్యాసాలు, జోకర్ గా నటించిన Heath Ledger అసాధారణ ప్రతిభ, వెంట్రుకలు నిక్కబొడుచుకునే Hans Zimmer సంగీతం కోసం మరో సారి థియేటర్ లో చూడాలని అనిపించి వెళ్ళాం. పదిహేనేళ్ల పైనే వచ్చి అందరూ టీవీలో ఎన్నో సార్లు చూసేసిన సినిమాకి ఎవరొస్తార్లే అనుకుంటే హౌస్ ఫుల్ అయింది. అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ మాలా ఆ సినిమాని కనీసం ఓ ఇరవై సార్లకు పైనే చూసిన వాళ్ళు. ఇంకేముంది. ప్రతీ డైలాగ్ కీ అశేష స్పందన. పోరాట సన్నివేశాల్లో ఐతే ఎవరూ సీట్ లో కూర్చోలేదు. సంక్రాంతి కి విడుదలయ్యే తెలుగు మాస్ సినిమాకి వెళ్లినట్టు అనిపించింది. “ఏదైనా థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరబ్బా” అని ఎవరైనా అంటే రొటీన్ డైలాగ్ అనిపించేది కానీ అదెంత నిజమో ఆ రోజు గుర్తొచ్చింది.
నిజ జీవితంలో ఓ ఇద్దరు మనుషులు ఏకాభిప్రాయానికి రావడం ఎంత కష్టమో మనకు తెలుసు. అలాంటిది సినిమా థియేటర్ లో వందల మంది ఒక సన్నివేశానికి ఒకేలా స్పందించడం ఓ చిన్నపాటి అద్భుతం అనిపిస్తుంది.
ఎన్నో సార్లు చిన్న తెర మీద చూసిన షాట్స్ లో ఎంత అబ్బురం ఉందో ఆ నైట్ టైం చైనా మీదుగా వెళ్లే డ్రోన్ షాట్ చూసినప్పుడు కానీ తెలియలేదు. వాహ్హ్హ్ అనుకున్నాం అందరం. నిజ జీవితంలో ఓ ఇద్దరు మనుషులు ఏకాభిప్రాయానికి రావడం ఎంత కష్టమో మనకు తెలుసు. అలాంటిది సినిమా థియేటర్ లో వందల మంది ఒక సన్నివేశానికి ఒకేలా స్పందిస్తూ “భలే ఉంది కదా” అనే విషయాన్ని ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండానే ఒకరితో ఒకరు చెప్పుకోవడం ఓ చిన్నపాటి అద్భుతం అనిపిస్తుంది.
ఫ్లాప్ సినిమా చూసి తల పట్టుకొని లాప్టాప్ మూయడానికీ, మన వెనక సీట్ లో కూర్చున్న కుర్రాళ్ళు వేసుకునే జోకులు వాళ్ళు పార్కింగ్ లో విడిపోయేవరకూ వాళ్ళ వెనకే నడుస్తూ వింటూ సైలెంట్ గా నవ్వుకోడానికీ ఎంత తేడా. మనందరం మళ్ళీ థియేటర్లలో ఏ భయం లేకుండా అలా కలిసి సినిమా చూసే రోజు త్వరలోనే వస్తుందని ఆశిద్దాం.
Face book లో స్వరూప్ ఆర్టికల్స్ చదివేవాళ్ళు చాలామంది ఉన్నారు. Cinema ను ప్రేమించే వాళ్లకు స్వరూప్ రాతలు మేకింగ్ video లాంటివి.