Editorial

Monday, December 23, 2024
కాల‌మ్‌హంసలను వేటాడొద్దు : ఈ వారం మంచి పుస్తకం

హంసలను వేటాడొద్దు : ఈ వారం మంచి పుస్తకం

‘మంచి పుస్తకం’ఒక సంపద. తెలుపు అందిస్తున్న సగౌరవ శీర్షిక. ఈ పుస్తక పరిచయ పరంపరలో ‘హంసలను వేటాడొద్దు’ పదిహేనో పుస్తకం.

దీని గురించి రాయటానికి ఆలోచనలు కొలిక్కి రాక చాలా రోజులు తనకలాడాను. దీని కథానాయకుడు యెగార్. అతని గురించి రాయాలంటే నవల మొత్తం మళ్లీ రాయాలి.

యెగార్ మంచి వడ్రంగి, పనిమంతుడు. పని పట్ల ప్రేమ. ప్రకృతిని ఆరాధిస్తాడు. కుక్కలంటే ఇష్టం. అతనిలో సృజనాత్మకత ఉండి ఉండి వెల్లువెత్తుతుంటుంది. అయితే అతడికి లౌక్యం తెలియదు. జీవించటం తెలుసు కానీ జీవిక సంపాదించుకోవటం తెలియదు. వెరసి ఒక ‘అసమర్థుని జీవయాత్ర’ అని అనుకునేవాడిని. యెగార్ పట్ల నాకు ఎంతో ప్రేమ ఉంది. కానీ అతనిని సరిగా అర్థం చేసుకోవటంలో విఫలమయ్యానా అని అనిపిస్తూ ఉంటుంది. పుస్తకం ప్రచురితమయిన తరవాత యెగార్‌కి అసలైన అభిమాని రూపంలో కందుకూరి రమేష్ బాబు కనిపించాడు. ‘యెగార్ నా హీరో’ అంటాడు అతను. సామాన్యుడు అని అనుకున్నవాడు అవకాశం దొరికితే ఏం సాధించగలడో యెగార్ చూపించాడని రమేష్ బాబు అంటాడు. యెగార్‌ని ఈ కోణం లోంచి నేను ముందుగా చూడలేదన్నది నిజం.

తన కోసం ఏమీ చేసుకోవటం చేతగాని యెగార్ ఇతరుల కోసం ఏదైనా చెయ్యటం కోసం చొరవ, ధైర్యసాహసాలు చూపిస్తాడు.

తన కోసం ఏమీ చేసుకోవటం చేతగాని యెగార్ ఇతరుల కోసం ఏదైనా చెయ్యటం కోసం చొరవ, ధైర్యసాహసాలు చూపిస్తాడు. స్థానిక పాఠశాలలో టీచరైన నోనా కోసం కలప దొంగతనం చెయ్యటానికి కూడా సిద్ధపడతాడు. యువ అటవీ అధికారి యూరి వ్యక్తిగత జీవితంలోని సమస్యని పరిష్కరించటానికి మాస్కో వెళ్లినప్పుడు అతని మాజీ ప్రియురాలితో గట్టిగా మాట్లాడతాడు. ఎవరైనా పట్టణానికి వెళ్లినప్పుడు బంధువులు, స్నేహితుల కోసం బహుమతులు కొని తీసుకుని వస్తారు. కానీ యెగార్ మాస్కో వెళ్లినప్పుడు తమ ఊరి నల్ల చెరువులో లేకుండాపోయిన హంసల కోసం అక్కడి జంతుశాల అధికారులను బతిమాలి, వాళ్లతో పోట్లాడి రెండు హంసలను తీసుకుని వస్తాడు. అలాగే అడవిని కాపాడటానికి తన ప్రాణాలను కూడా బలి పెట్టేటంత సాహసాన్ని యెగార్ కనబరుస్తాడు.

మనసులో యెగార్ మెదులుతూనే, కలవరపెడుతూనే ఉన్నప్పటికీ దీనిని ఎవరు ప్రచురిస్తారో తెలియక వెంటనే అనువదించకపోవటానికి ఒక కారణం. చివరికి యెగార్ గెలిచి నాతో అనువాదం చేయించాడు.

Boris Vasilyev రాసిన Don’t Shoot the White Swans రష్యాలో1973లో ప్రచురితం అయ్యింది, 1980లో సినిమాగా వచ్చింది. బోరిస్ వాసిల్యెవ్ రాసిన ‘The Dawns are Quiet Here’ అన్న నవల ఎంతో ఆదరణ పొందింది. ‘ప్రశాంత ప్రత్యూషాలు’ అన్న పేరుతో తెలుగులోకి అనువాదం కూడా అయింది. మరి Don’t Shoot the White Swans ఎందుకు మరుగున పడిపోయిందో నాకు తెలియ లేదు.

సోవియట్ రష్యాలో మారుతున్న పరిస్థితులను ఈ నవల చిత్రించిందని నాకు అనిపిస్తుంది. ఉమ్మడి వ్యవసాయ క్షేత్రాలు అంతరించి పోతున్నాయి (యెగార్ ఒకప్పుడు ఉమ్మడి వ్యవసాయ క్షేత్రంలో పని చేశాడు. కానీ తోడల్లుడు ఫ్యొదార్ ప్రలోభ పెడితే అతని దగ్గరకు వచ్చేస్తాడు). వ్యక్తిగతంగా డబ్బులు చేసుకోటానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి (లిండెన్ చెట్ల బెరడు కొంటామని ప్రభుత్వం ప్రకటిస్తుంది). అధికారులలో అవినీతి ఉంది (స్థానిక అటవీ అధికారి అయిన ఫ్యొదార్ తన ఇంటి కలప కోసం అనుమతి లేకుండా అడవిలోని చెట్లను కొడతాడు. అలాగే డబ్బు అవసరం అయ్యి పంది మాంసం అమ్ముకుని వద్దామని పట్టణం వెళ్లిన యెగార్‌ని అక్కడి అధికారులు బెదరగొట్టి, మోసం చేసి తక్కువ ధరకు అమ్ముకునేలా చేస్తారు). లంపెన్ వర్గం ఏర్పడుతూ ఉంది (తాగుబోతులైన క్రోక్, ఫిల్ అమాయకులను మోసం చేసి డబ్బు సంపాదిస్తూ ఉంటారు, దొంగతనాలు చేస్తూ ఉంటారు). ఆ రకంగా చూస్తే ఈ నవల రష్యాలో ప్రచురితం కావటం కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది.

అయితే పర్యావరణ నవలగా పేర్కొనటం దీనికి ఒకింత అన్యాయం చేయటమే అవుతుందని నాకు అనిపిస్తుంది. పర్యావరణ స్పృహ ఎంతగా ఉందో రచయితకి సామాజిక (రాజకీయ) స్పృహ కూడా అంతగానే ఉంది. కాకపోతే పనికట్టుకుని చెప్పినట్టు ఉండదు.

Don’t Shoot the White Swansని ఇంగ్లీషులో చదివిన తరవాత దగ్గర దగ్గర పది సంవత్సరాల దాకా దీని అనువాదానికి పూనుకోలేదు. ఈలోగా ఇంగ్లీషు నవలని ఇంటర్‌నెట్ కోసం తయారు చేసి అరవింద గుప్తా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాం (ఇంగ్లీషులో నవల పూర్తి పాఠం కోసం ఈ లింకు చూడండి. మనసులో యెగార్ మెదులుతూనే, కలవరపెడుతూనే ఉన్నప్పటికీ దీనిని ఎవరు ప్రచురిస్తారో తెలియక వెంటనే అనువదించకపోవటానికి ఒక కారణం. చివరికి యెగార్ గెలిచి నాతో అనువాదం చేయించాడు. ముందుగా ఈ అనువాదాన్ని కినిగే ఈ-మ్యాగజైన్‌లో ధారావాహికంగా ప్రచురించటానికి దానికి ఎడిటర్‌గా ఉన్న మెహర్ ఒప్పుకున్నారు. అంతే కాకుండా అనువాదానికి సంబంధించి సూచనలు చేశారు, సంస్కృత పదాలు తక్కువగా ఉండేలా చూడాలని సలహా ఇచ్చారు. తెలుగు పదాలు తటాలున తట్టకపోవటం వల్లనో, లేక సంస్కృత పదాలతో పోలిస్తే తెలుగు పదాలు అంత ‘గంభీరంగా’ ఉండటం లేదనిపించో నా అనువాదాలలో సంస్కృత పదాలు దొర్లుతూనే ఉన్నాయి.

పుస్తకంగా ప్రచురించాలని అడిగినప్పుడు చిరకాల మిత్రుడు సుబ్బయ్య కావ్య పబ్లిషింగ్ హౌస్ తరఫున ఆ బాధ్యత చేపట్టాడు. చక్కని ముఖచిత్రంతో పుస్తకాన్ని తీర్చిదిద్దాడు. (బొమ్మ తెలుగు కవర్ పేజీ) ఆ రకంగా యెగార్‌ని తెలుగు పాఠకులకు పరిచయం చేయటంలో సహకరించిన మెహర్, సుబ్బయ్యలకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. ప్రచురణకర్తగా సుబ్బయ్య చక్కని పరిచయ వాక్యాలు రాశాడు. అలాగే ఆర్టిస్టు, జర్నలిస్టు అయిన టి. వెంకట్రావ్ (టి.వి.) ‘జీవ వైవిధ్యం కాపాడుకుందాం’ అంటూ ముందు మాట రాశారు. రష్యన్ పేర్లు పాఠకులకు బాగా తెలియటానికి ముఖ్యమైన పాత్రల పరిచయం నవల ప్రారంభానికి ముందు ఉంది. 2014లో ప్రచిరితమైన ఈ పుస్తకం ఇప్పుడు కూడా అందుబాటులో ఉంది (206 పేజీలు, వెల 150 రూపాయలు. దీనిని కొనుక్కోవాలంటే ఈ లింకు చూడండి.

సోవియట్ విప్లవం తర్వాత యాభై ఏళ్లకి కూడా ఇలాంటివి సన్నివేశాలు చోటు చేసుకున్నాయంటే ఆశ్చర్యకరంగానే కాక బాధాకరంగా కూడా ఉంటుంది. సామాజిక మార్పుకి ఎంతో కాలం పడుతుందని, దాని కోసం ఎంతో ముందు నుంచి కూడా కృషి మొదలు పెట్టాల్సి ఉంటుందని నాకు అనిపిస్తూ ఉంటుంది.

ఈ నవలని Environmental Fictionగా చాలామంది పేర్కొన్నారు. జీవ వైవిధ్యాన్ని కాపాడాలనీ, ప్రకృతిని రక్షించుకోవాలనీ, వాతావరణాన్ని కాపాడుకోవాలనే దృక్పథాన్ని 50 ఏళ్ల క్రితమే రచయిత బోరిస్ వాసిల్యెవ్ కలిగి ఉన్నాడని, ఆ ఆలోచనలతోనే ఈ నవల రాశాడని టి.వి. తను ముందుమాటలో పేర్కొన్నారు. ఈ పుస్తకంలోని ప్రకృతి పట్ల లోతైన అవగాహన నిజంగా ఆశ్చర్యపరుస్తుంది (ప్రకృతి తల్లిని మనం అణిచివేస్తున్నాం… అయితే ఏ మనిషీ ఆమెకి ప్రభువు కాదు… మనిషి ఆమెకు బిడ్డ మాత్రమే. ఆమె పెద్ద బిడ్డ… అమ్మని కాటికి పంపవద్దు). అయితే పర్యావరణ నవలగా పేర్కొనటం దీనికి ఒకింత అన్యాయం చేయటమే అవుతుందని నాకు అనిపిస్తుంది. పర్యావరణ స్పృహ ఎంతగా ఉందో రచయితకి సామాజిక (రాజకీయ) స్పృహ కూడా అంతగానే ఉంది. కాకపోతే పనికట్టుకుని చెప్పినట్టు ఉండదు. సోవియట్ రష్యాలో (మారుతున్న) పరిస్థితులను నవలలో భాగంగా రచయిత చక్కగా పట్టుకున్నాడు, మనస్తత్వాలను అద్భుతంగా చిత్రీకరించాడు.

సోవియట్ కల ముగిసినప్పటికీ యెగార్‌ది ఎప్పటికీ చెదిరిపోని, చెరిగిపోని జ్ఞాపకం.

‘చేతకానివాడు’ భర్త అయినందుకు యెగార్ భార్య హారితీనా బాధపడుతూ ఉంటే అసలు మొగుడు అనేవాడు ఉంటే చాలని పట్టణంలో పెరిగి, పల్లెటూరిలో టీచరుగా పనిచేస్తున్న పెళ్లి కాని నోనా బాధపడుతూ ఉంటుంది. ఆ వయస్సుకి తమకి ఎంత మంది పిల్లలు ఉన్నారోనంటూ గ్రామ మహిళలు ఆమెను మాటలతో పొడుస్తూ ఉంటారు. మహిళా దినోత్సవం నాడు నోనా సూట్ వేసుకుని వెళితే మిగిలిన టీచర్లు ఆమె వేషధారణని తప్పుపడతారు. సోవియట్ విప్లవం తర్వాత యాభై ఏళ్లకి కూడా ఇలాంటివి సన్నివేశాలు చోటు చేసుకున్నాయంటే ఆశ్చర్యకరంగానే కాక బాధాకరంగా కూడా ఉంటుంది. సామాజిక మార్పుకి ఎంతో కాలం పడుతుందని, దాని కోసం ఎంతో ముందు నుంచి కూడా కృషి మొదలు పెట్టాల్సి ఉంటుందని నాకు అనిపిస్తూ ఉంటుంది.

యెగార్ కొడుకు కోల్కా తండ్రిని మించిన పర్యావరణ ప్రేమికుడు, జాలి గుండె కలిగిన వాడు, భావుకుడు. అదనంగా అతనిలో కవి కూడా ఉన్నాడు! యెగార్, కోల్కా, నోనా, యూరి లాంటి మంచి వాళ్లకు తగిన పరిస్థితులను సోవియట్ రష్యా ఎందుకు కల్పించ లేకపోయింది, అలాంటి వాళ్లను ఇంకా ఎక్కువ సంఖ్యలో ఎందుకు తయారు చేసుకోలేక పోయింది వంటి ప్రశ్నలు నన్ను వెంటాడుతుంటాయి.

సోవియట్ కల ముగిసినప్పటికీ యెగార్‌ది ఎప్పటికీ చెదిరిపోని, చెరిగిపోని జ్ఞాపకం.

కాలమిస్టు పరిచయం

పాఠకుల అభిరుచికి పెద్దపీట వేయడం కారణంగా కొసరాజు సురేష్ గారు మంచి అనువాద పుస్తకాలు అందించిన ఘనతని మాత్రమే సొంతం చేసుకోలేదు, వారు ‘మంచి పుస్తకం’ ప్రచురణ సంస్థ ట్రస్టీగా వందలాది పుస్తకాల భండాగారాన్ని తెలుగు పాఠకులకు అందించి మనల్ని సంపద్వంతం చేశారు. వారి అనువాదాల్లో గడ్డికపరకతో విప్లవం మొదటిదైతే బాబోయ్:బడి! రెండవది. ‘సందిగ్ధ’ మూడవది. ‘నాకు నేను తెలిసే’ నాలుగవది. సమ్మర్‌హిల్‌ ఐదవది. ఆరవది ‘అనార్కో’. ఏడవది ‘జీవన గీతం’ . ఎనిమిదవది ‘యుద్ధోన్మాది అమెరికా’. తొమ్మిదవది ‘బార్బియానా బడి పిల్లల నుంచి టీచర్లకు ఉత్తరం’. పదవది ‘ప్రకృతి నేర్పిన పాఠాలు’. పదకొండవది పరుసవేది. పన్నెండవది ‘శివమెత్తిన నది’. పదమూడవది ఒక రోజా కోసం. పద్నాలుగవది ‘సింగారవ్వ’. చిన్నవి పెద్దవి కలిపి వారు వంద పుస్తకాల దాకా తెలుగు పాఠక ప్రపంచానికి అనువదించి ఇచ్చారు. ‘మంచి పుస్తకం’ శీర్షిక పేరిటే వారు ఆయా పుస్తకాలను ఇలా వారానికి ఒకటి చొప్పున మీకు పరిచయం చేస్తారు. 

Email: kosaraju.suresh@gmail.com
website: https://manchipustakam.in/

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article