Editorial

Thursday, November 21, 2024
కథనాలుబోనం కథనం : అమ్మ తల్లుల ఆరాధన తెలుపు

బోనం కథనం : అమ్మ తల్లుల ఆరాధన తెలుపు

‘బోనం’ అంటే మరేమిటో కాదు, అన్నమే. కొత్త కుండలో దేవతలకు నైవేద్యంగా వండిన అన్నమే బోనం.  నిన్నటి నుంచి  ఈ పండుగా ప్రారంభమైన సందర్భంగా తెలుపు ప్రత్యేకం.

చిత్రాలు, కథనం: కందుకూరి రమేష్ బాబు

కరోనా మహమ్మారి లేకపోతే తెలంగాణ రాష్ట్ర మంతా బోనమై కదులేడిది.కానీ ఎన్నో పరిమితుల మధ్య నిన్న గోల్కొండలో జాతర మొదలైంది. పిమ్మట ఊరూ వాడా చిన్నగా కదులుతుంది.

ఇదొక జాతర. దర్శనీయ వేడుక.  ఒక చూడ ముచ్చట. గొప్ప సంబురం. తెలంగాణకే తలమానికం. బిడ్డల సంక్షేమం ముడివడి ఉన్న ఆరోగ్యదాయిని కూడా.

మన అమ్మతల్లుల అరాధన

తెలంగాణలో గ్రామ దేవతలలో ఏడుగురు అమ్మలను ఆరాధిస్తాం. ఆ తల్లులు -పోచమ్మ, మైసమ్మ, బాలమ్మ, ఎల్లమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మ, మహంకాళీ అమ్మవారు. ఈ ఏడుగురు ప్రసిద్దమైన వారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా కొందరిని ఆరాధిస్తారు గానీ వీరే ముఖ్యం. ఈ అక్కల రక్షకుడే తమ్ముడు పోతురాజు. తాను వీరి వెంట రక్షకుడిగా ఉంటాడు.

ఒక్కో దేవత ఒక్కో శక్తికి ప్రతీక. ఈ అమ్మ తల్లుల ఆరాధనే ఈ ఆషాడ మాసం  ప్రత్యేకత. ఈ పండుగ దళిత బహుజనులది. ఆరోగ్యమే ప్రధానంగా జరిగే గొప్ప సాంస్కృతిక సాంప్రదాయ పండుగ.

శాస్త్రీయ అంశాలు ఎన్నో ముడిపడి ఉన్న ఈ పండుగ శిశు సంక్షేమం కోసం మహిళలు జరిపే అమ్మతల్లి పండుగ అని చదువుకున్న చాలా మందికి తెలియదు.

పోచమ్మ

పోచమ్మ అంటే మశూచీకి ఆది దేవత. ఈమెను ఆరాధిస్తే మశూచీ నుంచి కాపాడుతుందని నమ్మకం. ఈ తల్లి వేప చెట్టు మొదట్లో ఉంటుంది. తనకు కల్లు అంటే ప్రీతీ. ‘బోనాలు’ అంటే ఇష్టం. అందుకే ‘పోచమ్మ బోనాలు’ అనే సామెత పుట్టింది.

పోచమ్మ సోకితే మశూచీ సోకిందని, ఆమెకు మొక్కితే ఆ వ్యాధి తగ్గిపోతుందని విశ్వాసం. అందుకోసం వేప ఆకు పైపూత పూస్తే ఈ వ్యాధిని అమ్మవారు నివారిస్తుందని విశ్వాసం. అందుకే ఆమెను వేప చెట్టు మొదట్లో పూజిస్తారు. బోనాలు జరిపే వేళ ఆ తల్లిని తలుచుకుని వేపమండలు ఇంట్లో అలంకరిస్తారు.

మైసమ్మ

మైసమ్మ అంటే మహిషమ్మ, పశువులను రక్షించే దేవత. ఈ తల్లి చెరువు కట్టలను కాపాడుతుంది. అందుకే ‘కట్ట మైసమ్మ’ అంటాం.

బాలమ్మ

బలబాలికలని రక్షించే దేవత. బాలారిష్టాలనుంచి కాపాడుతుంది గనుక ఆ తల్లిని బాలమ్మ అని పూజించుకుంటాం. తనకు ఇంట్లోనే గూడు ఏర్పాటు చేసుకుని ఆరాధిస్తాం.

ఎల్లమ్మ

ఎల్లలు, వూరి పొలిమేరలు కాపాడే దేవత. దుష్టశక్తులు గ్రామాల్లోకి రాకుండా కాపాడుతుంది.

ఇక, పెద్దమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మలు శక్తి స్వరూపులు. వీళ్ళు ప్రజలను రాక్షసులు, దయ్యాలు, భూతాల నుంచి కాపాడుతాయని విశ్వాసం.

అన్నట్టు ఈ దేవతలకు జంతు బలులు ఇష్టం. అందుకే యాటలను కోస్తాం. కోడి కూడా ఇష్టం. కళ్ళు సాక పోయడం ఆచారం.

యాటను కోయలేని వారు తమ శక్తికొద్ది కోడిని కోసి తృప్తి పాడుతారు. గ్రామ దేవతల ఆరాధనలో కల్లు, మాంసం తప్పనిసరి మరి.

బోనాలు తెలంగాణ సంస్కృతిలో భాగం. అందుకే రాష్ట్రం ఏర్పాటయ్యాక ఈ పండుగను ప్రభుత్వం కూడా ఘనంగా నిర్వహిస్తోంది.

ఈ పండుగ మొదట గోల్కొండ కోటలో నెలకొన్న శ్రీ జగదాంబికా ఎల్లమ్మ ఆలయం నుంచి,ప్రారంభం అవుతుంది. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆషాడమాసం అంతా ఆగస్టు రెండో వారం వరకూ జరుగుతాయి.

పోచమ్మకు సికింద్రాబాద్ లోని మహంకాళీ ఆలయం ఫేమస్. ఇక్కడ పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. ఇక్కడ బోనాలు, ఊరేగింపు, ఘటాల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణ.

బోనాల రోజు తలస్నానం చేసి ముత్తైదువులు కొత్త బట్టలు ధరించి కొత్త కుండ తెచ్చుకొని అందులో పొంగలి, బోనం వండుతారు. ఈ కుండను పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. దీనిపై కంచుడులో నూనె పోసి వెలిగిస్తారు. ఈ కుండను భర్త తలపై ఎత్తగా ఆ మహిళ కుదురుగా పెట్టుకొని పంబ, డప్పు మోతలతో ఊరేగింపుగా ముందుకు సాగుతుంది.

ఊరేగింపులో మొదట వాయిద్యాలు, తర్వాత బలి ఇచ్చే జీవి – గొర్రె, మేక వంటివి ఉంటాయి. వాటిని వేప మండలతో అలంకరించి అమ్మ వారి చెంతకు నడుస్తారు. ఊరేగింపులో శివసత్తులు శివమూగుతారు.

దేవతలు ఉన్న చోట బోనం దించి అన్నం రాశిని అమ్మవారి చెంత పోస్తారు. గుడిలో దేవతను దర్శించుకొని మొక్కుకొంటారు. తర్వాత నాలుగు కాళ్ళ జీవిని ఒక యువకుడు ఒక్క వేటుతో నరుకుతాడు. మెడ నరికి రక్తం బోనం రాశిలో పోస్తారు. కళ్ళు చల్లి సాకగా పోస్తారు. చుట్టూ నీళ్ళు పోసి అన్నం రాశిలోని కొంత అన్నం వూరి పోలిమేరాల్లో, పంట పొలాల్లో చల్లుతారు. ఇలా, దేవతలకు మొక్కు చెల్లించుకొని సంతృప్తిగా వెనుదిరుగుతారు.

 

 

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article