Editorial

Monday, December 23, 2024
సాహిత్యంమొహర్ : ముస్లిమ్ స్త్రీలతో మొదటి 'ముద్ర' - బొమ్మదేవర నాగకుమారి తెలుపు

మొహర్ : ముస్లిమ్ స్త్రీలతో మొదటి ‘ముద్ర’ – బొమ్మదేవర నాగకుమారి తెలుపు

ఇన్నాళ్ళూ ముస్లిమ్ వాద సాహిత్యంలో కూడా ముస్లిమ్ స్త్రీల కోణాన్ని స్పష్టంగా దర్శించ లేకపోయామని నిర్మొహమాటంగా చెప్పాలి. మొహర్ – ముస్లిమ్ స్త్రీల తొలి తెలుగు కథా సంకలనం ఆ దిశలో మొదటి ముద్ర అనే చెప్పాలి. డాక్టర్ షాజహానా ఈ కథా సంకలనానికి సంపాదకత్వ బాధ్యతలు వహించారు. చారిత్రాత్మకమైన ఈ ప్రయత్నానికి షాజహానా అభినందనీయురాలు. ఈ ముస్లిమ్ రచయిత్రులందరికీ ఒక్కొక్కరికి పేరు పేరునా ప్రియమారా, ప్రేమారా ‘అలాయ్ బలాయ్’

బొమ్మదేవర నాగకుమారి  

నేను కోఠీ వుమెన్స్ కాలేజిలో డిగ్రీ చదువుకునే రోజుల్లో….

మా కాలేజ్ గేట్‌ దగ్గర ముస్లిమ్ అమ్మాయిలకై కేటాయించబడ్డ ఒక ప్రత్యేకమైన గది!
ఉదయాన్నే కాలేజిలోకి ప్రవేశిస్తూనే ముస్లిమ్ అమ్మాయిలు ఆ గదిలోకి వెళ్ళి అప్పటిదాకా తాము ధరించిన బురఖాల్ని తీసేసి వచ్చేవాళ్ళు!
మళ్ళీ సాయంత్రం కాలేజి నుంచి తిరిగి ఇంటికి వెళ్ళేపుడు ఆ బురఖాల్ని వేసుకుని వెళ్ళేవాళ్ళు!

మాకందరికీ చాలా వింతగా, ఆశ్చర్యంగా, కుతూహలంగా ఉండేది.
ఆ పరదాలో ఊపిరి ఎలా ఆడుతుంది?
ఎండాకాలంలో ఎంత కష్టం?
అమ్మాయిలు అసలా పరదా ఎందుకు వేసుకోవాలి?
ఎందుకెందుకు?? ఎన్నెన్నో ప్రశ్నలు!!

వారిని ప్రశ్నిస్తే నిశ్శబ్దంగా నవ్వి ఊరుకునే వాళ్ళు! పెద్దగా మాట్లాడే వాళ్ళు కాదు.
ఒక నీడలా గుంభనంగా కదిలి వెళ్ళి పోయేవాళ్ళు!

నీడల్లో ముఖ కవళికలు, హృదయంలోని భావావేశాలు, ఆలోచనలు, కలలు, ఆకాంక్షలు, ఆశలు, ఆశయాలు మనకు తెలీవ్ కదా?

మనకు తెలీని సమాజాన్ని సాహిత్యం పరిచయం చేస్తుంది… కానీ ఇన్నాళ్ళుగా తెలుగు, ఇంగ్లీష్ సాహిత్యాల్లో ఎక్కడా అలాటి సమాజం కన్పించలేదనే చెప్పాలి.

అవమానాల మధ్య, అభద్రతల మధ్య,  అసమానతల మధ్య, అణచివేతల మధ్య అతలాకుతలమవుతున్న ముస్లిమ్ స్త్రీల అస్తిత్వ వేదనని ఈ కథా సంకలనం రికార్డ్ చేయటానికి నిజాయితీగా ప్రయత్నించింది.

సాహిత్య సభల్లో, సమావేశాల్లో కూడా ముస్లిమ్ స్త్రీలు కన్పించేవాళ్ళు కాదు.

ఆ మధ్య కాలంలో నిషేధించబడ్డ తస్లీమా నస్రీన్, బంగ్లాదేశ్ రచయిత్రి సృజన ‘లజ్జ’ ఓ సంచలనం.

రకరకాల సందర్భాల్లో గ్లామరస్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పై మత ఫత్వాలు విభ్రమానికి లోను చేసేవి.

ఇంతే తప్ప ముస్లిమ్ స్త్రీల గురించి మరింకేం తెలీదు.

ఇన్నాళ్ళూ ముస్లిమ్ వాద సాహిత్యంలో కూడా ముస్లిమ్ స్త్రీల కోణాన్ని స్పష్టంగా దర్శించ లేకపోయామని నిర్మొహమాటంగా చెప్పాలి.

అవమానాల మధ్య,
అభద్రతల మధ్య,
అసమానతల మధ్య,
అణచివేతల మధ్య అతలాకుతలమవుతున్న ముస్లిమ్ స్త్రీల అస్తిత్వ వేదనని ఈ కథా సంకలనం రికార్డ్ చేయటానికి నిజాయితీగా ప్రయత్నించింది.

ముస్లిమ్ సాహిత్యంలో కవయిత్రిగా (తన కవిత్వానికి నేను అభిమానిని), రచయిత్రిగా, పరిశోధకురాలిగా, సంపాదకురాలిగా, ఏక్టివిస్ట్‌గా మనందరికీ పరిచితురాలైన డాక్టర్ షాజహానా ఈ కథా సంకలనానికి సంపాదకత్వ బాధ్యతలు వహించారు. చారిత్రాత్మకమైన ఈ ప్రయత్నానికి షాజహానా అభినందనీయురాలు.

భిన్న పార్శ్వాలున్న ఈ కథా సంకలనాన్ని నేను ఇష్టంగా, ఉత్సాహంగా చదివాను.

ఈ సంకలనంలో సీనియర్ రచయిత్రి శ్రీమతి షెహనాజ్ బేగమ్ దగ్గర్నుంచి నిన్నా మొన్నా రాయటం మొదలు పెట్టిన రచయిత్రుల దాకా ఇరవై ముగ్గురి రచయిత్రుల ఇరవై ఆరు కథలున్నాయ్.
ఇందులో చాలా మంది రచయిత్రులకు ఇవి మొదటి కథలు!
అందుకే కాబోలు సహజత్వంతో తొణికిసలాడ్తున్నాయ్.
తమకు తెల్సిన, తాము అనుభవించిన జీవితాల్ని అక్షరబధ్ధం చేయాలన్న తపన ఈ రచనల్లో కన్పించింది.
ముందుగా ఆ తపనకు సలామ్‌లు!

సగటు ముస్లిమ్ స్త్రీల జీవితాల్ని ప్రతిబింబించిన కొన్ని కథల్ని మీకు పరిచయం చేస్తున్నాను.

మెట్రో జీవితాల్నో, సాఫ్ట్ వేర్ ఉద్యోగుల జీవితాలకు సంబంధించిన కథల్నో రాసేపుడు పాత్రల సంభాషణల్లో ఇంగ్లీష్ పదాలు ఎక్కువగా వాడటం మనం చూస్తుంటాం. దాదాపుగా ఈ సంకలనంలోని కథలన్నిటిలో సంభాషణలు ఉర్దూలో ఉన్నాయ్.

సగటు ముస్లిమ్ స్త్రీల జీవితాల్ని ప్రతిబింబించిన కొన్ని కథల్ని మీకు పరిచయం చేస్తున్నాను.

రుబీనా పర్వీన్ ‘ఖులా’ కథ ఆవిష్కరణ వేదిక మీద సంకలనంలోని ఉత్తమ కథగా పెద్దలందరూ కొనియాడారు.
మనందరికీ ‘తలాక్’ అన్న పదం పరిచయమే!
‘తలాక్’ అంటే ముస్లిమ్ భర్త తన భార్యకిచ్చే విడాకులు!
‘ఖులా’ అంటే తన భర్త నుంచి ముస్లిమ్ స్త్రీ కోరే విడాకులు! ఈ సరికొత్త పదాన్ని, స్త్రీల హక్కుని పరిచయం చేసిన రుబీనాకి అభినందనలు!
తెలంగాణా మాండలికంలోని భాషా సౌందర్యాన్ని దర్శించాలన్నా, స్త్రీ తిరుగుబాటుని అర్ధం చేసుకోవాలన్నా ఈ కథ చదివి తీరాల్సిందే!

ఫేస్ బుక్ సెలబ్రిటీ శ్రీమతి సయ్యద్ నజ్మా షమ్మీ కథ ‘ఆపా’ !
స్వయంఉపాధితో , ఆత్మ గౌరవంతో తన జీవనాన్ని నడుపుకునే ఆపా పెరట్లోని మొక్కల్ని ఖాదర్ పెంపుడు మేక రోజూ వచ్చి తింటుంటే , ఆమె పెద్ద నోరుతో అతడ్ని తిడుతూ ఉంటుంది. చేసిన అప్పు తీర్చలేక అతడా మేకని అమ్మేస్తే ఆపా ఏం చేసిందీ? ఫీల్ గుడ్ స్టోరీ!

పర్స్ పెక్టివ్స్ ప్రచురించిన ఈ కథా సంకలనానికై నవోదయా వారిని 040 24652387 లో సంప్రదించవచ్చు.

చెయ్యి తిరిగిన రచయిత్రి షాజహానా రచించిన మూడు కథల్లో మొదటి కథ ‘సిల్ సిలా’ లో ముస్లిమ్‌లలో ఉప సమూహమైన దూదేకుల వారి పేదరికాన్ని అక్షరాలా అక్షరీకరించింది. వారు సమాజంలో ఎదుర్కొనే అవమానాల్ని మన ముందుంచింది. నడి వయస్సు స్త్రీ అన్ని రకాల వ్యవసాయపు పనులు చేస్తూ, అష్టకష్టాలు పడుతూ కుటుంబాన్ని పోషిస్తూ, తాగుబోతు భర్తతో చావు దెబ్బలు కూడా తింటుంటుంది. ఆ భర్త గురించి బడెమ్మ తన చెల్లెలి కూతురితో ఇలా అంటుంది. ‘‘మీ బడె బాపు సుత మంచిగనే ఉంటడు గని గా సార తాగినపుడె సిందులేస్తడు.’’ స్త్రీలు ఇలా ఆలోచించ లేకపోతే ఎన్ని సంసారాలు నిలబడ్తాయ్?

నస్రీన్ ఖాన్ కథ ‘ లాపత్త’ లో పదో తరగతి చదువుతున్న రాహీల్‌ ని పోలీసులు ఢిల్లీ గొడవల సందర్భంగా అరెస్ట్ చేస్తారు. మరో వ్యాపకమేదీ లేకుండా బిడ్డ పెంపకమే జీవిత పరమార్ధంగా బ్రతికే రఫీఖా ఆ వార్తతో అల్లాడి పోతుంది. తన కొడుకుని విడుదల చేసినా ఆమె ప్రశాంతంగా నిద్ర పోదు. (ప్రాణమొక ఎత్తుగా అపురూపంగా పెంచుకున్న కొడుకు అకారణంగా కనబడకుండా పోతే ఆ తల్లి తండ్రులకు ఎంత క్షోభ? ఎంత నరకయాతన? తరచుగా ముస్లిమ్‌లు ఎదుర్కొనే వేదనని ప్రతిబింబిస్తుంది) తన కొడుకుతో పాటుగా అరెస్ట్ చేసిన వారందర్నీ విడిపించేదాకా ఆమె చేసిన పోరాటాన్ని చూసి, ఆమె భర్తతో పాటుగా పాఠకులు కూడా ఆశ్చర్య పోతారు.

‘పోనీలే’ కథలో రచయిత్రి డాక్టర్ జరీనా బేగమ్ బాగా చదువుకుని, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తూ కూడా తమ ఏటీఎమ్ కార్డ్‌ల్ని భర్తలకిచ్చేసి, ఏ మాత్రం ఆర్ధిక స్వాతంత్య్రం లేక పోయినా పోనీలే అని స్త్రీలు ఎలా సరిపెట్టుకుంటారో చెబ్తుంది.

జరీనా ఊడుగుల తన ‘తాలీమ్’ కథలో భర్త అనుమాన పిశాచి అయితే ఆ స్త్రీ అనుభవించే నరకయాతన ఎంత భయంకరంగా ఉంటుందో కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది..

సలీమా షేక్ ‘అమ్మ దిద్దిన బిడ్డ కథ’ లో సానుకూల ఆలోచనా ధోరణితో సమస్య పై పోరాట పటిమని పెంచుతుంది.

షెహనాజ్ గారి ‘స్వయంకృతం’ కథ చదివింతర్వాత ఇస్లామ్ మతంలోని ఒక గొప్ప ఆచారాన్ని తెల్సుకుని ఆనందించాను. ‘తలాక్’ ద్వారా భార్యకి విడాకులిచ్చేసాక, ఆ పురుషునికి బుధ్ధి వచ్చి మళ్ళీ ఆ స్త్రీనే వివాహమాడాలి అనుకుంటే ఏ ఆచారాన్ని పాటించాలో ఈ కథ చదివి తెల్సుకోవాల్సిందే!

ఈ తరానికి చెందిన కరిష్మా మహమ్మద్ తన కథ ‘ఇట్స్ మై లైఫ్’ లో ఎలాగైనా చదువుకోవాలనుకున్న ముస్లిమ్ అమ్మాయ్ ఇంటా బయటా ఎదుర్కొనే వివక్షని మనస్సాక్షిగా ఏకరువు పెట్టింది.

తస్లీమా మహమ్మద్ రచించిన ‘మన్నెం బిడ్డ’ నిజంగా భిన్నమైన కథ! ముస్లిమ్ స్త్రీలు రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షని వెలిబుచ్చిన కథ!

ఈ ముస్లిమ్ రచయిత్రులందరికీ ఒక్కొక్కరికి పేరు పేరునా ప్రియమారా, ప్రేమారా ‘అలాయ్ బలాయ్’

*బొమ్మదేవర నాగకుమారి ప్రముఖ రచయిత్రి, నివాసం హైదరాబాద్.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article