Editorial

Wednesday, January 22, 2025
కాల‌మ్‌బొంతల ముచ్చట్లు : బోథ్ పెద్దవాగు - ఒక పురా జ్ఞాపకం - శ్రీధర్ రావు...

బొంతల ముచ్చట్లు : బోథ్ పెద్దవాగు – ఒక పురా జ్ఞాపకం – శ్రీధర్ రావు దేశ్ పాండే తెలుపు

“మీరు ఫైల్ పై సంతకం చేయాలి సార్” అన్నాను. “ఏది ఫైల్” అన్నారు వారు. “ఇగో సార్” అని ఫైల్ ను సిఎం గారి ముందు ఉంచాను. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఫైల్ పై సంతకం చేసి నా చేతికి ఇచ్చారు.

శ్రీధర్ రావు దేశ్ పాండే

కాలమిస్టు చిన్ననాటి ఛాయా చిత్రం

ఉమ్మడి రాష్ట్రంలో చెరువులు విధ్వంసం అయినట్టే వాగులు వంకలు కూడా ఎండిపోయినాయి. ఉద్యమ కాలంలో గోరేటి వెంకన్న రాసిన “వాగు ఎండి పాయెరా, పెదవాగు తడి ఎండి పాయెరా” పాట మన హృదయాలను పిండేసింది. పెద్దవాగు తెలంగాణలో ఒక సర్వనామం. గోరటి వెంకన్న ప్రస్తావించిన ఎండిన పెద్ద వాగులు తెలంగాణ అంతటా ఉన్నాయి. కాబట్టే ఆ పాటతో తెలంగాణ సమాజం మమేకం అయ్యింది. తెలంగాణ రాష్ట్ర సాధనా ఉద్యమంలో చెరువుల పునరుద్దరణ ఒక ఉద్యమ ఆకాంక్షగా ముందుకు వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే సాగునీటి రంగంలో కెసిఆర్ చేపట్టిన తొలి పథకం మిషన్ కాకతీయ పేరుతో చెరువుల సమగ్ర పునరుద్దరణయే. నాలుగు దశలలో చెరువుల పునరుద్దరణ తర్వాత కెసిఆర్ వెనువెంటనే చేపట్టిన మరో కార్యక్రమం వాగుల పునరుజ్జీవన పథకం. ఈ పథకంలో భాగంగానే మా బోథ్ పెద్దవాగు పునరుజ్జీవనానికి నోచుకున్నది.

పెద్దవాగుపై బోథ్ ప్రాజెక్టు

‘బొంతల ముచ్చట్ల’ సుతారమైన జ్ఞాపకాల దర్పణమే కాదు, మన మూలాలను ఆప్యాయంగా తడిమే వేదిక. గత వర్తమానాలను తరచి చూస్తూ ఆశావహమైన భవిత కోసం ఆలోచనలు పంచే సూచిక కూడా. చదవండి, పెద్దవాగు జ్ఞాపకాల చెలిమ ఈ మూడోవారం.

సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో భాగమైన నిగ్ని, కంటెగామ గుట్టల్లో పుట్టిన బోథ్ పెద్దవాగు 1970 దశకం దాకా జీవ నదిగా ఉండింది. ఎండాకాలంలో కూడా వాగు పారేది. మా బాల్యం అంతా ఈ వాగులో, వాగు ఒడ్డున ఉన్న వందల ఎకరాల్లో మూడు నాలుగు కిలోమీటర్ల పొడవున మా పూర్వీకులు నాటిన ఊరుమ్మడి మామిడి చెట్ల మధ్యన గడచింది. ఈ మామిడి తోపులో ఊరిలో అందరికీ మామిడి చెట్లు ఉండేవి. ఫిబ్రవరిలో వొంటిపూట బడులు మొదలయ్యాక జూన్ లో వానలు వచ్చేదాకా ఈ పెద్దవాగులో ఈతలు, సాయంత్రం పండ్ల కోరలు పోయేటట్టు ఉప్పు కారం నంచుకొని మామిడి కాయలు తినడం, కాలికింది కట్టే, గిల్లీ దండ ఆటలతో అలసిపోయి చీకటి పడే వేళకు ఇంటికి వచ్చేది. పెద్దవాగుతో ఈ పురా జ్ఞాపకం మరపుకు వచ్చేది కాదు. కాలం మారింది. ఊరు చూట్టూర ఉన్న అడవి పోయింది. ఊరుమ్మడి మామిడి తోపు మెల్ల మెల్లగా తరిగిపోయింది. ఒకప్పుడు చల్లదనానికి మారుపేరుగా ఉన్న బోథ్ వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకున్నాయి.

పెద్దవాగుపై పొచ్చెర వద్ద నిర్మించిన చెక్ డ్యాం

అప్పుడు అటకెక్కిన పెద్దవాగు మీద ప్రతిపాదించిన కరత్వాడ చెరువు ఫైల్ ను వెలికితీసిండు నా కంటే సీనియర్ అయిన మా ఊరి సాగునీటి శాఖ ఇంజనీర్ శశికాంత్ రావు దేశ్ పాండే. ఆయన కృషి కారణంగా ప్రాజెక్టు 2000 సంవత్సరంలో శాంక్షన్ అయి పనులు మొదలయినాయి.

1990 దశకం వచ్చేసరికి పెద్దవాగు నవంబర్ లోనే పారకం బందు అయ్యింది. ఊరిలో నీటి కరువు అనుభవంలోకి రాసాగింది. ఇళ్ళలో చేద బావులు కూడా ఎండిపోయినాయి. ఎండాకాలంలో ఎప్పుడు లేని తాగునీటి ఎద్దడి వచ్చింది. అప్పుడు అటకెక్కిన పెద్దవాగు మీద ప్రతిపాదించిన కరత్వాడ చెరువు ఫైల్ ను వెలికితీసిండు నా కంటే సీనియర్ అయిన మా ఊరి సాగునీటి శాఖ ఇంజనీర్ శశికాంత్ రావు దేశ్ పాండే. నిర్మల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ అక్తరుద్దీన్ గారిని తోలుకొచ్చి సైట్ చూపిచ్చిండు. మీడియం ప్రాజెక్టుకు సరిపడా నీటి లభ్యత ఉన్నాకూడా కేంద్రం నుంచి అనుమతులు రావడం ఆలస్యం అవుతాయన్న కారణం చేత దాన్ని 4,700 ఎకరాల ఆయకట్టుతో మైనర్ ప్రాజెక్టుగా మార్చి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడానికి శశికాంత్ రావు శ్రమపడిండు. ఆయన కృషి కారణంగా ప్రాజెక్టు 2000 సంవత్సరంలో శాంక్షన్ అయి పనులు మొదలయినాయి. 2003 నాటికి ప్రాజెక్టు పూర్తి అయ్యింది. అదే సమయంలో తాగునీటి కోసం ఊరి పక్కనే పెద్దవాగు మీద ఒక చెక్ డ్యాం కూడా నిర్మాణం అయ్యింది. కరత్వాడ చెరువు, చెక్ డ్యాం కారణంగా ఎండిపోయిన పెద్దవాగు కొద్దిగా జీవం పోసుకున్నది. అయితే అది బోథ్ వరకే.

ఇప్పుడు వాగుల పునరుజ్జీవనం పథకంలో భాగంగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా శాంక్షన్ చేసిన మరో నాలుగు చెక్ డ్యాంల వలన పెద్దవాగు పొచ్చెర జలపాతం వరకు పునరుజ్జీవనం పొందింది. బోథ్ పర్యావరణం పునరుద్దరణ జరుగుతున్నది. భూగర్భ జలాలు పైకి లేచాయి. వన సంపద పెరుగుతున్నది. పశుపక్ష్యాదులకు, వన్య ప్రాణులకు నీటి తావులు ఏర్పడినాయి. మేము చిన్నప్పుడు చూసిన పెద్దవాగు మళ్ళీ దర్శనం ఇస్తున్నది. కరత్వాడ చెరువు నుంచి వచ్చే సీపేజ్ వాటర్, 4700 ఎకరాల ఆయకట్టు నుంచి వచ్చే పడవాటి నీరు (regenerated water) ఇప్పుడీ చెక్ డ్యాంలలో నిల్వ ఉంటాయి.

బోథ్ పెద్దవాగు ఇక ఎప్పుడూ ఎండిపోయే పరిస్థితి రాదు. మా తర్వాత తరం పిల్లలు దురదృష్టవంతులు. వారికి పెద్దవాగు అందుబాటులో లేకుండా పోయింది. ఈ తరం పిల్లలు అదృష్టవంతులు. పెద్దవాగు పునరుజ్జీవనం పొందినది. పెద్దవాగులో ఈత నేర్చుకోవడానికి వారు సిద్దం అవుతారు. పెద్దవాగు మీద మొదటి దశలో శాంక్షన్ అయిన నాలుగు చెక్ డ్యాంల నిర్మాణం 2021 లోనే పూర్తి అయినాయి. ఆ ఏడు కురిసిన భారీ వానలకు చెక్ డ్యాం తట్టుకొని నిలబడినాయి. నీటితో నిండి అలుగు పారినాయి.. నా హృదయం కూడా.

పొచ్చెర చెక్ డ్యాం వెనుక సజీవం అయిన పెద్దవాగు

బోథ్ పెద్దవాగు ఇక ఎప్పుడూ ఎండిపోయే పరిస్థితి రాదు. మా తర్వాత తరం పిల్లలు దురదృష్టవంతులు. వారికి పెద్దవాగు అందుబాటులో లేకుండా పోయింది. ఈ తరం పిల్లలు అదృష్టవంతులు. పెద్దవాగు పునరుజ్జీవనం పొందినది

ఈ చెక్ డ్యాంల శాంక్షన్ వెనుక కూడా ఒక కథ ఉన్నది. రాష్ట్రంలో చెక్ డ్యాంల నిర్మాణాన్ని మేజర్, మీడియం ప్రాజెక్టుల ఆయకట్టు పరిధిలో ఉండే వాగులపై మాత్రమే అనుమతించాలని నిబంధనలు రూపొందించినారు. రాష్ట్రంలో వాగులను వాటిలోకి వచ్చే నీటి ప్రవాహలను బట్టి 8 కేటగిరీలుగా వర్గీకరించడం జరిగింది. 4 నుంచి 8 కేటగిరీలోకి వచ్చే వాగులపై మాత్రమే చెక్ డ్యాంలను అనుమతించాలన్నది మరో నిభందన. బోథ్ పెద్దవాగుపై నిర్మించిన కరత్వాడ ప్రాజెక్టు, బాజార్ హాత్నూర్ మండలంలో దహేగామ్ గ్రామం వద్ద కడెం నదిపై నిర్మించిన ప్రాజెక్టు రెండూ కూడా మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కావడంతో ఈ రెండు వాగులపై చెక్ డ్యాంలను మైనర్ ఇరిగేషన్ అధికారులు ప్రతిపాదించలేదు. ఈ రెండు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అయినా కూడా వీటి ఆయకట్టు దాదాపు మీడియం ప్రాజెక్టుల కింద ఉండే ఆయకట్టుకు (5 వేల ఏకరాలు ఉంటే అది మెడియం ప్రాజెక్టు కింద లెక్క) దగ్గరలో ఉంటుంది. నీటి లభ్యత కూడా ఉంది. ఈ అంశాన్ని సిఎం గారి దృష్టికి తీసుకు పోవడానికి దాదాపు 15 రోజులు ఫైల్ పట్టుకొని వేచి చూశాను.

ఒక రోజు చెక్ డ్యాంల మీద ముఖ్యమంత్రి గారి వద్ద సమీక్ష జరిగింది. ఇదే మోఖా అనుకోని సిఎం గారికి వివరించాను. సార్ గూగుల్ ఎర్త్ ఓపెన్ చేసి పెద్దవాగుపై గతంలో నిర్మించిన కరత్వాడ ప్రాజెక్టును, అక్కడి నుండి కుంటాల వాటర్ ఫాల్ దాకా పెద్దవాగును, కడెం నదిని చూశారు. బోథ్ పెద్దవాగు పొచ్చెర వాటర్ ఫాల్స్ తర్వాత కుమారి గ్రామం వద్ద కడెం నదిలో కలుస్తుంది. కడెం నదిపై కుంటాలకు ఎగువన ప్రతిపాదించిన కుప్టి డ్యాం సైట్ వద్ద లెవెల్స్ ఆవీ కూడా చూశారు. అవకాశం దొరికితే చాలు గూగుల్ ఎర్త్ ఓపెన్ చేసి ఆ ప్రాంతం జాగ్రఫీ మొత్తం అధ్యయనం చేస్తారు సిఎం గారు. తెలంగాణ జాగ్రఫినే కాదు మొత్తం కృష్ణా, గోదావరి బేసిన్లను సమగ్రంగా అధ్యయనం చేశారు. ఏ నది ఎక్కడ ఉన్నది, ఆ నదుల మీద ఏయే ప్రాజెక్టులు కట్టారు అన్న విషయాలు బాగా అధ్యయనం చేశారు. కనుకనే 2016 మార్చ్31 న అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తెలంగాణ జల విధానంపై ఒక Tech Savvy లాగా చారిత్రాత్మకమైన ప్రసంగం చేసినారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడు ఇటువంటి సాహాసం చేసిన దాఖలాలు లేవు.

అట్లా బోథ్ పెద్ద వాగుపై నిర్మించిన కరత్వాడ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో 4, కడెం వాగుపై నిర్మించిన బాజార్ హత్నూర్ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో 5 చెక్ డ్యాంలు మొదటి దశలో శాంక్షన్ అయినాయి. ఇది బోథ్ పెద్దవాగు పునరుజ్జీవనం వెనుక కథ.

అట్లా సిఎం గారు సంతృప్తి చెంది ఈ రెండు వాగులపై కూడా చెక్ డ్యాంలను నిర్మించాలని ఆదేశించారు. “అందుకు మీరు ఫైల్ పై సంతకం చేయాలి సార్” అన్నాను. “ఏది ఫైల్” అన్నారు. “ఇగో సార్” అని ఫైల్ ను సిఎం గారి ముందు ఉంచాను. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఫైల్ పై సంతకం చేసి నా చేతికి ఇచ్చారు. మరుసటి రోజు ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వికాస్ రాజ్ గారు (ఈయన గతంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గా పని చేసినారు. కరత్వాడ, బాజార్ హాత్నూర్ ప్రాజెక్టుల భూసేకరణ ఆయన కలెక్టర్ గా ఉన్నప్పుడే జరిగింది) బోథ్ పెద్దవాగుపై, బాజార్ హాత్నూర్ కడెం వాగుపై చెక్ డ్యాంలను ప్రతిపాదిస్తూ ఫైల్ పంపాలని మైనర్ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ కు ఆదేశాలు జారీ చేశారు. అట్లా బోథ్ పెద్ద వాగుపై నిర్మించిన కరత్వాడ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో 4, కడెం వాగుపై నిర్మించిన బాజార్ హత్నూర్ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో 5 చెక్ డ్యాంలు మొదటి దశలో శాంక్షన్ అయినాయి. వీటికి నాబార్డ్ నిధులు కూడా సమకూరినాయి. చెక్ డ్యాంలు ఈ రెండు వాగులను పునరుజ్జీవనం చేసాయి. ఇది బోథ్ పెద్దవాగు పునరుజ్జీవనం వెనుక కథ.

ముక్తాయింపు

బోథ్ పెద్దవాగు మాత్రమే కాదు గోరేటి వెంకన్నతన పాటలో ప్రస్తావించిన దుందుభి, మానేరు, మంజీరా, మున్నేరు, ఆకేరు, స్వర్ణ, హల్దీ, కూడెల్లి, కాగ్నా తదితర వాగులన్నీ పునరుజ్జీవనం పొందబోతున్నాయి.

ఒకవైపు తెలంగాణకు హరితహారం, మరొక వైపు వాగుల పునరుజ్జీవనం వలన తెలంగాణా పర్యావరణంలో, జీవావరణంలో గొప్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి. భూగర్భ జలాల మట్టాలు గణనీయంగా పెరగనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పశువులు, మేకలు, గొర్లకు, వన్య ప్రాణులకు తాగునీటి సమస్య తీరనున్నది. అడవులు తిరిగి పునరుజ్జీవనం పొందడానికి చెక్ డ్యాములు దోహదం చేయనున్నాయి. బహుముఖ ప్రయోజనాలున్న చెక్ డ్యాంల నిర్మాణాలతో తెలంగాణా గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మారనున్నాయి.

కాలమిస్టు పరిచయం

శ్రీధర్ రావు దేశ్ పాండే గారు వృత్తి రీత్యా ఇంజనీర్. తెలంగాణ బిడ్డగా జల వనరుల నిపుణులుగానూ గత మూడు దశాబ్దాలుగా రాజకీయ, ఆర్థిక సామాజిక రంగాలపై అనేక వ్యాసాలు రచించారు. ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతను నొక్కి చెబుతూ  స్వయంగా పలు పుస్తకాలు రచిస్తూనే తెలంగాణా టైమ్స్, తెలంగాణా సొయి వంటి పత్రికలకు సంపాదకత్వ బాధ్యతలు కూడా వహించారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన వారు రాష్ట్ర పునర్నిర్మాణంలోనూ తమ వంతు బాధ్యతను నిర్వహిస్తున్న సంగతి మీకు తెలుసు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక అధికారిగా (OSD) సాగు నీటి పారుదల రంగంలో వారు పని చేస్తున్నారు.

ఆదిలాబాద్ జిల్లా ‘బోథ్’ వారి స్వగ్రామం. తెలుపు పాఠకులకు తమ ఊరి పేరిటే ‘బొంతల ముచ్చట్ల’ను పంచుకునేందుకు గాను వారు ఈ శీర్షికకు శ్రీకారం చుట్టారు. ఒక రకంగా ఇది మెత్తటి జ్ఞాపకాల శయ్య. తొలి భాగం “రింజిం రింజిం ఆదిలాబాద్…. బోథ్ వాలా జిందాబాద్”. రెండో భాగం నాది మూల నక్షత్రం పుట్టుక. మీరు చదివింది మూడో భాగం. వారి ఇ -మెయిల్ : irrigationosd@gmail.com

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article