ఒక ఐటెం సాంగ్ లోని సాహిత్యం సంగీతం అందులోని బాణీలను ఆస్వాదించే తెలుగు ప్రేక్షకుల అభిరుచిని తప్పుపట్టకుండా వారికి మంచి పాటలు అందించే చేవగల సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ తాజా పాట ఇది. “ఏదీ లేదీడ నువు తాకని వస్తువు” అంటూ చక్కటి ఇతివృత్తం తీసుకుని ‘పని మనిషి’కి నీరాజనం పలికారాయన.
కందుకూరి రమేష్ బాబు
రచయితా, సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ ‘పని మనిషి’ పాటతో మరోసారి మన సామాజిక జీవన మూలాలను ఆత్మీయంగా తడుముతున్నారు. సొంత తావులేకుండా మన అందరి తావులను శుభ్రపరిచే ఆడబిడ్డలను, లక్షలాది సన్నజీవుల కష్టసుఖాలు ఆర్తిగా మనతో పంచుకుంటున్నారు. ప్రతి రోజూ మన గడప తొక్కే హౌజ్ మెయిడ్ గురించి హృద్యమైన సంగీతంతో వారొక పాటను స్వరపరిచి ఈ ఉదయం పదిగంటలకు విడుదల చేశారు.
ఈ పాటను ‘తనతో పాటు ప్రవస్తి గానం చేయగా అంటరాని మన్నువు’ అంటూ పని మనిషికి ఆర్ద్రంగా వారు నీరాజనం పలికారు. దీక్షిత, నల్లమల చంద్రన్న ఈ పాటను తమ సహజ నటనతో కళ్ళకు కట్టారు.
తెలుపు టివి గతంలో ఈ ‘సుక్కురారం మహా లచ్చిమి’ పాట విన్నారా? అని ఒక వ్యాసం రాసింది. అందులో ఈ నల్లగొండ బిడ్డ చరణ్ అర్జున్ గురించి, ఆ సంబుర పాట గురించి కూడా రాసింది. అతడే ఈ రోజు తన యూ ట్యూబ్ ఛానల్ GMC Television నుంచి మంచి ఈ పాటను విడుదల చేశారు.
పని మనిషికి మనిషిగా ఉన్న ఆశలు వీగిపోతున్న వైనాన్ని కూడా అలవోకగా ఆవిష్కరిస్తూ ‘పని మనిషీ… దొరకలేదా నీకు వేరే బతుకు దెరువు’ అనడం గుండెలను పిండేస్తుంది.
ఒక ఐటెం సాంగ్ లోని సాహిత్యం సంగీతం అందులోని బాణీలను ఆస్వాదించే తెలుగు వీక్షకుల అబిరుచిని తప్పుపట్టకుండా వారికి మంచి పాటలు అందించి తమలోని మానవీయతను తట్టిలేపే ప్రయత్నాలు ఎల్ల వేళలా ఉండనే ఉంటాయి. అటువంటి ప్రయత్నాలను తెలుపడం కూడా గర్వంగా ఉంటుంది. మరి చూడండి. ఈ ప్రయత్నంపై మీ స్పందన తెలుపండి.
పాట పూర్తి సాహిత్యం కింద అందిస్తున్నాం.
పల్లవి:
ఆళ్ళ ఇల్లు కడుగుతావు ఆళ్ళ ఒల్లు కడుగుతావు..
అంత పెద్ద మేడ లోన నీకు లేదు తావు..
ఆళ్లకన్ని వండుతావు దగ్గరుండి వడ్డిస్తావు..
సాటు కెళ్ళి సద్దిబువ్వ సట్టున మింగుతావు..
ఒకనాడైనా నీవు అసలడగవుగా నీవు..
ఎందుకంటే నువ్ రాకుంటే బంగుల మొత్తం తసువు..
దొరకలేద లోకాన ఇంకో బతుకు దెరువు..
పనిమనిషి.. పనిమనిషి.. పని అయిపోతే ఎల్లాలి బంగుల ఇడిసి..
పనిమనిషి పనిమనిషి కారే తుడిసి బోవాలి బస్తికి నడిసి.. //ఆళ్ళ //
చరణం1:
అల్లారమక్కర లేదు తెల్లారగ లేస్తావు..
సూరీడికన్న ముందే ఇంటిని వెలిగిస్తావు..
నీ అమ్మ నాలుగిండ్లు
నీకింకో పదిండ్లు..
ఊరంత మీ ఇండ్లే ఊరవతల నీ ఇల్లు..
పనికెళితేనే నీ పళ్లెంలో అన్నం..
నువ్వెళ్లకుంటే ఆడ గూడా ఉపవాసం..
ఆట కోయిలకు తెలియదు ఏ మోసం..
గోసలు ఎన్నున్న దాయదు ధరహాసం..
ఏదీ లేదీడ నువ్ తాకని వస్తువు..
కానీ నువ్వేమో అంటరాని మన్నువు..//ఆళ్ళ //
చరణం2:
నీ ఈడు పిల్లలకేమో నీ ముందే బోగాటం..
నీకేమో నిరంతరం పొట్టకూటి పోరాటం..
నువ్వెంత కష్టబడిన ఇవ్వరు ఏ బహుమానం..
పైగా ఏమన్న బోతే నీమీదే అనుమానం..
పండు ముసలి నుండి పసిపాపల దాకా నిండు అవసరము నీతో ఉన్నాక..
కుక్కలు పిల్లులకు ఇచ్చిన విలువైనా..
నీకివ్వరు ఎందుకు అడుగుతున్న తెలీక..
నలుగురి ముందేమో మహా రాచరికాలు ఒంటరిగుంటే అన్ని వదిలి ఎక సెకాలు..
పండుగొస్తే ముందు ఫంక్షన్ లో మొత్తం నువ్వు..
ఆల్బమ్ లోనేమో ఒక్క ఫొటోలోను లేవు..
నీకు యూనియన్లు లేవు ఒపీనియన్లు లేవు..
పనులెన్నో జేసే పనికిరాని శిలవు..