బుద్ధం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి
సంఘం శరణం గచ్ఛామి
ఈ రోజు బుద్ధ జయంతి- ఒక మహాజ్ఞానం అవతరించిన రోజు. ఒక మానవతా శిఖరం తలయెత్తిన రోజు. ఒక ధర్మధ్వజం రెపరెపలాడినరోజు.
సంఘాన్ని గురించి, సంఘ జీవనంలోని అపశ్రుతులను తొలగించాలన్నదాన్ని గురించి ఆలోచించి యావద్విశ్వానికి మార్గదర్శనం చేసిన మహానీయుడు గౌతమ బుద్ధుడు. సిద్ధార్దునిగా జన్మించి బుద్ధుడై ప్రపంచానికి జ్ఞానాన్ని పంచిన మానవతామూర్తి మనకిచ్చిన గొప్ప వరం బౌద్ధధర్మం. బౌద్ధ ధర్మాన్ని బోధించే మహా గ్రంథాలు త్రిపిటకాలుగా పిలువబడ్డాయి. సుత్తిపిటకం, వినయపిటకం, అభిదమ్మ పిటకం అనే ఈ త్రిపిటకాలు సంపూర్ణంగా బుద్ధుని ఉపదేశాలతో సామాన్య ప్రజలకొరకు పాళీభాషలో రాయబడ్డాయి. వందల సంవత్సరాలకు ముందే సమాజంలోని సామాన్యుని గురించి ఆలోచించిన ధర్మం బౌద్ధ ధర్మం. వీటిల్లో దీఘని కాయం, మజ్జిని కాయం, సంయుత్త నికాయం, అంగుత్త నికాయం, ఖుద్ధనికాయం అని అయిదు భాగాల నికాయలు మనకు దర్శనమిస్తాయి. బౌద్ధం అనగానే స్పురించే దమ్మం పదం – వీటిలోని ముఖ్యమైన భాగం.
బుద్ధుడు అనే మాటకు జ్ఞానోదయం పొందిన వాడు అని అర్ధం. మరి ఏ జ్ఞానం, ఎటువంటి జ్ఞానం అనే సందేహం వస్తూ ఉంటుంది. మానవ జీవితంలో తటస్థపడే దుఃఖమూలాలను అన్వేషించి వాటిని పరిహరించాలన్న ఆలోచననే జ్ఞనోదయంగా భావించవచ్చు. అదే అసలైన జ్ఞానం. అది ఉదయించిన పవిత్ర స్థలమే బుద్ధగయ. ప్రపంచ వ్యాప్తంగా బుద్ధుని బోధనలు ప్రభావితం చెయ్యడానికి కూడా సామాన్య మానవుని దుఃఖనివారణ గురించి బుద్ధుడు ఆలోచించడమే ప్రధానకారణం.
బౌద్ధం గురించిన ప్రసక్తి ఎక్కడ వచ్చినా మనకు వినిపించే మూడు వాక్యాలే మనం ప్రారంభంలో చెప్పుకున్న వాక్యాలు. వీటిని త్రిరత్నాలు, రత్న త్రయం అని కూడా సంభావిస్తుంటారు. వీటిలో మనకు మూడు ప్రధానమైన అంశాలు కనిపిస్తుంటాయి. బుద్ధుడు ధర్మం, సంఘం- అనే ఈ మూడూ బౌద్ధ ధర్మానికి పునాదులు. బుద్ధుణ్ణి మనం ఒక వ్యక్తిగా భావించరాదు. ధర్మ స్వరూపమే బుద్ధుడు. అనంతమైన ధర్మమనేది సంఘానికి ప్రయోజనకరమై, లోకంలోని మానవాళికి మేలు చేసేదై ఉండాలి. ఆ అనంత ధర్మమే బుద్ధుడై అవతరించింది.
ధర్మ ప్రసక్తి వచ్చినప్పుడు బుద్ధుని బోధనలు చాలా స్పష్టంగా చెప్పడం విశేషం. ఏ ధర్మాన్నయినా గుడ్డిగా అనుసరింపరాదు. దానిని గురించి యోచించి, యుక్తాయుక్త వివేచన చేసి ఆచరించాలన్నది బుద్ధుని బోధనల సారాంశం.
మానవునికి ప్రధానంగా ఇబ్బంది కలిగించేది దుఃఖం. ఇది తృష్ణ వల్లనే కలుగుతుందన్నది బౌద్ధధర్మంలో ముఖ్యమైన అంశం. అదుకని మానవులు తృష్ణకు దూరంగా ఉండాలి. తృష్ణ అంటే మితిమీరిన కోరికలు. ఇవి దుఃఖ మూలాలు. వీటిని దగ్గరకు రానివ్వని మానసిక స్థితిని సాధించుకోవాలి. దానికి సంఘం సహకారం కూడా తీసుకోవాలి. సంఘం అంటే సత్యాసత్యవివేచన కలిగి బుద్ధుని బోధనల మార్గంలో నడుస్తూ బౌద్ధధర్మాలను ఆచరించే వ్యక్తుల సమూహమే సంఘము. అటువంటి సంఘ సహకారం మనిషి తృష్ణలను దూరం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అది దుఃఖ నివారణకు మొదటి మార్గం. బుద్ధుడు బోధించిన అనేక ధర్మాలలో ప్రధానమైన ధర్మం అహింసాధర్మం. సృష్టిలోని ప్రతిప్రాణికీ జీవించే హక్కు ఉంది. ఒక ప్రాణిని మరొక ప్రాణి హింసించే హక్కు ఎవరికీ లేదు. ఆ హింస భౌతికం కావచ్చు, మానసికం కావచ్చు. ఏదైనా సరే అది మానుకున్నప్పుడు మనిషికి జ్ఞానోదయమవుతుంది. తృష్ణలను జయించడంలో మొదటి విజయం సాధిస్తాడు.
బౌద్ధ ధర్మాలను గురించి తెలుసుకోవడానికి ఏర్పరిచే మార్గాన్నే ధర్మచక్ర పరివర్తన అంటారు. ఈ ధర్మ నిర్వహణ కొరకు బౌద్ధం అష్టాంగమార్గాన్ని బోధించింది. అంటే ఎనిమిది మార్గాల ద్వారా ధర్మాచరణ చెయ్యాలన్నది తాత్పర్యం. వాటిలో పరుషంగా మాట్లాడకుండా మంచిగా మాట్లాడాలనే దానిని సమ్యక్ వచనము అని, మంచిపనులు చెయ్యడాన్ని సమ్యక్ కర్మము అని, మంచి ఆదర్శాలతో జీవించడాన్ని సమ్యక్ జీవనము అని, మంచి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం సమ్యక్ స్మృతి అని, మంచి పనులు చేసి విజయాలను పొందడం సమ్యక్ సాధన అన, మంచి పనుల మీదే చూపు నిలపడం సమ్యక్ దృష్టి అని, మంచిని మాత్రమే చెయ్యాలన్న ఆలోచనలుండటం సమ్యక్ సంకల్పం అని, మంచిధ్యాసతోనే నిత్యం ఉండటం సమ్యక్ సమాధి అని ఈ ఎనిమిది మార్గాలు అనుసరించడం వల్లనే సామాన్యుని నుండి సార్వభౌముని వరకు దుఃఖం నివారింపబడుతుంది. అదే బౌద్ధ ధర్మం, అదే బుద్ధుని జ్ఞాన బోధ.