Editorial

Wednesday, January 22, 2025
కాల‌మ్‌"కోడి - గంపెడు బూరు" : మా చిన్నాయి చెప్పిన కథ – శ్రీధర్ రావు...

“కోడి – గంపెడు బూరు” : మా చిన్నాయి చెప్పిన కథ – శ్రీధర్ రావు దేశ్ పాండే ‘బొంతల ముచ్చట్లు’

‘బొంతల ముచ్చట్ల’ సుతారమైన జ్ఞాపకాల దర్పణమే కాదు, మన మూలాలను ఆప్యాయంగా తడిమే వేదిక. గత వర్తమానాలను తరచి చూస్తూ ఆశావహమైన భవిత కోసం ఆలోచనలు పంచే సూచిక కూడా. చదవండి, మా నాయినమ్మ ‘కోడి – గంపెడు బూరు కథ. ఇంకొన్ని ముచ్చట్లు ఈ వారం.

శ్రీర్ రావు దేశ్ పాండే

మా నాయినమ్మ (చిన్నాయి) కథలు చెప్పడంలో అద్వితీయమైన ప్రతిభ కనబరచేది. ఆమె లెక్క కథలు చెప్పేవారు నా చిన్నప్పుడు ఎవరూ లేకుండిరి అంటే అతిశయోక్తికాదు. హృదయానికి హత్తుకునే గొప్ప నారేషన్ అమెది. ఆ నారేషన్ పిల్లలను కట్టి పడేసేది. ఈ తరం అమ్మమ్మలు, నాయినమ్మలు ఈ రకంగా కథలు చెప్పలేరనే చెప్పాలి. ఆమె చెప్పిన బాలనాగమ్మ కథ హృదయంలో నిలచిపోయింది. అత్తవారింట బాలనాగమ్మ పడిన కష్టాలు హృదయ విదారకంగా ఉండేవి. చివరకు బాలనాగమ్మను ఒక రాజకుమారుడు ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కథ సుఖాంతం అవుతుంది.

రాత్రి భోజనాలు అయిన తర్వాత పిల్లలు అందరూ చిన్నాయి చుట్టు చేరి కథలు చెప్పమనేది. ఆమెకు కూడా కథలు చెప్పడం ఇష్టమే. అనగనగా ఒక రాజు, ఒక ప్రతాని .. ఇట్లా కథల ప్రవాహం కొనసాగేది. మూడు నాలుగు కథలు చెప్పి ఇక చాలించాలని అనుకున్నప్పుడు ఒక కథ చెప్పేది. అదే ‘కోడి-గంపెడు బూరు’ కథ. ఆ కథ ఎత్తుకునేది.

కథ ఇంతే. ముందుకు పోదు. ఈ కథను ఎవరికి చెప్పవద్దని పిల్లల వద్ద హామీ తీసుకొని కథ మొదలు పెడుతుంది. ఆ రెండు మాటలు అని ఆగిపోయి “మీరు ఎవరికన్న చెపుతారు” అనేది.

అందులో కథ ఏమి ఉండదు కానీ కథ చెప్పే పేరు మీద పిల్లలను తమకు తాము ఇక కథలు చాలు అనే దాకా లాగించేది. “ఒక కోడి ఉంటది. దానికి గంపెడు బూరు ఉంటది.” కథ ఇంతే. ముందుకు పోదు. ఈ కథను ఎవరికి చెప్పవద్దని పిల్లల వద్ద హామీ తీసుకొని కథ మొదలు పెడుతుంది. ఆ రెండు మాటలు అని ఆగిపోయి “మీరు ఎవరికన్న చెపుతారు” అనేది. పిల్లలు “ఎవరికి చెప్పమే” అంటారు. సరే అని అని మళ్ళీ మొదలు.. “ఒక కోడి.. గంపెడు బూరు.. ఎవరికన్న చెపుతారు”..

“నేను చెప్పను”.. పిల్లలు మళ్ళీ బతిమాలుతారు.. “ఎవరికి చెప్పమే” అంటారు..

మళ్ళీ కథ మొదలు.. “ఒక కోడి .. గంపెడు బూరు”..

ఇట్లా పిల్లలు విసుగుపడి నీ కథ వద్దు మన్నద్దు అని లేచి పోతారు. ఆమెకు కావలసింది అదే.

కథ కంచికి మనం ఇంటికి.

కథ చెప్పే పద్దతి, ఆమె హావభావాలు రాతలో వర్ణించలేము. బహుశా బ్రహ్మానందం గారికి ఈ సంగతి చెపితే అద్భుతంగా దృశ్యమానం చేసి చూపించగలరేమో!

పులి-మేక-గడ్డి మోపు

మా ఊరు బోథ్ కు పశ్చిమాన ఉన్న కర్తారం (ఇప్పుడు కరత్వాడ అంటున్నారు) నుంచి హైమద్, ఇస్మాయిల్ అని ఇద్దరు అన్నదమ్ములు హైస్కూల్ చదువుల కోసం బోథ్ వచ్చేవారు. ఇద్దరిలో ఇస్మాయిల్ బాగా చదువుకునే వాడు. చురుకుగా ఉండేవాడు. ఇద్దరూ జెండా లెక్క పొడుగ్గా ఉండేవారు. పొడుపు కథలు, చిక్కు ప్రశ్నలు వేసి మన మెదడుకు పరీక్ష పెట్టేవాడు ఇస్మాయిల్. అప్పటి చిక్కు ప్రశ్న ఒకటి ఇప్పటికీ యాదికి ఉన్నది..

ఒక పెద్ద మనిషి మూడు వస్తువులను .. ఒక పులి, ఒక మేక, ఒక గడ్డి మోపు పడవలో నది దాటించాలి. ఒకసారి అతనితో పాటు ఒక వస్తువు మాత్రమే తీసుకుపోవాలి అనేది నిబంధన. ఆయన ఉన్నప్పుడు అవి మిత్రులుగా ఉంటాయి. లేనప్పుడు సహజ ప్రవర్తన చూపిస్తాయి. అంటే పులి మేకను తినేస్తుంది. మేక గడ్డి కట్టను తినేస్తుంది. ఆ పెద్ద మనిషి మూడు వస్తువులను సురక్షితంగా నది దాటించాడు ఎట్లా? ఇదీ ప్రశ్న.

“ఏంది సమాధానం?” అని అడిగితే చెప్పేవాడు కాదు. ఆలోచించు అనేవాడు. దీనికి సొల్యూషన్ వారం రోజులు ఊరించి ఊరించి చెప్పిండు.

ఇగ మనం .. అనేక కాంబినేషన్లు ప్రయత్నం చేస్తాము. అన్నిటికీ కొర్రీలు పెడతాడు. మొదట మేకను తీసుకు పోతాడు. మళ్ళీ వచ్చి పులిని తీసుకుపోతాడు. అంటే గడ్డి కోసం పోయి తిరిగి వచ్చేలోగా పులి మేకను తింటది గదా! పోనీ గడ్డి కట్టను తీసుకుపోయి పులి కోసం వెళ్ళి తిరిగి వచ్చే లోగా మేక గడ్డి కట్టను తింటది. ఎట్లా ప్రశ్నించేవాడు?

“ఏంది సమాధానం?” అని అడిగితే చెప్పేవాడు కాదు. ఆలోచించు అనేవాడు. దీనికి సొల్యూషన్ వారం రోజులు ఊరించి ఊరించి చెప్పిండు. మొదట మేకను తీసుకుపోతాడు. తిరిగి వచ్చి పులిని తీసుకు పోతాడు. అక్కడి నుంచి మేకను తనతో వెనుకకు తీసుకు వస్తాడు. మేకను ఇక్కడ ఉంచి గడ్డి కట్టను తీసుకు పోతాడు. పులి గడ్డి తినదు. కనుక మళ్ళీ వచ్చి మేకను తీసుకు పోతాడు. అట్లా మూడు వస్తువులను సురక్షితంగా నది దాటించి తీసుకుపోతాడు. ఇదీ ఇస్మాయిల్ చెప్పిన కథ.

ఈ కథను చిన్నప్పుడు మా బిడ్డలు అంజలికి, వెన్నెలకు చెప్పి ఊరించి ఊరించి చంపేవాడిని. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ పిల్లలకు కూడా చెపుతారేమో చూడాలి! లేకపోతే నేనే చెపుతాను.

ఇస్మాయిల్ ఇటువంటి పల్లెటూరి కథలు అనేకం చెప్పి మమ్ములను ఊరించేవాడు. మాతో పులి జూదం ఆట ఆడి మమ్ములను ప్రతీసారి ఓడించేవాడు.

ఇస్మాయిల్ ఇటువంటి పల్లెటూరి కథలు అనేకం చెప్పి మమ్ములను ఊరించేవాడు. మాతో పులి జూదం ఆట ఆడి మమ్ములను ప్రతీసారి ఓడించేవాడు. మొదట ఆయన పులి వైపు ఆడి మేకలను తినేసేవాడు. అప్పుడు ఈసారి నువ్వు మేకల వైపు ఆడు మేము పులి వైపు ఆడుతాము అంటే దానికి ఒప్పుకొని పులిని కట్టడి చేసేవాడు. మేక పులి ఆటలో మేకల వైపు అడితే పులిని కట్టడి చేయడంలో దిట్ట. ఆయన మేకల దిక్కు ఆడితే మేకలు గెలిచేవి. పులి ఓడిపోయేది. మళ్ళీ అతను పులి వైపు ఆడితే పులిని గెలిపించేవాడు. ఆ నైపుణ్యం ఇస్మాయిల్ లో చూసి ఆశ్చర్య పోయేవాడిని. ఇప్పుడు ఆ కథలు లేవు, ఆ ఆటలు లేవు. మెదడుకు మేత ఇచ్చే, మెదడును చురుకుగా ఉంచే ఆటలు ఇప్పుడు లేవు.

ఇస్మాయిల్ పదవ తరగతి తర్వాత నాతో పెద్దగా కాంటాక్ట్ లో లేడు. మిత్రుల ద్వారా తెలుసుకున్నదేమిటంటే ఆయన బి ఎస్సి, బి ఎడ్ చేసి టీచర్ గా ఉద్యోగంలో స్థిరపడినాడు. అదనంగా ఆయన ఆ రోజుల్లోనే కంప్యూటర్ టెక్నాలజీలో విశేష నైపుణ్యం గడించడంతో ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖాధికారులు ఇస్మాయిల్ సేవలను డి ఇ ఒ ఆఫీసు లోనే కంప్యూటర్ పనికి వినియోగించుకునేవారట. మా కంటే వయసులో పెద్దవాడు కాబట్టి ఐదేళ్ల కిందనే పదవీ విరమణ చేసి ఉన్నాడు. మూడేళ్ళ కింద హజ్ యాత్రకు వెళ్ళి వస్తూ ఎయిర్పోర్టు లో గుండె పోటు వచ్చి చనిపోయాడని తెలిసి మనసు వికలం అయిపోయింది. ఆయన ఫోటో సంపాదించాలన్న నా ప్రయత్నాలు సఫలం కాలేదు. ఇస్మాయిల్ జ్ఞాపకాలు నా హృదయంలో ఎప్పుడూ సజీవం.

ముక్తాయింపు

చిన్నప్పుడు పెద్దవారు పొడుపు కథలు, సామెతలు, పాటలు, పద్యాలతో పిల్లల మెదడులో న్యూరాన్లకు పని కల్పించేవారని ఇప్పుడు అర్థం అవుతున్నది.

అనేకమైన మనకు ఇష్టమైన పనుల్లో నిమగ్నమై మన శరీరానికి, మెదడుకు పని కల్పించగలిగితే ముసలితనం ఎన్నటికీ మన దరిజేరదు.

మన ఆరోగ్యం బాగుండాలంటే మన మెదడులో ఉండే న్యూరాన్లు కీలక పాత్ర పోషిస్తాయట. ఈ న్యూరాన్లకు పని కల్పించకపోతే వయసు మీద పడినా కొద్ది శరీరం కూడా కృశించిపోతుంది. 58 ఏండ్లకు రిటైర్మెంట్ తర్వాత కూడా మనిషి చురుకుగా ఉండాలంటే శారీరక ఆరోగ్యం మీదనే కాక మన శారీరక ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషించే న్యూరాన్లకు కూడా పని కల్పించాలి. ఇందుకు పత్రికల్లో వచ్చే క్రాస్ వర్డ్ పజిల్స్, సుడుకో పజిల్స్, క్విజ్ లు బాగా ఉపయోగపడతాయి. పుస్తకాలు చదవడం, మనకు ఇష్టమైన వ్యవసాయం, ఇంటి తోట పనులు, మన ఉద్యోగ బాధ్యతల్లో పడిపోయి మనం నిర్లక్ష్యం చేసిన పనులను చేసుకోవడం, వివిధ ప్రదేశాలకు వెళ్ళడం, కొత్త విషయాలను తెలుసుకోవడం, కాలనీ సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనడం, కొత్త భాషలు నేర్చుకోవడం, సంగీతం నేర్చుకోవడం, రచనలు చేయడం .. ఇట్లా అనేకమైన మనకు ఇష్టమైన పనుల్లో నిమగ్నమై మన శరీరానికి, మెదడుకు పని కల్పించగలిగితే ముసలితనం ఎన్నటికీ మన దరిజేరదు.

అది ఉద్యోగం నుంచి విరమణే తప్ప జీవితం నుంచి కాదు. ఇప్పుడే మన అసలుసిసలు జీవితం ప్రారంభం అవుతుంది.

మనం ఉద్యోగంలో ఉన్నప్పుడు చేసుకోలేని పనులను చేసుకోవడానికి 58 ఏండ్ల పిన్నవయసులో(తెలంగాణ ప్రభుత్వం 61 ఏండ్లకు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 62 ఏండ్లకు పెంచినాయి) ప్రభుత్వం మనలను ఇంటికి పంపిస్తుంది. అది ఉద్యోగం నుంచి విరమణే తప్ప జీవితం నుంచి కాదు. ఇప్పుడే మన అసలుసిసలు జీవితం ప్రారంభం అవుతుంది. ఈ జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించాలి అంటే మన మెదడులో ఉండే న్యూరాన్లు చురుకుగా ఉన్నప్పుడే సాధ్యం. ఈ సంగతులు తెలంగాణ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, తెలంగాణా ఉద్యమ సహచరుడు శ్రీ వి ప్రకాష్ గారు వాలంటరీ డైరెక్టర్ జనరల్ గా పని చేసిన నా మిత్రుడు శ్రీ శ్యాంసుందర్ గారి రిటైర్మెంట్ ఫంక్షన్ లో చెప్పాడు. నడక, వ్యాయాయంతో పాటు న్యూరాన్లకు పని కల్పించే ఆటలు, ఆలోచనలు, పనులు చేద్దాము. ముసలితనంలో కూడా యువకులుగా ఉందాము.

కాలమిస్టు పరిచయం

శ్రీధర్ రావు దేశ్ పాండే గారు వృత్తి రీత్యా ఇంజనీర్. తెలంగాణ బిడ్డగా జల వనరుల నిపుణులుగానూ గత మూడు దశాబ్దాలుగా రాజకీయ, ఆర్థిక సామాజిక రంగాలపై అనేక వ్యాసాలు రచించారు. ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతను నొక్కి చెబుతూ  స్వయంగా పలు పుస్తకాలు రచిస్తూనే తెలంగాణా టైమ్స్, తెలంగాణా సొయి వంటి పత్రికలకు సంపాదకత్వ బాధ్యతలు కూడా వహించారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన వారు రాష్ట్ర పునర్నిర్మాణంలోనూ తమ వంతు బాధ్యతను నిర్వహిస్తున్న సంగతి మీకు తెలుసు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక అధికారిగా (OSD) సాగు నీటి పారుదల రంగంలో వారు పని చేస్తున్నారు.

ఆదిలాబాద్ జిల్లా ‘బోథ్’ వారి స్వగ్రామం. తెలుపు పాఠకులకు తమ ఊరి పేరిటే ‘బొంతల ముచ్చట్ల’ను పంచుకునేందుకు గాను వారు ఈ శీర్షికకు శ్రీకారం చుట్టారు. ఒక రకంగా ఇది మెత్తటి జ్ఞాపకాల శయ్య. తొలి భాగం “రింజిం రింజిం ఆదిలాబాద్…. బోథ్ వాలా జిందాబాద్”. రెండో భాగం నాది మూల నక్షత్రం పుట్టుక. మూడో భాగం బోథ్ పెద్దవాగు – ఒక పురా జ్ఞాపకం. నాలుగో భాగం స్వామి స్నేహితులు – మాల్గుడి క్రికెట్ క్లబ్. మీరు చదివింది ఐదో భాగం. వారి ఇ -మెయిల్ : irrigationosd@gmail.com

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article