Editorial

Wednesday, January 22, 2025
కాల‌మ్‌బొంతల ముచ్చట్లు : స్వామి స్నేహితులు - మాల్గుడి క్రికెట్ క్లబ్  – శ్రీధర్ రావు...

బొంతల ముచ్చట్లు : స్వామి స్నేహితులు – మాల్గుడి క్రికెట్ క్లబ్  – శ్రీధర్ రావు దేశ్ పాండే కాల‌మ్‌

‘బొంతల ముచ్చట్ల’ సుతారమైన జ్ఞాపకాల దర్పణమే కాదు, మన మూలాలను ఆప్యాయంగా తడిమే వేదిక. గత వర్తమానాలను తరచి చూస్తూ ఆశావహమైన భవిత కోసం ఆలోచనలు పంచే సూచిక కూడా. చదవండి, ‘ఫ్రెండ్స్ క్రికెట్ క్లబ్ – జ్ఞాపకాలు’ ఈ వారం.

శ్రీధర్ రావు దేశ్ పాండే

కాలమిస్టు చిన్ననాటి ఛాయా చిత్రం

1970 దశకం చివరి సంవత్సరాలలో .. నేను అప్పుడు 8,9,10 వ తరగతుల్లో ఉన్నాను. ఆర్ కె నారాయణ్ రాసిన స్వామి స్నేహితులు పుస్తకం మా ఊరు బోథ్ లైబ్రరీలో కంటబడింది. అది ఆయన ఇంగ్లిష్ లో రాసిన Swamy and Friends పుస్తకానికి అనువాదం. దక్షిణ భారత పుస్తక సంస్థ వారి సహకారంతో విజయవాడ ఆదర్శ గ్రంథ మండలి వారు తెలుగు అనువాదాన్ని1959 లో ప్రచురించారు. అనువాదం చేసింది శ్రీనివాస చక్రవర్తి. అప్పట్లో అనువాదం ఎవరు చేశారో గుర్తుకు లేదు కాని మూల రచయిత ఆర్ కె నారాయణ్, పుస్తకంలో బొమ్మలు వేసిన ఆర్ కె లక్ష్మన్ మాత్రం గుర్తుండి పోయారు. అట్ట మీద, పుస్తకం లోపల వేసిన బొమ్మలు, పుస్తకంలో ప్రధాన పాత్రలైన స్వామి, మణి, రాజంల చిత్రాలు మనసులో నిక్షిప్తం అయిపోయినాయి. ఆ రోజుల్లో ఆ పుస్తకం మాకు నిత్యపారాయణ గ్రంథం. ఇంగ్లిష్ పాఠ్య పుస్తకాల్లో కూడా swamy and friends పుస్తకంలో నుంచి కొన్ని భాగాలు ఉండేవి. ఆర్ కె నారాయణ్ ఇతర కథలు కూడా హైస్కూలు, ఇంటర్ పాఠ్య పుస్తకాల్లో ఉండేవి.

ఆర్ కె నారాయణ్ రాసిన స్వామి స్నేహితులు పుస్తకం నా మనసు మీద వేసిన ప్రభావం ఎంతటిదంటే నా కాల చక్రం మళ్ళీ వెనక్కి తిరిగింది. నన్ను ఆ బాల్యపు లోకంలోనికి తీసుకు వెళ్ళింది.

ఆ రకంగా ఆర్ కె నారాయణ్ రాసిన స్వామి స్నేహితులు పుస్తకం నా మనసు మీద వేసిన ప్రభావం ఎంతటిదంటే ఇవ్వాళ్ళ 59 ఏండ్ల వయసులో కూడా ఆ పుస్తకాన్ని పది పన్నెండు సంవత్సరాల పిల్లాడిలా చదివేసాను.

ఆర్ కె నారాయణ్

నా కాల చక్రం మళ్ళీ వెనక్కి తిరిగింది. నన్ను ఆ బాల్యపు లోకం లోనికి తీసుకు వెళ్ళింది. మాల్గుడిలో స్వామి, అతని స్నేహితులు తిరిగిన అన్ని రకాల ప్రదేశాలు బోథ్ లో కూడా ఉన్నాయి. ఒక్క రైల్వే స్టేషన్ తప్ప. మా ఊర్లో పారే పెద్ద వాగు మాల్గుడిలో ఉన్న సరయూ నదిని తలపించేది. మా పెద్ద బడిని (ప్రభుత్వ ఉన్నత పాఠశాల) స్వామి స్నేహితులు చదువుకున్న ఆల్బర్ట్ మిషన్ స్కూల్ లాగా ఊహించుకున్నాను. బడిలో టీచర్లు, వారికి పిల్లలు పెట్టుకున్న మారు పేర్లు, విశాలమైన మైదానం, చుట్టూ అడవి, సెలయేర్లు, పొచ్చెర, కుంటాల జలపాతాలు, పెద్దార్ల గుట్ట, సాకెర, నిగ్ని- కంటెగామ గుట్టలు ఉండనే ఉన్నాయి. ఈ పుస్తకం మళ్ళీ నా జీవితంలోని రావటం నన్ను ఉద్వేగానికి లోను చేసింది. ముప్పై ఏండ్లుగా ఈ పుస్తకం కోసం నా వెతుకులాట జూన్ 21, 2020న సఫలం అయ్యింది.

స్వామి స్నేహితుల కోసం అన్వేషణ

ఆదిలాబాద్ లో ఇంటర్ తర్వాత 1981 లో ఇంజనీరింగ్ చదువు కోసం హైదరాబాద్ చేరుకున్నాను. అప్పటికే మా బోథ్, ఆదిలాబాద్ లైబ్రరిల పుణ్యమాని చదవడం బాగానే అలవడిన కారణంగా నా పాకెట్ మనిలో పెద్ద మొత్తం పుస్తకాల కొనుగోలు కోసమే ఖర్చు పెట్టేవాడిని. అప్పట్లో సోవియట్ యూనియన్ నుంచి తక్కువ ధరకే పిల్లల పుస్తకాలు అందుబాటులో ఉండేవి. సెలవులకు ఇంటికి వెళ్ళేటప్పుడు మా మేనల్లుళ్ళకు, మేన కోడళ్ళకు బోలెడన్ని సోవియట్ పుస్తకాలు కొని తీసుకుపోయేవాడిని. హైద్రాబాద్ లో అబిడ్స్ ఫుట్ పాత్ మీద పుస్తకాలు కొనేవాడిని. అట్లా స్వామి స్నేహితులు అబిడ్స్ ఫుట్ పాత్ పై మళ్లీ కనబడింది. వెంటనే కొని బైండింగ్ చేపించి మా మేనల్లుడు శ్రావణ్ కు కానుకగా ఇచ్చాను. ఇంజనీరింగ్ చదువు 1985 పూర్తి అయ్యాక ఒక సంవత్సరం మహారాష్ట్రా పూసద్ లో ఒక ఇంజనీరింగ్ కాలేజిలో అధ్యాపకుడిగా పని చేసి 1987 సాగునీటి శాఖలో జూనియర్ ఇంజనీర్ గా చేరాను ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో. 1989 లో హైదరాబాద్ కి బదిలీ మీద వచ్చాను. ఇక అప్పటి నుండి ఉద్యోగం సద్యోగం అన్నీ హైదరాబాద్ లోనే. ఆబిడ్స్ ఫుట్ పాత్ లపై పుస్తకాల కొనుగోళ్ళు వీలుచేసుకొని చేస్తూ ఉండేవాడిని.

స్వామి మిత్రులు

ఇక మా బిడ్డలు అంజలి, వెన్నెల చదుకునే వయసు వచ్చేసరికి అబిడ్స్ ఫుట్ పాత్ మీద కూడా స్వామి స్నేహితులు పుస్తకం కంటబడలేదు. అయితే 1996 నేషనల్ బుక్ ట్రస్ట్ వారు ‘స్వామి మిత్రులు’ పేరిట ఒక పుస్తకాన్ని ప్రచురించారు. అనువాదం చేసింది డా.వాసిరెడ్డి సీతాదేవి గారు. పుస్తకంలో బొమ్మలు వేసింది మనోభిరామ చక్రవర్తి. ఈ పుస్తకాన్ని మా పెద్ద బిడ్డ అంజలికి, ఆ తర్వాత చిన్న బిడ్డ వెన్నెలకు కొని ఇచ్చాను. ఇప్పుడు ఈ పుస్తకం కూడా అందుబాటులో లేదు. అయితే స్వామి స్నేహితులు నా మదిలో మెదులుతూనే ఉంది. నేను చదివిన పుస్తకం మా బిడ్డలకు ఇవ్వాలన్న కోరిక రగులుతూనే ఉన్నది. వెయ్యికి పైగా పుస్తక సమీక్షలు, వందలాది సాహిత్య వ్యాసాలు రాసిన ప్రముఖ సాహితి విమర్శకులు కే పి అశోక్ కుమార్ ను అడిగాను. ఆయన కూడా దొరకబట్టలేకపోయాడు. మా బోథ్ లైబ్రరీలో వెతికాను. అది ఎప్పుడో చోరి అయిపొయింది. మొన్న అమెరికా నుంచి మా పెద్ద బిడ్డ ఫోన్ చేసి తన చిన్నప్పటి పుస్తకాలు అన్నీ.. స్వామి మిత్రులు సహా అమెరికా పంపమని అడిగింది. పుస్తకాలు అన్నీవెతికి బయటకు తీశాను అయితే స్వామి మిత్రులు మాత్రం దొరక లేదు. దొరికిన పుస్తకాలను కొరియర్ చేసాను. స్వామి మిత్రులు పిడిఎఫ్ కాపి కె పి అశోక్ కుమార్ పంపితే ఆ పిడిఎఫ్ కాపీని మా బిడ్డకు మెయిల్ చేసాను. అయితే స్వామి స్నేహితులు కావాలని అశోక్ ను అడిగాను. ఆయన కూడా ఆ పుస్తకం వెతుకులాటలో ఉండడగానే.. అనిల్ బత్తుల గారు గతంలో అనేక పాత పుస్తకాలను పరిచయం చేస్తూ ఫేస్ బుక్ లో పోస్టులు పెట్టడం గుర్తుకు వచ్చి ఆయన వాల్ మీద వెదికాను. అక్కడ దొరికింది ఈ పుస్తకం. సంతోషానికి హద్దులు లేకుండా పోయింది.

టైమ్ మెషీన్ లో కూసోని కాల చక్రాన్ని వెనక్కి తిప్పి పుస్తకం లోపలి ప్రపంచం లోనికి .. మాల్గుడిలోకి వెళ్లి స్వామి, మణి, రాజం బృందంలో సభ్యుడిగా వారి వెంట తిరిగాను. మూడు రోజులు ఆ లోకంలో గడిపి బయటకు వచ్చాను.

జూన్ 21 న దొరకటం, యాదృచ్చికంగా ఆ దినం ఫాదర్స్ డే కావటంతో వెంటనే లింక్ ను మా బిడ్డలకు ఫాదర్స్ డే కానుకగా పంపించాను. ఆ తర్వాత రెండు రోజులకు దత్తసాయి గ్రాఫిక్స్ యజమాని, నా చిరకాల మిత్రుడు అయిన శ్రీ వీరయ్య గారు ఆ పుస్తకాన్ని ప్రింట్ చేసి పర్ఫెక్ట్ బైండింగ్ చేసి నా చేతిలో పెట్టాడు. అనిల్ గారికి ఫేస్ బుక్ మాధ్యమంగా కృతఙ్ఞతలు చెప్పాను. నా ఫేస్ బుక్ వాల్ మీద, నా బాల్య మిత్రులు చాలా మందికి వాట్సాప్ ద్వారా లింక్ పంపినాను. అందులో చాలా మంది పుస్తకం ప్రింట్లు తీసుకొని తమ బిడ్డలకు అందించారని, తామూ చదివారని తెలిసింది. సాక్షి జర్నలిస్టు మిత్రుడు రాజశేఖర్ రెడ్డి కూడా ప్రింట్ తీసుకున్నట్టు చెప్పాడు. మొత్తం మీద పుస్తకాన్ని తనివితీరా తడిమి పుస్తకాన్ని ఆవాహన చేసుకొని టైమ్ మెషీన్ లో కూసోని కాల చక్రాన్ని వెనక్కి తిప్పి పుస్తకం లోపలి ప్రపంచం లోనికి .. మాల్గుడిలోకి వెళ్లి స్వామి, మణి, రాజం బృందంలో సభ్యుడిగా వారి వెంట తిరిగాను. మూడు రోజులు ఆ లోకంలో గడిపి, స్వామి, మణి లతో కలిసి రాజంకు వీడ్కోలు పలికి టైమ్ మెషీన్ ఎక్కి, కాల చక్రాన్ని ముందుకు తిప్పి బయటకు వచ్చాను.

స్వామి స్నేహితులు పుస్తకంలో మాల్గుడి క్రికెట్ క్లబ్ (MCC) విశేషాలు చదువుతుంటే మా చిన్నప్పటి ఫ్రెండ్స్ క్లబ్ క్రికెట్ అనుభావాలు యాదికి వచ్చాయి. టైమ్ మెషీన్ ను మళ్ళీ వెనక్కి తిప్పి వాటిని మీతో పంచుకుంటాను.

ఫ్రెండ్స్ క్రికెట్ క్లబ్ జ్ఞాపకాలు

మేము హైస్కూలు స్థాయికి వచ్చేటప్పటికి ఊర్లోకి క్రికెట్ ప్రవేశించింది. మా సీనియర్లు 1972 నాటి నుండే క్రికెట్ ఆడటం ప్రారంభించినారు. మ ఊరిలో ఫ్రెండ్స్ క్లబ్ పేరుతో ఒక క్లబ్ చాలా ఏండ్ల నుంచి ఉన్నది. దానికి ఊరి బస్ స్టాండ్ పక్కనే రెండెకురాల జాగా కూడా సమకూర్చారు ఊరి పెద్దలు. ఆ స్పూర్తి తోనే మా సీనియర్లు ‘ఫ్రెండ్స్ క్రికెట్ క్లబ్’ ను ఏర్పాటు చేశారు. అసలు బోథ్ కు క్రికెట్ ఎప్పుడు వచ్చింది? ఎవరూ తీసుకువచ్చారు అని విచారిస్తే.. శ్యాం దాదా చెప్పిన దాని ప్రకారం 1968-69 సంవత్సరాలలో శ్రీ మధుసూధన్ రెడ్డి గారు లా స్టూడెంట్ గా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునే సమయంలో సెలవులకు బోథ్ వచ్చినప్పుడు శాఖా బడి ఆవరణలో క్రికెట్ ఆడటం తాము చూసినామని గుర్తు చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన లాయర్, యువజన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మారి క్రికెట్ ను మా సీనియర్లకు అప్పగించినారు. ఆ తర్వాత ఆయన ఆదిలాబాద్ జిల్లా పరిషత్ ఛైర్మన్ గా, ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా (2004 లో ఆదిలాబాద్ లోక్ సభ స్థానం జెనరల్ కేటగిరీలో ఉండేది. 2009లో డి లిమిటేషన్ అమలు అయిన తర్వాత ఎస్ టి రిజర్వ్ కేటగిరీ లోకి మారింది) కూడా ఎన్నికైనాడు. ఆయన తర్వాత బోథ్ నుండి ఆ స్థాయికి ఎదిగిన రాజకీయ నాయకుడు మరొకరు లేరు.

వామన్ రావు సీనియర్ జట్టు కెప్టెన్. ఆయన స్పిన్ బౌలింగ్ కూడా చేసేవాడు. ఆయనను చక్రధారి అని పిలిచేవారం. స్పిన్ బౌలింగ్ చేసేటప్పుడు ఆయన చేతిని 360 డిగ్రీలు తిప్పి బంతిని వదిలేవాడు.

జూనియర్లమైన మేము సీనియర్లతో సామాన్లు మోసుకొని వెళ్ళటం, ఫీల్డింగ్ చేయడం చేసేది. ఆట ఆఖరుకు దయతలచి ఒక ఓవరో రెండు ఓవర్లో బ్యాటింగ్ కి అనుమతి ఇచ్చేది. మేము చిన్న పిల్లలం కనుక బాల్ ను మెల్లగా వేసేవారు. అటు సీనియర్ల వద్ద ట్రయినింగ్ అవుతూనే మా జూనియర్ల జట్టు ఒకటి తయారు చేసుకున్నాము. సీనియర్ల జట్టులో అరివీర భయంకర ఫాస్ట్ బౌలర్లు రాజు, గిరీష్, మహేష్, రమేశ్ లు ఉండేవారు. ఆకుల నారాయణ ఆఫ్ స్పిన్నర్. శేఖర్, ముర్తుజా ఖాన్ మీడియం పేసర్. మా చిన్నన్న గిరిధర్ దేశ్ పాండే ఓపెనింగ్ బ్యాట్స్ మన్. అందరి ఆశలు ఆయన మీదనే ఉండేవి. వామన్ రావు సీనియర్ జట్టు కెప్టెన్. ఆయన స్పిన్ బౌలింగ్ కూడా చేసేవాడు. ఆయనను చక్రధారి అని పిలిచేవారం. స్పిన్ బౌలింగ్ చేసేటప్పుడు ఆయన చేతిని 360 డిగ్రీలు తిప్పి బంతిని వదిలేవాడు. ఆయన తర్వాత రాజు కెప్టెన్ అయ్యాడు. మహేందర్ రెడ్డి కూడా బ్యాట్స్ మన్ గా టీం లో ఉండేవాడు.

శ్యాం దాదా (రిటైర్డ్ జిల్లా జడ్జి. ఇప్పుడు దేవాదాయ శాఖ అప్పిలేట్ ట్రిబ్యూనల్ ఛైర్మన్) జట్టుకు మేనేజర్. క్రికెట్ క్లబ్ అకౌంట్స్ కూడా చూసేవాడు. అందరిని నవ్వించి స్పూర్తిని నింపేవాడు. జట్టు బ్యాటింగ్ లో కొంత వీక్ గానే ఉండేది. మొదట్లో బ్యాట్ కు స్ట్రోక్ బాగా ఉండడానికి పైన లిన్సీడ్ ఆయిల్ (ఆవిశే గింజల నూనె) పట్టించేది. ఈ నూనె బోథ్ లో దొరికేది కాదు. ఆదిలాబాద్ నుంచి తెప్పించుకునే వాళ్ళం. ఆ తర్వాత కవర్ బ్యాట్ లు వచ్చిన తర్వాత నూనె పట్టించే బాధ తప్పింది.

టెస్ట్ మ్యాచులు

సీనియర్ల జట్టు కొద్ది రోజుల్లోనే టెస్ట్ మ్యాచులు.. అంటే పక్క ఊరి వాళ్ళతో .. ఆడటం మొదలు పెట్టింది. బోథ్ కు 40 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్రాలో ఉన్నకిన్వట్ జట్టుతో, గట్టు కింద (మహబూబ్ ఘాట్ల కింద) ఉన్న నిర్మల్ జట్టుతో, మా ఊరి పక్కన ఉండే కౌఠ, ఇచ్చోడ జట్లతో మ్యాచులు జరిగేవి. ఒకసారి మాత్రమే ఆదిలాబాద్ జట్టుతో ఆడినాము. కిన్వట్ జట్టుతో ఎక్కువ మ్యాచులు ఆడేవాళ్ళం. ఒకసారి మేము కిన్వట్ వెళితే, మరొకసారి వారు బోథ్ కి వచ్చేవారు. మా జట్టు బౌలింగ్ బాగున్నా బాటింగ్ లో ఫెయిల్ అవుతుండడంతో ఎక్కువ సార్లు ఓటమే ఎదురయ్యేది. హిట్టింగ్ కోసం ముర్తుజా ఖాన్ అన్న ముస్తఫా ఖాన్ ను బరిలోకి దించేది కెప్టెన్ వామన్ రావు. అడ్డిమార్ గుడ్డి దెబ్బలు. బ్యాట్ కు తగిలితే సిక్సర్. లేదంటే అవుట్. టెస్ట్ మ్యాచుల్లో మాకు ఎంట్రీ దక్కక పోయినా వారితో కలిసి మ్యాచులు చూడటానికి, వస్తువుల కాపలాకి మమ్ములని తీసుకుపోయేది. అప్పుడప్పుడు అవతలి వారి బాల్స్ ను మాయం చేసేవారం. దానికి ‘కేశవా’ అని ఒక కోడ్ వర్డ్ ను కూడా పెట్టుకున్నాము. క్రికెట్ క్లబ్ ఆర్థిక పరిస్థితి మెరుగు పడిన తర్వాత కేశవా ప్లాన్ అమలు చేయడం వదిలేసాము.

ఎన్ని మ్యాచులు ఓడిపోయినా క్రికెట్ స్పూర్తి మాత్రం మిగిలేది. నవ్వుతూ తూలుతూ ఆటను విశ్లేషించుకునే వాళ్ళం. ఓటమి బాధ శ్యాం దాదా జోకులతో ఎగిరిపోయేది.

కిన్వట్ పోవడానికి పొద్దున్న4 గంటలకు నైట్ హాల్ట్ బస్సు ఎక్కాలి. 4 గంటలకు బస్సు పట్టుకోవడానికి రాత్రంతా మెలకువగా ఉండవలసి వచ్చేది. నిద్రలేమి ఆట మీద ప్రభావం పడేది. బాటింగ్ వైఫల్యం మమ్ములని ఎప్పుడూ వెంటాడుతూ ఉండేది. అవుతల జట్టును తక్కువ స్కోర్ కు అవుట్ చేసినా కూడా బాటింగ్ ఫైఫల్యం ఆ స్కోర్ ను చేదించలేక మ్యాచులు ఓడిపోయేవారం. బోథ్ లో చాలా కాలం మాతో పాటు చదవుకుని ఆదిలాబాద్ వెళ్ళిపోయిన సతీష్ చంద్రను అప్పుడప్పుడు టెస్ట్ మ్యాచులు ఆడడానికి పిలిచేవారం. బలమైన ఆదిలాబాద్ జట్టుతో ఒకే ఒక మ్యాచ్ ఆడితే ఘోరంగా ఓడిపోయాము. ఎన్ని మ్యాచులు ఓడిపోయినా క్రికెట్ స్పూర్తి మాత్రం మిగిలేది. నవ్వుతూ తూలుతూ ఆటను విశ్లేషించుకునే వాళ్ళం. ఓటమి బాధ శ్యాం దాదా జోకులతో ఎగిరిపోయేది. మరో ఓటమిని ఎదుర్కోవడానికి సిద్దం అయ్యేది టీం.

జూనియర్ జట్టు

మేము పదవ తరగతి వచ్చేనాటికి మా జూనియర్ జట్టు నుంచి నేను, గంగాధర్ గౌడ్, బి రమేశ్, గోవర్ధన్, సర్దార్, మహమూద్ చంద్ర మోహన్, సుదర్శన్, నర్సా గౌడ్ తదితరులం సీనియర్ జట్టులోకి ఎంపిక అయినాము. జూనియర్ల జట్టుకు కెప్టెన్ నేనే. నేను, గంగాధర గౌడ్ ఓపెనింగ్ కి దిగేవాళ్ళం. గంగాధర్ గౌడ్ డిఫెన్స్ మినిస్టర్ గా పేరు గాంచాడు. రమేశ్ లెఫ్ట్ హాండ్ బాటింగ్, రైట్ హాండ్ బౌలింగ్. వాడు సవ్యసాచి. గోవర్ధన్ ఆల్ రౌండర్. వాడు ఒక్కొక్క సిక్సర్ కొడితే బాల్ దొరకడానికి 15 నిమిషాలు పట్టేది. వాడి లాంటి ఆటగాడు హైదరాబాద్ లో ఉంటె గనుక హైదరాబాద్ రంజీ జట్టుకు, ఆ తర్వాత జాతీయ జట్టుకు ఎంపిక అయి ఉండేవాడని ఇప్పుడు అనుకుంటున్నాను.

వారిని తప్పు పట్టడం లేదు కానీ హెచ్ సి ఎ తప్పిదాల వలన తెలంగాణ జిల్లాల ఆటగాళ్లు తీవ్రంగా నష్టపోయినారు. ఇప్పుడూ అదే పరిస్థితి.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యకలాపాలు హైదరాబాద్ నగరానికే పరిమితం అవడం వలన తెలంగాణ జిల్లాల్లో చాలా మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు రంజీ జట్టులోకి, ఆ తర్వాత జాతీయ జట్టులోకి ఎంపిక అయ్యే అవకాశాలు కోల్పోయినారు. హైదరాబాద్ లో నివసించే అనేక మంది ఆంధ్రా సెటిలర్లు నగరంలో క్లబ్స్ లో ఆది రంజీ జట్టుకు, ఆ తర్వాత జాతీయ జట్టుకు ఎంపిక అయినారు. వారిని తప్పు పట్టడం లేదు కానీ హెచ్ సి ఎ తప్పిదాల వలన తెలంగాణ జిల్లాల ఆటగాళ్లు తీవ్రంగా నష్టపోయినారు. ఇప్పుడూ అదే పరిస్థితి.

గోవర్ధన్ మా జట్టుకు కపిల్ దేవ్ లాంటివాడు. జూనియర్ జట్టుకు బ్యాట్లు, స్టంపులు అన్నీ స్థానికంగానే తయారు చేసుకునేది. మా క్లాసులో ఉన్న వడ్ల బక్కన్న టేకు చెక్కతో బ్యాటు చెక్కి ఇచ్చేవాడు. టేకు పెండే కట్టెలతో స్టంపులు తయారు చేసేవాడు. బ్యాటు బరువుగా ఉండేది. బ్యాటు చేతిలో నుంచి జారిపోకుండా ఉండటానికి హండిల్ కు సైకిల్ ట్యూబ్ ఎక్కించేవారం. బస్టాండ్ లో ఉన్న బాపురావు టేలాలో కార్క్ బంతులు దొరికేవి. ఆయన మా కోసం కార్క్ బంతులను నిర్మల్ నుంచి తెప్పించే వాడు. వాటితో మా క్రికెట్ ఆట షురు అయ్యింది. బంతుల వినియోగం చూస్తే.. మొదట రబ్బర్ బంతులతో క్రికెట్ మొదలయ్యింది. రబ్బర్ బంతులు త్వరగా పగిలిపోయేవి. ఆ తర్వాత కురుం బంతులతో ఆడేవారం. కురుం బంతులు అంటే అప్పట్లో తెలియదు కానీ అవి టెన్నిస్ బంతులన్నమాట. కురుం బాల్స్ బాగానే ఉండేవి కానీ వాటి ఖరీదు ఎక్కువ. అందుకని తక్కువ ధరకు దొరికే కార్క్ బంతులనే ఎక్కువ ఉపయోగించేవాళ్ళం. టెస్ట్ మ్యాచులకు మాత్రం తప్పనిసరిగా లెదర్ బంతులనే వినియోగించేవాళ్ళం.

యాప చెట్టు క్రికెట్: ఒక బాల్ కు 15 రన్స్

బోథ్ లో మా ఇంటి ముందు వందేళ్ల వయసున్న యాప చెట్టు ఉండేది. 5 ఏళ్ల కింద ఎండాకాలం గాలి దుమారానికి చెట్టు కూలిపోయింది. ఈ చెట్టుతో మాకున్న అనుబంధం ఎంతో ఘాఢమైనది. చెట్టు కాండమే స్టంపులుగా ఆ చెట్టు వద్ద మా క్రికెట్ ఆట సాగేది. పక్కనే మా ఎడ్ల కొట్టం కూడా ఉండేది. దాని వెనుక ఖాళీ జాగాలో మా ఆయి వానా కాలంలో మక్క పంట వేయించేది. ఈ యాప చెట్టు క్రికెట్ ఒక సరదా అనుభవం మీతో పంచుకుంటాను.

బాల్ దొరికే వరకు రన్నర్ 15 రన్స్ తీశాడు. కాబట్టి ఒక బాల్ కు 15 రన్స్ రావడం మా బోథ్ లో యాప చెట్టు క్రికెట్ ఆటలో తప్ప ప్రపంచంలో మరెక్కడా సాధ్యం కాలేదేమో!

మా పెద్దన్న గంగాధర రావు చిన్నప్పుడే పోలియో బారిన పడడంతో గ్రౌండ్ కు వచ్చి క్రికెట్ ఆడటం కుడిరేది కాదు. ఈ యాప చెట్టు వద్ద ఆయనకు అవకాశం దక్కేది. ఆయనకు ఒక రన్నర్ ను పెట్టేది. ఒకసారి ఆయన షాట్ కొడితే బాల్ మా ఎడ్ల కొట్టం మీద నుంచి మక్క పెరడులో పడింది. ఆ బాల్ దొరికే దాకా రన్నర్ పరుగులు తీస్తూనే ఉన్నాడు. బాల్ దొరికే వరకు రన్నర్ 15 రన్స్ తీశాడు. కాబట్టి ఒక బాల్ కు 15 రన్స్ రావడం మా బోథ్ లో యాప చెట్టు క్రికెట్ ఆటలో తప్ప ప్రపంచంలో మరెక్కడా సాధ్యం కాలేదేమో! ఆ తర్వాత రూల్ అమెండ్మెంట్ చేశారు. కొట్టం మీద నుంచి మక్క పెరడులో పడితే నాలుగు రన్స్ మాత్రమే ఇవ్వాలని డిక్లేర్ చేశారు.

రేడియోలో క్రికెట్ కామెంటరి

సుశీల్ దోషి

ఆ రోజుల్లో టివిలు లేవు కాబట్టి ఆల్ ఇండియా రేడియో వారు లైవ్ కామెంటరి ప్రసారం చేసివారు. హిందీ, ఇంగ్లిష్ భాషల్లో కామెంటరి వంతుల వారీగా ప్రసారం అయ్యేది. సుశీల్ దోషి హిందీ కామెంటరి, అనంత్ సెటిల్వార్ ఇంగ్లీష్ కామెంటరి బాగా నచ్చేది.

ప్యాంటు జేబులో పట్టే చిన్న ట్రాన్సిస్టర్ తీసుకొచ్చి బడిలో సార్ లేనప్పుడు దొంగతనంగా వినటం ఒక సరదాగా ఉండేది

ఇండియాలో మ్యాచ్ లు జరిగితే పొద్దంతా అదే ద్యాస. ఇంగ్లాండ్ లో మ్యాచ్ లు అయితే పగలు 2 గంటలకు మొదలై రాత్రి 8 వరకు కామెంటరి ప్రసారం అయ్యేది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో జరిగే మ్యాచ్ లకు పొద్దున్నే మూడు గంటలు మొదలై ఉదయం తొమ్మిది కల్లా అయిపోయేది. వెస్ట్ ఇండీస్ లో అయితే రాత్రి 10 గంటల నుంచి తెల్లవారే దాకా ప్రసారం అయ్యేది. క్రికెట్ కామెంటరి వినటం ఒక వ్యసనంగా ఉండేది. ప్యాంటు జేబులో పట్టే చిన్న ట్రాన్సిస్టర్ తీసుకొచ్చి బడిలో సార్ లేనప్పుడు దొంగతనంగా వినటం ఒక సరదాగా ఉండేది. ఇంగ్లాండ్, వెస్ట్ ఇండీస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో జరిగే మ్యాచులకైతే బడిలో కామెంటరి వినే బాధ ఉండేది కాదు. టివిలు వచ్చే దాకా రేడియో కామెంటరి వినే వ్యసనం మమ్ములను వదలలేదు. 1983 లో ఇండియా గెలిచిన ప్రపంచ కప్ ప్రసారాలు రేడియోలో విని ఉద్వేగానికి లోనయ్యాము. అండర్ డాగ్ గా బరిలోకి దిగిన ఇండియా బలమైన వెస్ట్ ఇండీస్ జట్టును ఓడించి కప్ గెలవడం ఎవ్వరూ ఊహించని పరిణామం.

బోథ్ లో కేబుల్ టివి 1986 లో ఏర్పాటు అయ్యింది. ఆ సంవత్సరం మెక్సికోలో జరిగిన ఫుట్ బాల్ ప్రపంచ కప్ ప్రసారాలను అర్ధరాత్రి క్రమం తప్పకుండా చూసాము. ఆ వరల్డ్ కప్ లో అర్జంటినా ఆటగాడు డీగో మారడోనా విన్యాసాలు మనందరికీ తెలిసిందే. 1986 ఫుట్ బాల్ వరల్డ్ కప్ ను అర్జంటినా గెలుచుకున్నది. ఇక అప్పటి నుండి రేడియో కామెంటరి ప్రసారాలు ఉన్నాకూడా టివి లైవ్ ప్రసారాలకే మొగ్గు చూపే పరిస్థితి వచ్చింది. అయితే రేడియోలో విన్నట్టు ఎక్కడ పడితే అక్కడ టివి చూడటం కుదరదు. ఇంట్లోనే చూడాలి. ఈ పరిమితి ఉన్నా ఆటగాడు ప్రత్యక్షంగా కనిపించే టివి ప్రసారాల ముందు రేడియో ప్రసారాలు దిగదుడుపే.

పిచ్ తయారి

1976-77 లో టోని గ్రేగ్ నాయకత్వంలో ఇంగ్లాండ్ టీం భారత పర్యటనకు వచ్చింది. పత్రికల్లో క్రికెట్ వార్తలు తెలుసుకోవడం మొదలయ్యింది. ముఖ్యంగా హిందూ పత్రికలో క్రీడా వార్తలు బాగా వచ్చేవి. ఆ సీరీస్ లో ఇంగ్లాండ్ తో మొదటి టెస్ట్ మ్యాచ్ దిల్లీ ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో జరిగింది. ఆ టెస్ట్ లో ఇంగ్లాండ్ ఓపెనింగ్ బ్యాట్స్ మన్ డెన్నిస్ అమిస్ 175 పరుగులు చేసినట్టు గుర్తు.

మట్టిని దంచడానికి దిమ్మిస తెచ్చింది సబ్బని నర్సయ్య. దిమ్మిస తెచ్చినందుకు వాడిని అందరు అమిస్ దిమ్మిస్ అని ఆటపట్టించేవారు

డెన్నిస్ అమిస్

ఆ మ్యాచ్ లో భారత్ ఇన్నిగ్స్ తేడాతో ఘోరంగా ఓడిపోయింది. అప్పుడే కిన్వట్ తో మా జట్టు మ్యాచ్ ఫిక్స్ అయ్యింది. జూనియర్ కాలేజి గ్రౌండ్ లో మ్యాచ్ కోసం ఒక పిచ్ తయారు చేద్దామని నిర్ణయించారు సీనియర్లు. మొదట పిచ్ పొడవున నల్ల మట్టిని తవ్వి అందులో మొదటి లేయర్ గా కంకర పరచాలి. ఆ తర్వాత ఎర్రమట్టిని నింపాలి. కంకరను రహమత్ అలీ అనే కాంట్రాక్టర్ ను అడిగి తెచ్చుకున్నాము. అందుకోసం ముర్తుజా ఖాన్ తమ ఇంట్లో ఉన్న డకల్ (తోపుడు) బండిని తీసుకొచ్చాడు. మా ప్రాంతంలో ఎర్ర మట్టి కడెం నది ఒడ్డున ఉన్నకుప్టి వద్ద మాత్రమే దొరుకుతుంది. ఎడ్ల బండిని కడెం నది ఒడ్డున ఉన్నకుప్టి గ్రామానికి పంపి ఎర్రమట్టిని తెప్పించాము. ఎర్ర మట్టిని జల్లెడ పట్టి సన్నని మట్టిని వేరు చేసి కంకర మీద దొడ్డు మట్టిని మొదటి లేయర్ వేసి దిమ్మిసతో దంచడం, దాని మీద సన్నని మట్టి పోసి మళ్ళీ దంచడం చేసి పిచ్ ని తయారు చేసినారు. మట్టిని దంచడానికి దిమ్మిస తెచ్చింది సబ్బని నర్సయ్య. దిమ్మిస తెచ్చినందుకు వాడిని అందరు అమిస్ దిమ్మిస్ అని ఆటపట్టించేవారు. వాడు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా మంచి లెగ్ స్పిన్ ప్రాక్టిస్ చేశాడు. కొత్తగా తయారు చేసిన పిచ్ మీద ప్రాక్టిస్ మొదలుపెట్టి మంచి ఆత్మ విశ్వాసంతో కిన్వట్ జట్టును ఆహ్వానించాము. బాటింగ్ లోమళ్ళీ ఫైఫల్యంతో జట్టు ఓడిపోయింది.

క్రికెట్ టోర్నమెంట్

1985 లో షార్జాలో ఆస్ట్రేలేసియా కప్ టోర్నీ జరిగింది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు పాల్గొన్నాయి. ఫైనల్ లో భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్లో జావేద్ మియాందాద్ చేతన శర్మ వేసిన చివరి బంతికి సిక్సర్ కొట్టి పాకిస్తాన్ ను గెలిపించాడు. ఆ తరహాలో బోథ్ లో ఒక తాలూకా స్థాయి 20 ఓవర్ల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించాలని అనుకున్నాము. నేను అప్పుడు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ లో ఉన్నా. ఊరిలో మా అందరికి సలహాదారు, పెద్దమనిషి శ్రీ ఏనుగు రమేశ్ చంద్రారెడ్డి గారిని చైర్మన్ గా పెట్టి ఒక ఆర్గనైజింగ్ కమిటిని వేసాము. అంపైర్ల పానెల్ ని ఎంపిక చేసాము.

నేను హైదరాబాద్ లో ఉన్నాను కనుక టోర్నమెంట్ కు అవసరమయ్యే క్రికెట్ సామాన్లు కొనుక్కు రావడానికి నన్ను హైదరాబాద్ పంపించారు. సికిందరాబాద్ లో క్రీడా వస్తువులు అమ్మే దుకాణంలో మ్యాట్, బ్యాట్లు, ప్యాడ్ లు, స్టంపులు, హాండ్ గ్లోవ్స్, ప్రైజ్ ల కోసం కప్పులు అన్నీ కొని తీసుకువచ్చాను.

బోథ్ తాలూకాలో క్రికెట్ జట్లు ఉన్న ఊర్లు కొన్నే. ఐదు జట్లను ఎంపిక చేసాము. వారికే ఆహ్వానం పంపినాము. బోథ్, ఇచ్చోడ, వడూర్, ధన్నూర్, కౌఠ జట్లు టోర్నమెంట్ లో పాల్గోన్నాయి. ఆ టోర్నమెంట్ గెలిచి తీరాలని బాగా ప్రాక్టిస్ చేసాము. నిధులు సేకరించాము. ఈ టోర్నమెంట్ కు ఆర్థికంగా బాగా సహకరించిన వారిలో కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ఆఫీసర్ కోటేశ్వరరావు ఒకరు. ఆయనకు క్రికెట్ అంటే పిచ్చి. ఆనాటికి సీనియర్లు అందరు చదువుల కోసం వెళ్ళిపోయిన కారణంగా జూనియర్ జట్టులో ఉన్న చాలా మందికి ప్రమోషన్లు వచ్చాయి. నేను ఇంజనీరింగ్ కోసం హైదరాబాద్ వెళ్ళినా కూడా నన్ను బోథ్ జట్టుకు కెప్టెన్ గా ఎంపిక చేసారు. రమేశ్, గోవర్ధన్, మహమూద్ లు ఫాస్ట్ బౌలింగ్, నేను ఆఫ్ స్పిన్, సబ్బని నర్సయ్య.. అదే అమిస్ దిమ్మిస్ లెగ్ స్పిన్, బ్యాటింగ్ లో నేను, చింటూ, అజయ్, గోవర్ధన్, మెహమూద్, కె రమేష్ .. ఇట్లా టీం బలంగానే ఉండింది. గంగాధర్ గౌడ్ ఆనాటికే బోథ్ వదలి ఇచ్చోడలో సెటిల్ అయ్యాడు. నేను హైదరాబాద్ లో ఉన్నాను కనుక టోర్నమెంట్ కు అవసరమయ్యే క్రికెట్ సామాన్లు కొనుక్కు రావడానికి నన్ను హైదరాబాద్ పంపించారు. సికిందరాబాద్ లో క్రీడా వస్తువులు అమ్మే దుకాణంలో మ్యాట్, బ్యాట్లు, ప్యాడ్ లు, స్టంపులు, హాండ్ గ్లోవ్స్, ప్రైజ్ ల కోసం కప్పులు అన్నీ కొని తీసుకువచ్చాను. మా ఊరి మధ్యలో ఉన్న ఫకీరోని చేనుని బోథ్ మార్కెట్ యార్డ్ కోసం సేకరించినారు. విశాలమైన మార్కెట్ యార్డును టోర్నమెంట్ నిర్వహణ కోసం ఎంపిక చేసాము. ఇక్కడ కూడా ఒక పిచ్ ను తయారు చేసినారు ఫ్రెండ్స్ క్లబ్ మిత్రులు. దాని మీద మ్యాట్ పరిచేవారు.

తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన ధన్నూర్ వారు ఓడిపోతున్న తరుణంలో అంపైర్ LBW నిర్ణయంతో పెద్ద గొడవ లేవదీసారు. అంపైర్ నిర్ణయాలు సరిగా లేవని, బోథ్ జట్టుకు అనుకూలంగా ఉన్నాయని స్టంపులు కింద పడేసి గొడవకు దిగారు.

మా మొదటి మ్యాచ్ కౌఠ జట్టుతో జరిగింది. రెండో మ్యాచ్ ఇచ్చోడ జట్టుతో జరిగింది. టీం అన్ని రంగాల్లో రాణించి కౌఠ, ఇచ్చోడ జట్లతో మ్యాచ్ లను గెలిచి సెమీ ఫైనల్ లో అడుగు పెట్టాము. సెమీ ఫైనల్ మ్యాచ్ ధన్నూర్ జట్టుతో. ఆ మ్యాచ్ గెలిస్తే ఫైనల్ మ్యాచ్ వడూర్ జట్టుతో ఆడాలి. వడూర్ జట్టులో ఉన్న ఆటగాళ్లు అందరూ నిర్మల్ లో క్రికెట్ ఆడే వాళ్ళు. టోర్నీలో వారు మా అందరి కంటే మెరుగ్గా ఆడే జట్టు. వాళ్ళ జట్టు ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా ఫైనల్ కు చేరి ఉన్నారు. ధన్నూర్ తో సెమీ ఫైనల్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసి మంచి స్కోర్ సాధించాము. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన ధన్నూర్ వారు ఓడిపోతున్న తరుణంలో అంపైర్ LBW నిర్ణయంతో పెద్ద గొడవ లేవదీసారు. అంపైర్ నిర్ణయాలు సరిగా లేవని, బోథ్ జట్టుకు అనుకూలంగా ఉన్నాయని స్టంపులు కింద పడేసి గొడవకు దిగారు. ఈ సారి బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో బాగా రాణించినప్పటికీ ధన్నూర్ టీంతో వచ్చిన గొడవ కారణంగా చైర్మన్ నిర్ణయం మేరకు ధన్నూర్ టీంను విజేతగా ప్రకటించాలని నిర్ణయించారు. టోర్నమెంట్ ను నిర్వహిస్తున్న జట్టుగా త్యాగానికి సిద్దపడ్డాము. చైర్మన్ నిర్ణయం మేరకు సెమీ ఫైనల్ మ్యాచ్ లో ధన్నూర్ జట్టును విజేతగా ప్రకటించి వారికి ఫైనల్ మ్యాచ్ వడూర్ తో ఆడటానికి వీలు కల్పించాము. ఫైనల్ లో వడూర్ జట్టు ఘన విజయం సాధించింది. వారికి కప్పును అందజేసాడు నిర్వాహణ కమిటీ ఛైర్మన్ శ్రీ రమేష్ చంద్రారెడ్డి గారు.

గేర్జా కప్ టోర్నీ

ఆ తర్వాత ఇచ్చోడలో కూడా ఇటువంటి టోర్నమెంట్ జరిగింది. అక్కడ కూడా ఇచ్చోడ జట్టుతో మొదటి మ్యాచ్ రసవత్తరంగా జరిగింది. నేను చింటూ మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం ఇచ్చాము. ఆ తర్వాత గోవర్ధన్ ఇచ్చోడ బౌలర్లపై విరుచుకుపడి సిక్సర్ లు బాది వారికి చెమటలు పట్టించాడు. వాడు అవుట్ అయిన తర్వాత జట్టు కుప్ప కూలిపోయింది. ఇచ్చోడ జట్టు మేము పెట్టిన టార్గెట్ ను తేలికగానే చేదించి టోర్నమెంట్ లో ముందుకు సాగారు. బోథ్ టోర్నమెంట్ లో ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నారు. మేము ఇంటి దారి పట్టాము.

బహుమతి ప్రధానోత్సవానికి మమ్ములని ఆహ్వానించాడు. చింటూకి ప్రత్యేక బహుమతి ప్రధానం చేశారు. నాకు ఒక మేమేంటో అందజేశారు. నాకు ఒక మేమేంటో అందజేశారు

ఆ తర్వాత మా పూర్వపు జూనియర్ జట్టు సభ్యుడు గంగాధర గౌడ్ వాడి స్వంత ఊరు గేర్జం లో ఒక టోర్నమెంట్ నిర్వహించాడు. “స్పూర్తి క్రికెట్ పోటీలు” పేరున జరిపిన ఈ టోర్నీలో కూడా వాడి ఆహ్వానం మేరకు పాల్గొన్నాము. మా మేనేజర్ శామ్ దాదా ఈ టోర్నీని సరదాగా గేర్జా కప్ అనేవాడు .. షార్జా కప్ లాగా. ఆ టోర్నీ ఏ ఊరి జట్లు పాల్గొన్నాయో ఇప్పుడు యాదికి లేదు. కానీ మా మొదటి మ్యాచ్ ఆతిథ్య జట్టు గేర్జం టీం తోనే ఆడినాము. గేర్జం టీం కెప్టెన్ గంగాధర్ గౌడ్ మంచి బ్యాటింగ్ పర్ఫార్మన్స్ ఇచ్చాము. నేను చింటూ ఓపెనింగ్ , ఆ తర్వాత అజయ్, గోవర్ధన్ ధనాధన్ బ్యాటింగ్ చేసి వచ్చారు. ఆ తర్వాత మిగతా వారు పెద్ద స్కోర్ సాధించ కుండానే తిరిగి వచ్చారు. గౌడ్ లెగ్ స్పిన్ మాయాజాలానికి అందరూ చేతులెత్తేసి వెనక్కి వచ్చేశారు. ఎప్పటిలాగానే ఆడి ఓడిపోయి ఇంటికి వచ్చాము.

మొత్తం మీద గేర్జా కప్ విజేతగా తన టీంను నిలబెట్టడంలో గౌడ్ విజయం సాధించాడు. బహుమతి ప్రధానోత్సవానికి మమ్ములని ఆహ్వానించాడు. చింటూకి ప్రత్యేక బహుమతి ప్రధానం చేశారు. నాకు ఒక మేమేంటో అందజేశారు. మా పూర్వపు టీం సభ్యుడు కెప్టెన్ గా ఉన్న గేర్జం టీం విజయాన్ని మా విజయంగా భావించి వాడిని అందరం హృదయ పూర్వకంగా అభినందించాము.

ముగింపు

ఇట్లా అంగడి మాముళ్లలో మొదలై, పెద్ద బడి మైదానం, ఫ్రెండ్స్ క్లబ్ మైదానం, పక్కిరోని చేను ( మార్కెట్ యార్డ్ మైదానం), బర్కం మైదానం వంటి చోట్ల మా క్రికెట్ సంబురాలు కొనసాగినాయి. 1987 లో సాగునీటి శాఖలో జూనియర్ ఇంజనీర్ గా ఉద్యోగంలో చేరడంతో నా క్రికెట్ ఆటకు ఫుల్ స్టాప్ పడింది. మా తరం తర్వాత కూడా బోథ్ లో క్రికెట్ ఆట కొనసాగింది. అయితే ఉద్యోగ రీత్యా ఊరికి, ఆటకు దూరం అవడంతో అవేవీ నాకు తెలియవు. అయితే చిన్నప్పటి క్రికెట్ జ్ఞాపకాలు మాత్రం హృదయంలో నిలచిపోయినాయి. స్వామి స్నేహితులు మళ్ళీ నన్ను నా క్రికెట్ జ్ఞాపకాల్లోకి తీసుకుపోయారు.

ఆ మ్యాచ్ లో ఒడిపోయినా రైతులప్రదర్శించిన క్రీడా స్పూర్తి అందరినీ ఆకట్టుకున్నది. అందుకే ఈ వార్తను జాతీయ ఛానళ్ళు, బిబిసి లాంటి అంతర్జాతీయ చానల్ కూడా ప్రసారం చేసినాయి. దీనితో బోథ్ లో క్రికెట్ ఇంకా సజీవంగా ఉందని రూడీ అయ్యింది.

ఇటీవల బోథ్ జరిగిన క్రికెట్ టోర్నీలో రావుల శంకర్ నాయకత్వంలో రైతుల టీం లగాన్ హిందీ సినిమాలో రైతుల టీం లెక్క తలకు రుమాలు, పంచెలతో పాల్గొన్నవార్త తెలంగాణలో సంచలనం సృష్టించింది. ఆ మ్యాచ్ లో ఒడిపోయినా రైతులప్రదర్శించిన క్రీడా స్పూర్తి అందరినీ ఆకట్టుకున్నది. అందుకే ఈ వార్తను స్థానిక తెలుగు, జాతీయ ఛానళ్ళు, బిబిసి లాంటి అంతర్జాతీయ చానల్ కూడా ప్రసారం చేసినాయి. దీనితో బోథ్ లో క్రికెట్ ఇంకా సజీవంగా ఉందని రూడీ అయ్యింది.

“స్కోర్ ఎంత?”

సందర్భం కనుక మరో రెండు ముచ్చట్లు. తలపండిన సాహిత్యకారుల్లో కూడా క్రికెట్ కు పిచ్చి అభిమానులు ఉన్నారని తెలుసుకొని ఆనందించాను. అందులో ఒక ఇద్దరి గురించి కూడా ఇక్కడ ప్రస్తావిస్తాను. వారిలో ఒకరు కాళోజీ నారాయణ రావు.

సీరియస్ గా ఏవో సాహిత్య విషయాలు చర్చిస్తున్నప్పుడు సడన్ గా “స్కోరెంతరా” అని కాళోజీ గారు అడుగేవారట. క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఆయన ఎక్కడ ఉన్నా స్కోర్ ఎంతనో తెలుసుకునేవాడని ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారు చెప్పేవారు.

అరమరికలు లేకుండా తన తప్పులను సైతం చెప్పుకున్న అద్భుతమైన ఆత్మకథలో ఎందుకో తన క్రికెట్ అభిమానాన్ని మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు!

ఇక రెండవ వ్యక్తి ‘హంపి నుంచి హరప్పా దాకా’ పుస్తక రచయిత తిరుమల రామచంద్ర. ఆయన ఒకసారి రంగనాయకమ్మ గారిని కలవటానికి వారింటికి వెళ్లారట. ఆమె ఆయనతో సాహిత్య విషయాలు చర్చిస్తుండగా సడన్ “స్కోర్ ఎంత” అని అడిగేసరికి ఈ తలపండిన సాహిత్యకారుడికి ఈ క్రికెట్ పిచ్చి ఏమిటో ఆమె అవాక్కు అయ్యారట. ఇది హంపి నుంచి హరప్పా దాకా పుస్తకం మీద ఒక వ్యాసం రాసిన సందర్భంగా రంగనాయకమ్మ గారు చెప్పిన ముచ్చట.

అమెరికాలో ఉన్నప్పుడు 700 పేజీల ఈ పుస్తకాన్ని ఏక బిగిన చదివేశాను. అయితే అరమరికలు లేకుండా తన తప్పులను సైతం చెప్పుకున్న అద్భుతమైన ఆత్మకథలో ఎందుకో తన క్రికెట్ అభిమానాన్ని మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు!

కాలమిస్టు పరిచయం

శ్రీధర్ రావు దేశ్ పాండే గారు వృత్తి రీత్యా ఇంజనీర్. తెలంగాణ బిడ్డగా జల వనరుల నిపుణులుగానూ గత మూడు దశాబ్దాలుగా రాజకీయ, ఆర్థిక సామాజిక రంగాలపై అనేక వ్యాసాలు రచించారు. ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతను నొక్కి చెబుతూ  స్వయంగా పలు పుస్తకాలు రచిస్తూనే తెలంగాణా టైమ్స్, తెలంగాణా సొయి వంటి పత్రికలకు సంపాదకత్వ బాధ్యతలు కూడా వహించారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన వారు రాష్ట్ర పునర్నిర్మాణంలోనూ తమ వంతు బాధ్యతను నిర్వహిస్తున్న సంగతి మీకు తెలుసు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక అధికారిగా (OSD) సాగు నీటి పారుదల రంగంలో వారు పని చేస్తున్నారు.

ఆదిలాబాద్ జిల్లా ‘బోథ్’ వారి స్వగ్రామం. తెలుపు పాఠకులకు తమ ఊరి పేరిటే ‘బొంతల ముచ్చట్ల’ను పంచుకునేందుకు గాను వారు ఈ శీర్షికకు శ్రీకారం చుట్టారు. ఒక రకంగా ఇది మెత్తటి జ్ఞాపకాల శయ్య. తొలి భాగం “రింజిం రింజిం ఆదిలాబాద్…. బోథ్ వాలా జిందాబాద్”. రెండో భాగం నాది మూల నక్షత్రం పుట్టుక. మూడో భాగం బోథ్ పెద్దవాగు – ఒక పురా జ్ఞాపకం. మీరు చదివింది నాలుగో భాగం. వారి ఇ -మెయిల్ : irrigationosd@gmail.com

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article