Editorial

Wednesday, January 22, 2025
కాల‌మ్‌'సూరజ్' కా సాత్వా ఘోడా - కొత్త శీర్షిక

‘సూరజ్’ కా సాత్వా ఘోడా – కొత్త శీర్షిక

suraj

‘సూరజ్’ కా సాత్వా ఘోడా – కొత్త శీర్షిక

సూరజ్ వి. భరద్వాజ్ సీనియర్ జర్నలిస్టు. ఉస్మానియాలో విశ్వ విద్యాలయంలో జర్నలిజంలో ఎంసిజె చదివిన ఈ కరీంనగర్ బిడ్డ అనతికాలంలోనే టెలివిజన్ జర్నలిజంలో తనదైన ముద్ర వేశారు. క్రైం  నుంచి పోలిటికల్ రిపోర్టింగ్ వరకు తనది చురుకైన పాత్ర, ప్రవేశం. ప్రస్తుతం టి న్యూస్ బ్యూరోలో  పనిచేస్తున్న తాను ముఖ్యమంత్రి, సచివాలయ కార్యకలాపాలను ప్రజలకు అందజేస్తున్నారు. మంచి వాక్యం రాయగల అరుదైన ఈ టెలివిజన్ జర్నలిస్టు ‘తెలుపు’ కోసం వార్తా విశేషాలను దాటి మనం చూస్తున్న లోకాన్నే సరికొత్తగా దర్శనం చేయిస్తారు.

ఖగోళంలో దెయ్యాలు!

మన కంటికి కనిపించినవన్నీ నిజాలు కావు. అదెలా అంటారా? అచ్చంగా విజ్ఞానశాస్త్ర ప్రకారమే! ఏంటీ, ఆశ్చర్యపోతున్నారా?
దెయ్యాలున్నాయా అని మిమ్మల్నెవరైనా సూటిప్రశ్న వేసారనుకోండి! మీ సమాధానం ఏంటి? నేనైతే టపీమని ఉన్నాయనే చెప్తాను! అదేంటి సైన్స్ ఇంతలా డెవలపవుతుంటే, వీడేంటి పిచ్చోడిలా మాట్లాడుతున్నాడు! దెయ్యాలున్నాయంటున్నాడు, అనుకుంటున్నారా? సరే, అది కాసేపు పక్కన పెట్టి, మరో విషయం చెప్పండి. మనం మన కళ్ళను నమ్ముతామా, లేదా? మనం చూసింది నిజమా కాదా? ఇదిగో ఇది నేను చూసాను! అందుకు నేనే సాక్ష్యం! నా రెండుకళ్ళతో నేనే స్వయంగా చూసాను కనక మీరెన్ని చెప్పినా నమ్మనని కూడా అంటుంటాం, అవునా కాదా! కానీ, మీరు స్వయంగా మీ కంటితో చూసిందే, అక్కడ లేదని తేలితే! మన కంటికి కనిపించినవన్నీ నిజాలు కావు, అబద్ధాలు కూడా అని రుజువైతే! అదేంటి వీడో మ్యాడ్ లా ఉన్నాడు! కంటికి కనిపించినా, అవి నిజాలు కావంటూ ఏదేదో నోటికొచ్చింది వాగుతున్నాడననుకోకండి! కొన్ని అంశాలను పరిశీలిస్తే నిజంగా మన కళ్ళను మనమే నమ్మాలా, వద్దా అన్న సందేహం కలుగుతుంది! చెప్పలేనంత సందిగ్ధంలో పడిపోతాం! అదెలా సాధ్యం అంటారా? అచ్చంగా విజ్ఞానశాస్త్ర ప్రకారమే! ఏంటీ, ఆశ్చర్యపోతున్నారా?
ఒక నిర్జన, ఎత్తైన ప్రదేశానికి వెళ్లి, నిశీధిరేయిలో వినువీధిలోకి తొంగిచూస్తే, చిన్నచిన్న పరిమాణాల్లో కొన్ని లక్షల సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ మిణుకుమిణుకు మంటూ మనకు దర్శనమిస్తాయి.
celestial
ఐతే, ఒక్కసారి విశ్వంలోకి తొంగిచూడండి, మీకే తెలుస్తుంది! అక్కడ వివిధ ద్రవ్యరాశులు, పరిమాణాలతో అనేకానేక ఖగోళ వస్తువులు/పదార్థాలు మీ కంటికి దర్శనమిస్తాయి! ఈ అనంత విశ్వంలో రోజూ కొన్ని కోటానుకోట్ల నక్షత్రాలు, నక్షత్ర సమూహాలు (గెలాక్సీలు), గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు, తోకచుక్కలు, ఉల్కల్లాంటివి ఖగోళ వస్తువులు/పదార్థాలు పుడుతుంటాయి, వాటంతటవే నశిస్తుంటాయి! ఇది విశ్వాంతరాళాల్లో సహజసిద్ధంగా చోటుచేసుకునే నిరంతర ప్రక్రియ. ఒక నిర్జన, ఎత్తైన ప్రదేశానికి వెళ్లి, నిశీధిరేయిలో వినువీధిలోకి తొంగిచూస్తే, చిన్నచిన్న పరిమాణాల్లో కొన్ని లక్షల సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ మిణుకుమిణుకు మంటూ మనకు దర్శనమిస్తాయి. కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉండటంతో మనం మన కంటితో వాటి నుంచి వెలువడే కాంతిని మాత్రమే చూడగలుగుతున్నాం! కానీ, భౌతికంగా వాటిని వీక్షించలేకపోతున్నాం! అసలు చూడటానికి కూడా ప్రస్తుతం అక్కడేమీ ఉండకపోవచ్చు! ఐతే, మరవి మనకెలా కనిపిస్తున్నాయంటే, దానికో చిన్న లెక్కుంది! ఖగోళ వస్తువు/పదార్థం నుంచి వెలువడుతున్న కాంతి మన భూమిని చేరడానికి కొన్ని కోట్ల కాంతి సంవత్సరాలు పడుతుంది!
నక్షత్రాలు స్వయం ప్రకాశితాలు! వాటి నుంచి వెలువడే కాంతి 1 సెకండుకు 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అంటే ఇది దాదాపు భూమికి చంద్రునికి మధ్య ఉన్న దూరమన్నమాట! ఆ లెక్కన ఒక్కసారి చంద్రుడి వైపు చూస్తే, కాంతివేగం ప్రకారం మనం ఒక సెకండ్ వెనక్కి చూసినట్లన్నమాట! ఇక ఈ బ్రహ్మాండంలో సూర్యుడు కూడా ఒక నక్షత్రమే! సూర్యుడికి దాని చుట్టూ ప్రదక్షిణ చేసే భూమికి మధ్య దూరం 149,203,714 కిలోమీటర్లు. ఆమేరకు సూర్యుడి నుంచి ప్రయాణించి కిరణాలు భూమిని చేరడానికి 8 నిమిషాలు పడుతుంది. ఆ లెక్కన మనం సూర్యుని దిక్కు చూసిన ప్రతిసారి ఓ 8 ని. లు గతంలోకి చూసినట్లన్నమాట! ఇక కాంతి సంవత్సరకాలంలో ప్రయాణించే దూరమే ఒక కాంతి సంవత్సరం. ఒక సంవత్సర కాలంలో కాంతి 6 మిలియన్ మిలియన్ మైళ్ళు ప్రయాణిస్తుంది! అలా మన కంటికి చేరిన కాంతిని అనుసరిస్తూ విశ్వంలోకి చూస్తే మనం కొన్ని మిలియన్ సంవత్సరాలు వెనక్కి (భూతకాలంలోకి) చూడొచ్చు! అంటే, బహుశా మనం చూసేటప్పటికి ఆ ఖగోళ వస్తువు/పదార్థం నశించిపోయి ఉంటుందన్న మాట!
celestial
నశించిపోయిన ఖగోళ వస్తువుల/పదార్థాల తాలూకు దెయ్యాలూ, మన కంటికి కనిపించినా నిజాలు కాని అబద్ధాలే!
ఒక్కమాటలో చెప్పాలంటే, అసలు గతాన్ని చూడకుండా మనం అంతరిక్షంలోకి చూడలేమన్నమాట! ఇక ప్రస్తుతం నుంచి భూత, భవిష్యత్ కాలాల్లో ప్రయాణించడానికి టైం మిషిన్ ఒక సాధనమని మోడర్న్ సైన్స్ ఉవాచ! గెలీలి గెలీలియో కనుక్కున్న టెలిస్కోపే ఓ టైం మిషిన్ అనుకుంటే, ప్రస్తుతం అది మనకు గతాన్ని మాత్రమే చూపిస్తోంది! ఈ విశ్వంలో మనకంటే విజ్ఞానవంతులైన జీవుల (గ్రహాంతరవాసులు లేదా ఏలియన్స్) జాడపడినా, లేదా మనకంటే అభివృద్ధి చెందిన మానవ సమాజాలున్న భూగ్రహాల్లాంటి ఇతర గ్రహాల ఉనికిని వెతికిపట్టినా, ఇదే టెలీస్కోప్ మనకు భవిష్యత్తు చూపించే టైం మిషిన్ అవుతుందనడంలో సందేహమే లేదు! ఇక ఖగోళ వస్తువుల/పదార్థాల కాంతిని మనం ప్రస్తుతకాలంలో చూడగలిగినా, అక్కడ వాటి తాలూకు భౌతిక ఆనవాళ్లు మాత్రం భూతకాలంలోనివే! ప్రజెంట్లో మనం వాటిని చూస్తోన్నా, అవి మనుగడలో లేనివే! ఇంకా చెప్పాలంటే నశించిపోయిన ఖగోళ వస్తువుల/పదార్థాల తాలూకు దెయ్యాలూ, మన కంటికి కనిపించినా నిజాలు కాని అబద్ధాలే!

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article