Editorial

Wednesday, January 22, 2025
సంపాద‌కీయంకూరెళ్ళ శ్రీనివాస్ 'చిత్రముఖ' : మృత్యువు ముంగిట జీవన హేల

కూరెళ్ళ శ్రీనివాస్ ‘చిత్రముఖ’ : మృత్యువు ముంగిట జీవన హేల

చిత్రముఖ. ఇది అప్రయత్నం. అసంకల్పితం. సర్వత్రా వ్యాపిస్తున్న మృత్యువు ముందు తలవంచి వినమ్రంగా జీవితాన్ని కొలిచిన వైనం.ఫేస్ బుక్ సామాజిక మాధ్యమంలో అనుదినం జరిపిన సంబుర కోలాహాలం. ఒక్క మాటలో తలెత్తి మానవుడి జీవించాలనే ఆకాంక్షకు ప్రతినిధులు కూరెల్లి చిత్రముఖాలు. వారి ప్రదర్శనకు అందరి తరపున కృతజ్ఞతలతో అభినందనలు తెలుపు సంపాదకీయం ఇది.

కందుకూరి రమేష్ బాబు 

సార్స్-సీవోవీ-2 వైరస్. ఇదే కరోనా వైరస్. ఇది ప్రకృతిలో సహజంగా పుట్టిందా లేక చైనాలోని ఒక ల్యాబ్ నుంచి ఉత్పన్నమై మానవ జనాభాను తాగ్గించి వేస్తున్నదా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. బహుశా ఇప్పుడపుడే తెలిసిరాదు. తెలిసే సరికి మరికొన్ని లక్షల మంది మరణిస్తారు కాబోలు. ఈ లోపల చనిపోయే వాళ్ళు చనిపోతూ పుట్టేవాళ్ళు పుడుతూనే ఉండొచ్చు. ఇది గనుక ప్రకృతి సహజం అయితే ఈ మహమ్మారి కేవలం మానవుడికే విషాదం తప్పా ప్రకృతిలో మరే ప్రాణికి సమస్య లేకపోగా లాభమే ఉండొచ్చు కూడా.

ఇదొక స్థితి. కారణాలేమైనా మనిషి అకస్మాత్తుగా అదృశ్యమైతున్న సందర్భం ఇది. అంతేకాదు, ఈ సందర్భంలో ఆ మనిషి బతికి బట్టకట్టినా… తన ఆయుష్షు ఒక్కపరి తరిగి పోయినా… అదంతా దురదృష్టం అని కుమిలిపోయే స్థితే తప్పా మరొకటి లేదు. యే లెక్కన చూసినా ఇదొక బీతివాహ కాలం. రాజ్యం సైతం చేతులెత్తేసి మనిషిని వాడి కర్మానికి వాడిని వదిలేయడం ఒక విషాద ముఖ చిత్రం.

అతడి ముఖం ఇప్పుడు వేరు. కరోనాకు ముందు వేరు. చిత్రమేమిటంటే, ఆ మేరకు తన పూర్వ జన్మ వంటి జీవితాన్ని తెలిసీ తెలియక ఒక చిత్రకారుడు ప్రదర్శన పెడుతుండటం చిత్రమే.

దగ్గినా తుమ్మినా అనుమానంగా చూసే స్థితి. గాలి… ఊపిరీ…భయానకంగా కనిపించే దుస్థితి. ఒక మనిషిని మరో మనిషి మునిపటిలా ఆలింగనం చేసుకునే స్థితి లేదు. సన్నిహితంగా మసిలే స్థితి లేదు. ఒకరి ఇంటికి వెళ్లి ఇంకొకరు హాయిగా గడిపే పరిస్థితి లేదు. కార్యాలయాలు రద్దయ్యాయి. ఇండ్లు కార్యాలయాలు అయ్యాయి. గృహిణిపై భారం పడింది. ఉద్యోగి గృహనిర్భంధంలోకి వచ్చాడు. తీవ్ర ఒత్తిడికి లోనయాడు. పిల్లలకు ఆటా పాటా కాదు కదా కనీసం బడి కూడా లేకుండా పోయింది. ఆన్ లైన్ అన్నది ప్రధాన స్రవంతి అయింది. జూమ్ మీటింగ్ ల వాకిట సమస్త జనావళి సభ సంస్కారాన్ని అలవర్చుకున్నది. ఇదంతా మొదటి విడత రెండో విడత కరోనా మహమ్మారి ఫలితం. ఒక్క మాటలో మానవుడి జీవన శైలి అన్నది కరోనాకు ముందు వేరు. తర్వాత వేరు. మరో రకంగా చెప్పాలంటే మానవుడి ఉనికి ముందు వేరు, తర్వాత వేరు. అకస్మాత్తుగా అత్యదునికుడిని అని మిడిసిపడే మానవుడి ప్రాపంచిక దృక్పథంలో మార్పు వచ్చింది. తాను వెనక్కి వెనక్కి వెళ్లి పురా జీవితంలో సేద తీరవలసి వస్తున్నది. ఇవన్నీ అనేక అంశాల సమాహారం అయితే, ఒకటి మాత్రం నిజం. అతడి ముఖం ఇప్పుడు వేరు. కరోనాకు ముందు వేరు. చిత్రమేమిటంటే, ఆ మేరకు తన పూర్వ జన్మ వంటి జీవితాన్ని తెలిసీ తెలియక ఒక చిత్రకారుడు ప్రదర్శన పెడుతుండటం చిత్రమే.

ఆ చిత్రాలు…మొత్తం ప్రదర్శన…అద్దంలో ప్రతిఫలించే మాదిరి అది చూపిస్తున్నది వర్తమానం కాదు. గతం.

నిర్భయంగా… తన మానాన తాను బతుకుతూ ఉన్నంతలో సముపార్జించుకున్న సహజ జీవితానికి ముఖపత్రం అది. అ ఆనవాళ్ళు ఒక ఫోటో తాలూకువి కావొచ్చు లేదా మరో ఫ్రీజ్ చేసిన మూమెంట్ ది కావొచ్చు. కానీ అది ఈ ఏడాదిన్నర కాలంలో నలిగిపోయిన జీవితానికన్నా …అంతకుముందు సాగించిన జీవన ప్రస్థానాన్నే చూపుతుంది. ఆ మేరకు మృత్యు ముఖంలో ఉన్న నేటి మానవుడి తలెత్తి నిన్నటి జీవితానికి కృతజ్ఞత చెప్పుకునే దాఖలా ఈ ప్రదర్శన.

కాగితం పూలుగా మారిన బతుకులకు అయన రంగులు అద్ది ప్రదరించడం అందుకే. కాళోజీ అన్నట్టు బతుకమ్మా… బతుకు. అదే కూరెళ్ళ శ్రీనివాస్ చిత్రకళా ఆదర్శం.

చిత్రకారుడు కూరెల్లి శ్రీనివాస్ ఉపాధ్యాయులు. కరోనా కారణంగా లాక్ డౌన్ సమయంలో యధాలాపంగా మొదలెట్టిన ఈ కృత్యం నిత్యకృత్యమై దాదాపు వంద రోజులకు పైగా ప్రతి రోజూ అయన కళలో సేద తీరాడు. పాండమిక్ లో లభించిన తీరుబాటు, ఏకాంతం,  బోర్ డం, వేదన, అంతర్గత సృజన, భౌతిక దూరం -అన్నీ కలిసి అతడిని ఉండనీయలేదు. ఇలా మనుషులతో గడిపాడు.

తన సర్కిల్ నుంచి మొదలై మెల్లమెల్లగా ఆయన తన పరిధి పెంచుకుంటూ వచ్చాడు. ఒక్కొక్కరిని , వారి ముఖ కవళికలను అధ్యయనం చేశాడు. వారి హావభావాలను అర్థం చేసుకున్నాడు. అందుబాటులో ఉన్న వారి ఒకానొక ఛాయాచిత్రంతో పాటు మరెన్నో ఛాయా చిత్రాలతో సరిపోల్చుకుని వారిని తమ రూపు  రేఖల్లో చిత్రించారు. నీటి రంగుల్లో తలా ఒక్కరికి తలంటాడు. ఒక్క దినంలోనే వారిని ప్రాణం పోసి నిలిపి చూపాడు. అట్లా నూటా ఎనిమిది రోజుల జీవన పారాయణం ఈ చిత్రకళా ప్రదర్శన. అయన వంద కాదు, మున్నూరు మందివి వేసినా జరిగేది ఇదే. మనిషి ముఖాన్ని చూడటం, పున:సృష్టి చేసి చూపడం. తద్వారా ఒక జీవితానికి మరింత ఆయుష్షు పెంచడం.

కాగితం పూలుగా మారిన బతుకులకు అయన రంగులు అద్ది ప్రదరించడం అందుకే. కాళోజీ అన్నట్టు బతుకమ్మా… బతుకు. అదే కూరెళ్ళ శ్రీనివాస్ చిత్రకళా ఆదర్శం.

కూరెళ్ళ శ్రీనివాస్ చిత్రముఖ : 108 వాటర్ కలర్ పోట్రేయిట్స్ ప్రదర్శన :  తెలంగాణ భాషా సాంసృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శన గురువారం 9 న పదకొండు గంటలకు ప్రారంభమై ఐదు రోజులు కొనసాగుతుంది. వేదిక – మాసాబ్ ట్యాంక్ లోని జె ఎన్ టి యూ కాలేజీలో ఉన్న నెహ్రూ ఆర్ట్ గ్యాలరీ.

ఇవన్నీ బతికున్న వారి చిత్రాలే. కానీ ఒక ముఖానికి రెండు నిదర్శనాలన్నట్టు కరోనా కాలంలో ఈ సృజన జీవన్మరణానికి దాఖలా. మనిషి ఉనికి ప్రశ్నార్థకం అవుతున్నప్పుడు చిత్రకారుడి కుంచెకు సర్రున పుట్టిన బిడ్డలు ఇవి. చిత్రమేమిటంటే ఇవి నేడు జీవితానికి సంబురాలు. రేపు ఒక్కక్కరూ పోతే, అవే తెల్లబోవు. నివాళి ఘటించు…అంజలి ప్రకటించు.

ఒక ఫోటోగా మీరెప్పుడో దిగిన మీ ఛాయా చిత్రాన్ని సప్త వర్ణాలతో ఆయన మరింత రాగరంజితం చేయడం ఎందుకూ అంటే అటువంటి ఒక ఘడియ వచ్చింది కనుక. గొప్ప గాంభీర్యంతో కళ్ళముందు నిలపడం ఎందుకూ అంటే లైఫ్ కి ట్రిబ్యూట్ చెప్పే సమయం ఆసన్నమైనంది కనుక. తప్పని స్థితిలో అయన తన పరిమితుల్లో ఒక్కక్కరిని అలంకరించారు. వారి గురించి అక్షరాల్లో చెప్పడానికి కవి మిత్రుడి రఘు సహకారం తీసుకోవడం కూడా ఒక చేర్పు. స్పర్శ. కవితా న్యాయం. కావునా ఇద్దరికీ అభినందనలు. బొమ్మగా మారిన వారంతా ఇక చిరంజీవులు.

ఒక్క మాటలో తలెత్తి మానవుడి జీవించాలనే ఆకాంక్షకు ప్రతినిధులు కూరెల్లి చిత్రముఖాలు.

ఇదిలా ఉంటే, విచిత్రమైన స్థితి ఏమిటంటే, ఇందులో ఎందుకు నేను ఉన్ననూ అంటే అది నా ఘనత అనుకోవడం. నిజానికి అది కాదు.అలాగే ఇందులో నేను ఎందుకు లేనూ అంటే అది నా దురదృష్టమూ కాదు. ఇదంతా ఒక కల్పన. యాదృచ్చికం. అప్రమేయం. అసంకల్పితం. ముందే చెప్పినట్టు వైరస్ సృష్టి. కానీ ఆత్మీయం. కాయనే పండు అవుతూ రాలిపడుతున్న వేళ ఒక వృక్షం తన వెళ్ళను తాను తడుముకున్నప్పటి దృశ్యం. అందుకు పులకరించాలి మనసు.

అందుకే అనడం, కరోనా కాలంలో జనించిన సృజన గొప్పదా కదా అని చర్చించడం మూర్ఖత్వం. ఇందులో నేనున్నానా లేదా అని చూసి మురవడం…నేను లేనని కాలు దువ్వడం అమాయకత్వం. ఇది ‘మనిషి ప్రకృతి’ మహమ్మారి ముందు సాగిలబడి చేసిన విన్యాసం. పరిమిత జీవితం ప్రతిఫలణం.

ఒక తల్లి తన కన్నబిడ్డను ఊయలలో వేసి పేరు పెట్టడానికే అందరిని పిలిచి మురిసిన చందం వంటిది ఈ ప్రదర్శన.

ఇది సర్వత్రా వ్యాపిస్తున్న మృత్యువు ముందు తలవంచి వినమ్రంగా జీవితాన్ని కొలిచిన చిత్ర సంకలనం. ఫేస్ బుక్ సామాజిక మాధ్యమంలో అనుదినం జరిపిన సంబుర కోలాహాలం. ఒక్క మాటలో తలెత్తి మానవుడి జీవించాలనే ఆకాంక్షకు ప్రతినిధులు కూరెల్లి చిత్రముఖాలు. వారి ప్రదర్శనకు అభినందనలు తెలుపు సంపాదకీయం ఇది.

చివరగా ఒక మాట. నిజానికి తాను గీసిన వాటిల్లో నలుగురే ఉంటే వారు మానవాళికి ప్రతీక అయ్యేవారు. పదుగురు ఉంటే ఒక ఏదో ఒక ధోరణికి నిదర్శనంగా ఉండేది. కానీ అయన వంద మందికిపైగా చిత్రించడంలోని అర్థం తన దృక్పథం ప్రాతినిధ్యం వ్యక్తుల గురించి చెప్పాలని కాదు, మొత్తం మానవాళిని చిత్రించి చూపాలన్న సహజమైన కుతూహలం. జీవన లాలస. అదేలాంటిది అంటే ఒక చిత్రకారుడు తన ప్రయోగ శీలతను తానే పరీక్షించుకుని కనులారా పరికించి చూడటం వంటిది. ఒక తల్లి తన కన్నబిడ్డను ఊయలలో వేసి పేరు పెట్టడానికే అందరిని పిలిచి మురిసిన చందం వంటిది. ఈ ప్రదర్శన చిత్రకారుడు హృది బహుజనం అని తెలుపు. అది తెలంగాణకు, ఎదో ఒక అస్తిత్వానికి పరిమితం చేయడం కూడా అనవసరం. ఇది జీవన హెల…మృత్యువు ముంగిట. కృతజ్ఞతలు సోదరా…

కూరెళ్ళ శ్రీనివాస్ ఫేస్ బుక్ టైం లైన్ ఇది. ఇక్కడ అందరి బొమ్మలు కనపడుతై.

 

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article